farmer plight

తెలంగాణలో అన్నదాతల వరుస ఆత్మహత్యలు

తెలంగాణలో రైతుల మరణ మృదంగం మోగుతూనే ఉన్నది. అన్నదాతల వరుస ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. ఆదిలాబాద్‌ జిల్లాలో రెండు రోజుల్లో ఇద్దరు రైతుల బలవన్మరణం నుంచి కోలుకోకముందే జనవరి 20న మరో నాలుగు జిల్లాల్లో అప్పుల బాధతో నలుగురు యువ రైతులు ప్రాణాలు వదిలారు. ఆదిలాబాద్ బ్యాంకులో ఒక రైతు రుణ‌మాఫీ కోసం ప్ర‌య‌త్నం చేసి.. అక్క‌డే పురుగుల మందు తాగి బ్యాంకు ఆవ‌ర‌ణ‌లో కుప్ప‌కూలిపోయాడు. ఇంతటి హృదయవిదారక ఘటన జరిగినా ప్రభుత్వంలో చలనం కనిపించడం లేదు. రైతులకు అండగా ఉన్నామని భరోసా ఇచ్చే ప్రయత్నం ప్రభుత్వ పరంగా జరగడం లేదు. 

వేసిన పంటలు చేతికిరాక, వచ్చిన పంటకు సరైన మద్దతు ధర లేక, బోరు బావుల్లో నీళ్లు పడక అప్పులు భారమై ముగ్గురు, రుణమాఫీ కాక మనస్తాపంతో ఒకరు తనువు చాలించారు. జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు, వరంగల్‌ జిల్లా సగెం మండలం పోచమ్మతండా, వికారాబాద్‌ జిల్లా దోమ మండలం అయినాపూర్‌, జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో జరిగిన ఈ ఘటనలు తెలంగాణలో రైతుల ప్రస్తుత దయనీయ పరిస్థితికి అద్దం పడుతున్నాయి. రాష్ట్ర రైతాంగానికి అనేక హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ఏడాది పాలనలో ఆత్మహత్యలు విపరీతంగా పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తున్నది. ఇప్పటికే 400 మందికి పైగా రైతన్నలు ఆత్మహత్య చేసుకున్న ఆందోళనకర పరిస్థితి రాష్ట్రంలో నెలకొన్నాయి. వీటన్నిటినీ ప్రభుత్వ హత్యలుగానే భావించాల్సి ఉంది. రుణమాఫీ చేయకుండా తీసిన ప్రాణాలు, రైతుబంధు వేయకుండా చేసిన ఖూనీలుగానే వీటిని పరిగణించాలి.

రాహుల్ గాంధీ నాయ‌క‌త్వంలో వ‌రంగ‌ల్ డిక్ల‌రేష‌న్ పేరిట కాంగ్రెస్ పార్టీ రైతులకు ఎన్నో హామీలు ఇచ్చింది. పంట‌కు బోన‌స్, రైతు భ‌రోసా, మ‌ద్ద‌తు ధ‌ర‌, కొనుగోలు కేంద్రాలు పెంచుతామ‌ని చాలా చెప్పారు. ఇవ‌న్నీ న‌మ్మిన రైతులు రూ.2 ల‌క్ష‌ల రుణ‌మాఫీ చేస్తామంటే విశ్వ‌సించి కాంగ్రెస్ పార్టీకి అధికారం క‌ట్ట‌బెట్టారు. ఈ రాష్ట్రంలో 65 శాతం మంది ప్ర‌త్య‌క్షంగా, ప‌రోక్షంగా వ్య‌వ‌సాయంపై ఆధార‌ప‌డి ఉన్నారు. ఈ ప్ర‌భుత్వం రైతుల‌కు ఇచ్చిన హామీలు అమ‌లు చేయ‌క‌పోవ‌డంతో, ప్ర‌భుత్వ‌ త‌ప్పుడు నిర్ణ‌యాల‌తో రైతులు నిరాశ‌, నిస్పృహ‌తో ఉన్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు 400 మందికి పైగా అన్న‌దాత‌లు ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌రు. రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన రైతు రుణమాఫీ కనీసం 30 శాతాన్ని దాటకపోవడం, రైతన్నలకు కొన్ని సంవత్సరాలుగా అందుతున్న రైతుబంధును ఆపి, ఇస్తామన్న రూ.15 వేల రైతు భరోసాను కూడా ఎగ్గొట్టడం వంటి ప్రధానమైన ఆర్థిక సమస్యలు రైతు ఆత్మహత్యలకు దారితీస్తున్నట్లు భావిస్తున్నారు.

వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్తు సరఫరా, సకాలంలో సాగునీటి వసతి కల్పించే విషయంలో సర్కారు పూర్తిగా చేతులెత్తేయడంతోనే రైతులు తీవ్ర సంక్షోభంలో కురుకుపోతున్నారు. కాంగ్రెస్‌ అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాల వల్లే రాష్ట్ర వ్యవసాయ రంగం పూర్తిగా చిన్నాభిన్నమైందని విమర్శలు చెలరేగుతున్నాయి. రైతుల పాలిట ఈ ప్రభుత్వం ఎంత కర్కశంగా వ్యవహరిస్తుందో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్గం కొడంగల్‌ పరిధిలోని లగచర్లలో రెండు నెలల క్రితం అధికారులపై జరిగిన దాడిలో పోలీసులు పలువురు గ్రామస్థులపై కేసులు నమోదు చేసి, ఉగ్రవాదుల మాదిరిగా అర్ధరాత్రి విద్యుత్ సరఫరా నిలిపివేసి, వారి ఇళ్లపై దాడులు జరిపి అరెస్ట్ చేసిన ఉదంతం వెల్లడిస్తుంది. తమ భూమిని సర్కారు గుంజుకుంటే కడుపుమండి తిరగబడిన రైతుల పట్ల కనీసం కనికరం లేకుండా వ్యవహరించారు. ఒక కేసులో జైలుకు వెళ్లి హైకోర్టు నుంచి బెయిల్‌ పొంది బయటకు రాగానే అదే ఘటనపై నమోదైన మరో కేసులో మళ్లీ అరెస్టు.. తిరిగి అదే జైలు! ఇలా ఒకటీ రెండు కాదు.. ఏకంగా 66 రోజులపాటు జైలు జీవితం గడిపే విధంగా కక్షపూరితంగా వ్యవహరించారు. ఒకే సంఘటనపై వేర్వేరుగా మూడు కేసులు నమోదు చేయడం విస్మయం కలిగిస్తుంది. మరోవంక, రాష్ట్రంలో పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు రైతులను పట్టించుకోని బీఆర్ఎస్ ఇప్పుడేదో హడావుడి చేస్తున్నారు. అధికారం పోయాక రైతులపై ప్రేమ కురిపిస్తూ ధర్నాలు చేస్తున్నారు. ఎర్రవల్లి ఫామ్‌హౌస్ చుట్టూ ఉన్న గ్రామాల్లో రైతులు ఆత్మహత్య చేసుకున్నప్పుడు కేసీఆర్, కేటీఆర్ ఎప్పుడూ స్పందించక పోవడం గమనార్హం.

ప్రవీణ్