Modi MKB

త్రివర్ణ పతాకంతో సెల్ఫీలు దిగండి

28 జూలై 2024న ప్రసారమైన ‘మన్ కీ బాత్’ (మనుసులో మాట) కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగంలోని ముఖ్యాంశాలు

ప్రస్తుతం పారిస్ ఒలింపిక్స్ ప్రపంచ వ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఒలింపిక్స్ మన క్రీడాకారులకు ప్రపంచ వేదికపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసే అవకాశం అందిస్తుంది. దేశం కోసం ఏదైనా చేసే అవకాశాన్ని కల్పిస్తుంది. మీరు కూడా మన క్రీడాకారులను ప్రోత్సహించండి. ఛీర్ ఫర్ భారత్‌!!

కొద్ది రోజుల క్రితం అంతర్జాతీయ గణిత ఒలింపియాడ్ జరిగింది. ఇందులో మన జట్టు అత్యుత్తమ ప్రదర్శన చూపి నాలుగు బంగారు పతకాలు, ఒక రజత పతకం సాధించింది. అంతర్జాతీయ గణిత ఒలింపియాడ్‌లో 100 కంటే ఎక్కువ దేశాలకు చెందిన యువత పాల్గొంటోంది. మన బృందం మొదటి ఐదు స్థానాల్లోకి రావడంలో విజయం సాధించింది.

అస్సాంలోని చరాయిదేవ్ మైదామ్ ను యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల్లో చేర్చారు. ఈ జాబితాలో ఇది భారతదేశంలోని 43వ ప్రదేశం. ఈశాన్య ప్రాంతంలో మొట్టమొదటిది. చరాయిదేవ్ అంటే కొండలపై ఉన్న ప్రకాశవంతమైన నగరం. ఇది అహోం రాజవంశ మొదటి రాజధాని. అహోం రాజవంశానికి చెందినవారు తమ పూర్వికుల మృతదేహాలను, వారి విలువైన వస్తువులను మైదామ్‌లో సంప్రదాయ బద్ధంగా ఉంచేవారు. మైదామ్ ఒక మట్టిదిబ్బ లాంటి నిర్మాణం. ఇది పైన మట్టితో కప్పి ఉంటుంది. కింద ఒకటి లేదా అంతకంటే ఎక్కువ గదులు ఉంటాయి. ఈ మైదాం అహోం రాజ్యానికి చెందిన దివంగత రాజులు, ప్రముఖుల పట్ల గౌరవానికి చిహ్నం. మన పూర్వికుల పట్ల గౌరవం చూపించే ఈ విధానం చాలా ప్రత్యేకమైంది. ఈ ప్రదేశంలో సామూహిక ఆరాధనలు కూడా జరిగేవి.

ఒక దేశం దాని సంస్కృతిని గౌరవించడం ద్వారా మాత్రమే అభివృద్ధి చెందుతుంది. భారతదేశంలో కూడా ఇలాంటి ప్రయత్నాలు చాలా జరుగుతున్నాయి. అలాంటి ఒక ప్రయత్నమే – ప్రాజెక్ట్ పరీ. పరీ అంటే పబ్లిక్ ఆర్ట్ ఆఫ్ ఇండియా. ప్రజా కళను ప్రాచుర్యంలోకి తెచ్చేందుకు, వర్ధమాన కళాకారులను ఒకే వేదికపైకి తీసుకురావడానికి ప్రాజెక్ట్ పరీ ఒక ప్రధాన మాధ్యమంగా మారుతోంది. రోడ్ల పక్కన, గోడలపై, అండర్‌పాస్‌లపై చాలా అందమైన పెయింటింగ్స్ కనిపిస్తాయి. ఈ పెయింటింగులు, ఈ కళాఖండాలు పరీతో అనుసంధానమైన కళాకారులు రూపొందించినవి. ఇది మన బహిరంగ ప్రదేశాల అందాన్ని మెరుగుపరుస్తుంది. మన సంస్కృతికి మరింత ప్రాచుర్యం కల్పించడంలో కూడా ఇది సహాయపడుతుంది.

చేనేత పరిశ్రమతో అనుబంధం ఉన్న హర్యానాలోని రోహ్‌తక్ జిల్లాకు చెందిన 250 మందికి పైగా మహిళలు ఇంతకు ముందు చిన్న చిన్న దుకాణాలు నిర్వహిస్తూ, కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగించేవారు. వాళ్ళు ‘ఉన్నతి’ స్వయం సహాయ సమూహంలో చేరడం ద్వారా బ్లాక్ ప్రింటింగ్, డైయింగ్‌లో శిక్షణ పొందారు. బట్టలపై రంగుల మాయాజాలాన్ని కూర్చడం నేర్చుకున్న ఈ మహిళలు నేడు లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు. వాళ్ళు తయారు చేసే బెడ్ కవర్లు, చీరలు, దుపట్టాలకు మార్కెట్ లో విపరీతమైన డిమాండ్ ఉంది. రోహ్‌తక్‌కు చెందిన ఈ మహిళల మాదిరిగానే దేశంలోని వివిధ ప్రాంతాల్లోని కళాకారులు చేనేతకు ప్రాచుర్యం కల్పించడంలో బిజీగా ఉన్నారు. ఒడిశాకు చెందిన ‘సంబల్‌పురి చీర’ అయినా, మధ్యప్రదేశ్ కు చెందిన ‘మహేశ్వరి చీర’ అయినా, మహారాష్ట్రకు చెందిన ‘పైథానీ’ అయినా, విదర్భకు చెందిన ‘హ్యాండ్ బ్లాక్ ప్రింట్స్’ అయినా, హిమాచల్‌కు చెందిన ‘భూట్టికో’ శాలువాలు, ఉన్ని బట్టలు అయినా లేదా జమ్మూ కశ్మీర్ కనీ శాలువాలు అయినా దేశంలోని నలుమూలలా చేనేత కళాకారుల కృషి కనిపిస్తుంది. ఈ రోజుల్లో చేనేత ఉత్పత్తులు ప్రజల హృదయాలలో తమ స్థానాన్ని సంపాదించుకున్న విధానం అద్భుతమైనది. ఇప్పుడు చాలా ప్రైవేటు కంపెనీలు కూడా కృత్రిమ మేధ ద్వారా చేనేత ఉత్పత్తులను, ఫ్యాషన్ ఉత్పత్తులను రూపొందిస్తున్నాయి.

నేడు ఖాదీని చాలా గర్వంగా ధరిస్తున్నారు. ఖాదీ గ్రామోద్యోగ్ టర్నోవర్ మొదటిసారిగా లక్షన్నర కోట్ల రూపాయలు దాటిందని మీకు చెప్పడానికి కూడా సంతోషిస్తున్నాను. ఖాదీ అమ్మకాలు ఎంత పెరిగాయో తెలుసా? 400 శాతం. ఈ పెరుగుతున్న ఖాదీ, చేనేత విక్రయాలు పెద్ద సంఖ్యలో కొత్త ఉపాధి అవకాశాలను కూడా సృష్టిస్తున్నాయి. చాలా మంది మహిళలకు ఈ పరిశ్రమతో అనుబంధం ఉంది. వారు ఎక్కువ ప్రయోజనం పొందుతున్నారు. మీరు ఇప్పటి వరకు ఖాదీ బట్టలు కొనకపోతే ఈ సంవత్సరం నుండి ప్రారంభించండి. ఆగస్ట్ నెల వచ్చేసింది. ఇది స్వాతంత్ర్యం వచ్చిన నెల. ఇది విప్లవ మాసం. ఖాదీని కొనడానికి ఇంతకంటే మంచి అవకాశం ఏముంటుంది!

తమ బిడ్డ డ్రగ్స్ బారిన పడే ప్రమాదం ఉందని ప్రతి కుటుంబం ఆందోళన చెందుతోంది. ఇప్పుడు అలాంటి వారికి సహాయం చేసేందుకు ప్రభుత్వం ‘మానస్’ పేరుతో ప్రత్యేక కేంద్రాన్ని ప్రారంభించింది. డ్రగ్స్‌పై పోరాటంలో ఇదొక పెద్ద ముందడుగు. ‘మానస్’ హెల్ప్‌లైన్, పోర్టల్ కొద్ది రోజుల కిందటే ప్రారంభమయ్యాయి. ప్రభుత్వం ‘1933’ అనే టోల్‌ ఫ్రీ నంబర్‌ను కూడా ప్రారంభించింది. దీనికి కాల్ చేయడం ద్వారా, ఎవరైనా అవసరమైన సలహాలను పొందవచ్చు లేదా సహాయ పునరావాసాలకు సంబంధించిన సమాచారాన్ని పొందవచ్చు. ఎవరి దగ్గరైనా డ్రగ్స్‌కు సంబంధించిన ఇతర సమాచారం ఉంటే వారు ఈ నంబర్‌కు కాల్ చేయడం ద్వారా దాన్ని మాదక ద్రవ్యాల నిరోధక సంస్థ- నారోటిక్స్ కంట్రోల్ బ్యూరోతో పంచుకోవచ్చు. ‘మానస్’తో పంచుకునే ప్రతి సమాచారాన్ని రహస్యంగా ఉంచుతారు. మానస్ హెల్ప్‌లైన్‌ను పూర్తిగా ఉపయోగించుకోవాలని భారతదేశాన్ని ‘డ్రగ్స్ ఫ్రీ’గా మార్చడంలో కృషి చేస్తున్న అందరు వ్యక్తులను, అన్ని కుటుంబాలను, అన్ని సంస్థలను కోరుతున్నాను.

రాజస్థాన్‌లోని రణతంబోర్ లో ప్రారంభమైన కుల్హాడి బంద్ పంచాయితీ ఒక ఆసక్తికరమైన ఉద్యమం. గొడ్డలితో అడవిలోకి వెళ్లబోమని, చెట్లను నరకబోమని అక్కడి స్థానిక సంఘాలు స్వచ్ఛందంగా ప్రమాణం చేశాయి. ఈ ఒక్క నిర్ణయంతో ఇక్కడి అడవులు మరోసారి పచ్చగా మారడంతోపాటు పులులకు చక్కటి వాతావరణం ఏర్పడుతోంది. మహారాష్ట్రలోని తడోబా-అంధారి టైగర్ రిజర్వ్ పులుల ప్రధాన నివాసాలలో ఒకటి. ఇక్కడి గోండు, మానా ఆదివాసీ తెగలకు చెందిన మన సోదర సోదరీమణులు ఎకో-టూరిజం వైపు వేగంగా అడుగులు వేశారు. ఇక్కడ పులులు పెరిగేలా చేసేందుకు తాము అడవిపై ఆధారపడడాన్ని తగ్గించుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని నల్లమల కొండలపై నివసించే ‘చెంచు’ తెగ వారు టైగర్ ట్రాకర్లుగా, అడవిలో వన్యప్రాణుల సంచారం గురించి ప్రతి సమాచారాన్ని సేకరించారు. దీంతో పాటు ఆయా ప్రాంతాల్లో జరుగుతున్న అక్రమాలపై నిఘా పెట్టారు. అదేవిధంగా ఉత్తరప్రదేశ్‌లోని పీలీభీత్‌లో జరుగుతున్న ‘బాగ్ మిత్ర కార్యక్రమం’ కూడా చాలా చర్చనీయాంశమైంది. దీని కింద స్థానిక ప్రజలకు ‘బాగ్ మిత్ర’- అంటే పులి మిత్రులుగా పని చేసేందుకు శిక్షణ ఇస్తారు. పులులకు, మనుషులకు మధ్య ఎలాంటి ఘర్షణ జరగకుండా పూర్తి జాగ్రత్తలు తీసుకుంటారు ఈ ‘పులి మిత్రులు’. ఇలాంటి ప్రయత్నాల వల్ల భారతదేశంలో పులుల సంఖ్య ఏటా పెరుగుతోంది. ప్రపంచంలోని 70 శాతం పులులు మన దేశంలోనే ఉన్నాయని తెలిస్తే మీరు సంతోషంగా, గర్వంగా అనుభూతి చెందుతారు. ఆలోచించండి! 70 శాతం పులులు!! – అందుకే మన దేశంలోని వివిధ ప్రాంతాల్లో అనేక పులుల అభయారణ్యాలు ఉన్నాయి.

మన దేశంలో పులుల పెరుగుదలతో పాటు అటవీ ప్రాంతం కూడా వేగంగా పెరుగుతోంది. గత ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో ‘ఏక్ పేడ్ మా కే నామ్’ కార్యక్రమం గురించి మీతో చర్చించాను. దేశంలోని వివిధ ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో ప్రజలు ఈ ఉద్యమంలో చేరడం నాకు సంతోషంగా ఉంది. పరిశుభ్రతకు ప్రసిద్ధి చెందిన ఇండోర్‌లో కొద్ది రోజుల క్రితం ఓ అద్భుతమైన కార్యక్రమం జరిగింది. ఇక్కడ ‘ఏక్ పేడ్ మా కే నామ్’ కార్యక్రమంలో ఒకే రోజు 2 లక్షలకు పైగా మొక్కలు నాటారు. మీరు కూడా మీ అమ్మ పేరు మీద మొక్కలు నాటే ఈ ఉద్యమంలో పాల్గొని సెల్ఫీ తీసుకుని సామాజిక మాధ్యమంలో పోస్టు చేయాలి. ఈ ఉద్యమంలో చేరడం ద్వారా, మీరు మీ అమ్మ కోసం, మాతృభూమి కోసం ప్రత్యేకంగా ఏదైనా చేయాలని భావిస్తారు.

ఆగస్టు 15వ తేదీకి ‘హర్ ఘర్ తిరంగా అభియాన్’ అనే మరో ఉద్యమం అనుసంధానమైంది. గత కొన్నేళ్లుగా దేశవ్యాప్తంగా ‘హర్ ఘర్ తిరంగా అభియాన్’పై అందరి ఉత్సాహం ఎక్కువగా ఉంది. పేదవారైనా, ధనవంతులైనా, చిన్న ఇల్లు అయినా, పెద్ద ఇల్లు అయినా అందరూ త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించి గర్వాన్ని అనుభూతి చెందుతారు. త్రివర్ణ పతాకంతో సెల్ఫీలు దిగి సామాజిక మాధ్యమంలో పోస్టు చేయడంలో కూడా క్రేజ్ ఉంది. అంటే ‘హర్ ఘర్ తిరంగా అభియాన్’ త్రివర్ణ పతాక చరిత్రలో ఒక అపూర్వమైన పర్వదినంగా మారింది. ఇప్పుడు దీనికి సంబంధించి వివిధ రకాల ఆవిష్కరణలు జరగడం ప్రారంభించాయి. గతంలో లాగే ఈ ఏడాది కూడా త్రివర్ణ పతాకంతో కూడిన మీ సెల్ఫీని ‘హర్ ఘర్ తిరంగా డాట్ కామ్’లో అప్‌లోడ్ చేయాలి.