ఉపాధి, ఉద్యోగాల కల్పనపై బడ్జెట్ ప్రత్యేక దృష్టి
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో ఉద్యోగాల సృష్టిపై దృష్టి కేంద్రీకరించారు. ఇది ఒక కీలకమైన మార్పు. ఈ ప్రాధాన్యం కొనసాగితే ప్రభుత్వం తదుపరి చర్యగా ప్రత్యేక విధానాలను రూపొందించి అమలుచేస్తుంది. సమ్మిళిత వృద్ధిని సాధించడానికి ఏకైక మార్గం అట్టడుగు స్థాయిలో ఉద్యోగాలను సృష్టించడం. ఉత్పత్తి పెంచడం, లాభాలను గరిష్ట స్థాయికి తీసుకువెళ్లడం కోసం తయారీ రంగంలోనూ, ఇప్పుడు కృత్రిమ మేధ అభివృద్ధి కారణంగా సేవల రంగంలోనూ ఆటోమేషన్ ను ప్రవేశ పెట్టడానికే ప్రయివేటు రంగం మొగ్గు చూపుతుంది గనుక అట్టడుగు స్థాయిలో ఉద్యోగాల సృష్టికి ఆ రంగం ప్రాధాన్యం ఇవ్వదు. అందువల్ల ఈ బాధ్యతను ప్రభుత్వమే నిర్వర్తించాలి.
ఒక వ్యక్తిని కొత్తగా ఉద్యోగంలో పెట్టుకున్నప్పుడు అతను లేదా ఆమె మొదటి జీతంలో రూ.15,000 వరకు గ్రాంటు, భారతదేశంలోని 500 అగ్రశ్రేణి కంపెనీలలో ఇంటర్న్‌షిప్‌లు, ప్రావిడెంట్ ఫండ్ వాటాను కంపెనీలకు తిరిగి చెల్లించడం, శ్రామిక శక్తిలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచడానికి ఇతర రాయితీలు వంటి చర్యలతో ఈ దిశలో ప్రభుత్వం ఒక ప్రశంసనీయమైన ముందడుగు వేసింది. ఈ చర్యలు ఉపాధి కల్పనను గణనీయంగా పెంచుతాయని భావిస్తున్నారు. దీనివల్ల 50 లక్షల ఉద్యోగాలు వస్తాయని ఆర్థిక మంత్రి అంచనా వేస్తున్నారు. ఇది ఒక శుభారంభం.
ఏంజెల్ పన్ను రద్దు
భారతదేశాన్ని ప్రముఖ స్టార్టప్ దేశంగా చేయడం కూడా బడ్జెట్ లక్ష్యం. ఈ దిశలో అత్యంత ముఖ్యమైన సంస్కరణ ‘ఏంజెల్ ట్యాక్స్’ తొలగింపు. ఈ పన్నును 2012లో యూపీఏ రెండో హయాంలో ప్రణబ్ ముఖర్జీ కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు విధించారు. కొత్త పన్ను విధించడం సులభం, కానీ పన్నును తీసివేయడం చాలా కష్టం. ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటిష్ వారి నుంచి సంక్రమించిన పన్నులను భారతీయులు ఇప్పటికీ చెల్లిస్తున్నారు. అందువల్ల ప్రభుత్వం పన్నును తీసివేసినప్పుడు అందుకు అధికార యంత్రాంగాన్ని ఒప్పించగలిగింది. ఏంజెల్ ట్యాక్స్ అనేది చాలా భారమైన పన్ను. ఎందుకంటే ఇది స్టార్టప్‌లు ‘ఏంజెల్స్’, అంటే కొత్త వ్యాపారాలకు పెట్టుబడులు పెట్టే వారి నుంచి నిధులు పొందినప్పుడు ఈ పన్నును చెల్లించాలి. ఆదాయంపై కాకుండా పెట్టుబడిపై విధించే పన్ను ఇది. స్టార్టప్‌లకు ఆదాయం లేనప్పుడు, అవి వ్యాపారాన్ని నిర్మించడానికి ఇంకా కష్టపడుతున్నప్పుడు పన్ను చెల్లించవలసి వచ్చింది. పన్నులు ఎగవేయడానికి, నల్లడబ్బును చట్టబద్దమైన డబ్బుగా చేసుకోడానికి (మనీ లాండరింగ్) ఏంజెల్ పెట్టుబడులు ఉపయోగపడుతున్నాయని గత యూపీఏ ప్రభుత్వం భావించి ఈ పన్ను విధించింది. నాటి యూపీఏ ప్రభుత్వం వ్యాపార వ్యతిరేక దృక్పథంతో స్టార్టప్ లను, ఔత్సాహిక వ్యాపారులను మోసగాళ్లుగా, నీతిబాహ్యులుగా పరిగణించింది. పారిశ్రామికుల పట్ల అధికార యంత్రాంగం వైఖరి ప్రతికూలంగా ఉంది. కాబట్టి వారి అభిప్రాయాన్ని మార్చడం కష్టం. ఇప్పుడు అధికార యంత్రాంగానికి ఇష్టం లేకపోయినా ఈ పన్నును ఎన్డీయే ప్రభుత్వం తొలగించినందున స్టార్టప్‌లు తమ మౌలిక పెట్టుబడులు మొత్తాన్ని వ్యాపార నిర్మాణానికి వినియోగించుకోగలుగుతాయి. అమెరికాలో స్టార్టప్ కంపెనీలలో తమ మూలధనాన్ని పెట్టే ఏంజెల్ ఇన్వెస్టర్లకు ప్రోత్సాహకాలు కల్పిస్తారు. మనం ఇంకా ఆ దశకు చేరుకోలేదు. కానీ మనం పయనించే మార్గం మాత్రం సరైనదే. టెక్ స్టార్టప్‌లు మాత్రమే మీడియా దృష్టిని ఆకర్షిస్తున్నప్పటికీ, ఆర్థిక వ్యవస్థలోని అనేక రంగాలలో కంపెనీలు ఏర్పాటు చేస్తున్నారు. దీనిని విధాన రూపకర్తలు ప్రోత్సహించాలి.
ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహకాల (పీఎల్ఐ) పథకంలో తయారీ సంస్థలకు ఇచ్చే ప్రోత్సాహకాలు మూలధన ఆధారితమైనవి. వీటిని ఉద్యోగాలతో ముడిపెట్టడం అవసరం. ప్రభుత్వ విధానంలో నవలకల్పన కేంద్రం (సీఐపీపీ) చాలా కాలంగా ప్రభుత్వం పర్యాటకం, సాంస్కృతిక రంగాలలో ఉద్యోగాల కల్పన అవకాశాలను పరిగణనలోకి తీసుకోవాలని కోరుతోంది. పర్యాటకం చిన్న నగరాలు, గ్రామీణ ప్రాంతాలతో సహా ప్రాంతీయస్థాయిలో ఉద్యోగాలను సృష్టించగలదు. స్థానిక సంస్కృతీ సంప్రదాయాలతో అనుసంధానిస్తే పర్యాటక ఆధారిత ఉద్యోగాలకు కాలం చెల్లడం లేదా ఆటోమేషన్ ప్రభావాలకు గురికావడం జరగదు. గయ, బోధ్ గయలను ప్రధాన పర్యాటక కేంద్రాలుగా పునర్నిర్మించడం ద్వారా ఈ రంగంలో కొత్త ధోరణికి తెరలేచింది. సంప్రదాయాలు, ప్రాంతం సంస్కృతిని నిర్మాణాత్మకంగా చూడటం, ఈ ప్రాంతం వంటకాలకు ప్రచారం కల్పించడం వంటి చర్యల ద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనకు అపారమైన అవకాశం ఉంది. సాంప్రదాయ వంటకాలను గుర్తించి, ప్రమాణీకరించి, నాణ్యతా ప్రమాణాలను నిర్దేశిస్తే ఆ ప్రాంత సాంప్రదాయ పాకశాస్త్ర ప్రతిభను స్థిరమైన ఉద్యోగాలుగా మార్చవచ్చు. కొత్త బడ్జెట్లో రూ.10 లక్షల నుండి రూ.20 లక్షలకు పెంచిన కొత్త ముద్ర రుణ పథకం నుంచి సాంప్రదాయ వంటకాలను అందించే రెస్టారెంట్ల రంగం ప్రయోజనం పొందాలి.
65 లక్షల మందికి పైగా వీధి వ్యాపారులకు రూ.11,680 కోట్లకు పైగా రుణాలను పంపిణీ చేసిన ప్రధానమంత్రి స్వనిధి పథకంలో కూడా వంటల రంగంలో ప్రత్యేకత నైపుణ్యం కలిగిన వీధి వ్యాపారులకు లబ్ధి చేకూర్చవచ్చు. వీధి వ్యాపారులు సాంప్రదాయ వంటకాలను ప్రజలకు అందించే వారిలో ప్రధాన వర్గమైనా వారికి గుర్తింపు, ప్రచారం లేవు. వారు కూడా చిన్న వ్యాపారులే. ఎక్కువగా వీటిని మహిళలే సొంతంగా నిర్వహిస్తారు. శ్రామిక శక్తిలో మహిళా భాగస్వామ్యాన్ని పెంచుతామని బడ్జెట్ హామీ ఇచ్చింది. సాంప్రదాయ వంటకాలు అందించే మహిళా వ్యాపారులను ప్రోత్సహించడం ఇందుకు శక్తిమంతమైన మార్గం. సీఐపీపీ అంచనా ప్రకారం సాంస్కృతిక రంగ ఉద్యోగాలు జీడీపీలో 1.8 శాతం నుండి 2.5 శాతం వరకు ఉత్పత్తి చేయగలవు. ఇటువంటి సంప్రదాయ రంగం పట్ల అధికార యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో ప్రభుత్వం దీనిని విస్మరించింది. కానీ తయారీ రంగంలో అటోమేషన్, సేవల రంగంలో ఏఐ కారణంగా ఉద్యోగాలు అంతర్ధానమవుతున్న తరుణంలో ప్రభుత్వం సాంస్కృతిక, పర్యాటకం రంగం వంటి విషయాల్లో సృజనాత్మకంగా ఆలోచించడం చాలా అవసరం.
అప్పులకు కళ్ళెం
జీడీపీలో 3.4 శాతం మౌలిక సదుపాయాల వ్యయంగా కేటాయించినా ఆర్థిక మంత్రి ద్రవ్య విచక్షణను పాటించి ప్రశంసనీయమైన పని చేశారు. ఆమె ఆర్థిక లోటును 5.1 శాతం నుంచి 4.9 శాతానికి తగ్గించారు. సాధారణంగా, స్థూల ఆర్థిక వ్యవస్థ సమతుల్యమైన, ఆరోగ్యకరమైన స్థాయిలో ఉన్నప్పుడు ప్రభుత్వం మరిన్ని ఉద్యోగాల కల్పనపై దృష్టి కేంద్రీకరిస్తుంది.
నైపుణ్యాల పెంపునకు ప్రాధాన్యం
నైపుణ్యాభివృద్ధి బడ్జెట్‌కు మూలస్తంభం. ఉద్యోగ కల్పనకు చాలా అవసరం. నైపుణ్యాభివృద్ధికి ప్రభుత్వం పెద్ద మొత్తంలో డబ్బును ఖర్చు చేసింది. నైపుణ్యాభివృద్ధి కోర్సులు తప్పనిసరిగా ఉపాధికి దారితీయాలని ప్రభుత్వం నిర్దేశించినా ప్రైవేట్ రంగంలోని కొన్ని సంస్థలు వ్యవస్థను స్వప్రయోజనాలకు వాడుకున్నాయి. చాలా రంగాలలో ప్రభుత్వ రాయితీతో కూడిన నైపుణ్య ధృవీకరణ పరిశ్రమల్లో హాస్యాస్పదంగా మారింది. ఒకే వ్యవస్థపై ఎక్కువ ఖర్చు చేయడం వల్ల ఉద్యోగ కల్పనకు సంబంధించి ఆశించిన ఫలితాలు రావు. ఇంటర్న్‌షిప్‌లకు సబ్సిడీ ఇవ్వడం అనేది యజమాని ద్వారా నైపుణ్యాభివృద్ధికి ఒక అద్భుతమైన మార్గం. అయితే, అటువంటి ప్రోత్సాహకాలను జాగ్రత్తగా రూపొందించాలి.
స్వల్పకాలిక పన్నులను పెంచడం ద్వారా స్టాక్ మార్కెట్ లాభాలపై పన్ను విధిస్తూ ఆర్థిక మంత్రి తీసుకున్న నిర్ణయాన్ని విమర్శిస్తున్నారు. పన్నులు చెల్లించే వారు తక్కువగా ఉన్న అభివృద్ధి చెందుతున్న దేశంలో, ఆదాయం ఎప్పుడూ పన్ను పరిధిలో ఉంటుంది. పన్ను చెల్లింపుదారులు ఈ వాస్తవాన్ని అంగీకరించక తప్పదు. వారు సంపాదిస్తున్నారంటే దానికి వారి వ్యక్తిగత ప్రయత్నాలే కాకుండా దాని వెనుక ప్రభుత్వం సృష్టించిన వ్యాపార పరిస్థితులు కూడా ఉన్నాయని వారు అంగీకరించాలి. బడ్జెట్ వ్యవసాయం పైన, ప్రకృతి వ్యవసాయం ఆవశ్యకతపైన కూడా దృష్టి పెట్టింది. ఇది స్వాగతించదగిన అంశం. వ్యవసాయం రాష్ట్ర జాబితాలోని అంశమైనందున ప్రకృతి వ్యవసాయాన్ని కచ్చితంగా నిర్వచించడం, ప్రోత్సహించడంలో రాష్ట్రాల సహకారం అవసరం.

