Beti Bachao Beti Padao logo

వికసిత్ భారత్‌కు దోహదం చేస్తున్న బేటీ బచావో బేటీ పడావో

భారతదేశం 2047 నాటికి వికసిత్ భారత్‌గా మారే దిశగా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్న తరుణంలో మహిళల అభివృద్ధిపై దృష్టి పెట్టడం నుంచి మహిళల నేతృత్వంలోని అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వడంలో మనం సాధించిన పురోగతికి నిదర్శనం బేటీ బచావో బేటీ పడావో (BBBP) కార్యక్రమం. స్వామి వివేకానంద ఒకసారి ఇలా అన్నారు, “మహిళల పరిస్థితి మెరుగుపడకపోతే లోక సంక్షేమానికి అవకాశం లేదు. పక్షి ఒక్క రెక్కపై మాత్రమే ఎగరడం సాధ్యం కాదు.” ఈ కాలాతీత దార్శనికత స్ఫూర్తితో ప్రధాని నరేంద్ర మోదీ 2015 జనవరి 22న హర్యానాలోని పానిపట్ లో BBBPని ప్రారంభించారు. భారతదేశంలో క్షీణిస్తున్న బాలల లింగ నిష్పత్తి (CSR)ని పరిష్కరించడానికి, దేశవ్యాప్తంగా బాలికలు, మహిళలకు తగిన అవకాశాలు, సంరక్షణ, గౌరవం లభించేలా చూడటానికి ఈ కీలక కార్యక్రమం ప్రయత్నించింది.

2011 జనాభా లెక్కల ప్రకారం జనన సమయంలో లింగ నిష్పత్తి (SRB) 918. అంటే ప్రతి 1,000 మంది మగపిల్లలకు 918 మంది ఆడపిల్లలే పుడుతున్నారని అర్థం. ఇది సమాజంలో ఆడపిల్లల పట్ల వివక్ష, కడుపులో బిడ్డ ఆడో మగో చెప్పే వైద్య పరీక్షల దుర్వినియోగానికి స్పష్టమైన ఉదాహరణ. నిర్దిష్ట లక్ష్యాలు, ఆడపిల్లల జీవితాలకు భరోసానిచ్చే పథకాల ద్వారా BBBP ఈ ధోరణిని తిప్పికొట్టడమే కాకుండా, మహిళలు నాయకత్వం వహించే, అభివృద్ధి చెందే భవిష్యత్తుకు పునాది వేసింది. గత దశాబ్ద కాలంలో ఈ కార్యక్రమం గణనీయమైన పురోగతికి దారితీసింది. ఆరోగ్య నిర్వహణ సమాచార వ్యవస్థ వివరాల ప్రకారం జాతీయ ఎస్ఆర్బీ 2014-15లో 918 నుండి 2023-24 నాటికి 930కి మెరుగుపడింది. సంస్థాగత (ఆస్పత్రుల్లో) ప్రసవాలు 2014-15లో 61 శాతం నుంచి 2023-24 నాటికి 97.3 శాతానికి పెరగ్గా, మొదటి త్రైమాసిక ప్రసవానంతర సంరక్షణ రిజిస్ట్రేషన్లు 61 శాతం నుంచి 80.5 శాతానికి పెరిగాయి. సెకండరీ విద్య స్థాయిలో బాలికల స్థూల నమోదు నిష్పత్తులు 2014-15లో 75.51 శాతం ఉండగా, 2021-22 నాటికి 79.4 శాతానికి పెరిగాయి. ఇదికాక మగ, ఆడ నవజాత శిశువుల మధ్య శిశు మరణాల రేటులో అంతరం దాదాపు కనుమరుగైంది. ఇది ఆడశిశువుల సంరక్షణలో సమానత్వం పట్ల మా ప్రభుత్వ నిబద్ధతను ప్రతిబింబిస్తుంది.

బేటీ బచావో బేటీ పఢావో (BBBP) ఉద్యమం కేవలం గణాంకాలను మెరుగుపరచడం కాదు. అంతకు మించి గొప్ప ఫలితాలు సాధించింది. మహిళా సాధికారతను పునర్నిర్వచించింది. 2023 అక్టోబర్లో 150 మంది మహిళా బైకర్లు 10,000 కిలోమీటర్లు యశస్విని బైక్ ఎక్స్పెడిషన్ పేరిట బైక్ పై ప్రయాణించారు. ఇటువంటి కార్యక్రమాలు భారతదేశపు ఆడబిడ్డల ధైర్యానికి, ఆత్మవిశ్వాసానికి ప్రతీక. కన్యా శిక్షా ప్రవేశ్ ఉత్సవ్ 2022లో 1,00,786 మంది బడికి వెళ్ళని బాలికలను తిరిగి బడిలో చేర్చింది. ఇది జీవితాలను మార్చడంలో విద్య శక్తిని ప్రదర్శిస్తుంది. నైపుణ్యాల పెంపు (స్కిల్లింగ్)పై జరిగిన జాతీయ సదస్సు శ్రామిక శక్తిలో మహిళల చురుకైన భాగస్వామ్యం ప్రాముఖ్యతను నొక్కిచెప్పింది, ఇది మహిళల నేతృత్వంలోని అభివృద్ధి అనే దార్శనికతకు మమ్మల్ని చేరువ చేసింది. 

ఈ పరివర్తన కార్యక్రమానికి 10 సంవత్సరాలు పూర్తయినా ఈ ప్రయాణం ఇంకా ముగియలేదు. మనం వికసిత్ భారత్‌గా మారాలంటే దేశ నిర్మాణంలో బాలికలు, మహిళలు భాగస్వాములుగా మారవలసిన అవసరం ఎంతైనా ఉంది. బాలికలు, మహిళలు తమ పూర్తి సామర్థ్యాన్ని వినియోగించుకుంటే తప్ప భారతదేశం అభివృద్ధి చెందదు. మనం నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాల్సిన సమయం ఇది. 1994 నాటి గర్భిణీ స్త్రీల వైద్య పరీక్షల (PCPN DT) చట్టం అమలును కట్టుదిట్టం చేయాలి. మధ్యలో చదువు ఆపేసి ఆడపిల్లల సంఖ్యను తగ్గించాలి. నైపుణ్యాల అభివృద్ధి కార్యక్రమాలను విస్తరించాలి. బాలికల జీవితంలోని ప్రతి దశలోనూ వారికీ చేయూతనిచ్చే ప్రత్యేక పథకాలను, కార్యక్రమాలను ప్రవేశపెట్టాల్సి ఉంది. 2024 ఆర్థిక సంవత్సరంలో భారతదేశంలో మహిళా కార్మిక శక్తి భాగస్వామ్యం (FLFP) రేటు 41.7 శాతంగా ఉంది. ఇది అంతకుముందు సంవత్సరాలతో పోలిస్తే గణనీయమైన పెరుగుదలే అయినప్పటికీ, ఇది ఇప్పటికీ పురుషుల కార్మిక శక్తి భాగస్వామ్యం కంటే తక్కువగా ఉంది. గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణ ప్రాంతాల్లో మహిళా కార్మిక శక్తి తక్కువగా ఉండటం గమనార్హం. భారతదేశంలో పెద్ద సంఖ్యలో మహిళలు వేతనం లేని ఇంటిపనుల్లో నిమగ్నమయ్యారు. ఎక్కువ మంది మహిళలు తమ ఇంటి బయటికి వచ్చి ఉపాధి పొందే వాతావరణాన్ని పెంపొందించడమే కాకుండా, పిల్లలు, వృద్దులు, రోగగ్రస్తుల వంటి వారి సంరక్షణ పనిని ఒక విలువైన వృత్తిగా ప్రోత్సహించే మార్గాన్ని సృష్టించడం కూడా మా ప్రయత్నం. అప్పుడే సంరక్షణ పనిలో శిక్షణ పొందిన మహిళలు, దానిని కొనసాగించాలనుకునే వారు ఆర్థిక స్వాతంత్య్రం పొందడమే కాక వారు చేసే పని దేశ ఆర్థిక వృద్ధికి దోహదం చేస్తుంది.

 ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) ప్రకారం, శ్రామిక శక్తిలో మహిళల భాగస్వామ్యాన్ని పురుషులతో సమానంగా చేస్తే ప్రపంచ స్థూల దేశీయోత్పత్తి (GDP) 20 శాతం పెరుగుతుంది. భారతదేశానికి ఇది ఒక అవకాశం మాత్రమే కాదు – ఇది ఒక అవసరం కూడా. 5 ట్రిలియన్ (లక్ష కోట్ల) డాలర్ల ఆర్థిక వ్యవస్థతో 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలన్న మన లక్ష్యాన్ని సాధించడానికి మహిళల నేతృత్వంలోని అభివృద్ధి కీలకం. బేటీ బచావో-బేటీ పఢావో కార్యక్రమం లక్షల మందికి స్ఫూర్తినిచ్చిన ఉద్యమంగా మారింది. భారత్ పురోగతిలో మహిళలను ముందువరసలో నిలిపింది.

ప్రధాని మోదీ నాయకత్వంలో మనం చారిత్రాత్మక పరివర్తనను చూస్తున్నాం. మహిళా వికాసం నుంచి మహిళల సారథ్యంలో అభివృద్ధి వరకు భారతదేశపు ఆడబిడ్డలు పరివర్తనా సారథులుగా, పారిశ్రామికవేత్తలుగా, నాయకులుగా ఎదుగుతున్నారు. తమ అభివృద్ధి గాథను తామే లిఖించుకునే చైతన్య మూర్తులుగా మారుతున్నారు. మనమంతా కలిసి వారి కలలను ప్రోత్సహిద్దాం, వారి ప్రయాణాన్ని సాధికారీకరిద్దాం. తద్వారా భారత్ స్వాతంత్య్ర శత జయంతి ఉత్సవాలను జరుపుకొనే సమయానికి దాని భవితవ్యాన్ని తీర్చిదిద్దడంలో ప్రతి మహిళా తనవంతు పాత్రను పోషించ గలుగుతుంది.

అన్నపూర్ణా దేవి,
కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి