ఓటుకు నోటు కేసులో రేవంత్ మళ్లీ డుమ్మా
2015లో తెలంగాణలో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు గత 9 సంవత్సరాలుగా వివిధ కారణాలతో వాయిదాలు పడుతూ వస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి మద్దతుగా ఓటు వేయాలని నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ ఇంటికి లక్షల రూపాయలతో వెళ్లిన రేవంత్ రెడ్డిని ఏసీబీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న విషయం అందరికీ తెలిసినదే. తన గారడీ మాటలు, బూటకపు ఉపన్యాసాలు, దగాకోరు హామీలతో తెలంగాణలో ముఖ్యమంత్రి అధికార పీఠం చేజిక్కించుకున్న రేవంత్ హోం మంత్రిత్వ శాఖను తన దగ్గర పెట్టుకోవడంలో ఓటుకు నోటు కేసు కూడా కారణమని తెలంగాణ ప్రజలు భావిస్తున్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణలో బలపడుతోన్న బిజెపిని అడ్డుకునేందుకు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీతో లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకున్న కేసీఆర్… తర్వాత రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు కావడంలో ముఖ్యపాత్ర వహించాడని అప్పుడు వార్తలు వచ్చాయి. ఓటుకు నోటు కేసును నాన్చడంలో తనకు సహకరించిన కేసీఆర్ కు ప్రత్యుపకారంగా కాళేశ్వరం దోపిడీ, ఫోన్ ట్యాపింగ్ ఇతర కేసీఆర్ స్కాంలపై కేసులు పెట్టకుండా కమిషన్లతో కాలయాపన చేస్తున్నాడని తెలంగాణ మేధావులు భావిస్తున్నారు. సెప్టెంబర్ 24న నాంపల్లి కోర్టులో ఓటుకు నోటు కేసులో హాజరు కావాల్సిన రేవంత్ రెడ్డి డుమ్మా కొట్టడంపై కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రేవంత్ రెడ్డికి కూడా తన దిల్లీ బాసు రాహుల్ గాంధీ మాదిరిగానే రాజకీయాల కోసం న్యాయస్థానాలను తప్పుగా వాడుకోవడం, క్షమాపణలు చెప్పడం, డుమ్మాలు కొట్టడం, ఆగ్రహానికి గురి కావడం, అనవసర స్టేలు, బెయిలు తెచ్చుకోవడం అలవాటే. దురదృష్టమేమంటే కేసీఆర్ గానీ, రేవంత్ రెడ్డి గానీ ఇతర కుటుంబ, అవినీతి, ఓటుబ్యాంకు రాజకీయాల ముఖ్య నాయకుల కేసులు వాయిదా పడడంపై ప్రజల్లో ఎక్కువ చర్చకు రాకుండా కొన్ని బలమైన శక్తులు పని చేస్తున్నాయి.
2002 గుజరాత్ అల్లర్ల విషయంలో ప్రపంచంలో ఎక్కడా, ఎవరి మీద లేనంత అప్పటి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీపై భయంకర విష ప్రచారం చేసిన అంతర్గత, బాహ్య శక్తుల విషయం అందరికీ తెలిసినదే. ఆ బూటకపు విషపూరిత కేసులలో నరేంద్ర మోదీ ఎన్నడూ వాయిదాలు కోరలేదు, స్టేలు తెచ్చుకోలేదు, డుమ్మాలు కొట్టలేదు. దేశ సర్వోన్నత న్యాయస్థానం నియమించిన సిట్ 2012లో నరేంద్ర మోదీకి క్లీన్ చిట్ ఇచ్చినప్పటికీ దేశద్రోహి తీస్తా సెతల్వాడ్, అప్పటి కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ మరో దశాబ్ద కాలం పాటు మోదీపై తప్పుడు కేసుల పరంపర కొనసాగించినప్పటికీ జూన్ 24, 2022న సర్వోన్నత న్యాయస్థానం మరోసారి నరేంద్ర మోదీ నిర్దోషి అని, 2012లో సిట్ ఇచ్చిన నివేదికలో ఎలాంటి లోపాలు లేవని స్పష్టం చేసింది. 2004 నుంచి 2014 వరకు కేంద్రంలో అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుత్వం సోహ్రాబుద్దీన్ ఎన్ కౌంటర్ కేసును తప్పుగా చిత్రీకరించి, అక్రమ కేసులు పెట్టి అప్పటి గుజరాత్ రాష్ట్ర, ప్రస్తుత కేంద్ర హోం మంత్రి అమిత్ షాను జైలులో కూడా పెట్టారు. మోదీ తరహాలోనే అమిత్ షా సైతం న్యాయస్థానాలకు పూర్తిగా సహకరిస్తూ, వాయిదాలు, స్టేలు, డుమ్మాలు లేకుండా, విచారణ పూర్తి చేసుకొని నిర్దోషిత్వాన్ని నిరూపించుకున్నారు.
మోదీ, అమిత్ షా సహా బిజెపి నాయకులు న్యాయస్థానాలకు సంపూర్ణ గౌరవం ఇస్తూ తప్పుడు కేసులపైనా విచారణకు పూర్తిగా సహకరిస్తూ చట్టాలపై, న్యాయస్థానాలపై ప్రజల విశ్వాసం పెంచుతున్నప్పటికీ కాంగ్రెస్, బీఆర్ఎస్ లాంటి కుటంబ, అవినీతి పార్టీలు తమ దోపిడీ కేసుల్లో కూడా స్టేలు, వాయిదాలు, డుమ్మాలతో న్యాయం జరగకుండా, వాళ్లకు శిక్ష పడకుండా వివిధ రకాల గిమ్మికులు చేస్తూ ఉండడం ప్రజలు గమనిస్తున్నారు. కెమెరా ముందు రెడ్ హ్యాండెడ్ గా దొరికిన కేసులో కూడా దోషికి శిక్ష పడకపోతే ప్రజలకు ఈ వ్యవస్థలన్నింటిపై విశ్వాసం సన్నగిల్లే ప్రమాదం ఉంది. ఇలాంటి ముఖ్యమైన విషయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉన్న వివిధ రకాల మీడియా తమ పాత్రను నిర్వహించకపోవడంపై ప్రజలకు పలు అనుమానాలు కలుగుతున్నాయి. ఇది ప్రజాస్వామ్యానికి, పరిపాలన వ్యవస్థకు, న్యాయ వ్యవస్థకు మంచిది కాదు. ఇలాంటి అవినీతి కేసుల్లో అంతర్గతంగా, లోపాయికారీగా కుమ్మక్కవుతున్న శక్తుల గురించి ప్రజలు జాగ్రత్త వహించాలి. ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా కొంత బలంగా ఉండడం వల్ల కొన్ని కొన్ని నిజాలు ప్రజల్లోకి వస్తున్నాయి. ఈ సోషల్ మీడియా స్థాయిలో అయినా నిజాలు బయటపెట్టని ప్రధాన స్రవంతి మీడియాలోని కొన్ని గ్రూపులు సిగ్గు పడాలి.
అలవికాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు, అవినీతి కేసుల విచారణ తప్పించుకునేందుకు ఎన్ని ‘‘హైడ్రా’’మాలు చేసినా అవి ఎక్కువ కాలం ప్రజలను మోసం చేయలేవు. పేద ప్రజలు కట్టుకున్న ఇళ్లను ఎలాంటి నోటీసు లేకుండా, మానవత్వం లేకుండా అకస్మాత్తుగా కూలగొడుతూ ధనవంతుల జోలికి, ముఖ్యంగా పాతబస్తీ నాయకుల వైపు వెళ్లకుండా చేస్తున్న ఈ ‘‘హైడ్రా’’మాలను ఎక్కువ కాలం నడపలేరని, న్యాయస్థానాలతో పాటు ప్రజల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని కాంగ్రెస్ నాయకులు, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గ్రహించాలి.