వక్ఫ్ సవరణ చట్టం సందర్భంగా ప్రతిపక్షాల భంగపాటు
ఈ నెల మొదటి వారంలో పార్లమెంటులో వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదం పొందడం చారిత్రాత్మకం. బ్రిటిష్ కాలంలో మొదలై, నెహ్రూ హయాంలో మార్పులు జరిగి, 1995లో ఏర్పడ్డ వక్ఫ్ బోర్డు చట్టం 2013లో సుప్రీం కోర్టుకు మించిన అధికారాలు పొంది భయానకంగా తయారైంది. వక్ఫ్ అధికారాలకు అడ్డూ అదుపు లేకపోవడంతో దేశ రాజధాని దిల్లీలోని పార్లమెంటు భవనం, తమిళనాడులోని 1500 సంవత్సరాల నాటి పురాతన దేవాలయం సహా ఎన్నెన్నో దేశ, ప్రజల ఆస్తులను తనవిగా చెప్పుకొనే వరకు వక్ఫ్ బోర్డు వెళ్లింది. అసదుద్దీన్ ఓవైసీ లాంటి దోపిడీదారుల సంపద పెరగడం తప్ప, సాధారణ పేద ముస్లింలకు వక్ఫ్ బోర్డు వల్ల ఎలాంటి ప్రయోజనం చేకూరలేదన్నది నగ్న సత్యం.
నీచ ఓటుబ్యాంకు రాజకీయాలకు పరాకాష్ట అయిన కాంగ్రెస్, ఆ పార్టీ ఉపగ్రహాలుగా తయారైన ఇతర కుటుంబ ప్రాంతీయ పార్టీలతో ఏర్పడిన ఇండీ కూటమి పక్షాల అర్థరహిత వైఖరేంటో ఈ వక్ఫ్ బోర్డు సవరణ చట్టం సందర్భంలో బయటపడింది. పార్లమెంటు ఉభయ సభలు ఈ ఉమ్మీద్ బిల్లును చర్చించి, ఆమోదిస్తున్న సమయంలో దేశవ్యాప్తంగా పేద ముస్లింలు ప్రధాని మోదీ, అమిత్ షా ఫోటోలు పట్టుకొని వక్ఫ్ బోర్డును తీవ్రంగా విమర్శిస్తూ వక్ఫ్ సవరణ చట్టానికి మద్దతుగా నినాదాలిచ్చిన సంఘటనలు కోకొల్లలు. వక్ఫ్ బోర్డు దారుణాలను, ఓవైసీ లాంటి మతోన్మాదుల కబ్జాలను, అక్రమాలను సాధారణ పౌరులతో పాటు వక్ఫ్ బోర్డు చైర్మన్‌లుగా పని చేసిన వాళ్లు కూడా వెల్లడించారు. ఎంతో మంది మౌల్వీలు సైతం వక్ఫ్ బోర్డు పేదలకు కనీస విద్య వైద్య సదుపాయాలను కల్పించడం లేదని, దీని వల్ల పేద ముస్లింలకు నష్టమే జరుగుతుందని, పారదర్శకత, జవాబుదారీతనం లేకపోవడంతో సగానికి పైగా వక్ఫ్ బోర్డు ఆస్తులు కబ్జాకు గురయ్యాయని విమర్శించారు. కాంగ్రెస్‌తో లోపాయికారీ సంబంధాలు పెట్టుకున్న బీఆర్ఎస్ ఎప్పటిలాగే లోక్‌సభలో ఒక్క సభ్యుడు లేకున్నా బిల్లును వ్యతిరేకిస్తామని ప్రగల్భాలు పలుకుతూ, రాజ్యసభలో వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకించింది. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ ముఖ్య నాయకుడు రాహుల్ గాంధీ దీనిపై ఒక్క మాట మాట్లాడకపోవడం, ఆయన సోదరి ప్రియాంక గాంధీ ఓటింగ్‌లోనూ పాల్గొనకపోవడం ఆ పార్టీ గందరగోళ పరిస్థితిని బహిర్గతం చేస్తుంది.
గత ఆగస్టులో పార్లమెంటులో ప్రవేశపెట్టిన వక్ఫ్ సవరణ బిల్లు ప్రతిపక్షాల కోరిక మేరకు పార్లమెంటరీ కమిటీకి పంపించారు. ఆ పార్లమెంటరీ కమిటీ వక్ఫ్ బోర్డు 9లక్షల 75వేల వినతి పత్రాలను స్వీకరించి, వివిధ ప్రజా సమూహాలతో చర్చించి నివేదికను ప్రభుత్వానికి అందించింది. కేంద్ర క్యాబినెట్ ఆమోదంతో ఈ నెల మొదటి వారంలో పార్లమెంటులో వక్ఫ్ సవరణ బిల్లు ప్రవేశపెట్టి, ముందు లోక్ సభలో, మరుసటి రోజు రాజ్యసభలో సుదీర్ఘ చర్చల అనంతరం ఆమోదం పొందింది. అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతకంతో చట్టంగా రూపొంది, కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్‌తో అమల్లోకి వచ్చింది.
8.50 లక్షల ఆస్తులు, 9.40 లక్షల ఎకరాల భూములున్న వక్ఫ్ బోర్డు ఆదాయంగా ఘోరంగా పడిపోవడం, పేద ముస్లింల కోసం ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టకపోవడం, కనీసం ఉద్యోగుల జీతాలు కూడా వక్ఫ్ బోర్డు సొంతంగా చెల్లించలేకపోవడం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఆధారపడే దౌర్భాగ్య స్థితికి రావడం వంటివి వక్ఫ్ చట్టం సవరణ ఆవశ్యకతను తెలియజేస్తుంది. గత కొన్ని సంవత్సరాలలో ఎన్నో బిల్లులు ఆమోదం పొందినా, ఈ వక్ఫ్ సవరణ బిల్లు మాత్రం దేశ ప్రజలను ఎంతో చైతన్యం తీసుకొచ్చింది. అవకాశవాద ఓటుబ్యాంకు రాజకీయ పార్టీల నీచ రాజకీయాలను ఈ వక్ఫ్ సవరణ ఆమోద ప్రక్రియ మరింత బహిర్గతం చేసింది. దీంతో కాంగ్రెస్, మిగతా ప్రతిపక్షాల పరువు అట్టడుగు స్థాయికి చేరింది. దీనికి తోడు తెలంగాణలో హెచ్‌సీయూలో రాత్రికి రాత్రి వృక్ష సంపదను నాశనం చేయడంపై నిరసన తెలుపుతున్న విద్యార్థుల మీద పోలీసుల దమనకాండతో కాంగ్రెస్ పరువు మరింత దిగజారింది. కొంతమంది విశ్లేషకులు కాంగ్రెస్ చర్యలను సమీక్షిస్తూ, దేశం కోసం ఒక్క మంచి పని చేసిన సందర్భం కూడా లేదని, దేశ ప్రజలు కాంగ్రెస్‌ను అసహ్యించుకోవాల్సిన పరిస్థితి ఉందని స్పష్టం చేస్తున్నారు. సబ్ కా సాథ్, సబ్ కా వికాస్ నినాదంలో భాగంగా నరేంద్ర మోదీ ప్రభుత్వం ట్రిపుల్ తలాక్ రద్దు చట్టం తరహాలోనే వక్ఫ్ సవరణ ఉమ్మీద్ చట్టం పేద ముస్లింలకు గణనీయమైన మేలు చేస్తుందనడంలో సందేహం లేదు.