Modi

యువత ఉత్సాహం దేశానికి ప్రయోజనం

ఆగస్ట్ 25న ప్రసారమైన ‘మన్ కీ బాత్’ (మనసులో మాట) కార్యక్రమంలో
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగంలోని ముఖ్యాంశాలు

రాజకీయ నేపథ్యం లేని లక్ష మంది యువతను రాజకీయ వ్యవస్థతో అనుసంధానించాలని నేను ఎర్రకోట నుండి పిలుపునిచ్చాను. దీనికి అద్భుతమైన స్పందన వచ్చింది. మన యువత ఎంత పెద్ద సంఖ్యలో రాజకీయాల్లోకి రావడానికి సిద్ధంగా ఉన్నారో అర్థమవుతుంది. వారు సరైన అవకాశం, సరైన మార్గదర్శకత్వం కోసం చూస్తున్నారు. దేశవ్యాప్తంగా యువత నుంచి ఈ అంశంపై నాకు లేఖలు కూడా వచ్చాయి. సామాజిక మాధ్యమాల్లో కూడా విశేష స్పందన వస్తోంది. ప్రజలు కూడా నాకు చాలా రకాల సలహాలు పంపారు. ఇది నిజంగా తమకు ఊహకందని విషయమని కొందరు యువకులు లేఖలో రాశారు. తమకు అట్టడుగు స్థాయిలో పని చేసిన అనుభవం ఉందని, ప్రజల సమస్యల పరిష్కారానికి తమ అనుభవం ఉపయోగపడుతుందని కొంతమంది యువకులు రాశారు. కుటుంబ రాజకీయాలు కొత్త ప్రతిభను అణిచివేస్తాయని కూడా కొందరు రాశారు. ఇలాంటి ప్రయత్నాలు మన ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తాయని కొందరు యువకులు అభిప్రాయపడ్డారు. ఎలాంటి రాజకీయ నేపథ్యం లేని యువత కూడా ఇప్పుడు మన సామూహిక కృషితో రాజకీయాల్లో ముందుకు రావాలని కోరుకుంటున్నాను. వారి అనుభవం, ఉత్సాహం దేశానికి ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను. సమాజంలోని వివిధ వర్గాలకు చెంది, రాజకీయ నేపథ్యం లేని అనేక మంది స్వాతంత్య్ర పోరాట సమయంలో కూడా ముందుకు వచ్చారు. భారతదేశానికి స్వాతంత్ర్యం కోసం తమను తాము త్యాగం చేసుకున్నారు. వికసిత భారతదేశ లక్ష్యాన్ని సాధించడానికి ఈ రోజు మనకు మరోసారి అదే స్ఫూర్తి అవసరం. మీ ఈ అడుగు మీ భవిష్యత్తును, దేశ భవిష్యత్తును మారుస్తుంది.

దేశంలోని నలుమూలల నుండి ‘హర్ ఘర్ తిరంగా, పూరా దేశ్ తిరంగా’ కార్యక్రమానికి సంబంధించిన అద్భుతమైన చిత్రాలు వచ్చాయి. ఇళ్లపై త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించడం చూశాం. స్కూళ్లు, కాలేజీలు, విశ్వవిద్యాలయాల్లో త్రివర్ణ పతాకాన్ని చూశాం. ప్రజలు తమ దుకాణాలు, కార్యాలయాల్లో పతాకాన్ని ఎగురవేశారు. తమ డెస్క్‌టాప్‌లు, మొబైళ్లు, వాహనాలపై కూడా త్రివర్ణ పతాకాన్ని ఉంచారు. ప్రజలు ఒకచోట చేరి తమ భావాలను వ్యక్తం చేసినప్పుడు ప్రతి కార్యక్రమానికి ఊతం లభిస్తుంది. జమ్మూ కాశ్మీర్‌లోని రియాసిలో 750 మీటర్ల పొడవైన జెండాతో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చినాబ్ రైల్వే బ్రిడ్జిపై త్రివర్ణ పతాక ర్యాలీని నిర్వహించారు. శ్రీనగర్‌లోని దాల్ లేక్‌లో త్రివర్ణ పతాక యాత్రకు సంబంధించిన అందమైన చిత్రాలను చూశాం. అరుణాచల్ ప్రదేశ్‌లోని ఈస్ట్ కామెంగ్ జిల్లాలో 600 అడుగుల పొడవైన త్రివర్ణ పతాకంతో యాత్ర నిర్వహించారు. అదేవిధంగా దేశంలోని ఇతర రాష్ట్రాల్లోనూ అన్ని వయసుల వారు ఇలాంటి త్రివర్ణ పతాక ర్యాలీల్లో పాల్గొన్నారు. స్వాతంత్ర్య దినోత్సవం ఇప్పుడు సామాజిక పర్వదినంగా మారుతోంది. స్వయం సహాయక సంఘాలతో సంబంధం ఉన్న మహిళలు లక్షల జెండాలను తయారు చేస్తారు. ఇ-కామర్స్ వేదికలో త్రివర్ణ రంగులో ఉన్న వస్తువుల విక్రయం పెరుగుతుంది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశంలోని నలుమూలల, నేల- నీరు-ఆకాశంలో ఎక్కడ చూసినా మన జెండా మూడు రంగులే కనిపించాయి. హర్ ఘర్ తిరంగా వెబ్‌సైట్‌లో కూడా ఐదు కోట్లకు పైగా సెల్ఫీలు పోస్ట్ అయ్యాయి. ఈ కార్యక్రమం మొత్తం దేశాన్ని ఒక చోట చేర్చింది. ఇదే ‘ఏక్ భారత్-శ్రేష్ఠ భారత్’.

అస్సాంలోని తిన్ సుకియా జిల్లాలోని చిన్న గ్రామం బారేకురీలో మోరాన్ ఆదివాసీ తెగకు చెందిన ప్రజలు నివసిస్తున్నారు. ఇదే గ్రామంలో ‘హూలాక్ గిబన్లు’ కూడా నివసిస్తున్నాయి. వాటిని అక్కడ ‘హోలో కోతులు’ అని పిలుస్తారు. ఈ గ్రామ ప్రజలకు హూలాక్ గిబ్బన్‌లతో చాలా లోతైన అనుబంధం ఉంది. గిబ్బన్లు అరటిపండ్లను ఇష్టపడతాయని అరటి సాగును కూడా ప్రారంభించారు. గిబ్బన్ల జనన మరణాలకు సంబంధించిన ఆచారాలను మనుషులకు చేసే విధంగానే నెరవేర్చాలని నిర్ణయించుకున్నారు. వారు గిబ్బన్లకు పేర్లు కూడా పెట్టారు. విద్యుత్ తీగల వల్ల గిబ్బన్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని ప్రభుత్వం ముందు ఉంచడంతో దానికి పరిష్కారం లభించింది. ఈ గిబ్బన్లు ఫోటోలకు కూడా పోజులిస్తాయని తెలిసింది.

అరుణాచల్‌లోని మన యువ స్నేహితులు కొందరు 3-డి ప్రింటింగ్ టెక్నాలజీని ఉపయోగించడం ప్రారంభించారు. కొమ్ములు, దంతాల కోసం అడవి జంతువులను వేటాడకుండా కాపాడాలని వారు కోరుకుంటారు. నాబమ్ బాపు, లిఖా నానా నేతృత్వంలో ఈ బృందం జంతువులలోని వివిధ భాగాలను 3-డి ప్రింటింగ్ చేస్తుంది. జంతువుల కొమ్ములు కావచ్చు. దంతాలు కావచ్చు. వీటన్నింటినీ 3-డి ప్రింటింగ్ ద్వారా రూపొందిస్తారు. వీటి నుండి దుస్తులు, టోపీలు వంటి వాటిని తయారు చేస్తారు. బయో-డిగ్రేడబుల్ సామగ్రిని ఉపయోగించే అద్భుతమైన ప్రత్యామ్నాయం ఇది. మన జంతువుల రక్షణ కోసం, సంప్రదాయ పరిరక్షణ కోసం ఈ రంగంలో మరిన్ని స్టార్టప్‌లు రావాలి.

మధ్యప్రదేశ్‌లోని ఝాబువాలో పారిశుద్ధ్య కార్మికులు ‘వ్యర్థం నుండి సంపద’ అనే సందేశాన్ని వాస్తవంగా మార్చి చూపించారు. ఈ బృందం ఝాబువాలోని ఒక పార్కులో చెత్త నుండి అద్భుతమైన కళాకృతులను రూపొందించింది. ఇందుకోసం చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ప్లాస్టిక్‌ వ్యర్థాలు, సీసాలు, టైర్లు, పైపులను సేకరించారు. ఈ కళాఖండాలలో హెలికాప్టర్లు, కార్లు, ఫిరంగులు కూడా ఉన్నాయి. అందమైన వేలాడే పూల కుండీలను కూడా తయారు చేశారు. వాడిన టైర్లను ఇక్కడ సౌకర్యవంతమైన బెంచీల తయారీకి ఉపయోగించారు. ఈ పారిశుద్ధ్య కార్మికుల బృందం రెడ్యూస్, రీ యూజ్, రీసైకిల్ అనే మంత్రాన్ని స్వీకరించింది. వారి కృషి వల్ల పార్క్ చాలా అందంగా తయారైంది. దీన్ని చూసేందుకు స్థానికులే కాకుండా చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా అక్కడికి వస్తున్నారు.

ఇ-కాన్షస్ పేరుతో ఉన్న ఒక బృందం పర్యావరణ అనుకూల ఉత్పత్తులను తయారు చేయడానికి ప్లాస్టిక్ వ్యర్థాలను ఉపయోగిస్తోంది. మన పర్యాటక ప్రదేశాలలో- ముఖ్యంగా కొండ ప్రాంతాలలో- పేరుకుపోయిన చెత్తను చూసిన తర్వాత వారికి ఈ ఆలోచన వచ్చింది. అలాంటి వారితో కూడిన మరో బృందం ఎకోకారీ అనే స్టార్టప్‌ను ప్రారంభించింది. ఆ బృందం ప్లాస్టిక్ వ్యర్థాల నుండి వివిధ అందమైన వస్తువులను తయారు చేస్తుంది. టాయ్ రీసైక్లింగ్ అనేది మనం కలిసి పని చేసే మరొక రంగం. చాలా మంది పిల్లలు బొమ్మలతో త్వరగా విసుగు చెందుతారు. అదే సమయంలో ఆ బొమ్మలను ఆరాధిస్తూ కలలు కనే పిల్లలు కూడా ఉన్నారు. మీ పిల్లలు ఇకపై ఆడని బొమ్మలను వాటిని ఉపయోగించే ప్రదేశాలకు విరాళంగా ఇవ్వవచ్చు. పర్యావరణ పరిరక్షణకు ఇది కూడా మంచి మార్గం. 

మన కుటుంబం, మన సమాజం, మన దేశం భవిష్యత్తు మన పిల్లల ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుంది. పిల్లల మంచి ఆరోగ్యం కోసం వారు సరైన పోషకాహారాన్ని కొనసాగించడం చాలా ముఖ్యం. పిల్లల పౌష్టికాహారం దేశం ప్రాధాన్యత. దీని కోసం ప్రతి సంవత్సరం సెప్టెంబరు 1 నుండి సెప్టెంబరు 30 మధ్య పోషకాహార మాసాన్ని జరుపుకుంటారు. పౌష్టికాహారంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు పోషకాహార మేళా, రక్తహీనత శిబిరం, నవజాత శిశువుల ఇంటి సందర్శన, సెమినార్, వెబ్‌నార్ వంటి అనేక పద్ధతులను అవలంబిస్తున్నారు. అనేక చోట్ల అంగన్‌వాడీల నిర్వహణలో మాతా శిశు కమిటీలను కూడా ఏర్పాటు చేశారు. ఈ కమిటీ పోషకాహార లోపం ఉన్న పిల్లలు, గర్భిణీ స్త్రీలు, నవజాత శిశువుల తల్లుల ఆరోగ్యంపై శ్రద్ద పెడుతుంది. వారిని నిరంతరం పర్యవేక్షిస్తుంది. వారి పోషకాహారానికి ఏర్పాట్లు చేస్తుంది. ‘పోషణ్ భీ పఢాయీ భీ’ ప్రచారం పిల్లల సమతుల అభివృద్ధిపై దృష్టి సారించింది. మీ ప్రాంతంలో పోషకాహార అవగాహన ప్రచారంలో మీరు కూడా చేరాలి. పోషకాహార లోపానికి వ్యతిరేకంగా జరిగే ఈ పోరాటంలో మీ చిన్న ప్రయత్నం ఎంతో దోహదపడుతుంది.

తెలుగు భాషపై మోదీ ప్రశంసలు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలుగు భాషపై ప్రశంసలు కురిపించారు. ‘మన్ కీ బాత్’లో ‘తెలుగు భాషా దినోత్సవం’ను ప్రస్తావించారు. ఆగస్ట్ 29న ‘తెలుగు భాషా దినోత్సవం’ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ‘తెలుగు నిజంగా చాలా అద్భుతమైన భాష. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు’ అని అన్నారు.