195 మందితో బిజెపి తొలి జాబితా
సార్వత్రిక ఎన్నికలకు బిజెపి సై అంటోంది. అప్పుడే 195 మందితో తొలి జాబితాను విడుదల చేసి సమరశంఖాన్ని పూరించింది. వారణాసి నుంచి ప్రధాని నరేంద్ర మోదీ, గాంధీనగర్ నుంచి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, లఖ్‌నవూ నుంచి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ బరిలో నిలుస్తున్నారు. తెలంగాణలోని 9 సీట్లకు అభ్యర్థులను ప్రకటించింది. మార్చ్ 2న దిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే జాబితాను విడుదల చేశారు.
బిజెపి తొలి జాబితాలో 28 మంది మహిళలు, 50 ఏళ్లలోపువారు 47 మంది ఉన్నారు. ఎస్సీలకు 27, ఎస్టీలకు 18, ఓబీసీలకు 57 స్థానాలు దక్కాయి. జాబితాలో ఇద్దరు మాజీ సీఎంలకు చోటు దక్కింది. తొలి జాబితాలో 34 మంది మంత్రులకు చోటు దక్కింది. తొలి జాబితాలో చోటు దక్కించుకున్న మంత్రుల్లో మన్సుఖ్ మాండవీయ, జితేంద్ర సింగ్, సర్బానంద సోనోవాల్, గజేంద్ర షెఖావత్, భూపేందర్ యాదవ్, జి.కిషన్‌రెడ్డి, కిరణ్ రిజిజు, జ్యోతిరాదిత్య సింధియా, రాజీవ్ చంద్రశేఖర్, అర్జున్‌రాం మేఘ్వాల్, అర్జున్ ముండా తదితరులున్నారు. మధ్యప్రదేశ్‌లోని విదిశ నుంచి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను, పశ్చిమ త్రిపుర నుంచి బిప్లవ్ దేవ్‌ను బరిలోకి దింపింది. ఉత్తర్ ప్రదేశ్‌లోని అమేఠీలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ పోటీ చేస్తున్నారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా రాజస్థాన్‌లోని కోటా నుంచి పోటీకి దిగుతున్నారు.
రాష్ట్రాల వారీగా అభ్యర్థుల ప్రకటన ఇలా..
అండమాన్ నికోబార్-1, అరుణాచల్ ప్రదేశ్-2, అస్సాం-11, ఛత్తీస్‌గఢ్-11, దాద్రా అండ్ నగర్ హవేలీ అండ్ దమణ్ దీవ్-1, దిల్లీ-5, గోవా-1, గుజరాత్-15, జమ్మూ కశ్మీర్-2, ఝార్ఖండ్-11, కేరళ-12, మధ్యప్రదేశ్-24, రాజస్థాన్-15, తెలంగాణ-9, త్రిపుర-1, ఉత్తరాఖండ్-3, ఉత్తర్‌ప్రదేశ్-51, పశ్చిమ బెంగాల్-20.