BJP

కొత్త ప్రాంతాలకు, వర్గాలకు విస్తరించిన బిజెపి

18వ లోకసభ ఎన్నికల ఫలితాలపై ఎవరికి తోచిన విశ్లేషణలు వారు చేస్తున్నారు. భారత ప్రజాస్వామ్యం బ్రిటన్ లో అమల్లో ఉన్న ‘వెస్ట్ మినిస్టర్’ పద్ధతి కాబట్టి ఓట్ల నిష్పత్తి కాకుండా సంఖ్యాబలం ఆధారంగానే ప్రభుత్వం ఏర్పడుతుంది. ఆ లెక్కన అధికార భారతీయ జనతా పార్టీకి గత బలంతో పోలిస్తే 61 స్థానాలు, సాధారణ మెజారిటీకి 31 స్థానాలు తగ్గాయి. అయినప్పటికీ ఎన్డీఏ కూటమి 293 సంఖ్యను పరిగణనలోకి తీసుకుంటే సంపూర్ణ మెజారిటీ లభించింది. ఇతర పార్టీలు, కూటములపై ఆధార పడకుండానే ప్రభుత్వం ఏర్పాటయింది. 1999లో అటల్ బిహారీ వాజ్ పేయి నాయకత్వంలో ఏర్పడిన ఎన్డీఏ ప్రభుత్వం నాటి బిజెపి బలం కంటే నేడు 60 మంది సభ్యులు అధికంగా ఎన్నికయ్యారు. కాబట్టి ప్రభుత్వ సుస్థిరతపై ఎవరికీ ఎటువంటి అనుమానం అక్కర్లేదు. కానీ బిజెపి ప్రభుత్వానికి, నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా ప్రజలు తీర్పు ఇచ్చారని విపక్షాలు ప్రచారం చేయడమే విడ్డూరంగా ఉంది. బిజెపి ప్రచారం చేసినట్లు ‘అబ్ కీ బార్ 400 పార్’ నినాదం పూర్తిస్థాయిలో ఫలించకపోయి ఉండొచ్చు. కానీ 293 సీట్ల ద్వారా 75 శాతం లక్ష్యం సాధించినట్లే కదా!

వాస్తవంగా బిజెపి సొంతంగా 37.36 శాతం ఓట్లతో 240 సీట్లు, ఎన్డీఏ కూటమిగా 42.5 శాతం ఓట్లతో 293 స్థానాలు సాధించింది. ఇదే సమయంలో కాంగ్రెస్ సొంతంగా 21.19 శాతం ఓట్లతో 99 స్థానాలు, ‘ఇండీ’ కూటమి 40.68 శాతం ఓట్లతో 234 స్థానాలు సంపాదించింది. ఎన్డీఏలో మిత్రపక్షాల బలం కేవలం 5 శాతం కాగా ‘ఇండీ’ కూటమిలో మిత్రపక్షాల బలం దాదాపు సగం. సీట్లపరంగా చూస్తే మరింత ఎక్కువ. పైగా చాలా రాష్ట్రాలలో కాంగ్రెస్ ప్రాంతీయ పార్టీల సహకారంతో గెలిచిన సీట్లే అధికం. కాంగ్రెస్ కు ఇది కృత్రిమ బలం తప్ప సొంత బలం కాదు. ఓట్లు, సీట్లు, రాష్ట్రాలు, ప్రాంతాల వారీగా ఫలితాలు విశ్లేషిస్తే నిజమైన విజేత బిజెపి అన్నది నిస్సందేహం.

సర్వస్పర్షి – సర్వవ్యాప్తి

సమాజంలో అన్ని వర్గాలకు, దేశంలోని అన్ని ప్రాంతాలకు చేరుకోవాలని సామాజికంగా, భౌగోళికంగా పార్టీ విస్తరించాలని పార్టీ ‘‘సర్వస్పర్శి – సర్వ వ్యాప్తి’’ నినాదాన్ని చాలా సంవత్సరాల క్రితమే ఇచ్చింది. దానికి అనుగుణంగా మహిళలు, రైతులు, యువకులతో పాటు ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలతో మమేకం కావాలని పార్టీ ఆయా వర్గాల మోర్చాలను (విభాగాలను ) ఏర్పాటు చేసింది. దేశంలో సామాజికంగా, వృత్తిపరంగా బలహీనవర్గాలు జనాభాలో సగం ఉన్న నేపథ్యంలో ఆ వర్గాలను ఆకట్టుకోవడానికి, అట్టడుగు స్థాయి వరకు వెళ్లాలని, విస్తృతంగా చర్చించిన తర్వాత ‘‘ఓబీసీ’’ మోర్చాను కూడా పార్టీ ఏర్పాటు చేసింది. తద్వారా పార్టీని మించిన రీతిలో ఆయా మోర్చాల కార్యకలాపాలు పార్టీని ఉన్నత స్థితిలో ఉంచడానికి దోహదపడ్డాయి. అదేవిధంగా పార్టీ స్థాపించిన సమయంలో కొన్ని రాష్ట్రాలు, ప్రాంతాలు, ముఖ్యంగా ఉత్తర భారత దేశంలోనే బలంగా ఉన్న పార్టీ కాలక్రమేణా పశ్చిమ, తూర్పు, దక్షిణ రాష్ట్రాలలో కూడా విస్తరించింది.  అయితే దానికి పార్టీ నిరంతర శ్రమ, త్యాగం తోపాటు నీతి, నిజాయితీ, గౌరవం, విశ్వసనీయత గల నాయకత్వం, క్రమశిక్షణ, అంకితాభావంతో పనిచేసే క్యాడర్ పార్టీ విస్తరణకు దోహదపడ్డాయి.

1998లో అటల్ బిహారీ వాజపేయి నాయకత్వంలో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడినప్పటికీ, ప్రభుత్వ మనుగడకు ఇతర పార్టీల మీద ఆధారపడవలసి రావడం వల్ల ప్రభుత్వ పరంగా ప్రజల అభిమానం, ఆమోదయోగ్యత లభించినప్పటికీ సంస్థాగత విషయాలపై దృష్టి కేంద్రీకరించలేకపోయారు. కానీ 2014లో నరేంద్ర మోదీ నాయకత్వంలో రెండవసారి బిజెపి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పార్టీ అన్ని ప్రాంతాలకు విస్తరించడంలో విజయం సాధించింది. ఈశాన్య భారతంలో కూడా సొంతంగా అస్సాం, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్ లలో ప్రభుత్వాలు ఏర్పాటు చేయడమే కాకుండా మిగిలిన రాష్ట్రాలపై కూడా పట్టు సాధించింది. ఆయా రాష్ట్రాలలో ఇతర పార్టీలలో ఉన్న బలమైన నాయకులను గుర్తించి పార్టీలో చేర్చుకొని సముచిత ప్రాధాన్యం ఇవ్వడంతో పార్టీ మరింత వెళ్ళూనుకుంది. తద్వారా ‘సర్వ వ్యాప్తి-సర్వ స్పర్షి’ నినాదం వాస్తవ రూపం దాల్చింది.

మరుగున పడిపోయిన ముఖ్య విషయం ఏమిటంటే ఈ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ సంఖ్యాబలం తగ్గి నప్పటికీ భౌగోళికంగా, సామాజికంగా విస్తరించడం. ఈ ప్రాంతాల్లో పార్టీ అద్భుత ఫలితాలు సాధించింది. మొదటిసారిగా ఒరిస్సాలో సొంతంగా అధికారం చేపట్టింది. తెలంగాణలో దాదాపు సగం రాష్ట్రాన్ని దున్నేసింది. కేరళలోను మొదటిసారిగా ఖాతా తెరిచింది. ఈ రాష్ట్రంలో భారత ధర్మ జనసేన (బీడీజేఎస్) తో కలిసి పోటీ చేసి 19.24 శాతం, సొంతంగా సుమారుగా 17 శాతం, అంటే పోలైన ఓట్లలోఆరవ వంతు తెచ్చుకోవడంతోపాటు 11 అసెంబ్లీ స్థానాల్లో ఆధిక్యతను ప్రదర్శించింది. తమిళనాడులో సీట్లు రాకపోయినా సొంతంగా 11.24 శాతం, కూటమితో 18.28 శాతం అనగా సుమారు 5వ వంతు ఓట్లను సంపాదించింది. ఇక్కడ ఏఐఏడిఎంకెతో పొత్తు లేని విషయం గమనించాలి. 

ఇక తెలంగాణలో 8 సీట్లు గెలవడమే కాకుండా 35 శాతం ఓట్లను సొంతం చేసుకుంది. అదిలాబాద్ నుంచి హైదరాబాద్ మీదుగా పాలమూరు వరకు గిరిజన, గ్రామీణ ప్రాంతాల నుండి రాజధాని వరకు అప్రతిహత విజయం సాధించింది. ఒరిస్సాలో 45.34 శాతం ఓట్లతో 20 లోకసభ, 78 అసెంబ్లీ స్థానాలలో విజయకేతనం ఎగురవేసి ప్రభుత్వాన్ని స్థాపించింది. పశ్చిమబెంగాల్ లో సీట్ల సంఖ్య తగ్గినప్పటికీ సుమారు 39 శాతం ఓట్లతో 2.33 కోట్ల ఓట్లను సాధించింది. 11 శాతం ఓట్లతో కాంగ్రెస్-లెఫ్ట్ కూటమి బిజెపికి దరిదాపుల్లో కూడా లేదు. పంజాబ్ లో ఒక్క సీటు రానప్పటికీ ఐదవ వంతు ఓట్లు, అంటే 18.56 శాతం, సంపాదించింది. దశాబ్దాలుగా అకాలీదళ్ తో కలిసి పోటీ చేసిన బిజెపి ఒంటరిగా ఎదిగి తన పరిధిని విస్తరించుకోవడం విశేషం. ఆ అకాళీదళ్ తో కలుపుకొంటే ఓట్ల శాతం 32 శాతం దాటిపోతుంది. ఇక ఈశాన్య రాష్ట్రాలలో అస్సాంలో 10, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలలో ఉన్న రెండేసి సీట్లు తన ఖాతాలో వేసుకుంది. మేఘాలయను మిత్రపక్షాలకు వదిలి వేయగా సిక్కింతోపాటు మిగతా మూడు రాష్ట్రాలలోని నాలుగు సీట్లను కాంగ్రెస్, ప్రాంతీయ పార్టీలు పంచుకున్నాయి. 

ఉత్తర, పశ్చిమ భారతం విషయానికొస్తే మధ్యప్రదేశ్, గుజరాత్, ఛత్తీస్ గడ్, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ లలో బిజెపి దాదాపుగా సంపూర్ణ విజయం సాధించింది. బీహార్లో నాల్గింట మూడు వంతుల సీట్లను బిజెపి, జెడియు, ఎల్జెపి, హెచ్ఏఎం కూటమి గెల్చుకుంది. జార్ఖండ్ లోను ఇదే ఫలితాన్ని సాధించింది. ఇకపోతే ఉత్తర ప్రదేశ్ కు సంబంధించి ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే కాంగ్రెస్-ఎస్పి కూటమి 43.52 శాతం ఓట్లతో 43 సీట్లు గెలుచుకోగా, బిజెపి కూటమికి 44 శాతం ఓట్లు వచ్చినప్పటికీ 36 సీట్లకే పరిమితం కావడం. హర్యానాలో ఓట్లు, సీట్లు దాదాపుగా సమానంగా వచ్చాయి. రాజస్థాన్లో బిజెపి 49 శాతం ఓట్లతో 14 స్థానాలు గెలుచుకోగా కాంగ్రెస్ పలు పార్టీలతో జతకట్టి 45 శాతం ఓట్లతో 11 సీట్లకు పరిమితమైంది. మహారాష్ట్రలో కాంగ్రెస్, బిజెపి కూటముల మధ్య రెండు లక్షల ఓట్లు మాత్రమే తేడా ఉన్నప్పటికీ ఎన్డీఏకు 13 సీట్లు తగ్గిపోయాయి. ఈ నాలుగు రాష్ట్రాలలో బిజెపి ప్రభుత్వాలే ఉన్నాయి. అధికారంలో లేనప్పుడు కూడా ప్రధాన ప్రతిపక్షంగా ఉంటూ వచ్చింది. ఈ కారణంగా బలబలాలలో స్వల్ప మార్పులు సహజంగానే జరుగుతుంటాయి. ఈ లెక్కన సంస్థాగతంగా బలంగా ఉన్న బిజెపి బలం ఏ మాత్రం తగ్గలేదు. మరోవైపు ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, బెంగాల్, హర్యానా, మహారాష్ట్రలలో కేంద్ర ప్రభుత్వ వ్యతిరేకత కంటే స్థానిక అంశాలు, కులాల సమీకరణాలే బిజెపి కి నష్టం కలిగించాయనడంలో అతిశయోక్తి లేదు. 

కాంగ్రెస్ కు ప్రమాద ఘంటికలు 

ఒంటరిగా పోటీ చేసి సంస్థాగతంగా బలోపేతం కావాలన్న కాంగ్రెస్ జైపూర్ తీర్మానాన్ని గాలికి వదిలేసి సంఖ్యాబలం కోసం అర్రులు చాచింది. వివిధ రాష్ట్రాలలో తనకున్న కాస్త బలాన్ని ఫణంగా పెట్టి పొత్తులు కుదుర్చు కుంది. యూపీలో సమాజ్ వాది, బీహార్లో రాష్ట్రీయ జనతా దళ్, తమిళనాడులో డీఎంకే, మహారాష్ట్రలో ఎన్సీపీ, ఉద్ధవ్ శివసేన, కేరళలో యుడిఎఫ్ పక్షాలు, బెంగాల్లో వామపక్షాలు, ఢిల్లీ, హర్యానా తదితర రాష్ట్రాలలో ఆమ్ ఆద్మీ పార్టీ పొత్తుతో పోటీ చేసే స్థానాల సంఖ్య 328కి పరిమితం అయింది. ఆ విధంగా తన సంస్థాగత బలాన్ని తగ్గించుకుంది. మిగతా 215 స్థానాలలో కాంగ్రెస్ చతికిలబడినట్లే లెక్క. ఇటువంటి పరిస్థితిలో కాంగ్రెస్ పునరుజ్జీవం పొందడం అసంభవం. 

వాస్తవంగా ఈనాడు కాంగ్రెస్ పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యిలా ఉంది. ఒంటరిగా పోరాడి 2014, 2019 ఎన్నికలలో ప్రధాన ప్రతిపక్ష స్థాయికి కూడా చేరలేక పోయింది. దీంతో సంఖ్యా బలం కోసం పొత్తులకు తెరలేపింది. అయితే ఈ పొత్తులతో ఆయా ప్రాంతీయ పార్టీల దయాదాక్షిణ్యాల మీద ఆధార పడవలసిన పరిస్థితి ఏర్పడింది. బిజెపితో నేరుగా తలపడే మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, ఛత్తీస్ గడ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, కర్ణాటక తదితర రాష్ట్రాలలో మూడవ పార్టీ లేని కారణంగా భవిష్యత్తులో ఎప్పుడైనా బిజెపి స్థానాల సంఖ్య తగ్గితే ఆ మేరకు కాంగ్రెస్ ప్రయోజనం పొందవచ్చు. కానీ పొత్తులున్న అన్ని రాష్ట్రాలలో బిజెపి బలం తగ్గినా ఆ మేరకు ప్రాంతీయ పార్టీలే లాభపడతాయి. దీనికి ప్రత్యక్ష సాక్ష్యం ఉత్తర ప్రదేశ్. ఈ విధంగా కాంగ్రెస్ ఒక్కొక్క రాష్ట్రాన్ని ప్రాంతీయ పార్టీలకు అప్పగించింది. తద్వారా కాంగ్రెస్ సొంతంగా పోటీలో నిలబడగలిగే రాష్ట్రాలు క్రమంగా తగ్గిపోతున్నాయి. 

కాంగ్రెస్ పార్టీ ఇంకా ఒక కుటుంబ పార్టీగానే కొనసాగుతుండడం అతిపెద్ద ప్రతికూలాంశం. కాంగ్రెస్ జమానాలోని తరాలు మారాయి. దేశంలో పలు ప్రాంతీయ పార్టీలు కుటుంబ పార్టీలుగా, కుటుంబ పార్టీలు అవినీతి పార్టీలుగా ప్రజల దృష్టిలో చులకన అయిపోయాయి. దీనికి కాంగ్రెస్ ఏమీ అతీతం కాదు. కాంగ్రెస్ పార్టీ ఎంత మారినా కుటుంబ పార్టీ ముద్రను తొలగించు కోలేకపోయింది. దేశంలోని యువతరం, నవతరం ఆశలకు, ఆకాంక్షలకు తగ్గట్టుగా కుటుంబ సంకెళ్ల నుండి బయటపడే సాహసం ఆ పార్టీ చేస్తుందా? ఇది జరగనంత వరకు కాంగ్రెస్ జాతీయ ప్రత్యామ్నాయ పార్టీగా ఆవిర్భవించడం అసాధ్యం. మరోవైపు బిజెపి దాదాపు 20 రాష్ట్రాలలో అధికారంలో ఉండడంతోపాటు కేరళ, తమిళనాడు, పంజాబ్ వంటి రాష్ట్రాలలో బలం పెంచుకోవడానికి సర్వశక్తులు ఒడ్డుతోంది. తద్వారా బిజెపిని కాంగ్రెస్ ఒంటరిగా ఢీకొట్ట లేని స్థాయికి దిగజా ర్చింది. కాంగ్రెస్ ఎదుగుదలకు దాని మిత్ర పక్షాలు, ప్రాంతీయ పార్టీలే అడ్డుగోడలుగా మారాయి. ఈ అడ్డుగోడలను ఛేదించుకొని బిజెపికి సమాన స్థాయిలో బలం సమకూర్చుకునే అవకాశం కాంగ్రెస్ కు సుదూర భవిష్యత్తులో లేదు. 

సామాజిక అసమానతలు-ఆందోళనలు

గత పది సంవత్సరాల కాలంలో నరేంద్ర మోదీ ఎలాంటి అవినీతి, అక్రమాలు, కుంభకోణాలకు అవకాశం ఇవ్వకుండా పరిపాలన కొనసాగిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్, ఇతర పక్షాలు రిజర్వేషన్లు, రాజ్యాంగ సవరణ అనే అవసరం లేని, అసందర్భ విషయాలను ఎన్నికల అంశాలుగా నెత్తికెత్తుకున్నాయి. దేశ రాజ్యాంగాన్ని సమూలంగా మార్చి, రిజర్వేషన్లు రద్దు చేసే సాహసం ఏ రాజకీయ పార్టీ అయినా చేస్తుందా? ఆ మాత్రం రాజకీయ పరిణతి, విజ్ఞత, అవగాహన బిజెపి నాయకత్వానికి లేవనుకోవడం విపక్షాల రాజకీయ అజ్ఞానం, మూర్ఖత్వం. ఇలాంటి విషయాల వల్ల ప్రతిపక్షాలకు ఒరిగేది శూన్యం. 

దేశంలో రాజకీయ సుస్థిరత, సుపరిపాలన, ఆర్థిక పురోగతి, దౌత్య పరంగా అంతర్జాతీయ స్థాయిలో భారత్ ప్రతిష్ట ఇనుమడించిన సమయంలో కొన్ని రాష్ట్రాలలో రిజర్వేషన్ల కోసం హింసాత్మక ఆందోళనలు తలెత్తాయి. పశ్చిమ యుపి, హర్యానా, రాజస్థాన్లలో జాట్లు, గుజరాత్ లో పాటీదారులు (పటేళ్లు), మహారాష్ట్రలో మరాఠీల రిజర్వేషన్ల కోసం ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి. బిజెపిని రాజకీయంగా దెబ్బతీయడానికే ఈ ఉద్యమాలు జరిగాయని అనుమానాలు తలెత్తాయి. గతంలో మండల్ కమిషన్ నివేదిక ఆధారంగా బీసీలకు 27 శాతం రిజర్వేషన్లకు అనుకూలంగా, వ్యతిరేకంగా ఆందోళనలు, ఉద్యమాలు జరిగినప్పటికీ ఆయా రాష్ట్రాలలో సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా బలమైన సామాజిక వర్గాలు కూడా రిజర్వేషన్ల కోసం పోరుబాట పట్టడం విచిత్రం. ఈ పరిస్థితులను అర్థం చేసుకున్న నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈబిసిల కోసం 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ బిల్లు తేవడంతో ఈ ఉద్యమాలు నిర్వీర్యం అయినప్పటికీ, మరాఠీల ఉద్యమం ఇంకా కొనసాగుతుండడం ఆశ్చర్యకరం. దేశం నిరంతరం ఎదుర్కొంటున్న తీవ్రవాదం, సరిహద్దుల్లో అక్రమ చొరబాట్లు, దేశభద్రత వంటి సమస్యలను వదిలేసి ప్రతిపక్షాలు అప్రధాన అంశాలకు ప్రాధాన్యమివ్వడం మన రాజకీయపక్షాల బలహీనతలను, దీనస్థితిని తెలియజేస్తుంది.

బిజెపి కేంద్ర బిందువుగా రాజకీయాలు

భారత రాజకీయాలలో ఒకప్పుడు ఒంటరిగా కాంగ్రెసును ఢీకొట్టే రాజకీయ పార్టీ ఏదీ ఉండేది కాదు. కానీ పటిష్టమైన, అంకితభావం గల కార్యకర్తల యంత్రాంగం, స్థిరమైన సిద్ధాంతం, స్పష్టమైన విధానం, బలమైన రాజకీయ నాయకత్వంతో బిజెపి గత నాలుగు దశాబ్దాలలో తిరుగులేని రాజకీయ శక్తిగా ఎదిగిన తీరు అద్భుతం. మిగతా పార్టీ నాయకులతో పోల్చినప్పుడు బిజెపి అగ్ర నేతలు అటల్ బిహారీ వాజపేయి, లాల్ కృష్ణ అద్వానీలు దేశ రాజకీయాలలో శిఖర సమానులనడంలో అతియోక్తి లేదు. కుటుంబ, అవినీతి రాజకీయాలకు అతీతంగా దేశం, ప్రజలే ప్రాధాన్యంగా అచంచల దేశభక్తి, నిష్కళంక రాజకీయ జీవితంతో బిజెపిని దాదాపు 3 దశాబ్దాలు ముందుకు నడిపించారు. ఈ అంశాలే దేశ ప్రజలను ఆకర్షించడానికి కారణాలయ్యాయి. అదే కోవలో నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా తన అద్భుతమైన పనితీరుతో దేశంలోని యువత, మధ్యతరగతి ప్రజల అభిమానం చూరగొని ప్రధానమంత్రిగా అన్ని వర్గాల ప్రజలకు చేరువై పార్టీని దేశంలో సమీప భవిష్యత్తులో ఏ ఇతర పార్టీ ఢీకొట్టే స్థితిలో లేకుండా నిర్మాణం చేశారు.

కేంద్రంతో పాటు అనేక రాష్ట్రాలలో అధికారంలో ఉండడమే కాకుండా మిగతా రాష్ట్రాలలో ప్రధాన పక్షంగా కొనసాగడం, సంస్థాగతంగా బలపడడం ద్వారా దేశ రాజకీయాలకు బిజెపి కేంద్ర బిందువుగా మారింది. దాదాపు 18 కోట్ల సభ్యత్వంతో ప్రపచంలోనే అతి పెద్ద రాజకీయ పార్టీ గా ఉద్భవించింది. ఒకప్పుడు వాజపేయి, అద్వానీల తర్వాత ఎవరు అనే ప్రశ్నలకు సమాధానంగా నేడు నరేంద్ర మోదీ ఆ స్థానాన్ని ఆక్రమించారు. వారసత్వ రాజకీయాలకు భిన్నంగా సిద్ధాంతపరంగా నడిచే పార్టీలకే ఇటువంటి అవకాశం ఉంటుంది. అందుకే నరేంద్ర మోదీ తర్వాత ఎవరు అనే ప్రశ్నే ఉదయించదు. ఆ స్థానాన్ని భర్తీ చేయగల నాయకులూ బిజెపిలో పుష్కలంగా ఉన్నారు. 2024 లోక్ సభ ఫలితాలు బిజెపికి కొంత నిరాశ కలిగించినప్పటికీ పార్టీ కొత్త ప్రాంతాలలో, రాష్ట్రాలలో విస్తరించడం, భిన్న సామాజిక వర్గాల ప్రతినిధులు పార్టీ తరఫున ఎన్నిక కావడం, తద్వారా భవిష్యత్తులో పార్టీ ఏ పరిణామాలనైనా ఎదుర్కోగల సత్తా కలిగి ఉండడం బిజెపి ఉజ్జ్వల భవిష్యత్తుకు సంకేతం.

డాక్టర్ ఎస్ మల్లారెడ్డి ,
బిజెపి రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు