Telangana Farmer

బూటకంగా రేవంత్ రెడ్డి రుణమాఫీ హామీ

గస్టు 15 వరకు ఒకే దఫాలో రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామన్న కాంగ్రెస్‌ హామీ బూటకమని తేలిపోయింది. గడువులోపు రుణమాఫీ పూర్తి చేయలేదని, రైతులకు ఇచ్చిన మాట తప్పామని స్వయంగా మంత్రులే ఒప్పుకొంటున్నారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియాకు ముఖం చాటేసి, మంత్రులను ముందుకు నెడుతున్నారు. ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి మరో మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి మీడియా సమావేశం నిర్వహించి రుణమాఫీ పూర్తికాలేదని, ఇంకా 9.14 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేయాల్సి ఉన్నదని అంగీకరించారు. మరోవంక, స్వయంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సైతం తమ ప్రభుత్వ తప్పును బయటపెట్టారు. ఆగస్టు 15 వరకు సగం మంది రైతులకే రుణమాఫీ చేశామని కుండబద్దలు కొట్టారు. రుణమాఫీకి అర్హులైన మొత్తం రైతులు 41,78,892 మంది ఉండగా 22 లక్షల మందికే రుణమాఫీ చేసినట్లు స్పష్టం చేశారు. అంటే ఇంకా సుమారు 20 లక్షల మంది రైతులకు ఎగనామం పెట్టామని చెప్పకనే చెప్పారు. ఆయా రైతులు సుమారు 40 బ్యాంకులకు చెందిన 5,782 బ్రాంచీల్లో రూ.31 వేల కోట్ల పంట రుణాలు తీసుకున్నట్టు గుర్తించామని తెలిపారు. ఇందులో ఆగస్టు 15 నాటికి రూ.18 వేల కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేశామని వివరించారు. రుణమాఫీ కాని వారందరికీ పూర్తి చేస్తామని చెబుతున్న మంత్రి, ఎప్పటిలోపు చేస్తారనేది మాత్రం చెప్పలేక పోతున్నారు.

ప్రభుత్వం రూ.2 లక్షల వరకు అరకొర రుణమాఫీ చేసి చేతులు దులుపుకొన్నది. ఇక 2 లక్షలకు పైన రుణాలున్న రైతులకు మాఫీ ఎప్పుడు చేస్తారో ప్రభ్తుత్వం స్పష్టత ఇవ్వడం లేదు. నిధులున్నప్పుడే వీరికి మాఫీ చేసేలా ప్రభుత్వ తీరు కనిపిస్తున్నది. ఈ రైతులకు సంబంధించి త్వరలో క్యాబినెట్‌లో నిర్ణయం తీసుకుంటామని మంత్రి తుమ్మల వెల్లడించారు. నిధులు సమకూరడాన్ని బట్టి మాఫీ చేస్తామని చెబుతున్నా అసలు క్యాబినెట్‌ భేటీ అయ్యేదెప్పుడో? చర్చించేదెప్పుడో? నిబంధనలు రూపొందించేదెప్పుడో? రుణమాఫీ చేసేదెప్పుడో? అనే సందేహాలు రైతుల్లో వ్యక్తమవుతున్నాయి. రూ.2 లక్షలలోపు రుణాలుండి మాఫీ కాని వారి సమస్యలపై, రూ.2 లక్షల పైన రుణాల అంశంపై మంత్రి తుమ్మల స్పష్టత ఇవ్వలేకపోతున్నారు. ఇప్పటికే రుణమాఫీ నిబంధనలు రూపొందించి, ఉత్తర్వులు జారీ చేశారని, వాటి ప్రకారం రుణమాఫీ చేసినప్పుడు మళ్లీ క్యాబినెట్‌ నిర్ణయం ఎందుకనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. క్యాబినెట్‌లో చర్చ, నిబంధనల పేరుతో కాలయాపన చేసేందుకు, తద్వారా మొత్తంగా రుణమాఫీని తప్పించుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

‘డిసెంబర్‌ 9న రైతులందరికీ రూ.2 లక్షల రుణమాఫీ చేస్తాం’.. ఇది అసెంబ్లీ ఎన్నికల ముందు రుణమాఫీపై రేవంత్‌రెడ్డి చెప్పిన మాట! ‘ఆరు నూరైనా, తూర్పున ఉదయించే సూర్యుడు పడమర ఉదయించినా ఆగస్టు 15 వరకు రైతులందరికీ రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తాం’ ఇది పార్లమెంట్‌ ఎన్నికల ప్రచారంలో కనిపించిన దేవుళ్లందరిపైనా ఒట్టు పెట్టి మరీ రేవంత్‌ చెప్పిన మాట. ఇలా ఎన్నికల పబ్బం గడుపుకొనేందుకు రుణమాఫీపై అప్పటిమందం హామీలిచ్చి తర్వాత ముఖం చాటేయడం రేవంత్‌ రెడ్డికి, కాంగ్రెస్ నేతలకు పరిపాటిగా మారింది. నాడు ఆగస్టు 15 వరకు రైతులందరికీ రుణమాఫీ చేస్తామని చెప్పగా ఇప్పుడేమో ఆగస్టు 15 వరకు చిన్న, సన్నకారు రైతులకే రూ.2 లక్షల మాఫీ చేస్తామని చెప్పామని, చేశామని మంత్రి తుమ్మల మాటమార్చడం గమనార్హం.

అర్హతలున్నప్పటికీ తమకు రుణమాఫీ కాలేదంటూ రైతుల నుంచి ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. లక్ష మందికి పైగా రైతులు ఫిర్యాదులు చేసినట్లు తెలుస్తున్నది. ఇవి అధికారికంగా ఇచ్చిన ఫిర్యాదులు మాత్రమే. క్షేత్రస్థాయిలో ఏఈవోలకు, ఇతర అధికారులకు రైతులు పెట్టుకొన్న ఫిర్యాదుల సంఖ్య ఇందుకు రెట్టింపు ఉంటుందని అధికారులే చెప్తున్నారు. ఇవన్నీ అధికారిక ‘లెక్క’లోకి రావడం లేదు. రుణమాఫీ ప్రారంభమైంది మొదలు రైతులు ఏఈవోలు, బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. తమకు రుణమాఫీ కాలేదని, సమస్య పరిష్కరించాలంటూ ప్రతి అధికారికీ మొర పెట్టుకుంటున్నా రైతుల మొర అరణ్య రోదనే అవుతున్నదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. స్వీకరించిన, పరిష్కరించిన ఫిర్యాదుల సంఖ్య ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నది. వివిధ బ్యాంకుల్లో నెలకొన్న సాంకేతిక సమస్యల కారణంగా 80 వేల ఖాతాలకు సంబంధించిన వివరాలను తెప్పించుకున్నట్టు మంత్రి తుమ్మల వెల్లడించారు. ఇందులో ఆధార్‌ నంబర్‌ ఇవ్వకపోవడం, సరిగ్గా లేకపోవడం, రుణాల మంజూరు తేదీలో తప్పులు ఇలా అనేక కారణాలు ఉన్నాయని వివరించారు. 80 వేల ఖాతాలకు సంబంధించిన సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది.

మొదటి రెండు విడతల్లో తప్పులు దొర్లిన 7,925 ఖాతాల సమస్యలను మాత్రమే పరిష్కరించినట్టు మంత్రి తెలపడం గమనార్హం. ఆయా ఖాతాలకు రూ.44.95 కోట్లు విడుదల చేసినట్టు చెప్పారు. అధికారికంగా 80 వేల ఖాతాల్లో సమస్యలు ఉంటే, ప్రభుత్వం పరిష్కరించింది 8 వేలు మాత్రమే. నెల రోజుల్లో 8 వేల ఖాతాల సమస్యలను మాత్రమే పరిష్కరించగా మిగిలిన 72 వేల ఖాతాల సమస్యలను పరిష్కరించేందుకు ఎన్ని నెలల సమయం తీసుకుంటారోననే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. 22 వేల ఖాతాల్లో జమైన రుణమాఫీ డబ్బు రివర్స్‌ వచ్చినట్టు తెలిపారు. రైతుల ఖాతాల్లో జమైన పైసలు.. తిరిగి ప్రభుత్వ ఖాతాల్లోకి వెళ్లడం గమనార్హం. రుణమాఫీ కాని వారు అధికారులకు ఫిర్యాదు చేయాలని, పరిష్కరిస్తామని ప్రభుత్వం చెప్తున్నది. కానీ, వాటికి పరిష్కారం ఎప్పుడు, ఎక్కడ అనే ప్రశ్నలకు సమాధానం దొరకడం లేదు. రుణమాఫీ ఫిర్యాదులకు సంబంధించి వ్యవసాయ శాఖ డైరెక్టరేట్‌లో ప్రత్యేకంగా ఎలాంటి ఏర్పాట్లు చేయలేదని ఉన్నతాధికారి ఒకరు స్పష్టం చేశారు. మొత్తం క్షేత్రస్థాయిలోనే పరిష్కరిస్తున్నారని తెలిపారు. దీంతో వ్యవసాయ శాఖ ఉన్నతాధికారుల జోక్యం లేకుండా సమస్యల పరిష్కారం జరుగుతుందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో వ్యవసాయ శాఖ రైతుల ఫిర్యాదులను పట్టించుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

కృష్ణ చైతన్య