Modi membershipt

సభ్యత్వ నమోదు ఓ సైద్ధాంతిక ఉద్యమం

Modi nadda Membershipబిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమం కేవలం గణాంకాలు, అంకెలు కాదని… పూర్తి స్థాయి సైద్ధాంతిక ఉద్యమం అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సభ్యత్వం అంటే పార్టీ సభ్యుల సంఖ్యను పెంచడం మాత్రమే కాదని కాదు, దేశాన్ని బలోపేతం చేయడం కూడా అని అభివర్ణించారు. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పవిత్ర కార్యంగా భావించాలని, వేడుకగా మార్చాలని అన్నారు. బిజెపి కార్యకర్తల మనోభావాలు దేశభక్తితో ప్రేరణ పొందాయని, భరతమాత సంక్షేమం కోసం, 140 కోట్ల మంది దేశ ప్రజల సంక్షేమం కోసం నిబద్ధమై ఉన్నామని అన్నారు. కొత్త వారిని సభ్యులుగా చేర్చుకొని వారికి ఉపకారం చేశామనే భావన కలిగించకూడదని, దేశ ప్రయోజనాల కోసం వారు ముందుకు రావడం మనకు గర్వకారణం అన్న భావన కలిగించాలని సూచించారు. సెప్టెంబర్ 2న దిల్లీలో బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తొలి సభ్యుడిగా నమోదయ్యారు. 88 00 00 2024 నెంబర్ కు మిస్డ్ కాల్ ఇచ్చి బిజెపి సభ్యత్వం తీసుకున్నారు. అనంతరం బిజెపి జాతీయ అధ్యక్షుడు జె.పి. నడ్డా, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తమ సభ్యత్వం పునరుద్ధరించుకున్నారు.

సభ్యత్వ నమోదు అనేది నిరంతర ప్రక్రియ… మిస్డ్ కాల్స్, వాట్సాప్, అధికారిక వెబ్ సైట్, క్యూఆర్ కోడ్లు, నమో యాప్, సభ్యత్వ నమోదు పత్రాలతో సహా బహుళ మార్గాల ద్వారా బిజెపి సభ్యత్వం లభిస్తుంది. డిజిటల్ గానూ, ఫిజికల్ స్లిప్పుల రూపంలోనూ సభ్యత్వ నమోదు ఉంటుంది. మొదటి దశ సభ్యత్వ నమోదు కార్యక్రమం సెప్టెంబర్ 2న ప్రారంభమై సెప్టెంబర్ 25న ముగుస్తుంది. రెండో దశ అక్టోబర్ 1 నుంచి 15 వరకు ఉంటుంది. అక్టోబర్ 16 నుంచి అక్టోబర్ 31 వరకు క్రియాశీల సభ్యత్వ నమోదు జరుగుతుంది. పార్టీ రాజ్యాంగం ప్రకారం క్రియాశీల సభ్యులు మాత్రమే ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హులు. సభ్యత్వ నమోదు కార్యక్రమం ద్వారా 10 కోట్ల మంది సభ్యులను చేర్చాలనేది లక్ష్యం. ఇందుకోసం బిజెపి పటిష్ట ప్రణాళికను రూపొందించింది. ఆగస్టు 17న జాతీయస్థాయి కార్యశాల అనంతరం ఆగస్టు 19 నుంచి 21 వరకు రాష్ట్రస్థాయి కార్యశాలలు జరిగాయి. 777 జిల్లాల్లో జిల్లా స్థాయి కార్యశాలలు, మండల స్థాయిలో సుమారు 11,486 కార్యశాలలు పూర్తయ్యాయి. ఆగస్టు 31 నాటికి 4 లక్షలకు పైగా బూత్ లలో కార్యశాలలు నిర్వహించారు. 

బిజెపి సభ్యత్వాన్ని పునరుద్ధరించుకున్న అనంతరం అక్కడున్న పార్టీ నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి ప్రధాని ప్రసంగించారు. భారతీయ జనసంఘ్ నుంచి ఇప్పటి వరకు దేశంలో కొత్త రాజకీయ సంస్కృతిని తీసుకురావడానికి ఎంతో కృషి చేశామన్నారు. భారతదేశంలో ప్రజాస్వామ్య ప్రక్రియలను అనుసరిస్తూ విస్తరిస్తున్న ఏకైక పార్టీ బిజెపినే అని స్పష్టం చేశారు. సామాన్యుడి ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా పార్టీ నిరంతరం పని చేస్తుందన్నారు. ఎన్నో ఏళ్ల కృషి, ఎంతో మంది త్యాగాలతో బిజెపి ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకోగలిగిందని తెలిపారు. ఇద్దరు ఎంపీలు ఉన్నప్పుడు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నామని గతాన్ని గుర్తు చేసుకున్నారు. సుందర్ సింగ్ భండారీ మెంబర్షిప్ డ్రైవ్ కోసం పట్టుబట్టినప్పుడు దీంతో ఏమవుతుందని చాలా మంది అనుకున్నారని, కానీ నేడు ఈ మెంబర్షిప్ డ్రైవ్ దేశ ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చే మాధ్యమంగా మారిందన్నారు.

యావత్ ప్రపంచానికి, ముఖ్యంగా గ్లోబల్ సౌత్ దేశాలకు, అభివృద్ధి చెందుతున్న దేశాలకు భారత్ ఆదర్శంగా నిలిచిందన్నారు. ఇప్పటి వరకు ఎవరూ పట్టించుకోని వారిని ఆదరించాలని మనం కోరుకుంటున్నామని తెలిపారు. పాలనపై దృష్టి పెట్టి, ప్రజల భాగస్వామ్యంతో సామాన్యుల ఆకాంక్షలపై పని చేయడం వల్ల నేడు దేశంలోని ఆకాంక్షాత్మక జిల్లాలు రాష్ట్రంలో అగ్రస్థానంలో ఉన్న జిల్లాలతో పోటీ పడుతున్నాయని మోదీ తెలిపారు. గతంలో సరిహద్దు గ్రామాలను భారతదేశం చివరి గ్రామాలుగా పిలిచేవారని, ఇది చివరి గ్రామం కాదని, దేశంలోనే తొలి గ్రామం అని మనం స్పష్టం చేశామని తెలిపారు. సరిహద్దు గ్రామం బిజెపి కోటగా మారితే, అటోమేటిగ్గా దేశం బిజెపి కోటగా మారుతుందన్నారు.

గతంలో హిమాచల్ ప్రదేశ్ లో జరిగిన సంఘటనలను గుర్తు చేసుకుంటూ ”హిమాచల్ ప్రదేశ్ సభ్యత్వ నమోదు సమయంలో కొండ ప్రాంతాలకు వెళ్లాను. పోలింగ్ బూత్ కు వెళ్లడానికి నాకు ఒక రోజు పట్టేది. పర్వతాలు ఎక్కాల్సి వచ్చింది. అక్కడికి వెళ్లి 20-22 మందితో సమావేశం నిర్వహించిన తర్వాత కిందికి వచ్చేవాడిని. ఇందుకు ఒక రోజంతా గడిచేది. అయినా అక్కడ ఎవరో ఉన్నారని ఆనందించేవాడిని” అని అన్నారు. మహిళలకు ఈ 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ బిజెపి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయాన్ని తెలిపి పెద్ద సంఖ్యలో మహిళలను పార్టీ సభ్యులుగా చేర్చుకోవాలని, ముఖ్యంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు సహా ఎన్నికల్లో గెలవగలిగే మహిళలను చేర్చుకోవాలని సూచించారు. ఏ ఒక్క వర్గాన్నీ ఉపేక్షించకుండా ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు అందరినీ చేరుకోవాలని సూచిస్తూ ”గోళ్లు శరీరంలో చిన్న భాగం, గోళ్లు ఊడితే శరీరమంతా నొప్పిగా ఉంటుంది. ఎందుకంటే అవి శరీరంలో భాగమే. దేశంలో ఒక వ్యక్తి బాధపడితే, అతని బాధను నేను కూడా అనుభవిస్తున్నాను. ఈ బాధ నుంచే పీఎం జన్ మన్ యోజన పుట్టింది. మారమూల ప్రాంతాలకు ప్రభుత్వం వచ్చింది. రోడ్లు నిర్మితమవుతున్నాయి, పిల్లలు కూడా బడిలో చేరుతున్నారు. మరి, కమలానికి ఎవరు అన్నం పెడతారు, ఎవరు తినిపిస్తారు? ఈ విధంగా ఆలోచించడం ద్వారా మనం ఈ వర్గాలను చేరుకోగలం.” అని అన్నారు.

మూడు, నాలుగు తరాలుగా పక్కా ఇల్లు చూడని వారు దేశంలో ఉన్నారని, వారిలో నాలుగు కోట్ల కుటుంబాలకు ఇప్పుడు చిరునామాలు దక్కాయన్నారు. కమలం ఇంటి గోడలను నిర్మించిందని, ఆ కమలానికి వారి హృదయంలో స్థానం కల్పించాలన్న భావన వారిలో కల్పించాలన్నారు. ప్రస్తుతం 18-20 ఏళ్ల వయసులో ఉన్నవారికి గతంలో జరిగిన లక్షల కోట్ల కుంభకోణాల గురించి అవగాహన ఉండదని, 10, 11 ఏళ్ల క్రితం దేశ పరిస్థితి ఎలా ఉండేదో వారికి తెలియదని అన్నారు. వారి తల్లిదండ్రులు ఎన్ని కష్టాలు పడ్డారో.. టెలిఫోన్ కనెక్షన్ కోసం ఎమ్మెల్యే, ఎంపీ ఇంటి చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి రావడం…. గ్యాస్ కనెక్షన్ కోసం ఏళ్ల తరబడి నిరీక్షించాల్సి రావడం… ఎప్పుడూ కరెంటు ఉండకపోవడం…. అంధకారంలో జీవనాన్ని గడపడం… పిల్లలకు చదువు లేకపోవడం వంటి కష్టాలు, జీవితాలు వారికి తెలియవన్నారు. అలాంటి స్థితి నుంచి దేశాన్ని ఎక్కడికి తీసుకెళ్లామో వారికి వివరించి సభ్యులుగా చేర్చుకోవాలన్నారు.

”పార్టీ కార్యకర్తల నిరంతర కృషి వల్లే మనం వరసగా ఎన్నికల్లో గెలుస్తున్నాం. కొత్త తరాలు వస్తేనే మనం బలపడతాం. కొత్త వాళ్లు వస్తే మీ బలం పెరుగుతుంది. మీ గౌరవం పెరుగుతుంది. మీరు కోరుకున్న ఫలితాలను పొందేందుకు అతను మీ భాగస్వామిగా పని చేస్తారు. మనం ప్రజాస్వామిక విలువలకు పట్టం కట్టే పార్టీ. వ్యవస్థలో, ఆలోచనలో, సంస్కృతిలో ప్రజాస్వామ్యాన్ని అనుసరిస్తున్నాం. మన సభ్యత్వ నమోదు కొత్త శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షిస్తున్నాను. గత రెండు మూడు ఎన్నికల్లో తక్కువ ఓట్లు వచ్చిన సీ గ్రేడ్ పోలింగ్ బూత్ నుంచే సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించాలి. దేశంలోని పేదలకు మన విధానాలు, నిర్ణయాలపై పూర్తి విశ్వాసం ఉంది. నడ్డా నాయకత్వంలో పార్టీ సంస్థాగత బలం పూర్తిగా నిమగ్నమైతే, ఈ సభ్యత్వ నమోదు పాత రికార్డులన్నింటినీ బద్దలు కొడుతుంది. ఈ మెంబర్ షిప్ డ్రైవ్ అనేక కొత్త బూత్ లకు చేరుతుంది.” అని అన్నారు.

కార్యకర్త భావజాల వాహకం: అమిత్ షా

ఈ కార్యక్రమంలో అమిత్ షా మాట్లాడుతూ బిజెపి కార్యకర్త కేవలం పార్టీలో సభ్యులు మాత్రమే కాదని, ఒక యూనిట్ అని, ఒక భావజాల వాహకమని అన్నారు. ప్రభుత్వానికి, పార్టీకి మధ్య వారధిగా పని చేస్తారన్నారు. ఫలితంగా ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రజలతో కనెక్ట్ అవుతుందన్నారు. ”భారతీయ జనతా పార్టీ ప్రపంచంలోనే అతి పెద్ద రాజకీయ పార్టీ, రాజకీయ పార్టీలలో అత్యంత విశిష్టమైన పార్టీ. నేడు భారతదేశ రాజకీయ పటంలో 1500కి పైగా రాజకీయ పార్టీలు ఉన్నాయి, కాని ఏ రాజకీయ పార్టీ కూడా ప్రతి ఆరేళ్లకు ఒకసారి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా బహిరంగంగా, స్థిరమైన పద్ధతిలో నిర్వహించదు. బిజెపి మాత్రమే ఈ సంప్రదాయం, సంస్కృతితో ముందుకెళ్తోంది.” అని అన్నారు. బలమైన మరియు సంపన్న భారతదేశాన్ని నిర్మించాలనే కల బిజెపి కార్యకర్తలతో ప్రజల అనుబంధం వల్ల మాత్రమే నెరవేరుతుందని అన్నారు. అన్ని వర్గాలను కలుపుకునిపోవాలని, ప్రతి వయసు, వర్గం, కులం, మతంలో ఉన్న ప్రతి ఒక్కరిని బిజెపి భాగస్వాములను చేయాలన్నారు.

బిజెపి సిద్ధాంతంతో నడుస్తోందని, భావజాలం ఆధారంగానే రాజకీయాల్లో పని చేయడం ప్రారంభించిందని అన్నారు. ”భారతీయ జనతా పార్టీ ఎన్నో సంవత్సరాలు పోరాడింది, ఎన్నో పరాజయాలు చవిచూసింది, విజయాన్ని కూడా చవిచూసింది, కానీ ఆ పార్టీ తన పనిని నిరంతరం చేస్తూనే ఉంది. గత పదేళ్లలో నరేంద్ర మోదీ నాయకత్వంలోని బిజెపి ప్రభుత్వం 60 కోట్ల మంది పేదలకు ఇల్లు, విద్యుత్, రేషన్, గ్యాస్, ఆరోగ్యం వంటి అన్ని సౌకర్యాలను అందించింది. దేశం కొత్త శిఖరాలను అధిరోహించి ప్రపంచంలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. ఇది బిజెపి కార్యకర్తలందరికీ గర్వకారణం. గడచిన 10 సంవత్సరాలలో, దేశంలోని అనేక పెండింగ్ సమస్యలను నరేంద్ర మోదీ పరిష్కరించారు.” అని అన్నారు.

గతంలో గుజరాత్ లో సభ్యత్వ నమోదు కోసం నరేంద్ర మోదీతో కలిసి పని చేసిన అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు. ”80వ దశకంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గుజరాత్ సంస్థాగత ప్రధాన కార్యదర్శి అయ్యారు. అప్పుడు సభ్యత్వ నమోదు కార్యక్రమానికి నేనే కో-ఇంఛార్జిగా ఉన్నాను, ఆనందీబెన్ పటేల్ ఇన్ ఛార్జిగా ఉన్నారు. నరేంద్ర మోదీ 45 రోజుల పాటు రైలులో రాత్రింబవళ్లు ప్రయాణించి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని సంస్థాగతం చేశారు. ఆ సమయంలో ప్రతి సభ్యుడి డేటాను నమోదు చేసి గుజరాత్ లో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేశారు.” అని వివరించారు. పార్టీని సంస్థాగతంగా పునరుద్ధరించాల్సిన బాధ్యత పార్టీ కార్యకర్తలు, పదాధికారులు అందరిపై ఉందన్నారు. మనమందరం కలిసి ప్రతి వీధి, గ్రామం, నగరం, పర్వతం, అడవి, ద్వీపం, ప్రతిచోటా వెళ్లి నరేంద్ర మోదీ, బిజెపి జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాశ్ నడ్డా సందేశాన్ని వ్యాప్తి చేయాలని పిలుపునిచ్చారు. కార్యకర్తలంతా మరోసారి పార్టీలో కొత్త రక్తాన్ని తీసుకువచ్చి పార్టీ పని సంస్కృతిని ప్రజలకు పరిచయం చేయాలన్నారు. కోట్లాది మంది బిజెపి కార్యకర్తలు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని అమిత్ షా విశ్వాసం వ్యక్తం చేశారు.

10 కోట్ల మార్కు దాటుతాం: నడ్డా

జగత్ ప్రకాశ్ నడ్డా మాట్లాడుతూ అంకితభావం, నిస్వార్థతతో 140 కోట్ల మంది ప్రజలను నడిపించిన ప్రధాని నరేంద్ర మోదీ జీ జాతి ప్రధాన సేవకుడు అని కొనియాడారు. బిజెపి నిరంతర అభివృద్ధి, ఎదుగుదలకు ఆయన నిబద్ధత, అంకితభావం ఎంతగానో దోహదపడ్డాయని తెలిపారు. అమిత్ షా జాతీయ అధ్యక్షుడిగా పని చేసినప్పుడు బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమానికి పార్టీ అధిక ప్రాధాన్యత ఇచ్చిందన్నారు. బిజెపిలో చేరడానికి, పని చేయడానికి, ఆసక్తి ఉన్న వ్యక్తులను పెద్ద సంఖ్యలో చేర్చడానికి పార్టీ తన విధానాన్ని మార్చుకుందని చెప్పారు. మారుమూల ప్రాంతాలతో సహా దేశంలోని వివిధ ప్రాంతాల్లో విస్తృత వర్గాలతో మమేకమయ్యేందుకు అనేక కార్యశాలలు జరిగాయన్నారు. ఈ కార్యశాలలో పార్టీ డిజిటల్ మెంబర్ షిప్ ప్రోగ్రాంను ప్రవేశపెట్టాలని నిర్ణయించారన్నారు. సభ్యత్వ కార్యక్రమం ఆరు నెలలకు పైగా కొనసాగిందని, ఫలితంగా, బిజెపి 10 కోట్ల సభ్యత్వ నమోదు లక్ష్యాన్ని అధిగమించిందన్నారు. ఈసారి కూడా సభ్యత్వ నమోదు లక్ష్యాన్ని పార్టీ మరోసారి సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. 18 కోట్ల మంది సభ్యులు చేరిన తర్వాత కూడా రాజ్యాంగంలోని ఆర్టికల్ 9 ప్రకారం ప్రతి ఆరేళ్లకోసారి సభ్యత్వాన్ని పునరుద్ధరించుకోవాలన్నారు. ప్రస్తుత సభ్యత్వ నమోదు కార్యక్రమంతో సభ్యులు మరోసారి పార్టీతో అనుబంధాన్ని పునరుద్ధరిస్తారని, 10 కోట్ల సభ్యత్వాల మార్కును దాటుతారని అంచనా వేశారు. రాష్ట్ర, జిల్లా, మండలాల నుంచి శక్తి కేంద్రాలు, బూత్, స్థాయిల వరకు సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతున్న ఏకైక పార్టీ బిజెపియేనని నడ్డా స్పష్టం చేశారు. మొదటి, రెండో దశల సభ్యత్వ నమోదు తర్వాత క్రియాశీలక సభ్యత్వ నమోదు ఉంటుందన్నారు. అనంతరం మండల, జిల్లా, రాష్ట్ర, కేంద్ర స్థాయిల్లో ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. ఈ విధానం పారదర్శకతను నిర్ధారిస్తుందన్నారు. వికసిత్ భారత్ లక్ష్య సాధన కోసం ప్రధాన మంత్రి నిర్విరామంగా కృషి చేస్తున్నట్లే, వికసిత్ భారత్ ను సాకారం చేసుకునేందుకు ప్రతి బిజెపి కార్యకర్త పూర్తిగా సహకరిస్తారని నరేంద్ర మోదీకి జె.పి. నడ్డా హామీ ఇచ్చారు.