Revanth Reddy

ఫిరాయింపు రాజకీయాల్లో రేవంత్ మార్క్

తర పార్టీల వారు వచ్చి తమ పార్టీలో చేరాలంటే ముందుగా తమ అధికార పదవికి రాజీనామా చేసి రావాలంటూ ఎన్నికల ప్రణాళికలో స్పష్టం చేసిన కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్ లో ఇంకా తనను ‘బయటి వ్యక్తి’గానే చూస్తున్నారని గ్రహించి, సొంత బలం పెంచుకునేందుకు ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారు. ఏకంగా ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తిని ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండానే సికింద్రాబాద్ నుండి లోక్ సభ ఎన్నికలలో పార్టీ అభ్యర్థిగా నిలబెట్టి అపప్రద మూటగట్టుకున్నారు. ఇటీవల ముఖ్యమంత్రి సమక్షంలో కాంగ్రెస్ లో చేరినట్లు మీడియాలో కనిపించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీని స్పీకర్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ గా నియమించడం కలకలం రేపింది. ఫిరాయింపుదారులపై చర్యలు తీసుకోకుండా స్పీకర్ జాప్యం చేస్తున్నారని ఈ వివాదం  హైకోర్టుకు చేరడంతో నాలుగు వారాల లోపు ఏం చేస్తున్నారో చెప్పాలంటూ న్యాయస్థానం స్పీకర్ ను ఆదేశించింది. ఈ తరుణంలో సెప్టెంబర్ 22న ఓ హోటల్ లో జరిగిన కాంగ్రెస్ శాసనసభా పక్ష సమావేశంపై గాంధీతో పాటు నలుగురు ఫిరాయింపు ఎమ్మెల్యేలు హాజరు కావడం, ఆ ఫోటోలు మీడియాలో రావడంతో మరో వివాదం చెలరేగింది. ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ సహా ప్రకాశ్‌ గౌడ్‌, దానం నాగేందర్‌, కడియం శీహరి కప్పుకొన్న ముసుగు తొలగిపోయినట్లయింది. కారు గుర్తుపై గెలిచిన నలుగురు ఎమ్మెల్యేలకు సీఎల్పీ సమావేశంలో చోటు కల్పించడంపై రాజకీయ దుమారం రేగింది.

శేరిలింగంపల్లి నుంచి కారు గుర్తుపై గెలిచిన అరికెపూడి గాంధీ సీఎం రేవంత్‌ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లోకి చేరటం, ఆయనను పబ్లిక్‌ అకౌంట్స్‌ కమిటీ చైర్మన్‌గా కాంగ్రెస్‌ సర్కార్‌ నియమించడంతో ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఇది దుష్ట సంప్రదాయమని, ఆనవాయితీ ప్రకారం పీఏసీ చైర్మన్‌ పదవి ప్రతిపక్ష సభ్యుడికే ఇవ్వాలని నిరసన వ్యక్తం చేశాయి. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు స్పీకర్‌ నిర్ణయాన్ని వెనకేసుకొచ్చారు. అరికెపూడి గాంధీ ఇప్పటికీ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేగానే ఉన్నారని, ఆయనకు కాంగ్రెస్‌ కు సంబంధం లేదని శ్రీధర్‌ బాబు చెప్పుకొచ్చారు. 

అధికార పార్టీ కండువా కప్పుకొన్న వ్యక్తి, ప్రతిపక్ష సభ్యుడినని చెప్పుకొని పీఏసీ చైర్మన్‌ పదవి తీసుకోవటం శాసనసభను మోసం చేయడమే. సీఎం రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ శాసనసభకు తప్పుడు సమాచారం ఇచ్చి, స్పీకర్‌ను తప్పుదోవ పట్టించారని వెల్లడైంది. స్పీకర్‌కు, ఉన్నత న్యాయస్థానానికి తప్పుడు సమాచారమిచ్చిన వారిపై వెంటనే అనర్హత వేటు వేయాలన్న డిమాండ్‌ వినిపిస్తోంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేల సమావేశం వద్ద గాంధీ కనిపించడాన్ని మంత్రి శ్రీధర్ బాబు సమర్థించుకున్నారు. సీఎల్పీ మీటింగ్‌ జరిగిన హోటల్‌ శేరిలింగంపల్లి నియోజకవర్గంలోనే ఉన్నదని, సీఎంను మర్యాదపూర్వకంగా కలిసేందుకు అరికెపూడి గాంధీ వచ్చారని, సీఎల్పీ మీటింగ్‌కు రాలేదని శ్రీధర్‌ బాబు సర్దిచెప్పుకొనే ప్రయత్నం చేశారు. తన నియోజకవర్గానికి సీఎం వచ్చినప్పుడు శాసన సభ్యుడు కలిస్తే తప్పా? అని ప్రశ్నించారు. అయితే, అధికార కార్యక్రమాలలో ముఖ్యమంత్రిని కలవడం, నివాసం వద్దనో లేదా కార్యాలయం వద్దనో కలవడం వేరు… పార్టీ ఎమ్మెల్యేల సమావేశం వద్దకు వెళ్లి కలవడం వేరు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలకు కాంగ్రెస్‌ కండువా కప్పి దేవుడి కండువా అని బుకాయిస్తారు. సీఎల్పీ సమావేశానికి హాజరైతే మర్యాదపూర్వక కలయిక అంటారు. ఈ విధంగా నిస్సిగ్గుగా తమ రాజకీయ అనైతిక చర్యలను కాంగ్రెస్ నేతలు సమర్థించుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయమై గగ్గోలు పెడుతోన్న బీఆర్ఎస్ మాత్రం తాము అధికారంలో ఉన్నప్పుడు అంతకన్నా మెరుగ్గా వ్యవహరించారా? అన్న విషయమై ఆత్మపరిశీలన చేసుకోవాలి. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ గా నాటి ప్రతిపక్షమైన కాంగ్రెస్ ప్రతినిధికి కాకుండా, తమకు మిత్రపక్షంగా ఉన్న ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీకి కట్టబెట్టిన విషయం మరచిపోకూడదు.

ప్రవీణ్