Musi

ఎన్నికల హామీలు వదిలేసి మూసీ వైపు రేవంత్ దృష్టి

హైదరాబాద్ నగరానికి వరప్రసాదంగా ఏర్పడిన మూసీ నదిని మురికికూపంగా తయారు చేసిన ఘనత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ రాష్ట్రం వరకు పాలించిన నేతలకే దక్కుతుంది. మూసీ నది ప్రక్షాళన ద్వారానే హైదరాబాద్‌ను సుందరవనంగా మార్చడమే కాకుండా వరదలు, భారీ వర్షాలు, నీటి కొరత, కాలుష్యం వంటి వైపరీత్యాల నుండి కాపాడగలమని నిపుణులు చాలాకాలంగా చెబుతూనే ఉన్నారు. ప్రతి ప్రభుత్వం మూసీ ప్రక్షాళనకు భారీ పథకాలు ప్రకటించడం, వాటి అమలును పట్టించుకోక పోవడం చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రూ.1.50 లక్షల కోట్ల వ్యయంతో మూసీ నదిని ప్రక్షాళన చేస్తానంటూ బయలుదేరారు. కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళికలో ఈ అంశాన్ని ప్రస్తావించ లేదు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వదిలేసి ఇప్పుడు మూసీ ప్రక్షాళన చేస్తానంటూ బయలుదేరడం చాలామందికి ఆశ్చర్యం కలిగిస్తుంది.

దేశంలోనే కీలకమైన హైదరాబాద్‌ను భవిష్యత్ తరాల కోసం మరింత మెరుగైన నగరంగా తీర్చిదిద్దేందుకు మూసీ నదిని పునరుద్ధరించడం హర్షణీయమే. కానీ, తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టోలో అమలు చేయాల్సిన ఎన్నో కీలక హామీలు ఉండగా వాటన్నింటినీ పక్కన పెట్టి ఇప్పుడు మూసీ పునరుజ్జీవనం ప్రాజెక్టును ఎందుకెత్తుకున్నట్టు? అన్న అనుమానాలు కాంగ్రెస్ నేతలకు కూడా కలుగుతున్నాయి. ఎన్నికల హామీలలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తప్ప మరే హామీని అమలు చేయడం లేదు. రుణమాఫీ చేస్తామని కనిపించిన దేవుళ్లందరిపై ఒట్టు వేసినా సగం మందికి కూడా పూర్తిగా అమలు కాలేదని కాంగ్రెస్ నేతలే చెబుతున్నారు. ఇక రైతు భరోసా గురించి మీనమేషాలు లెక్కిస్తున్నారు.

మేనిఫెస్టోలో మహాలక్ష్మి కింద మహిళలకు ప్రతి నెలా రూ.2500 ఇచ్చే పథకం… రైతులు, కౌలు రైతులకు ఇవ్వాల్సిన రైతు భరోసా, పెన్షన్ పెంపు వంటివి ఇంకా అమలుకు నోచుకోవడం లేదు. అందుకు చెబుతున్న కారణం కేవలం నిధుల కొరత. రూ.18,000 కోట్ల మేరకు రుణమాఫీ చేసినా రైతు భరోసా అమలు కాకపోవడంతో రైతులలో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. తొలుత రైతు భరోసా అమలు చేసి, రుణమాఫీని కొంత ఆలస్యంగా అమలు చేసినా ఇంత వ్యతిరేకత వచ్చి ఉండేది కాదని కాంగ్రెస్ నేతలే వాపోతున్నారు. మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఈ విషయమై పలుచోట్ల నిరసనలు ఎదుర్కొంటున్నారు. ఎన్నికల్లో గెలిచేందుకు ఇచ్చిన హామీల అమలుకే ప్రభుత్వం దగ్గర ఇప్పుడు వనరులు లేవు. పైగా చేయాల్సిన పనులు, బీఆర్ఎస్ పెండింగ్ లో పెట్టిన బకాయిలు కూడా ఎన్నో ఉన్నాయి. మూసీ కోసం వనరులు ఏవిధంగా సమీకరిస్తారన్నది ప్రశ్నార్థకమే. అందుకు బడ్జెటులో ఎటువంటి ప్రతిపాదనలు చేయకపోవడం గమనార్హం. ప్రపంచ బ్యాంకు రుణాలకు ప్రయత్నిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.

ఎన్నికల్లో గెలిచేందుకు ఇచ్చిన హామీలు అమలు చేసి ప్రభుత్వం కొత్తగా ఎన్ని ప్రాజెక్టులు చేపట్టినా పెద్దగా సమస్యలకు అవకాశం ఉండదు. అయితే అకస్మాత్తుగా సీఎం రేవంత్ రెడ్డి ఈ భారీ ప్రాజెక్టును తెర మీదకు తీసుకురావటంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రైతు రుణమాఫీ, రైతు భరోసా, హైడ్రా కూల్చివేతలు, గ్రూప్స్‌ అభ్యర్థుల అందోళనలు, రాష్ట్ర అప్పులు.. ఇలా ప్రభుత్వంపై అన్ని వర్గాల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత మొదలు కావడంతో వారి దృష్టి మళ్లించేందుకే ఈ ప్రాజెక్టును తెరపైకి తెచ్చినట్లు కనిపిస్తోంది. పోనీ నిజంగా చిత్తశుద్ధితో ఈ ప్రాజెక్టు చేపట్టి ఉంటే నగరవాసులతో పాటు ఈ ప్రాజెక్టు వల్ల ఇబ్బంది పడే ప్రజలను ఒప్పించి ముందుకు సాగాలి. ఒక పక్క మూసీ పరివాహక ప్రాంతాలలో కూల్చివేతలు ప్రయత్నం చేస్తూ, మరోవంక ఈ ప్రాజెక్ట్ ఏ విధంగా చేపట్టాలని సలహాలు కోరడం, అందుకు ఉత్తర కొరియాకు ఒక అధ్యయన బృందాన్ని పంపించడం గమనిస్తే ఎన్నికల హామీల అమలులో వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు చేస్తున్నారా? అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. పైగా ‘మీరు వద్దు అంటే ప్రాజెక్ట్ ఆపేస్తాను’ అంటూ మీడియా వారికి, ప్రతిపక్ష నాయకులకు చెప్పడం ఈ ప్రాజెక్టు అమలు విషయమై ముఖ్యమంత్రిలో నెలకొన్న అయోమయం స్పష్టంగా వెల్లడి అవుతుంది.

మూసీ నది గర్భంలోనే అనేక ప్రభుత్వ కట్టడాలు ఉన్నాయి. మహాత్మా గాంధీ బస్ స్టేషన్ అందులో ఉంది. దాని పక్కనే మెట్రో రైలు స్టేషన్ ఉంది. పేదల ఇళ్లను కూల్చేందుకు ఉత్సాహం చూపుతున్న ప్రభుత్వం అటువంటి భవనాల సంగతి ఏం చేస్తుంది? మూసీ రివర్‌ఫ్రంట్‌ ప్రాజెక్టుకు లండన్‌లోని థేమ్స్‌ ప్లాన్‌ను అమలు చేస్తామంటూ ఆర్భాటంగా ప్రకటించిన రేవంత్‌ ఇప్పుడు మాట మారుస్తుంది. ఇప్పటివరకు మూసీ రివర్‌ఫ్రంట్‌, మూసీ సుందరీకరణ పేరిట ప్రచారం చేసుకున్న ప్రభుత్వం.. ఇప్పుడు నది పునరుజ్జీవనం పేరిట కొత్త రాగం అందుకుంది. ఇందులో భాగంగా దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లోని చుంగ్‌ గై చున్‌ రీస్టోరేషన్‌ ప్రాజెక్టు పరిశీలనకు హైదరాబాద్‌ నుంచి 20 మందితో కూడిన బృందం పంపింది. అయితే, మూసీ ప్రాజెక్టుకు, ఎక్కడో సియోల్‌లో ఉన్న చుంగ్‌ గై చున్‌ ప్రాజెక్టుకు సంబంధమేంటి? అనే ప్రశ్న ఇప్పుడు అంతటా వినిపిస్తున్నది. పైగా, అది నది కాదు. ఓ పిల్ల కాలువ. నిర్దిష్టమైన ప్రణాళిక, కార్యాచరణ లేకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ మొత్తం కసరత్తు చేస్తున్నట్లు కనిపిస్తోంది.

ప్రవీణ్