Revanth Reddy

విజయోత్సవాలా… ప్రజా వంచన ఉత్సవాలా!

తెలంగాణలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా పెద్ద ఎత్తున ప్రజా విజయోత్సవాలు జరుపుకొంటున్నారు. ముఖ్యమంత్రి కాగానే తమది ‘ప్రజా ప్రభుత్వం’ అని ప్రకటించిన రేవంత్ రెడ్డి తన పాలనలో ప్రజల వేధింపులు ఉండబోవని, ప్రజలు స్వేచ్ఛగా తమ నిరసనలు వ్యక్తం చేసుకోవచ్చని ప్రకటించారు. తన సొంత నియోజకవర్గంలో ఫార్మా కంపెనీల కోసం చేపట్టిన భూసేకరణను వ్యతిరేకించిన రైతులు, ముఖ్యంగా గిరిజనులపైకి పోలీసులను పంపి, వారిపై దౌర్జన్యాలు చేసి, అరెస్టులు చేసి, జైళ్లలో నింపడం ద్వారా ఎమర్జెన్సీ రోజులను గుర్తుకు తెచ్చిన రేవంత్ రెడ్డి ఇప్పుడు విజయోత్సవాలు అంటూ జరుపుకోవడం హాస్యాస్పదంగా ఉంటుంది. ముఖ్యమంత్రి కాగానే మొదటి సంతకం 6 గ్యారంటీలపై పెట్టి, చట్టబద్ధత కల్పిస్తామని చెప్పి, బాండ్ పేపర్ తో ప్రజల్లోకి వెళ్లండని పార్టీ శ్రేణులకు పిలుపిచ్చి, అధికారంలోకి వచ్చి దాదాపు ఏడాది అవుతున్నప్పటికీ 6 గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పించలేకపోయారు. ఎన్నికల సమయంలో 420 హామీలు చేశారు. 11 నెలల పాలనలో ప్రజలకు ఏం చేశారో, ఏం సాధించారో ప్రజలకు తెలియచెప్పే ప్రయత్నం చేయకుండా సంబరాలు జరుపుకోవడం ఎవరి కోసం అనే ప్రశ్న తలెత్తుతుంది. 6 గ్యారెంటీలు అంటూ మోసం చేశారు. పింఛన్లు, విద్య భరోసా కార్డు, ఉద్యోగాలు ఏవీ లేవు. ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క విద్యార్థికి కూడా స్కాల‌ర్‌షిప్స్ డ‌బ్బులు ఇవ్వ‌లేదు. డిగ్రీ పాస్ అయిన విద్యార్థులకు యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. ఏడాది అవుతున్నది ఒక్క రూపాయి కూడా ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ ఇవ్వలేదు.

రూ. 2 లక్షల చొప్పున రూ. 31 వేల కోట్ల మేర రైతుల రుణాలను మాఫీ చేస్తామని చెప్పి కేవలం రూ. 17 వేల కోట్లతో కాంగ్రెస్ సర్కారు సరిపెట్టింది. రాష్ట్రంలో 50 శాతం మంది రైతులు చేసిన అప్పులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారు. కొంతమంది ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి ఏర్పడింది. రైతు భరోసా కింద సాగు చేసే రైతులకు రూ. 15 వేల చొప్పున ఇస్తామన్నారు. కాంగ్రెస్ హామీ నేరవేర్చకపోవడంతో రాష్ట్రంలో రైతులు మోసపోయారు. రైతుబంధు లేదు.. రైతు భరోసా లేదు.. కాంగ్రెస్ ప్రభుత్వం మీద కూడా రైతులు భరోసా కోల్పోయారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. పత్తికి రూ.500 బోనస్‌ ఇస్తామన్నారని, ఇప్పడు బోనస్‌ను బోగస్‌గా మార్చారు. మద్దతు ధర కూడా రావట్లేదని విమర్శించారు. ప్రభుత్వ అలసత్వంతో పత్తి రైతులు ఇబ్బంది పడుతున్నారు. సగానికి పైగా ధాన్యం దళారుల పాలైంది. మిర్చి రైతులను కూడా ప్రభుత్వం తీవ్రంగా మోసం చేసింది. ముఖ్యమంత్రి పత్తి కొనుగోలుపై ఇప్పటివరకు సమీక్ష చేయలేదు. కాంగ్రెస్‌ పాలనలో రైతులు నష్టపోయి, దళారులు లాభపడుతున్నారు.

యువత, రైతులు, మహిళలు, నిరుద్యోగులు.. ఇలా అన్ని వర్గాల ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలు, 420 హామీలను అమలు చేయకుండా రేవంత్ రెడ్డి ఏ మొహం పెట్టుకుని విజయోత్సవాలు జరుపుకుంటున్నట్లు?  గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను మోసం చేసింది. పేపర్ లీకేజీలతో యువత కట్టలు తెంచుకున్న ఆగ్రహంతో బీఆర్ఎస్ ను ఓడించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏడాది వ్యవధిలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చి, రూ.4 వేల చొప్పున నిరుద్యోగ భృతి కల్పిస్తామని రాహుల్ గాంధీ హామీతో ప్రజలను నమ్మించారు. అధికారంలోకి వచ్చాక నిరుద్యోగ యువతను మోసం చేశారు. అశోక్ నగర్ సెంటర్ లో ఉద్యోగాల కోసం యువత ఉద్యమిస్తే పోలీసులు లాఠీలు ఝులిపించి, తలలు పగులగొట్టారు. విద్యార్థినులు అని కూడా చూడకుండా లాక్కొని వెళ్లి జైలు పాల్జేశారు. వృద్ధులకు రూ. 4 వేల చొప్పున పెన్షన్ ఇస్తమని చెప్పి, ఇవ్వకుండా మోసం చేశారు. మహాలక్ష్మీ పేరుతో మహిళలకు రూ.2500 చొప్పున ఇస్తామని హామీ ఇచ్చి, అమలు చేయకుండా మోసం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం యువత, రైతులు, మహిళలు.. ఇలా అన్ని వర్గాల ప్రజలను మోసం చేసింది. చెరువుల పరిరక్షణ పేరుతో హైడ్రాతో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇండ్లను కూలగొడుతున్నారు. మూసీ సుందరీకరణ పేరుతో పేద ప్రజలు, దళితులు కట్టుకున్న ఇండ్లను కూల్చివేస్తున్నారు. మూసీ సుందరీకరణ పేరుతో లక్షా 50 వేల కోట్లకు అంచనాలు పెంచి, ఆస్థాన గుత్తేదారుల జేబులు నింపుకొనే ప్రయత్నం చేస్తున్నారు.

బీఆర్ఎస్ పాలనలో కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పేరుతో లక్షల కోట్ల రూపాయల దోపిడీ జరిగిందని, అధికారంలోకి రాగానే దోపిడీ చేసిన సొమ్మును కక్కించి జైళ్లకు పంపిస్తానని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. అప్పుడు దోపిడీలో కీలక భాగస్వాములైన కాంట్రాక్టులను ఇప్పటి ప్రభుత్వం కూడా నెత్తిన పెట్టుకొంటున్నది. వారికి సరికొత్త కాంట్రాక్టులు కూడా ఇస్తుంది. వారిపై ఈగ కూడా వాలకుండా కాపాడుకుంటూ వస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ అంటూ పెద్ద ఎత్తున రభస చేశారు. ఆ కేసు ఎటు పోయిందో చెప్పలేక పోతున్నారు. ఎప్పటికప్పుడు గత ప్రభుత్వంలో దోపిడీకి, కుంభకోణాలకు పాల్పడిన వారినే దగ్గరకు తీసి, వారితో వాటాలు పంచుకొంటున్నారా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి అంటేనే ‘ట్రిపుల్ ఆర్’ ట్యాక్స్.. ఫోర్త్ సిటీ, మూసీ సుందరీకరణ అంటూ వేల కోట్ల అవినీతి చేయడంగా మారింది.

ప్రవీణ్