కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాలే ఎస్ఎల్బీసీకి శనిగ్రహాలు
కరువు పీడిత ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 4 లక్షల 15 వేల ఎకరాల బీడు భూములకు సాగునీరు, ఫ్లోరైడ్ పీడిత 500 పైగా గ్రామాలకు తాగునీరు, రాజధాని హైదరాబాద్ ప్రజలకు నీటిసరఫరా కోసం రూపకల్పన చేసిన బృహత్తర ప్రాజెక్టు ఎస్ఎల్బీసీ. అర్ధ శతాబ్ద కాలంగా ఒకడుగు ముందుకు రెండడుగులు వెనక్కు అన్న రీతిలో తెలంగాణలో సుదీర్ఘ కాలంగా నిర్మాణం కొనసాగుతూ, వేరువేరు రాష్ట్ర ప్రభుత్వాల పక్షపాతం, తీవ్ర నిర్లక్షం, ప్రకృతి ప్రకోపానికి గురవుతూ… తెలంగాణలో సుదీర్ఘకాలంగా నిర్మాణం జరుగుతున్న ప్రాజెక్టుగా ఎస్ఎల్బీసీ టన్నెల్ ను చెప్పుకోవచ్చు.
సుమారు 46 ఏళ్ల కిందటే ఈ ప్రాజెక్టుకు అంకురార్పణ జరిగింది. 1978లో ఎస్‌ఎల్‌బీసీ సొరంగం ప్రాజెక్టుకు సంబంధించి అధ్యయనానికి నిపుణుల కమిటీ వేశారు. 1980లో అక్కమ్మ బిలం వద్ద సొరంగం నిర్మాణానికి నాటి ముఖ్యమంత్రి అంజయ్య శంకుస్థాపన చేశారు. అయితే, నిధులు విడుదల అయ్యేందుకు జాప్యం జరగడంతో పనులు మాత్రం 20 ఏళ్ల క్రితం మొదలయ్యాయి. అంజయ్య శంకుస్థాపన చేసిన అక్కమ్మ బిలంకు 10 కిలోమీటర్లకు పైగా దూరంగా ఉన్న దోమలపెంటకు ఇన్ లెట్ స్థానాన్ని మారుస్తూ 2005లో అప్పటి కాంగ్రెస్, బీఆర్ఎస్ సంకీర్ణ ప్రభుత్వ ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి నిర్ణయం తీసుకోవడం మొదటికే మోసం వచ్చింది. 10 కిలో మీటర్ల పొడవు పెంపుతోనే ఈ బృహత్తర ప్రాజెక్టుకు సమస్యల్లో కూరుకుపోయింది. ప్రస్తుత పరిస్థితికీ కారణం ఇన్ లెట్ స్థానాన్ని మార్చడమే.
శ్రీశైలంలో జల విద్యుత్ ఉత్పత్తి ద్వారా నాగార్జున సాగర్ రిజర్వాయర్ కు నీళ్లు వదలడంలో కాంగ్రెస్ ప్రభుత్వ కుట్రపూరిత జాప్యంతో శ్రీశైలం జలాశయం నీటి స్థాయి 870 అడుగులు దాటడం, ఎగువన కుండపోత వర్షాలతో డ్యామ్ ఔట్ ఫ్లో కెపాసిటీ (13 లక్షల)కి రెండింతల వరద రావడంతో శ్రీశైలం రిజర్వాయర్ నీటి మట్టం గరిష్ట (885 అడుగులకు) స్థాయి కన్నా 11 అడుగులకు పైగా 896.5 అడుగులకు నీటి మట్టం చేరడంతో ఎస్ఎల్బీసీ టన్నెల్ వరద నీటితో నిండిపోయింది. మెషినరీ ముఖ్యంగా టీబీఎం తీవ్రంగా దెబ్బతిన్నది. పూడిక పెద్దఎత్తున పేరుకుపోవడంతో 2009 అక్టోబర్ లో టన్నెల్ నిర్మాణానికి పెద్దఎత్తున ఆటంకం ఏర్పడింది.
శ్రీశైలం డ్యాం జలవిద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టు. నాగార్జున సాగర్ ఆయకట్టు స్థిరీకరణ ప్రాజెక్ట్. కానీ, 2004లో సమైక్య రాష్ట్రంలో ఏర్పడ్డ కాంగ్రెస్, బీఆర్ఎస్ సంకీర్ణ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు కోసం ఎస్ఎల్బీసీని నిర్వీర్యం చేసే కుట్రలకు పాల్పడింది. ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును 2010 నాటికే పూర్తి చేయాల్సి ఉండగా ఇప్పటివరకు ఆరు సార్లు ప్రాజెక్టు గడువులు పొడిగిస్తూ వచ్చారు. ముఖ్యంగా గత కేసీఆర్ ప్రభుత్వంలో 2019, 2020, 2021లో మూడేళ్లలో రూ.10 కోట్లే కేటాయించారు. ఈ నిధులు నిర్వహణకు కూడా సరిపోయే పరిస్థితి లేదు. పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏనాడూ ఈ ప్రాజెక్టును పట్టించుకున్న పాపాన పోలేదు. అదే బీఆర్ఎస్ ఇప్పుడు మొసలి కన్నీళ్లు కార్చడం వారి రాజకీయ అవకాశవాదానికి అద్దం పడుతుంది.
ఎస్ఎల్బీసీ సొరంగంలో 8 మంది ఇంజనీర్లు, కూలీల మృతికి ముమ్మాటికీ కాంగ్రెస్ ప్రభుత్వ తప్పిదమే కారణం. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రధాని మోదీ ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. ఇది తెలంగాణపై మోదీకి ఉన్న ప్రత్యేక శ్రద్ధకు నిదర్శనం. అసమర్థ కాంగ్రెస్, అశ్రద్ధ బీఆర్ఎస్ ప్రభుత్వాలతో అత్యంత ప్రాధాన్యత గల ఎస్ఎల్బీసీ టన్నెల్ పూర్తి కాదు. ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల చాంపియన్స్ ట్రోఫీ గెల్చుకున్న బిజెపి డబల్ ఇంజన్ సర్కార్ తోనే ఎస్ఎల్బీసీ టన్నెల్, ఇతర పనులు పూర్తవుతాయి.