MLC results

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఫలితాలు రానున్న రాజకీయ మార్పునకు సంకేతం!

రిగ్గా ఆరేళ్ళ క్రితం కరీంనగర్‌-నిజామాబాద్‌-ఆదిలాబాద్‌-మెదక్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఎన్నికలలో ఆనాడు తిరుగులేని అధికారంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ను ఓడించి కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ మంత్రి జీవన్ రెడ్డి గెలుపొందారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. ఇప్పుడు అదే స్థానానికి జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికారంలో ఉండి కూడా కాంగ్రెస్ తన సిట్టింగ్ స్థానం కోల్పోయింది. ఆ పార్టీ సీనియర్ నాయకుడు, సిట్టింగ్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పోటీ చేసేందుకే వెనకడుగు వేశారు. అనూహ్యంగా బిజెపి అభ్యర్థి సి అంజిరెడ్డి గెలుపొందారు. ఈ స్థానంతో పాటు ఇక్కడి నుండే జరిగిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానంలో కూడా బిజెపి అభ్యర్థి కొమరయ్య గెలుపొందారు.

గతంలో ఎన్నడూ జనసంఘ్ రోజులలో గాని, బిజెపి ఏర్పడిన తర్వాత గాని ఆ పార్టీ గెల్చుకున్న స్థానాలు కూడా కావు. రాష్ట్రంలో మారుతున్న రాజకీయ వాతావరణాన్ని, రాజకీయ ప్రత్యామ్నాయంగా బిజెపి ఎదుగుతున్న పరిణామాన్ని ఈ ఫలితాలు సూచిస్తున్నట్లు చెప్పవచ్చు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలను సూక్ష్మంగా పరిశీలిస్తే రాష్ట్రంలో 15 నెలల కాంగ్రెస్‌ పరిపాలనపై రిఫరెండంగా భావించాలి. బిజెపి నేతలు ఎన్నికల ప్రచార సమయంలోనే రేవంత్ రెడ్డి పాలనపై రెఫరెండంగా ఈ ఎన్నికలను స్వీకరించాలని సవాల్ చేసినా ముఖ్యమంత్రి గాని, కాంగ్రెస్ నేతలు గాని స్పందించని లేదు. ఏదేమైనా ఎమ్మెల్సీ ఫలితాలు అధికార కాంగ్రెస్‌ పార్టీపై ఉన్న వ్యతిరేకతను స్పష్టంగా ప్రస్పుటం చేశాయి. కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ప్రజలు, ముఖ్యంగా చదువుకున్న వారు, యువత, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు ఎమ్మెల్సీ ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. 

రాజకీయాల్లో రెండో స్థానానికి బహుమతి ఉండదు. ఈ అంశం అనేక సార్లు రుజువయ్యింది. కాంగ్రెస్‌ నాయకులు మాత్రం తాము రెండో స్థానంలో నిలిచినందుకు చంకలు గుద్దుకుంటున్నారు. కాంగ్రెస్‌ నాయకులు తాము కేవలం 5 వేల ఓట్లతో ఓడిపోయామని, కొద్ది జాగ్రత్తలు తీసుకుంటే తామే గెలిచేవారమని ఆత్మవంచన చేసుకుంటున్నారు. అయితే అవన్నీ పరాజయాన్ని కప్పుపుచ్చుకొనేందుకు చేస్తున్న వాదనలు మాత్రమే. ముఖ్యమంత్రి ప్రచారం చేసినందుకు గట్టి పోటీ ఇచ్చామని కాంగ్రెస్‌ నేతలు చెప్పుకోవడం హాస్యాస్పదం. ఎన్నడూ లేని విధంగా సీఎం స్థాయిలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రచారం చేసినా ఎందుకు ఓడిపోయామని ఆత్మవిమర్శ చేసుకోవాలి. చివరకు ఎస్ఎల్‌బీసీ సొరంగంలో జరిగిన ప్రమాదం గురించి కూడా పట్టించుకోకుండా ముఖ్యమంత్రి ఈ ప్రచారంలో మునిగిపోయారు.

ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిన తర్వాత కూడా అధికార కాంగ్రెస్‌ పార్టీ గెలవకుండా బిజెపి ఎలా గెలిచింది? బీఎస్పీ అభ్యర్థిగా ప్రకటించుకున్న స్వతంత్ర అభ్యర్థి ప్రసన్న హరికృష్ణకు 60,419 ఓట్లు ఎట్లా వచ్చాయి? అన్ని ఓట్లు ఎలా వచ్చాయని సమీక్షించుకోకుండా ఇంకా భ్రమల్లో ఉంటూ కాంగ్రెస్ నేతలు ఆత్మవంచన చేసుకుంటున్నారు. ఇది కాంగ్రెస్‌ పార్టీకి మంచిది కాదు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన అభ్యర్థి మూడో స్థానంలో నిలవడమే కాకుండా గట్టి పోటీ ఇచ్చారు. ఈ విషయాన్ని అధికార కాంగ్రెస్‌ పార్టీ నాయకులు గుర్తుంచుకోవాలి. ఆయనకు వచ్చిన ఓట్లన్నీ కూడా ప్రభుత్వ వ్యతిరేకత ఓటే కావడం గమనార్హం. హరికృష్ణ పోటీలో లేని పక్షంలో బిజెపికి భారీ మెజారిటీ వచ్చి ఉండేది. కాంగ్రెస్ వారు ప్రచారం చేస్తున్నట్లు అతను కాంగ్రెస్ ఓట్లను కాకుండా బిజెపి ఓట్లను చీల్చదని గుర్తించాలి. పైగా, పోటీలో అధికారికంగా అభ్యర్థిని నిలబెట్టకపోయినా బీఆర్ఎస్ చివరి రోజులలో బిజెపి అభ్యర్థిని ఓడించేందుకు తమవంతు కృషి చేశారు. ఈ నియోజకవర్గం పరిధిలోనే కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్, కవితలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలు ఉన్నాయి. వారెవ్వరికీ బిజెపి అభ్యర్థి గెలుపొందడం ఇష్టం ఉండదు అనడంలో సందేహం లేదు. ఇన్ని ప్రతికూల పరిస్థితుల మధ్య కూడా బిజెపి అభ్యర్థి గెలుపొందడం తెలంగాణ రాజకీయాలలో రానున్న పెను మార్పులను సూచిస్తున్నాయని గమనించాలి.

ఇప్పటికే ఉత్తర తెలంగాణలో 6 ఎంపీ సీట్లతో, 7 ఎమ్మెల్యే సీట్లతో బిజెపి తన పట్టు సాధించుకొంటున్నది. ఇప్పుడు రెండు ఎమ్మెల్సీ సీట్లు గెలుపొందడం ద్వారా ఆ పట్టు మరింతగా బలపడిందని స్పష్టం అవుతుంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ముఖాముఖి పోటీ జరిగుంటే బిజెపి అభ్యర్థి భారీ మెజార్టీతో గెలిచేవారు. త్రిముఖ పోటీ కారణంగానే స్వల్ప మెజార్టీతో గెలిచారు. అంటే, పరోక్షంగా బిజెపి అభ్యర్థిని ఓడించేందుకు మిగిలిన రాజకీయ పక్షాలన్నీ ఒకటి అయ్యే ప్రయత్నం చేశాయని స్పష్టం అవుతుంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు రెండుగా చీలిపోయినా అధికార కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించలేదంటే ప్రభుత్వంపైన ఎంత వ్యతిరేకత ఉందో స్పష్టమవుతోంది. 15 నెలలు అవుతున్నా ఎన్నికల హామీలను అమలు పరచలేక పోవడం, బీఆర్ఎస్ పాలనా తరహాలోనే పయనిస్తూ ఉండటం, అవినీతిపై చర్యలు తీసుకుంటానని చేసిన చెప్పిన మాటలలు తిలోదకాలిచ్చి అవినీతి పరులతో కుమ్మక్కు అవుతూ ఉండడాన్ని ప్రజలు సునిశితంగా గమనిస్తున్నారని ఈ ఫలితాలు వెల్లడి చేస్తున్నాయి.

ఎమ్మెల్సీ ఫలితాలను శాస్త్రీయంగా అధ్యయనం చేస్తే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి ఘోర పరాజయం తప్పదని ఎన్నికల పరిశోధనా సంస్థ పీపుల్స్ పల్స్ వెల్లడించింది. దీనికి ప్రధాన కారణం అనేక చోట్ల ముఖాముఖి పోటీయే జరిగే అవకాశం ఉండటమే అని తెలిపింది. ప్రస్తుతం క్షేత్రస్థాయిలో రాజకీయ పరిస్థితులు అధ్యయనం చేస్తే ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, ఏ సామాజిక వర్గమూ ప్రభుత్వానికి అనుకూలంగా లేదని, గ్రామీణ, పట్టణ ప్రాంతాలనే భేదం లేకుండా ఎన్నికలు ఎప్పుడొస్తే అప్పుడు అధికార కాంగ్రెస్‌ పార్టీని ఓడించాలని కంకణం కట్టుకున్నారని ఆ సంస్థ స్పష్టం చేసింది. పైగా, ఈ ఎన్నికలు కాంగ్రెస్ లో కుమ్ములాటలు సైతం బహిర్గతం చేశాయి. మంత్రులలో డి శ్రీధర్ బాబు మినహా మరెవ్వరూ సీరియస్ గా తీసుకున్న దాఖలాలు లేవు. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ ఈ ఎన్నికలను కేవలం మొక్కుబడిగా తీసుకున్నారు. ఈయన సొంత జిల్లా నిజామాబాద్‌లో కూడా కాంగ్రెస్‌కు తక్కువ ఓట్లు రావడమే ఇందుకు నిదర్శనం. ముఖ్యమంత్రి మొదలుకొని రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ యంత్రాంగం అంతా ఎన్నికల్లో ప్రచారం చేసినా ఓడిపోయారంటే అది ప్రజా వ్యతిరేకతకు నిదర్శనం. అధికారంలో ఉన్నా, పార్టీకి కేడర్‌ ఉన్నా బిజెపి మైక్రో పోల్‌ మేనేజ్‌మెంట్‌ ముందు కాంగ్రెస్‌ వ్యూహాలు తేలిపోయాయి.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి గెలుపొందడానికి ప్రధాన కారణం అభ్యర్థిని ముందుగా ప్రకటించడం, క్షేత్రస్థాయిలో బిజెపి దాని అనుబంధ సంఘాలు శక్తివంచన లేకుండా పనిచేయడం, ఆర్‌ఎస్‌ఎస్‌ వాటి అనుబంధ సంఘాలు ఎటువంటి ఆర్బాటాలు లేకుండా ఓటర్లను కలిసి వారిని పార్టీ వైపు తిప్పుకునేలా చేశారు. ఓటర్లను కలవడానికి, ఓట్లు వేయించుకోవడానికి ప్రాధాన్యతిచ్చారు. కాంగ్రెస్‌ నాయకులు, టీపీసీసీ అధ్యక్షులు, మంత్రులు కేవలం జూమ్‌ మీటింగులకు, బ్రేక్‌ఫాస్ట్‌, లంచ్‌, డిన్నర్‌ సమావేశాలు, సోషల్‌ మీడియాకు ప్రాధాన్యతిచ్చారు. టీపీసీసీ పార్టీ అనుబంధ సంఘాలైన యూత్‌ కాంగ్రెస్‌, ఎన్‌ఎస్‌యూఐ, మహిళా కాంగ్రెస్‌ సంఘాలను సమన్వయం చేసుకోవడంలో పూర్తిగా విఫలమైంది. పార్టీ యంత్రాంగాన్ని ఒక తాటిపై తేవడంలో కూడా టీపీసీసీ పూర్తిగా విఫలమైంది.

చలసాని నరేంద్ర