గని కార్మికుల వల్లే నిరంతర విద్యుత్
ప్రస్తుత పరిస్థితుల్లో విద్యుత్ వినియోగం పెరిగిందని, దీనికి అనుగుణంగా బొగ్గు గనుల్లో పనిచేస్తున్న కార్మికుల కష్టం వల్లే నిరంతరం విద్యుత్ సరఫరా అందజేయగలుగుతున్నామని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి వివరించారు. రెండురోజుల ఛత్తీస్‌గఢ్ పర్యటనలో భాగంగా ఆయన ఏప్రిల్ 10న ప్రపంచంలోనే రెండో అతిపెద్ద బొగ్గు గని గెవరా గనిని సందర్శించారు. అధికారులు గనిలో జరుగుతున్న కార్యకలాపాలకు సంబంధించి కేంద్రమంత్రికి ప్రజెంటేషన్ రూపంలో వివరించారు. అనంతరం స్వయంగా గనిలోకి దిగి అక్కడ భారీ మెషీన్లతో జరుగుతున్న తవ్వకాలను వీక్షించారు. బ్లాస్ట్ ఫ్రీ సర్ఫేస్ మైనర్ సాంకేతికత ద్వారా జరుగుతున్న బొగ్గు తవ్వకాలను ఆసక్తిగా గమనించారు. ఫస్ట్ మైల్ కనెక్టివిటీ కార్యక్రమం ద్వారా పర్యావరణహితంగా జరుగుతున్న బొగ్గు రవాణాను పరిశీలించారు. మెషీన్ ఆపరేటర్లను పలకరించి యంత్రాల పనితీరుకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. దేశ ఇంధన భద్రతను పరిరక్షించడంలో కీలకమైన బొగ్గు ఉత్పత్తిలో భాగస్వామ్యమై అహర్నిశలు కృషి చేస్తున్న కార్మికులు, మహిళా ఉద్యోగులను ఆయన ప్రశంసించారు. అనంతరం, కార్మికులతో కలసి సహపంక్తి భోజనం చేశారు. వారితో కలసి సెల్ఫీలు దిగారు. గెవరాలో మియావాకి పద్ధతిలో పైలట్ ప్రాజెక్టులో చెట్లను పెంచిన ప్రదేశాన్ని సందర్శించారు. కార్మికులు, ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా నిర్మించిన కల్యాణ మండపాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమాల్లో కిషన్ రెడ్డితో పాటు కోలిండియా లిమిటెడ్ చైర్మన్ పీఎం ప్రసాద్, బొగ్గు శాఖ జాయింట్ సెక్రటరీ బీపీ పాటి, ఎస్ఈసీఎల్ సీఎండీ హరీశ్ దుహాన్ తదితరులు పాల్గొన్నారు.
దేశంలో ఇంధన భద్రత కల్పించడంలో బొగ్గు శాఖ కీలక పాత్ర పోషిస్తోందని, దేశంలోని విద్యుత్ అవసరాల్లో 70 శాతానికి పైగా బొగ్గు నుంచే ఉత్పత్తి అవుతోందని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. మైనింగ్ కార్యకలాపాల్లో సుస్థిరత సాధించేందుకు ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. సరైన పద్ధతిలో ప్రణాళికాబద్ధంగా గనుల మూసివేత చేపడుతున్నామన్నారు. గెవరా గని దేశానికే తలమానికమని, దేశ ఇంధన అవసరాలను తీర్చడంలోనూ ఈ గని కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు.
రెండో రోజు ఏప్రిల్ 11న SECL (సౌత్ ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్ లిమిటెడ్) ఆధ్వర్యంలో కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) కింద చేపట్టిన పలు కార్యక్రమాల పనితీరును సమీక్షించారు. SECL ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘ధడ్‌కన్’ కార్యక్రమంలో భాగంగా బాల్యం నుంచే గుండె సమస్యలతో ఇబ్బందులు పడుతున్న చిన్నారులకు ఉచితంగా ఆపరేషన్లు చేయిస్తున్నారు. నయా రాయ్‌పూర్‌లో శ్రీ సత్యసాయి సంజీవని ఆసుపత్రిలో ఆపరేషన్లు పూర్తయిన చిన్నారులను పరామర్శించారు. ‘సుష్రుత’ కార్యక్రమంలో భాగంగా SECL పరిధిలోని ప్రాంతాల్లో పేద విద్యార్థులకు నీట్ ప్రవేశ పరీక్షకు శిక్షణ ఇస్తున్నారు. ఈ పథకం ద్వారా శిక్షణ పొంది వైద్యవిద్యను పూర్తిచేసిన యువ డాక్టర్లను కేంద్రమంత్రి అభినందించారు. మారుమూల ప్రాంతాల్లోనూ వైద్యసేవలను విస్తృతం చేయడంలో చురుకైన పాత్ర పోషించాలని వారికి కేంద్రమంత్రి సూచించారు.