42 శాతం బీసీ రిజర్వేషన్ లేకుండానే స్థానిక ఎన్నికలు!
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను గాలికొదిలేసి అందాల పోటీలు వంటి కార్యక్రమాలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరిక లేకుండా ఉన్నారు. ఏపని చేద్దామన్నా రూపాయి కూడా చేతిలో లేదంటూనే తన నిర్వాకాన్ని బహిరంగంగా ఒప్పుకున్న రేవంత్ రెడ్డి కనీసం తన చేతిలో ఉన్న మంత్రిత్వ శాఖల గురించి సమీక్షలు కూడా జరపడం లేదు. ప్రైవేట్ కళాశాలలకు ఫీజ్ రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించక పోవడంతో రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు డిగ్రీ పరీక్షలు జరపలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాయి. దాంతో 6 లక్షల మంది డిగ్రీ విద్యార్థుల భవిష్యత్ అగమ్యగోచరంగా మారింది. అయినా విద్యాశాఖను నిర్వహిస్తున్న రేవంత్ రెడ్డి పట్టించుకోవడం లేదు. ఓ సమీక్ష జరిపిన దాఖలాలు కూడా లేవు.
అకాల వర్షాలకు చేతికి వచ్చిన ధాన్యం అమ్ముకోబోయే సమయంలో తడిసి రైతులు దిగాలు పడుతుంటే వారి గురించి పట్టించుకొనే తీరిక కూడా ముఖ్యమంత్రికి లేకుండా పోయింది. ఇక స్థానిక సంస్థలకు ఎన్నికైన ప్రజాప్రతినిధుల పదవీకాలం ముగిసి సంవత్సరం దాటినా, అధికారుల పర్యవేక్షణలో ఉంటున్నా వాటికి ఎన్నికలు జరిపించే సాహసం చేయలేక పోతున్నారు. ‘అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే కులగణన నిర్వహిస్తాం. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచి 23,973 మంది బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పిస్తాం. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణనూ అమలు చేస్తాం’ అని కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో పేర్కొంది. అయితే ఇప్పుడు అటువంటి అవకాశాలు కనిపించడం లేదు. దానితో జనం ముందుకు వచ్చేందుకు ముఖ్యమంత్రి సందేహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాంగ్రెస్ తీరుతో ఇప్పుడు పాత రిజర్వేషన్లకూ ఎసరు వచ్చి పడింది.
2019 జనవరిలో జరిగిన పంచాయతీ ఎన్నికల సమయంలో సుప్రీంకోర్టు ఎట్టి పరిస్థితుల్లోనూ రిజర్వేషన్లు 50% దాటవద్దని స్పష్టం చేసింది. ఆ మేరకు బీసీలకు 22.79%, ఎస్సీలకు 20.53%, ఎస్టీలకు 6.68% ప్రకారం ఎన్నికలు నిర్వహించారు. ప్రస్తుతం ఆ రిజర్వేషన్లను అమలు చేసేందుకు అవకాశం ఉన్నది. కానీ ఈ పాత రిజర్వేషన్లను అమలు చేయాలన్నా ఆ మేరకు డెడికేటెడ్ కమిషన్ సిఫారసులు తప్పనిసరి. లేదంటే మొత్తంగా బీసీలకు గతంలో అమలు చేసిన 22.79% బీసీ రిజర్వేషన్ సీట్లు కూడా జనరల్ స్థానాలుగానే మారే ప్రమాదం ఉన్నది. కులగణన చేసే అధికారం రాష్ర్టానికి లేదని తెలిసినా కేవలం ఓట్ల కోసమే హామీ ఇచ్చింది. అక్కడితో ఆగకుండా ఆ తర్వాత న్యాయనిపుణులు, బీసీ సంఘాల మేధావులు చెప్పినా వినకుండా అశాస్త్రీయమైన రీతిలో కులగణన నిర్వహించింది. క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితులకు భిన్నంగా స్థూలంగా గణాంకాలను ప్రకటించింది. కులాలు, ఉప కులాల వారీగా లెక్కలను వెల్లడించలేదు.
ఇప్పటివరకు సర్వే నివేదికనే బహిర్గతం చేయలేదు. ఆ అసంబద్ధమైన గణాంకాలనే డెడికేటెడ్ కమిషన్కు అందజేసింది. ఆ గణంకాలనే ప్రామాణికంగా తీసుకుని బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లను కల్పించాలని సిఫారసు చేసింది. ఆ నివేదికను సర్కారు బయటపెట్టలేదు. కమిషన్ నివేదిక ఆధారంగా సర్కారు హడావుడిగా బీసీల రిజర్వేషన్ల శాతాన్ని పెంచుతూ అసెంబ్లీలో బిల్లులు ఆమోదించి కేంద్రానికి పంపింది. కానీ కేంద్రం మాత్రం తాజాగా రాష్ర్టాల కులగణనకు సాధికారత లేదని తేల్చిచెప్పింది. దానితో బీసీలకు 42% రిజర్వేషన్ల అమలు అందని ద్రాక్షగానే మరోసారి మిగిలిపోనున్నది. మరోవంక, గ్రామాలలో ఎన్నికైన సర్పంచులు లేకపోతుండడంతో ఫైనాన్స్ కమిషన్ సూచించిన విధంగా గ్రామాలకు కేంద్రం నుండి రావాల్సిన నిధులు రాలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దానితో గ్రామాభివృద్ధి అటకెక్కుతోంది. రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకపోగా, కేంద్రం నుండి వచ్చే నిధులను సైతం సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయలేక పోతున్నారు.
కృష్ణ చైతన్య