బీసీలపై కాంగ్రెస్ కపట ప్రేమ
బీసీల పట్ల కాంగ్రెస్ చిత్తశుద్ధి ఏపాటిదో ఉపరాష్ట్రపతి ఎన్నికల ఇండీ కూటమి అభ్యర్థిని చూస్తే అర్థమవుతుంది. బీసీల అభివృద్ధి కన్నా కులాల మధ్య కుంపట్లు పెట్టి ఓట్లు దండుకోవాలన్న ఆలోచనతో నిత్యంతో బీసీ జపం చేస్తున్న రాహుల్ గాంధీ, ఆయన పరివారానికి ఉపరాష్ట్రపతిగా పోటీ చేసేందుకు ఒక్క బీసీ నేత కూడా దొరకలేదు. ఓసీ అయిన రిటైర్డ్ సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి పేరును ప్రకటించి కాంగ్రెస్ బీసీ ప్రేమ నేతి బీరకాయ చందమే అని చాటుకుంది.
జగదీప్ ధన్ ఖడ్ రాజీనామాతో అనివార్యమైన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తమిళనాడులోని గౌండర్ వర్గానికి చెందిన ఓబీసీ నేత సీపీ రాధాకృష్ణన్ ను కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ అభ్యర్థిగా నిలబెట్టింది. ఉపరాష్ట్రపతిని ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు సీపీ రాధాకృష్ణన్ కు మద్దతివ్వాలని బిజెపి జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా ప్రతిపక్షాలను అభ్యర్థించారు. నడ్డా అభ్యర్థనను తోసిరాజని తెలంగాణకు చెందిన సుప్రీం కోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి పేరును ఇండీ కూటమిగా అభ్యర్థిగా ప్రకటించారు. ఏ రాజకీయ పార్టీకైనా, ఏ కూటమికైనా వారి ఇష్టానుసారం అభ్యర్థిని ప్రకటించుకోవచ్చు. దీనిపై అభ్యంతరం పెట్టాల్సిన అవసరం లేదు. అయితే, కాంగ్రెస్ మాటలకు, ఆచరణకు ఏమాత్రం పొంతన కుదరడం లేదు. నిత్యం బీసీ జపమే చేస్తోన్న కాంగ్రెస్ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఓబీసీకి అవకాశం ఇవ్వకపోవడం ఆ పార్టీ ద్వంద్వ వైఖరిని బయటపెడుతోంది. కులగణన చేశామని గొప్పలు చెప్పుకుంటూ దిల్లీలో రేవంత్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి నెల రోజులు కూడా గడవకముందే ఉప రాష్ట్రపతి అభ్యర్థి విషయంలో బీసీ వర్గానికి మొండిచేయి చూపిన హస్తం పార్టీ అసలు స్వరూపం ఏంటో స్పష్టంగా అర్థమవుతోంది.
తెలంగాణలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్లు ఇస్తామని కామారెడ్డి డిక్లరేషన్ లో, మ్యానిఫెస్టోలో కాంగ్రెస్ హామీ ఇవ్వడమే కాదు, రాహుల్, రేవంత్ సహా అనేక మంది హస్తం నాయకులు తమ ప్రసంగాల్లో వాగ్దానం చేశారు. ఇప్పుడు మాత్రం ఆర్డినెన్స్ జారీ చేయాహని చేతులు దులుపుకొంటూ కేంద్రంపై నెపం నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతాయి. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం మేరకే రిజర్వేషన్లు ఖరారవుతాయి. ఇందులో కేంద్రం పాత్ర ఇసుమంతైనా ఉండదు. అయినా మోదీ ప్రభుత్వం 42 శాతం బీసీ రిజర్వేషన్లను అడ్డుకుంటుందని కేంద్రాన్ని బద్నాం చేయడం ఆ పార్టీ దివాలాకోరుతనానికి నిదర్శనం. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ల విషయంలో వెనకడుగు వేస్తోన్న కాంగ్రెస్ టికెట్లలో 42 శాతం బీసీలకే ఇస్తామంటూ మరోసారి బీసీలను మభ్యపెడుతోంది. స్థానిక సంస్థల రిజర్వేషన్లు మాత్రమే కాదు, కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌లో ఇచ్చిన ఏ హామీని కాంగ్రెస్ రేవంత్ ప్రభుత్వం అమలు చేయలేదు.
కాంగ్రెస్ బీసీలకు ద్రోహం చేయడం పరిపాటిగా మారింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే చేపట్టి రాష్ట్రంలో 12 శాతం ముస్లిం జనాభా ఉందని, అందులో సుమారు 85 శాతం బీసీలే అని తేల్చింది. రాష్ట్ర జనాభాలో దాదాపు 10 శాతం ముస్లింలు బీసీలంటూ ఈ ప్రభుత్వం వెనకబడిన వర్గాల గొంతు కోసింది. జనాభాలో సగానికి పైగా ఉండే బీసీలను 46 శాతానికి కుదించి వారి ప్రాధాన్యాన్ని తక్కువ చేసి చూపేందుకు ప్రయత్నించింది. ఎమ్మెల్యే టికెట్ల విషయంలోనూ కాంగ్రెస్ బీసీలకు ఇచ్చిన మాట నిలుపుకోలేకపోయింది. ఏఐసీసీ ఉదయ్‌పూర్ డిక్లరేషన్ ప్రకారం ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో కనీసం రెండు అసెంబ్లీ స్థానాలు బీసీలకు కేటాయిస్తామని చెప్పినా, దానిని అమలు చేయలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన నాటి నుంచి 2025 వరకు రాష్ట్రాన్ని ఎక్కువ కాలం పాలించింది కాంగ్రెస్ పార్టీనే. ఇన్నేళ్ల సుదీర్ఘ పాలనలో టంగుటూరి అంజయ్య మినహా ఒక్క బీసీ ముఖ్యమంత్రి కాలేదు.
అధికారంలోకి వచ్చిన ప్రతిసారి బిజెపి సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తుంది. మొదటి అవకాశంలో శాస్త్రవేత్త, మైనారిటీ వర్గానికి చెందిన డా. ఏ.పి.జె. అబ్దుల్ కలాంను రాష్ట్రపతిగా చేసింది. రెండోసారి ప్రముఖ న్యాయవాది, దళిత వర్గానికి చెందిన రామ్ నాథ్ కోవింద్ ను రాష్ట్రపతిగా చేసింది. మూడోసారి ఆదివాసీ బిడ్డ ద్రౌపది ముర్మును రాష్ట్రపతిగా చేసింది. గెలిచే అవకాశాలు లేకున్నా కాంగ్రెస్ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా బీసీని నిలబెట్టలేకపోయింది. కాంగ్రెస్ బీసీ నినాదం ఓట్ల కోసమే తప్ప, వారి ప్రయోజనం కోసం కాదన్న విషయాన్ని ప్రజల్లోకి, ముఖ్యంగా బీసీ వర్గాల్లోకి తీసుకెళ్లాలి. ఇందుకు ప్రతి బిజెపి కార్యకర్త చొరవ చూపాలి. బీసీల పట్ల కాంగ్రెస్ కపట ప్రేమను ఎండగట్టాలి.