Nitin Nabin Modi

సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు ‘సేవా సంకల్ప్ అభియాన్’

BJP National Officebearersప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజా జీవితంలో కొనసాగించిన సేవా స్ఫూర్తిని సమాజంలోని ప్రతి వర్గానికీ చేరువ చేయాలనే లక్ష్యంతో బిజెపి దేశవ్యాప్తంగా నెల రోజుల పాటు ‘సేవా సంకల్ప్ అభియాన్’ నిర్వహించనుంది. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. కొత్త జాతీయ కార్యవర్గం ఏర్పాటైన తర్వాత ఆగస్ట్ 22న తొలిసారిగా జాతీయ పదాధికారుల సమావేశం జరిగింది. అనంతరం జరిగిన ‘సేవా సంకల్ప్ అభియాన్’ కార్యశాలలో జాతీయ పదాధికారులతో పాటు రాష్ట్ర అధ్యక్షులు, రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శులు, ప్రతి రాష్ట్రం నుంచి ఏడెనిమిది సభ్యులు గల బృందాలు పాల్గొన్నాయి. ఈ సమావేశాల్లో ప్రధానమంత్రి పాల్గొని, నాయకులకు దిశానిర్దేశం చేశారు.

ప్రధాని మోదీ జన్మదినమైన సెప్టెంబర్ 17న బిజెపి ప్రతి ఏడాది దేశవ్యాప్తంగా ‘సేవా పక్షం’గా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. 2001 అక్టోబర్ 7న నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ఏడాది అక్టోబర్ 7 నాటికి ఆయన ప్రజా జీవితంలో ముఖ్యమైన ఈ ఘట్టానికి 25 ఏళ్లు పూర్తవుతాయి. ఈ నేపథ్యంలో మోదీ 25 ఏళ్ల ప్రజా జీవితంలో ప్రదర్శించిన సేవా స్ఫూర్తిని ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లేందుకు ఈసారి నెల రోజుల పాటు ‘సేవా సంకల్ప్ అభియాన్’ నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా 14 లక్షలకు పైగా అంగన్‌వాడీ కేంద్రాలను బిజెపి కార్యకర్తలు సందర్శించి అక్కడ పనిచేస్తున్న కార్యకర్తలను సేవా స్ఫూర్తితో సత్కరించనున్నారు. యువతను సేవా కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేసేందుకు ‘సేవా మే మేరా యోగదాన్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. సేవా కార్యక్రమాలపై యువత రీల్స్ రూపొందించి ఇతరులకు స్ఫూర్తిగా నిలిచేలా ప్రోత్సహించనున్నారు. పరిశుభ్రత కార్యక్రమాలు, మొక్కలు నాటడం, క్షయవ్యాధి (టీబీ) నిర్మూలనలో భాగంగా టీబీ బాధితులను గుర్తించడం, వారిని ప్రభుత్వ సంక్షేమ పథకాలతో అనుసంధానం చేయడం వంటి సేవా కార్యక్రమాలను ఈ రీల్స్ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు. యువత రూపొందించిన ఉత్తమ రీల్స్‌ను జిల్లా, రాష్ట్ర స్థాయిలో ప్రచారం చేసి మరింత మంది సేవా కార్యక్రమాల్లో పాల్గొనేలా ప్రోత్సహించనున్నారు.

ప్రధాని మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు అర్హులైన ఏ ఒక్కరూ దూరం కాకుండా చూడటమే ‘సేవా సేతు అభియాన్’ లక్ష్యం. ఇందుకోసం 15 రోజుల పాటు మండల స్థాయిలో సంబంధిత ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేయనున్నారు. ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి వంటి పథకాల్లో అర్హత ఉన్నప్పటికీ పేరు నమోదు కాని వారు ఈ శిబిరాలను సందర్శించి అవసరమైన దరఖాస్తులు సమర్పించి పథకాల్లో చేరే అవకాశం కల్పించనున్నారు. ఈ విధంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలకు, వాటి అసలు లబ్ధిదారులకు మధ్య వారధిగా ‘సేవా సేతు అభియాన్’ పనిచేయనుంది. యువతలోని సృజనాత్మకత, ఆవిష్కరణ సామర్థ్యాన్ని ప్రోత్సహించేందుకు ‘నేషనల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్’ను కూడా నిర్వహించనున్నారు. స్థానికంగా ఉన్న సమస్యలను యువత గుర్తించి.. వాటికి పరిశోధన, ఆవిష్కరణల ద్వారా పరిష్కారాలను సూచించేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. ఈ పోటీని మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో నిర్వహించనున్నారు. తద్వారా స్థానిక సమస్యలకు స్థానికంగానే వినూత్న పరిష్కారాలను కనుగొనే అవకాశం ఏర్పడుతుంది.