Modi Iday

ప్రధానమంత్రి స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగం వికసిత్ భారత్‌కు దిశానిర్దేశం

Modi with Flagఎనభై ఏళ్ల స్వాతంత్ర్యం.. ఎర్రకోటపై ఎనభై ఏళ్ల త్రివర్ణ వైభవం.. ఆ చరిత్రకు సాక్షిగా వరుసగా 13వసారి అదే ఎర్రకోట నుంచి ప్రధాని మోదీ గళం.. 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన ప్రసంగం.. ఒకవైపు గత 12 ఏళ్ల ప్రగతి పథాన్ని గణాంకాల అద్దంలో ఆవిష్కరిస్తే, మరోవైపు 2047 నాటికి ‘వికసిత్ భారత్’ అనే మహా సంకల్పానికి దిశానిర్దేశం చేసింది. ఎర్రకోట నుంచి వరుసగా 13సార్లు ప్రసంగించిన ప్రధానమంత్రిగా ఇందిరాగాంధీ రికార్డును అధిగమించి, జవహర్‌లాల్ నెహ్రూ తర్వాత ఈ ఘనతలో రెండో స్థానంలో నిలిచిన మోదీ.. ఈసారి ప్రసంగంలో కేవలం ప్రభుత్వ విజయాలను లెక్కించడానికే పరిమితం కాలేదు. పేదరికం నుంచి బయటపడిన 25 కోట్ల మంది నుంచి ప్రపంచ మార్కెట్లను లక్ష్యంగా చేసుకున్న భారత తయారీ రంగం వరకు, 35 రెట్లు పెరిగిన మొబైల్ ఉత్పత్తి నుంచి 100 రెట్లు పెరిగిన డిజిటల్ లావాదేవీల వరకు, సెమీకండక్టర్ల నుంచి అణుశక్తి వరకు, యువత నుంచి మహిళా శక్తి వరకు.. ‘వికసిత్ భారత్’ అనే కలకు అవసర‌‌మైన ప్రతి ఇటుకనూ ఎక్కడి నుంచి సమకూర్చుకోవాలో వివరించారు. ఆర్థిక రంగంలో భారత్‌ మరింత ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకోవాలంటూ వచ్చే దశాబ్దంలో ఫార్చూన్ 500 జాబితాలో 50 భారతీయ కంపెనీలు ఉండేలా లక్ష్యాన్ని పెట్టుకోవాలని ఆకాంక్షించారు. భారతీయ బ్యాంకులు ప్రపంచంలోని అగ్రశ్రేణి బ్యాంకుల సరసన నిలవాలని అభిలషించారు‌. స్వాతంత్ర్యపు ఎనిమిది దశాబ్దాల ప్రయాణాన్ని వెనక్కి తిరిగి చూసుకుంటూనే.. రాబోయే రెండు దశాబ్దాల భారత భవిష్యత్తును ముందుగానే చిత్రించిన ప్రసంగంగా ఇది నిలిచింది. 

దేశం 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్న వేళ.. ఎర్రకోట బురుజులపై నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన ప్రసంగం కేవలం గతాన్ని గుర్తుచేసుకునే సందర్భంగా కాకుండా, 2047 నాటికి ‘వికసిత్ భారత్‌’ నిర్మాణానికి దేశం అనుసరించాల్సిన మార్గాన్ని నిర్దేశించే ప్రసంగంగా సాగింది. ‘హర్ ఘర్ తిరంగా హై.. హర్ మన్ తిరంగా హై’ అనే స్ఫూర్తితో దేశం కొత్త శక్తి, కొత్త సంకల్పంతో ముందుకు సాగుతోందని ప్రధాని పేర్కొన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తొలిసారిగా ఆగస్టు 15న ఎర్రకోట నుంచి ‘వందేమాతరం’ ప్రతిధ్వనిస్తోందని, ఇదే సమయంలో వందేమాతరం 150వ వార్షికోత్సవాన్ని జరుపుకోవడం ప్రత్యేక సందర్భమని అన్నారు.

ఇటీవల దేశంలోని పలు ప్రాంతాల్లో వరదలు, కొండచరియలు విరిగిపడటంతో నష్టపోయిన కుటుంబాల పట్ల ప్రధాని సానుభూతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు యావత్ దేశం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.అయితే ప్రసంగం ప్రధానంగా దేశ భవిష్యత్తుపైనే కేంద్రీకృతమైంది. 2047లో స్వాతంత్ర్యం వచ్చి 100 సంవత్సరాలు పూర్తయ్యే నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలన్నదే తన లక్ష్యమని ప్రధాని స్పష్టం చేశారు. 140 కోట్ల మంది భారతీయుల సమష్టి కృషితో ఈ లక్ష్యాన్ని సాధించాలని పిలుపునిచ్చారు.‌

దేశ ప్రగతికి ప్రభుత్వం మాత్రమే కాదు.. ప్రతి పౌరుడి కృషే పునాది అని ప్రధాని నొక్కిచెప్పారు. గత 12 సంవత్సరాల్లో దళితులు, అణగారిన వర్గాలు, గిరిజనులు, పేదలు, మధ్యతరగతి, యువత, మహిళలు, వృద్ధులు, గ్రామీణులు, పట్టణ ప్రజలు.. ఉత్తర, దక్షిణ, తూర్పు, పశ్చిమ ప్రాంతాలకు చెందిన కోట్లాది మంది తమ శక్తిమేరకు దేశ నిర్మాణంలో భాగస్వాములయ్యారని పేర్కొన్నారు. ఈ సమష్టి కృషి ఫలితంగానే అతి తక్కువ సమయంలో 25 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారని తెలిపారు. ఒకప్పుడు ‘ఫ్రాగైల్ ఫైవ్‌’ వంటి బలహీన ఆర్థిక వ్యవస్థల జాబితాలో ఉన్న భారత్‌.. కేవలం 12 ఏళ్లలోనే ప్రధాన ఆర్థిక వ్యవస్థగా, అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని అన్నారు. ఈ కాలంలో వివిధ రంగాల్లో చోటుచేసుకున్న మార్పులను ప్రధాని గణాంకాలతో వివరించారు. రక్షణ రంగ ఉత్పత్తి దాదాపు నాలుగు రెట్లు, ఖాదీ–గ్రామ పరిశ్రమల ఉత్పత్తి దాదాపు ఐదు రెట్లు, ఎలక్ట్రానిక్స్ తయారీ దాదాపు ఏడు రెట్లు పెరిగాయి. ఆధునిక రైల్వే కోచ్‌ల ఉత్పత్తి 21 రెట్లు, మొబైల్ ఫోన్ల ఉత్పత్తి 35 రెట్లు పెరిగింది. డిజిటల్ రంగంలోనూ ఇదే వేగం కనిపించిందని ప్రధాని చెప్పారు. ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య దాదాపు నాలుగు రెట్లు, మంజూరైన పేటెంట్లు నాలుగు రెట్లు, డిజిటల్ లావాదేవీలు ఏకంగా 100 రెట్లు పెరిగాయని తెలిపారు.

సామాన్య ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే మౌలిక సదుపాయాల విస్తరణలోనూ వేగం పెరిగిందని అన్నారు. గతంతో పోలిస్తే నల్లా నీటి కనెక్షన్ల కల్పన సగటు వార్షిక వేగం 15 రెట్లు, గ్యాస్ కనెక్షన్ల కల్పన ఆరు రెట్లు, పేదలకు మరుగుదొడ్ల నిర్మాణం నాలుగు రెట్లు, పేదలకు ఇళ్ల నిర్మాణం మూడు రెట్లు వేగంగా జరుగుతోందని వివరించారు. వేలాది నిబంధనలను తొలగించడంతో పాటు, కాలం చెల్లిన వందలాది చట్టాలను రద్దు చేశామని పేర్కొన్నారు. మెట్రో వ్యవస్థల విస్తరణ, ప్రజా రవాణా బలోపేతం వంటి చర్యలతో ఆధునిక మౌలిక సదుపాయాలకు ఊతమిచ్చామని, స్వాతంత్ర్యం తర్వాత గత దశాబ్దంలో దేశం ఇంతటి వేగం, విస్తృతిని తొలిసారిగా చూస్తోందని ప్రధాని పేర్కొన్నారు.

‌’ఆత్మనిర్భర్ భారత్‌’కు తయారీ రంగమే పునాది

ప్రపంచంతో పోటీ పడటానికి భారత్‌ తన సామర్థ్యాలను మరింత పెంచుకోవాల్సిన అవసరం ఉందని ప్రధాని అన్నారు. దేశ ప్రయోజనాలను కాపాడుకోవడమే లక్ష్యంగా ‘ఆత్మనిర్భర్ భారత్‌’ దిశగా ప్రయాణం కొనసాగుతుందని చెప్పారు. ‘మేక్ ఇన్ ఇండియా’, ‘స్వదేశీ’, ‘వోకల్ ఫర్ లోకల్’ కార్యక్రమాలను ప్రస్తావిస్తూ దేశీయ తయారీకి ప్రాధాన్యం ఇవ్వాలని పిలుపునిచ్చారు. 2014 నుంచి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 40 దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు (ఎఫ్‌టీఏలు) కుదుర్చుకున్నామని తెలిపారు. వీటి ద్వారా భారత ఉత్పత్తులకు ప్రపంచ మార్కెట్లలో విస్తృత అవకాశాలు లభిస్తున్నాయని, ముఖ్యంగా ఎంఎస్ఎంఈలు ఈ అవకాశాలను అందిపుచ్చుకోవాలని కోరారు. భారత వస్త్రాలు, యంత్రాలు, ఔషధాలు తదితర ఉత్పత్తులు ప్రపంచ మార్కెట్లలో స్థానం సంపాదించుకోవాలని, ప్రపంచ ప్రమాణాలను అందుకోవడమే కాకుండా వాటిని అధిగమించాలని సూచించారు. తదుపరి దశ సంస్కరణల్లో తయారీ రంగానికి అత్యున్నత ప్రాధాన్యం ఉంటుందని ప్రధాని చెప్పారు. చిన్న విడిభాగాల నుంచి పూర్తి స్థాయి ఉత్పత్తుల వరకు దేశంలోనే తయారు చేసే సామర్థ్యాన్ని పెంచుకోవాలని, డిజైన్‌ నుంచి తయారీ వరకు ప్రపంచ సరఫరా వ్యవస్థలో భారత్‌ను విశ్వసనీయ కేంద్రంగా తీర్చిదిద్దాలని అన్నారు. పోటీతత్వం, వినియోగదారులకు అనుకూలత, ఆకర్షణీయమైన ప్యాకేజింగ్, లోపాలు లేని ఉత్పత్తి, కచ్చితత్వంతో కూడిన తయారీ భారత పరిశ్రమకు గుర్తింపుగా మారాలని సూచించారు. ప్రపంచ మార్కెట్లో భారత బ్రాండ్ విలువకు ‘నాణ్యత’నే పునాదిగా నిలపాలని స్పష్టం చేశారు.

‌రైతు నుంచి ప్రపంచ మార్కెట్‌ వరకు

‘సప్త ధార’లో రెండో శక్తిగా వ్యవసాయం, ఆహార ఉత్పత్తిని ప్రధాని పేర్కొన్నారు. రైతులపై భారం తగ్గించేందుకు ప్రభుత్వం భారీ వ్యయాన్ని భరిస్తోందని చెప్పారు. అంతర్జాతీయ మార్కెట్లో రూ.3,000 ధర చేసే యూరియా బస్తాను రైతులకు రూ.300కే, ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో రూ.5,000కు చేరిన డీఏపీని రూ.1,350కే అందిస్తున్నామని వివరించారు. ఎఫ్‌టీఏల కారణంగా భారత రైతులకు విస్తృత ప్రపంచ మార్కెట్లు అందుబాటులోకి వస్తున్నాయని, ఈ అవకాశాలను వినియోగించుకుని వ్యవసాయ క్షేత్రం నుంచి నేరుగా ఎగుమతి మార్కెట్‌ వరకు ప్రయాణించాల్సిన అవసరం ఉందని ప్రధాని అన్నారు. రసాయన రహిత వ్యవసాయానికి మరింత ప్రాధాన్యం ఇవ్వాలని, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణమైన వ్యవసాయ ఉత్పత్తులతో ప్రపంచ మార్కెట్లలో భారత స్థానం మరింత బలపడుతుందని సూచించారు.

టెక్నాలజీపై దృష్టి

కృత్రిమ మేధ, క్వాంటమ్ టెక్నాలజీ, అంతరిక్షం, రోబోటిక్స్, డేటా సెంటర్లు వంటి కొత్త రంగాలు వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో భారత్ కేవలం ప్రపంచ మార్కెట్‌గా కాకుండా ఆవిష్కరణలకు కేంద్రంగా మారాలని ఆకాంక్షించారు. మొబైల్ ఫోన్ల ఉత్పత్తి 35 రెట్లు పెరగడం, ఇంటర్నెట్ వినియోగదారులు, పేటెంట్లు నాలుగు రెట్లు పెరగడం, డిజిటల్ లావాదేవీలు 100 రెట్లు పెరగడాన్ని ప్రస్తావించారు. యూపీఐ, డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ద్వారా భారత్ తన సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటిందని చెప్పారు. చిప్‌ల ప్రాధాన్యం పెరుగుతున్న నేపథ్యంలో సెమీకండక్టర్ తయారీలో స్వావలంబన సాధించేందుకు ఇప్పటికే మూడు సెమీకండక్టర్ ప్లాంట్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టామని తెలిపారు. రాబోయే ఏడు నుంచి ఎనిమిదేళ్లలో మరో ఐదు నుంచి ఎనిమిది సెమీకండక్టర్ ప్లాంట్లు ఏర్పాటయ్యే అవకాశం ఉందన్నారు. తదుపరి తరం కమ్యూనికేషన్ టెక్నాలజీల్లో భారత్ నాయకత్వం వహించాలని, భారత్‌లో తయారయ్యే 6జీ సాంకేతికత ప్రపంచంలోని నలుమూలలకు చేరేలా చూడటం లక్ష్యంగా పెట్టుకోవాలని పిలుపునిచ్చారు.

Modi Iday

‌కీలక ఖనిజాల్లో స్వావలంబన

సెమీకండక్టర్లు, ఆధునిక సాంకేతికతకు అవసరమైన కీలక ఖనిజాల విషయంలోనూ భారత్ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోందని ప్రధాని తెలిపారు. దేశానికి అవసరమైన కీలక ఖనిజాల లభ్యత కోసం ‘జాతీయ కీలక ఖనిజాల మిషన్‌’ ప్రారంభించామని, బడ్జెట్‌లో కీలక ఖనిజాల కారిడార్‌ ప్రకటించామని చెప్పారు. అనేక దేశాలతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నామని, కీలక ఖనిజాల విషయంలో ప్రపంచంలోని అనేక దేశాలు భారత్‌పై నమ్మకం ఉంచుతున్నాయని తెలిపారు. చిప్‌లు, ఏఐ, డేటా సెంటర్ల నుంచి ఆధునిక పరిశ్రమల వరకు ప్రతి రంగానికీ భారీ మొత్తంలో విద్యుత్ అవసరమవుతున్న నేపథ్యంలో ఇంధన భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరాన్ని ప్రధాని వివరించారు. అణుఇంధనాన్ని ఇంధన భద్రతకు కీలక మార్గంగా పేర్కొంటూ, 2047 నాటికి 100 గిగావాట్ల అణువిద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం సాధించాలనే లక్ష్యాన్ని ప్రకటించారు. ఈ దశాబ్దంలోనే ఐదు కొత్త అణు రియాక్టర్లను ప్రారంభించే దిశగా పనిచేస్తున్నామని, ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ సాంకేతికతను విజయవంతంగా సాధించడం ద్వారా భారత్ మరో కీలక మైలురాయిని అధిగమించిందని చెప్పారు. ఇక పైపుల ద్వారా గ్యాస్ సరఫరా విషయంలోనూ విస్తరణను ప్రధాని వివరించారు. 2014కు ముందు కేవలం 70 నగరాల్లో పైపుల గ్యాస్ సౌకర్యం ఉండగా, ఇప్పుడు అది 700 నగరాలకు విస్తరించిందన్నారు. 2014కు ముందు 20–22 లక్షల కుటుంబాలకు మాత్రమే పైపుల ద్వారా గ్యాస్ అందగా, ఇప్పుడు 1.75 కోట్ల కుటుంబాలకు అందుతోందని తెలిపారు.

సౌర విద్యుత్ సామర్థ్యం 12 ఏళ్ల క్రితం కేవలం 2 గిగావాట్లు ఉండగా, ఇప్పుడు 160 గిగావాట్లకు చేరిందని చెప్పారు. ‘పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన’ ద్వారా తక్కువ కాలంలోనే 50 లక్షల కుటుంబాలు సౌర విద్యుత్‌ను స్వీకరించాయని, ఒక్కో కుటుంబానికి ప్రభుత్వం రూ.80,000 ఆర్థిక సహాయం అందిస్తోందని వివరించారు. మిగిలిన విద్యుత్‌ను విక్రయిస్తూ కొన్ని కుటుంబాలు ఆదాయం కూడా ఆర్జిస్తున్నాయని తెలిపారు. హరిత, నీలి ఆర్థిక వ్యవస్థలను ‘సప్తధార’లో ఆరో శక్తిగా పేర్కొంటూ గ్రీన్ హైడ్రోజన్, పునరుత్పాదక ఇంధనం, ఇంధన నిల్వ, హరిత రవాణా, హరిత తయారీ రంగాల్లో భారత్ ప్రపంచ నాయకత్వాన్ని సాధించాలని ఆకాంక్షించారు.

90 ఏళ్లలో 30 శాతం, పదేళ్లలో 70 శాతం

భారత రైల్వేల్లో చోటుచేసుకున్న మార్పులను ప్రధాని ఒక ప్రత్యేక ఉదాహరణగా వివరించారు. ఆధునిక రైల్వే కోచ్‌ల ఉత్పత్తి 21 రెట్లు పెరిగిందని చెప్పారు. రైల్వే విద్యుదీకరణ 1925లో ప్రారంభమైనప్పటికీ, 1925 నుంచి 2015 వరకు 90 ఏళ్లలో కేవలం 30 శాతం నెట్‌వర్క్ మాత్రమే విద్యుదీకరణ పొందిందన్నారు. మిగిలిన 70 శాతం విద్యుదీకరణను కేవలం ఒక దశాబ్దంలో పూర్తి చేశామని తెలిపారు. దీంతో డీజిల్ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు కూడా ప్రయోజనం కలిగిందన్నారు. దేశంలో తొలి హైడ్రోజన్ ఆధారిత రైలును ప్రవేశపెట్టామని, అది ప్రపంచంలోనే అత్యంత పొడవైన, అత్యంత శక్తివంతమైన హైడ్రోజన్ రైలుగా నిలిచిందని చెప్పారు.

‌రక్షణలో స్వావలంబన

రక్షణ రంగంలో స్వయం సమృద్ధి సాధించడం భారత్‌కు తప్పనిసరి అని స్పష్టం చేశారు. డ్రోన్లు, డ్రోన్ నిరోధక వ్యవస్థలు, హైపర్‌సోనిక్ రక్షణ సాంకేతికతల అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు. సైబర్ భద్రత కూడా నేటి కుటుంబాలకు, సమాజానికి కీలక సవాలుగా మారిందని, యువత సామర్థ్యాలను ఈ రంగంలో వినియోగించుకోవాలని సూచించారు. ‘మిషన్ సుదర్శన్ చక్ర’ పనులు వేగంగా పురోగమిస్తున్నాయని పేర్కొంటూ, గత 12 ఏళ్లలో భారత రక్షణ ఎగుమతులు దాదాపు 50 రెట్లు పెరిగాయని, భారత ఆయుధాలు, రక్షణ పరికరాలు ప్రపంచవ్యాప్తంగా సుమారు 100 దేశాలకు చేరుతున్నాయని తెలిపారు.

‌రవాణా నుంచి పోర్టుల వరకు.. కనెక్టివిటీకి కొత్త దిశ

దేశంలో నిరాటంకమైన, వేగవంతమైన అనుసంధానాన్ని లక్ష్యంగా పెట్టుకోవాలని అన్నారు. హైస్పీడ్ రైళ్లు, ఆధునిక రహదారులు, అంతర్గత జలమార్గాలు, విమానాశ్రయాలు, బహుళ రవాణా మార్గాల ఆధారిత లాజిస్టిక్స్ వ్యవస్థ అవసరమని చెప్పారు. ఓడరేవులను కేవలం సరుకుల ఎగుమతి–దిగుమతి కేంద్రాలుగా కాకుండా పోర్ట్ ఆధారిత అభివృద్ధి కేంద్రాలుగా తీర్చిదిద్దాలని సూచించారు. భారత సుదీర్ఘ తీరప్రాంతం బ్లూ ఎకానమీకి భారీ అవకాశాలను అందిస్తోందని, మత్స్య పరిశ్రమ, తీరప్రాంత పర్యాటకం, సముద్ర సాంకేతికత వంటి రంగాల్లో విస్తృత అవకాశాలున్నాయని చెప్పారు. ఎఫ్‌టీఏల కారణంగా కేరళ నుంచి గుజరాత్ వరకు, తమిళనాడు నుంచి బెంగాల్ వరకు భారత రొయ్యలు, సముద్ర ఆహార ఉత్పత్తులకు ప్రపంచ మార్కెట్లలో మరిన్ని అవకాశాలు లభిస్తున్నాయని వివరించారు.

‌పర్యాటకం, క్రీడలు.. ‘కన్సర్ట్ ఎకానమీ’పై దృష్టి

భారత్‌కు ఉన్న వన్యప్రాణి సంపదను ప్రపంచ పర్యాటకానికి మరింతగా వినియోగించుకోవాలని ప్రధాని అన్నారు. దేశంలో 100కు పైగా జాతీయ పార్కులు ఉన్నప్పటికీ విదేశీ పర్యాటకులను ఆకర్షించడంలో ఇంకా వెనుకబడి ఉన్నామని పేర్కొన్నారు. భారత్‌ సాఫ్ట్ పవర్‌ను వినియోగించి ప్రపంచ పర్యాటకులను ఆకర్షించవచ్చని అన్నారు. ప్రపంచ క్రీడా కార్యక్రమాలను భారత్‌లో నిర్వహించేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాలని సూచించారు. అదే సమయంలో ‘కన్సర్ట్ ఎకానమీ’ వేగంగా అభివృద్ధి చెందుతోందని, ప్రపంచంలోని ప్రముఖ కళాకారులు భారత్‌లో ప్రదర్శనలు ఇవ్వాలని కోరుకుంటున్నారని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి తగిన మౌలిక సదుపాయాలు, వ్యవస్థలను ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు.

యోగాతో ప్రపంచం భారత్‌తో అనుసంధానమైందని, ఆయుర్వేదం, ఆధ్యాత్మికత, సంపూర్ణ ఆరోగ్య సంరక్షణ వంటి రంగాల్లో భారత్‌కు ప్రత్యేక సామర్థ్యం ఉందని చెప్పారు. ‘హీల్ ఇన్ ఇండియా’ ద్వారా ఈ సామర్థ్యాలను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లవచ్చన్నారు. హస్తకళలు, సంస్కృతి, సినిమాలు, సృజనాత్మక రంగం, వీఎఫ్ఎక్స్, యానిమేషన్, గేమింగ్, డిజిటల్ కంటెంట్ వంటి రంగాల్లోనూ భారత్ తన స్థాయిని చాటుకోగలదని అన్నారు. భారత వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్‌ (వేవ్స్) ద్వారా భారత సాఫ్ట్ పవర్, సృజనాత్మక రంగానికి ప్రపంచవ్యాప్త వేదిక ఏర్పడుతోందని పేర్కొన్నారు.

‌ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదగాలంటే..

ఆర్థిక రంగంలో భారత్‌ మరింత ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకోవాలని ప్రధాని అన్నారు. వచ్చే దశాబ్దంలో ఫార్చూన్ 500 జాబితాలో 50 భారతీయ కంపెనీలు ఉండేలా లక్ష్యాన్ని పెట్టుకోవాలని ఆకాంక్షించారు. భారతీయ బ్యాంకులు ప్రపంచంలోని అగ్రశ్రేణి బ్యాంకుల సరసన నిలవాలని, కనీసం ఒక భారతీయ బ్యాంకు ప్రపంచంలోని ఐదు అగ్రగామి బ్యాంకుల్లో స్థానం సంపాదించాలన్నారు. ‘స్వామిత్వ పథకం’ ద్వారా దాదాపు 3.25 కోట్ల కుటుంబాలు లబ్ధి పొందాయని, దాదాపు రూ.140 లక్షల కోట్ల విలువైన ఆస్తులు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. ఈ ఆస్తుల ఆధారంగా ప్రజలు బ్యాంకుల నుంచి రుణాలు పొందుతూ సొంత వ్యాపారాలు ప్రారంభించగలుగుతున్నారని చెప్పారు.

భారత ఔషధ రంగం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందని ప్రధాని అన్నారు. ప్రపంచంలోని ఐదు అతిపెద్ద ఔషధ కంపెనీల్లో కనీసం ఒకటి లేదా రెండు భారతీయ కంపెనీలు ఉండాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. సామాజిక భద్రత విస్తరణలో గత దశాబ్దంలో గణనీయమైన పురోగతి సాధించామని తెలిపారు. గత ఐదు నుంచి ఏడు దశాబ్దాల్లో 25 కోట్ల మందికి సామాజిక భద్రత లభించగా, కేవలం ఒక దశాబ్దంలోనే 100 కోట్ల మంది పౌరులకు సామాజిక భద్రత కవచాన్ని అందించగలిగామని చెప్పారు. ‘ఆయుష్మాన్ భారత్’ పరిధిని విస్తరించి, 70 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసున్న వృద్ధులకు రూ.5 లక్షల వరకు ఉచిత వైద్య చికిత్స, మందులు అందిస్తున్నామని తెలిపారు.

యువతకు కొత్త అవకాశాలు

35 ఏళ్లుగా కొత్త విద్యా విధానం లేని పరిస్థితిలో కొత్త జాతీయ విద్యా విధానాన్ని తీసుకొచ్చామని ప్రధాని చెప్పారు. 2004–2014 మధ్య దేశంలో 350 కంటే తక్కువ విశ్వవిద్యాలయాలు ఉండగా, గత 10–12 ఏళ్లలో దాదాపు 650 కొత్త విశ్వవిద్యాలయాలు ఏర్పాటయ్యాయని తెలిపారు. దీంతో భారత్ దాదాపు 1,000 విశ్వవిద్యాలయాల స్థాయికి చేరువవుతోందన్నారు. మెడికల్ సీట్ల విషయంలోనూ విస్తరణ జరిగిందని, 2014కు ముందు ఉన్న 400తో పోలిస్తే ప్రస్తుతం దాదాపు 850 మెడికల్ సీట్లు ఉన్నాయని పేర్కొన్నారు. విదేశీ విశ్వవిద్యాలయాలు భారత్‌లోకి రావడానికి మార్గం సుగమమైందని, భారత యువత దేశంలోనే ఉండి విదేశీ విశ్వవిద్యాలయాల నుంచి డిగ్రీలు పొందే అవకాశాలు ఏర్పడ్డాయని చెప్పారు. చిన్న వయసులోనే సాంకేతిక విజ్ఞానం, ఆవిష్కరణలపై ఆసక్తి పెంచేందుకు 10,000కు పైగా అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ఏర్పాటు చేశామని తెలిపారు. దేశ యువతకు వివిధ పోటీ పరీక్షల కోసం ఉచిత ఆన్‌లైన్ కోచింగ్ అందించే సమగ్ర నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.‌

వికసిత్ భారత్ నిర్మాణంలో యువత కీలక పాత్ర పోషించాల్సి ఉందని ప్రధాని అన్నారు. అదే సమయంలో వికసిత్ భారత్‌కు అతిపెద్ద లబ్ధిదారులు కూడా యువతేనని పేర్కొన్నారు. ‘స్టార్టప్ ఇండియా’ ప్రభావంతో దేశంలో 2.5 లక్షలకు పైగా అంకుర సంస్థలు నమోదయ్యాయని తెలిపారు. యువత ఉద్యోగాలు పొందడమే కాకుండా, ఇతరులకు ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదుగుతోందన్నారు. దేశంలో రూ.1 లక్ష కోట్లతో ఇన్నొవేషన్ ఫండ్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. సగటున 28 ఏళ్ల లోపు వయసున్న యువత స్థాపించిన భారతీయ ప్రైవేట్ స్టార్టప్‌లు తమ తొలి ప్రయత్నాల్లోనే మానవ నిర్మిత ఉపగ్రహాలు, రాకెట్లను ప్రయోగించి సామర్థ్యాన్ని చాటుకున్నాయని చెప్పారు. ఏఐ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో వచ్చే ఒక సంవత్సరంలో కోటి మంది యువతీయువకులకు ఏఐ నైపుణ్యాల్లో శిక్షణ ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. భారత్ బయోఎకానమీ కూడా భారీగా విస్తరించిందని చెప్పారు. 2014కు ముందు ఈ రంగంలో టర్నోవర్ రూ.60,000 కోట్లు ఉండగా, ప్రస్తుతం అది రూ.20 లక్షల కోట్లకు చేరుకుందని తెలిపారు.

‌క్రీడల్లో 2036 లక్ష్యం

‘టీఓపీఎస్’ పథకం, ‘ఖేలో ఇండియా గేమ్స్’, యూనివర్సిటీ గేమ్స్, శీతాకాల క్రీడలు, బీచ్ గేమ్స్, క్రీడా మౌలిక సదుపాయాలు, శిక్షణ, స్పోర్ట్స్ మెడిసిన్, క్రీడాకారుల పోషణ వంటి రంగాల్లో భారత్ వేగంగా ముందుకు సాగుతోందని ప్రధాని అన్నారు. 2036 ఒలింపిక్స్‌కు బలమైన పోటీదారుగా భారత్ ఎదగాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. భారత్ 2030 కామన్వెల్త్ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వనుందని, 2036 ఒలింపిక్స్‌కు భారత్ వేదిక కావాలని కోరుకుంటున్నామని తెలిపారు. ప్రస్తుతం భారత్‌లో పెద్దగా ఆడని లేదా అర్హత సాధించని క్రీడా విభాగాల్లో నాలుగింట మూడు వంతుల అవకాశాలు ఉన్నాయని, వాటిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని అన్నారు. 5 నుంచి 15 ఏళ్ల వయసున్న పిల్లల్లో గ్రామాలు, నగరాలు, పాఠశాలల్లో ప్రతిభను గుర్తించే భారీ ప్రతిభాన్వేషణ కార్యక్రమాన్ని చేపట్టి, ఎంపికైన వారికి ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. అదే సమయంలో మాదకద్రవ్యాల వ్యసనం యువతకు ప్రధాన సవాలుగా మారుతోందని, ‘నషా ముక్త్ భారత్’ నిర్మాణం అందరి బాధ్యత అని అన్నారు.

‌మహిళా శక్తి.. 6 కోట్ల లఖ్‌పతి దీదీలు

దేశ నిర్మాణంలో మహిళల పాత్రను ప్రధాని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఫైటర్ జెట్ల నుంచి పౌర విమానయానం వరకు మహిళలు ముందువరుసలో నిలుస్తున్నారని అన్నారు. మొదట 3 కోట్ల మంది మహిళలను ‘లఖ్‌పతి దీదీలు’గా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఆ లక్ష్యాన్ని అధిగమించి ఇప్పుడు 6 కోట్ల మంది లఖ్‌పతి దీదీలకు చేరుకోవడమే తదుపరి లక్ష్యమని తెలిపారు. కొత్తగా 3 కోట్ల మంది మహిళలను లఖ్‌పతి దీదీలుగా తీర్చిదిద్దడం గ్రామీణ ఆర్థిక వ్యవస్థ రూపురేఖల్లో పెద్ద మార్పుకు దారితీస్తుందని చెప్పారు. చట్టసభల్లో, లోక్‌సభలో మహిళలకు 33 శాతం ప్రాతినిధ్యం త్వరగా అమలయ్యేలా అన్ని రాజకీయ పక్షాలు సహకరించాలని ప్రధాని విజ్ఞప్తి చేశారు. మహిళా రిజర్వేషన్ అమలుతో భారత విధాన రూపకల్పనలో మహిళల పాత్ర మరింత పెరగాలని ఆకాంక్షించారు.

‌నక్సలిజం నుంచి పౌర రక్షణ వరకు

నక్సలిజం, మావోయిజం కారణంగా లక్షలాది యువత భవిష్యత్తు దెబ్బతిన్నదని ప్రధాని అన్నారు. నాలుగు దశాబ్దాల పాటు నక్సలిజం దేశంలోని అనేక ప్రాంతాలను ప్రభావితం చేసిందని పేర్కొన్నారు. సాధారణ పౌరులను రక్షించే క్రమంలో 3,500 మందికి పైగా పోలీసులు, భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. నక్సల్ ప్రభావిత ప్రాంతాలు ఇప్పుడు అభివృద్ధి, విశ్వాసం, కృషికి ప్రతీకలుగా మారుతున్నాయని, సాయుధ నక్సలిజం బలహీనపడినా ‘నక్సల్ మనస్తత్వం’ ఇంకా మిగిలి ఉందని హెచ్చరించారు. హింస, అరాచక భావజాలాన్ని సమాజంలోకి చొప్పించే ప్రయత్నాలను గుర్తించి, యువతను అభివృద్ధి చెందిన దేశ నిర్మాణం వైపు నడిపించాలని పిలుపునిచ్చారు. సరిహద్దుల లోపల నుంచి లేదా బయట నుంచి వచ్చే ఏ సవాలుకైనా భారత్ సిద్ధంగా ఉండాలని, మారుతున్న యుద్ధ స్వరూపానికి అనుగుణంగా శక్తిమంతమైన పౌర రక్షణ వ్యవస్థను నిర్మిస్తామని తెలిపారు.

‌జనగణన.. భవిష్యత్ విధానాలకు పునాది

కొనసాగుతున్న జనగణన ప్రక్రియను ప్రధాని ప్రస్తావిస్తూ, జనగణన అనేది కేవలం సంఖ్యలను లెక్కించడం కాదని అన్నారు. అందులోని సూక్ష్మ గణాంకాలే భవిష్యత్ విధానాలు, ప్రణాళికలకు కీలక ఆధారమని వివరించారు. దేశ యువత తమ కుటుంబ సభ్యులతో కలిసి జనగణన ఫారాన్ని పూర్తిగా అర్థం చేసుకుని, ఈ భారీ కార్యక్రమం విజయవంతం కావడానికి చురుగ్గా పాల్గొనాలని కోరారు.

ఎర్రకోట నుంచి గతంలో తాను ప్రస్తావించిన ‘పంచ ప్రాణ్‌’ ఐదు సంకల్పాలు దేశానికి అపారమైన శక్తిని అందించాయని ప్రధాని అన్నారు. బానిసత్వ మనస్తత్వాన్ని నిరంతరం నిర్మూలించడం, వ్యక్తిగత ప్రయోజనాల కంటే దేశ ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇవ్వడం, కర్తవ్యాన్ని గుర్తింపుగా చేసుకోవడం వంటి విలువలను మరోసారి గుర్తుచేశారు. దేశం ముందు ఉన్న సమయం, అవకాశాలు, సంకల్పం అన్నీ భారతీయులవేనని పేర్కొంటూ.. కలలను సంకల్పాలుగా, సంకల్పాలను శక్తిగా, ఆ శక్తిని విజయంగా మార్చుకోవాలని పిలుపునిచ్చారు. ప్రతి అడుగూ అభివృద్ధి వైపు పడాలని, దేశ లక్ష్యంతో ప్రతి ఒక్కరూ అనుసంధానమై ముందుకు సాగాలని అన్నారు. 2047 నాటికి వికసిత్ భారత్‌ అనే లక్ష్యం ఒక్క ప్రభుత్వానికి సంబంధించినది కాదని.. 140 కోట్ల మంది భారతీయుల సమష్టి సంకల్పం, శ్రమ, ప్రతిభ, ఆవిష్కరణ, కర్తవ్యబద్ధతతో సాధించాల్సిన జాతీయ లక్ష్యమని ఆయన ప్రసంగం స్పష్టం చేసింది. ఒక దీపం వేల దీపాలను వెలిగించినట్లుగా.. ప్రతి పౌరుడి శక్తి మరొక పౌరుడికి స్ఫూర్తిగా మారితే, ఆ సమష్టి శక్తే భారత భవిష్యత్తును నిర్మిస్తుందని చెబుతూ ప్రధాని తన ప్రసంగాన్ని ‘మనమందరం కలిసి వికసిత్ భారత్‌ను నిర్మిద్దాం’ అనే పిలుపుతో ముగించారు.

ఉజ్వల భారతానికి మోదీ ‘సప్తధార’

  1. తయారీ, పారిశ్రామిక స్థాయి: విడిభాగాల కూర్పు నుంచి సమగ్ర తయారీ స్థాయికి పారిశ్రామిక రంగం ఎదిగేలా చేయడం.
  2. వ్యవసాయం, ఆహార శుద్ధి: భారత వ్యవసాయ రంగాన్ని ఎగుమతుల అధికార కేంద్రంగా మార్చడం.
  3. టెక్నాలజీ, ఏఐ, డీప్‌టెక్: అంతర్జాతీయ టెక్నాలజీ లీడర్‌గా ఎదగడం. యూపీఐలాంటి వ్యవస్థలను అంతర్జాతీయంగా విస్తరించడం. జనరేటివ్ ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్, అడ్వాన్స్డ్ రోబోటిక్స్, శాటిలైట్ కమ్యూనికేషన్లలో మరింతగా విస్తరించడం.
  4. పీఎం గతిశక్తి, మల్టీమోడల్ రవాణా: ఉప ఖండం అంతటా రవాణా సౌకర్యాలను విస్తరించడం. పారిశ్రామిక క్లస్టర్ల మధ్య హైస్పీడ్ రైళ్ల అనుసంధానం పెంచడం.
  5. రక్షణ సామర్థ్యం, ఎగుమతుల పెంపు: సైనిక సంపత్తిలో స్వీయ సమృద్ధి సాధన.. ఎగుమతుల పెంపు. దేశానికున్న దిగుమతుల ముద్రను తొలగించడం.
  6. గ్రీన్, బ్లూ ఆర్థిక వ్యవస్థల విస్తరణ: పర్యావరణ సుస్థిరతను సాధించడం. గ్రీన్ హైడ్రోజన్లో పెట్టుబడులు. సముద్ర వనరుల అన్వేషణ కోసం తీర ప్రాంతాల వినియోగం.
  7. సాఫ్ట్ పవర్: సాంస్కృతిక దౌత్యం, సృజనాత్మక పరిశ్రమలు, అంతర్జాతీయ విద్యార్థుల మార్పిడి, అంతర్జాతీయ నైపుణ్యం కలిగిన సిబ్బంది నియామకం ద్వారా యువశక్తిని వినియోగించుకోవడం.