nitin nabin

వందేమాతరం సమగ్రత, గౌరవాలపై రాజీలేదు

(దిల్లీలోని బిజెపి కేంద్ర కార్యాలయంలో ఆగస్టు 22న జరిగిన బిజెపి జాతీయ పదాధికారుల సమావేశంలో ఆమోదం పొందిన తీర్మానం)

కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ 2026 ఆగస్టు 19న తన 1937 నాటి తీర్మానాన్ని పునరుద్ఘాటిస్తూ, కాంగ్రెస్ కార్యక్రమాలలో ‘వందేమాతరం’ గేయాన్ని మొదటి రెండు చరణాలకే పరిమితం చేయాలని తీసుకున్న నిర్ణయాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది, తీవ్ర నిరసన వ్యక్తం చేస్తోంది.

బిజెపి వందేమాతరాన్ని భారత్ జాతీయ గేయంగా, భారతావని పట్ల భక్తిప్రపత్తుల వ్యక్తీకరణగా, స్వతంత్ర సంగ్రామ మంత్రంగా, భారతదేశ జాతీయ చైతన్యానికి అమర సంకేతంగా భావిస్తుంది. బంకించంద్ర ఛటోపాధ్యాయ రచించిన వందేమాతరం, భరతమాత పట్ల భక్తిని, అంకిత భావాన్ని కవితాత్మకంగా ఆవిష్కరించింది. అంతేకాకుండా జాతీయ జాగృతి అమోఘమైన సాధనంగా మారింది. “తల్లీ! నీకు వందనం” అనే భావన కలిగిన వందేమాతరం, 1905 నాటి బెంగాల్ విభజన అనంతరం సాగిన స్వదేశీ ఉద్యమంలో నిరసన గళంగా మారి దేశమంతటా వ్యాపించింది. దీని విప్లవాత్మక శక్తిని గుర్తించిన బ్రిటిష్ సామ్రాజ్యం దీనిని అణచివేసేందుకు అనేక ప్రయత్నాలు చేసింది. ఇందులో భాగంగా 1906లో బరిసాల్‌లో దీనిని బహిరంగంగా పాడటంపై నిషేధం విధించింది. అయినప్పటికీ, దాని స్వరాన్ని మూగబోయేలా చేయలేకపోయారు. 1907లో స్టుట్‌గార్ట్‌లో శ్రీమతి భికాజీ కామా ప్రదర్శించిన పతాకంపై ‘వందేమాతరం’ పదాలు కనిపించాయి. జాతీయోద్యమ చైతన్యంపై ఇది గాఢమైన ముద్ర వేసింది.

వలస పాలనకు వ్యతిరేకంగా ప్రతిఘటనను రగిలించినందుకు బ్రిటిష్ వారు అణచివేయాలని చూసిన అదే వందేమాతరాన్ని, దశాబ్దాల తర్వాత కాంగ్రెస్ సంతుష్టీకరణ పేరుతో తన ఆరు చరణాలలో కేవలం రెండింటికే పరిమితం చేయడం ఒక విచిత్రమైన చారిత్రక వైపరీత్యం. కాంగ్రెస్ స్వయంగా ఒకప్పుడు వందేమాతరం జాతీయ ప్రాముఖ్యతను గుర్తించింది, కానీ ఆ తర్వాత పెరిగిన కొన్ని వర్గాల ఒత్తిళ్లకు లొంగిపోయింది. 1923 కాకినాడ కాంగ్రెస్ సమావేశంలో పండిట్ విష్ణు దిగంబర్ పలుస్కర్ వందేమాతరం ఆలపించడం ప్రారంభించినప్పుడు, కాంగ్రెస్ అధ్యక్షుడు మౌలానా మహమ్మద్ అలీ అభ్యంతరం వ్యక్తం చేస్తూ సమావేశం నుంచి బయటకు వెళ్ళిపోయారు. 1937 అక్టోబర్ 28న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రముఖ జాతీయ దినాల్లో ఆరు చరణాలలో మొదటి రెండు చరణాలను మాత్రమే ఆలపించాలని నిర్ణయించింది. తరువాతి చరణాలలోని మతపరమైన ప్రస్తావనలపై వచ్చిన అభ్యంతరాలను అంగీకరించడం ద్వారా, కాంగ్రెస్ సంపూర్ణ జాతీయ గేయాన్ని తగ్గించింది. ఇది మతవాద, వేర్పాటువాద రాజకీయాలకు మరింత చోటు కల్పించిన విస్తృత సంతుష్టీకరణ రాజకీయాన్ని ప్రతిబింబించింది. ఈ రాజకీయ వాతావరణంలోనే ద్విజాతి సిద్ధాంతం బలపడి, చివరికి భారత్ విభజన విషాదాన్ని అనుభవించింది.

ఈ నిర్ణయం వెనుక ఉన్న రాజకీయ నేపథ్యం 1938లో ఎం ఎ జిన్నా, జవహర్‌లాల్ నెహ్రూల మధ్య జరిగిన ఉత్తరప్రత్యుత్తరాలలో మరింతగా ప్రతిబింబిస్తుంది. ముస్లిం లీగ్ 14 డిమాండ్లలో వందేమాతరాన్ని పూర్తిగా వదిలివేయాలనేది కూడా ఒకటి. జాతీయ ప్రాముఖ్యం గల సందర్భాలలో గేయం దాని ఆరు చరణాలలో నాలుగింటిని మినహాయించాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని జవహర్‌లాల్ నెహ్రూ సమర్థించారు. తద్వారా జాతీయ గేయంపై మతవాద అభ్యంతరాలు ప్రభావం చూపడానికి అనుమతించారు. ఈ వివాదాన్ని కేవలం సాహిత్య పద్యాలపై వివాదంగా అర్థం చేసుకోలేమని బిజెపి గుర్తు చేస్తోంది. వందేమాతరం దేశవ్యాప్తంగా ఉన్న భారతీయుల దేశభక్తికి, సామ్రాజ్యవాద వ్యతిరేక చైతన్యానికి నిదర్శనంగా మారింది. మహాత్మా గాంధీ స్వయంగా వందేమాతరం గురించి ఇలా రాశారు: “దాని మూలం ఏదైనప్పటికీ, అది ఎలా, ఎప్పుడు రచించినప్పటికీ, విభజన రోజుల్లో బెంగాల్‌లోని హిందువులు, ముస్లింలలో అది అత్యంత శక్తిమంతమైన యుద్ధనాదంగా మారింది. అది ఒక సామ్రాజ్యవాద వ్యతిరేక నినాదం. ఒక బాలుడిగా, నాకు ఆనంద్ మఠం గురించి కానీ, దాని అమర రచయిత బంకిం గురించి కానీ ఏమీ తెలియనప్పుడు, వందేమాతరం నన్ను ఆకట్టుకుంది. నేను దానిని మొదటిసారి విన్నప్పుడు, పాడినప్పుడు నన్ను ఎంతగానో అలరించింది. నేను దానితో అత్యంత పవిత్రమైన జాతీయ భావాన్ని అనుసంధానించాను. అది హిందూ పాట అని లేదా హిందువుల కోసమే ఉద్దేశించినదని నాకు ఎప్పుడూ అనిపించలేదు. దురదృష్టవశాత్తూ, ఇప్పుడు మనకు చెడు రోజులు వచ్చాయి.” మహాత్మా గాంధీ చెప్పిన ఈ మాటలకూ ఎంతో ప్రాధాన్యం ఉంది. వందేమాతరం చారిత్రక అర్థాన్ని దాని తరువాతి చరణాలలోని కొన్ని భాగాలలో ఉన్న మతపరమైన ప్రస్తావనలకు మాత్రమే పరిమితం చేయలేమని ఇది స్పష్టం చేస్తోంది. కోట్ల మంది భారతీయులకు, ఇది సామ్రాజ్యవాద వ్యతిరేక సమర నినాదంగా, పవిత్రమైన జాతీయ స్ఫూర్తి వ్యక్తీకరణగా మారింది.

1950 జనవరి 24న, స్వతంత్ర భారతదేశ తొలి రాష్ట్రపతి, రాజ్యాంగ సభ అధ్యక్షుడు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, ‘జన గణ మన’ జాతీయ గీతంగా ఆమోదం పొందుతుందని, స్వాతంత్య్ర పోరాటంలో దాని చారిత్రక పాత్రను పరిగణనలోకి తీసుకుని, వందేమాతరం ‘జన గణ మన’తో సమానమైన గౌరవం, హోదాను పొందుతుందని ప్రకటించారు. ఈ విధంగా, స్వతంత్ర భారతదేశం తన సొంత రాజ్యాంగ యుగంపై ఒక అభిప్రాయానికి వచ్చింది. జన గణ మన అధికారిక ప్రోటోకాల్‌లో జాతీయ గీతంగా చేర్చగా, వందేమాతరం జాతీయ గేయంగా గౌరవం పొందుతూ దాని సమాన జాతీయ హోదాను నిలుపుకుంది. అయినప్పటికీ, తదుపరి దశాబ్దాలలో మొదటి రెండు చరణాలు ప్రామాణిక బహిరంగ ఆలాపనగా మారాయి. కాగా మిగిలిన నాలుగు చరణాలు భారతీయ ప్రజలకు క్రమంగా అపరిచితంగా మారాయి. అందువల్ల భారతదేశం ఆరు చరణాల జాతీయ గేయాన్ని కలిగి ఉన్నప్పటికీ, తరువాతి తరాలు ప్రధానంగా రెండు చరణాలను మాత్రమే తెలుసుకుంటూ పెరిగాయి. ఈ చారిత్రక పరిస్థితిని సరిదిద్దుతూ గౌరవనీయ ప్రధాని నరేంద్ర మోదీ జీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం వందేమాతరం గౌరవాన్ని, మర్యాదను, దానికి దక్కాల్సిన జాతీయ స్థానాన్ని పునరుద్ధరించడానికి నిర్దిష్టమైన చర్యలు తీసుకుంది.

2025 పార్లమెంట్ శీతాకాల సమావేశాలలో, డిసెంబర్ 8న లోక్‌సభ వందేమాతరం 150వ వార్షికోత్సవంపై 11 గంటల 32 నిమిషాల పాటు ప్రత్యేక చర్చ నిర్వహించగా, రాజ్యసభ డిసెంబర్ 9, 10, 11 తేదీలలో మొత్తం 12 గంటల 49 నిమిషాల పాటు చర్చ జరిపింది. అధికారిక ప్రోటోకాల్‌లో వందేమాతరం సంపూర్ణ ఆలాపనను ప్రభుత్వం పునరుద్ధరించింది. అనంతరం పార్లమెంట్ జూలై 29, 30 తేదీలలో జాతీయ గౌరవానికి విఘాతాన్ని నిరోధించే (సవరణ) బిల్లు, 2026ను ఆమోదించింది. ఈ బిల్లు ఆగస్టు 6, 2026న రాష్ట్రపతి ఆమోదం పొంది చట్టంగా మారింది. ఇది జన గణ మనకు ఇచ్చిన చట్టబద్ధమైన రక్షణకు సమానమైన రక్షణను వందేమాతరానికి విస్తరించింది, దాని ఆలాపనకు ఉద్దేశపూర్వకంగా ఆటంకం కలిగించడం లేదా దానిని ఆలపిస్తున్న సభకు ఉద్దేశపూర్వకంగా అంతరాయం కలిగించడాన్ని శిక్షార్హం చేసింది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత తొలిసారిగా 2026 ఆగస్టు 15న 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఎర్రకోట బురుజుల నుంచి సంపూర్ణమైన వందేమాతరాన్ని ఆలపించారు. దీని ద్వారా దేశ అత్యున్నత అధికారిక సాంప్రదాయంలో జాతీయ గేయానికి దక్కాల్సిన స్థానాన్ని పునరుద్ధరించారు. అదే సమయంలో, కాలం మారినా తన సంతుష్టీకరణ రాజకీయాలు మారలేదని కాంగ్రెస్ నాయకత్వ వైఖరి నిరూపించింది. అదే స్వాతంత్య్ర దినోత్సవం రోజున, అంటే 2026 ఆగస్టు 15న, ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో సంపూర్ణ వందేమాతరం ఆలపిస్తుండగా, రెండో చరణం తర్వాత ఆలాపనను నిలిపివేయాలని శ్రీమతి సోనియా గాంధీ సైగ చేయడం కనిపిచింది. నాలుగు రోజుల తర్వాత, 2026 ఆగస్టు 19న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ, కాంగ్రెస్ కార్యక్రమాలలో మొదటి రెండు చరణాలను మాత్రమే పాడే సంప్రదాయాన్ని కొనసాగించడానికి తన 1937 నాటి నిర్ణయాన్ని అధికారికంగా పునరుద్ఘాటించింది.

ఈ విధంగా ఎన్డీయే ప్రభుత్వం వందేమాతరాన్ని దానికి దక్కాల్సిన జాతీయ స్థానంలో పునరుద్ధరిస్తున్న తరుణంలోనే, 1930ల నాటి సంతుష్టీకరణ రాజకీయాల కారణంగా పెట్టిన ఆంక్షలనే కాపాడటానికి కాంగ్రెస్ నిర్ణయించుకుంది. నేడు కాంగ్రెస్ నాయకత్వ వైఖరి ఆ బుజ్జగింపు రాజకీయాలు ఇంకా కనుమరుగవ్వలేదని వెల్లడిస్తుంది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నాయకత్వంలో వందేమాతరం పట్ల కాంగ్రెస్ దృక్పథం, గతంలో ముస్లిం లీగ్ మతపరమైన అభ్యంతరాలకు కాంగ్రెస్ తలవంచి సంపూర్ణ జాతీయ గేయాన్ని తగ్గించించిన నాటి రాజకీయ మనస్తత్వాన్నే గుర్తుకు తెస్తోంది. 1938లో జవహర్‌లాల్ నెహ్రూ, ఎం ఎ జిన్నాల మధ్య జరిగిన ఉత్తరప్రత్యుత్తరాలు, ముస్లిం లీగ్ అభ్యంతరాల దృష్ట్యా జాతీయ ప్రముఖ దినాలలో వందేమాతరం ఆరు చరణాలలో నాలుగింటిని విస్మరించాలన్న నిర్ణయానికి జవహర్‌లాల్ నెహ్రూ మద్దతు ఇచ్చి ఆమోదించినట్లు బలంగా నిరూపిస్తున్నాయి. స్వాతంత్య్ర పోరాటంలో వందేమాతరాన్ని తమ దేశభక్తిని వ్యక్తపరిచే సాధనంగా మలుచుకున్న అసంఖ్యాక భారతీయుల భావోద్వేగాలను ఇది తీవ్రంగా గాయపరిచింది. ఒకప్పుడు తాను లొంగిపోయిన అదే సంతుష్టీకరణ రాజకీయాల ముందు నేడు సైతం కాంగ్రెస్ మోకరిల్లుతూనే ఉంది. తద్వారా జాతీయ గేయం, జాతీయ చిహ్నాలపై కూడా ముస్లిం లీగ్, జిన్నాలు తమ మతవాద డిమాండ్లను రుద్దేలా చేసింది. దేశభక్తికి తామే ప్రతీకలమని చెప్పుకునే ఒక పార్టీ, జాతీయ గేయం పట్ల అంత శత్రుత్వాన్ని ప్రదర్శిస్తున్నప్పుడు, అది చెప్పే మాటలకు, చేసే పనులకు మధ్య ఉన్న వైరుధ్యం నుంచి తప్పించుకోలేదు. ఎదో సామెత చెప్పినట్లు, నక్క సింహం తోలు కప్పుకున్నంత మాత్రాన సింహం అయిపోదు. దేశభక్తి నటన సంతుష్టీకరణ రాజకీయాలను ఎక్కువ కాలం దాచలేవు. ఏదో ఒక రోజు ఆ ముసుగు తొలగిపోయి, దాని వెనుక ఉన్న రాజకీయ నైజం దేశం ముందు బహిర్గతమవుతుంది. 

1939 జనవరిలో సి రాజగోపాలాచారి చేసిన హెచ్చరికను కూడా బిజెపి గుర్తు చేసుకుంటోంది. వందేమాతరం విషయంలో ఇస్తున్న మినహాయింపుల గురించి సర్దార్ వల్లభభాయ్ పటేల్‌కు లేఖ రాస్తూ రాజాజీ ఇలా వ్యాఖ్యానించారు: “ఈ రాయితీలు పరిస్థితిని కాపాడలేవు… వీటిని మనం రాయితీలుగా చూపిస్తే, అవి తదుపరి ఆందోళనలకు కారణాలుగా మారతాయి, శాంతికి ఏవిధంగానూ దోహదం చేయవు. మరోవైపు ఈ రాయితీలు హిందువుల ఆత్మవిశ్వాసాన్ని బలహీనపరచడానికి, సర్వత్రా నైరాశ్యానికి దారితీయవచ్చు.” ఈ విషయాన్ని సబ్యసాచి భట్టాచార్య రాసిన ‘వందేమాతరం: ది బయోగ్రఫీ అఫ్ ఆ సాంగ్’ (2013) పుస్తకంలో, ‘సెలెక్టెడ్ వర్స్క్ అఫ్ సి రాజగోపాలాచారి’లో ప్రచురించారు. రాజాజీ హెచ్చరిక నేటికీ వర్తిస్తుంది. మతవాద ఒత్తిడి కింద ఇచ్చే రాయితీలు ఆందోళనలను ముగించవు; అవి తదుపరి డిమాండ్లకు దారితీస్తాయి. అందువల్ల జాతీయ ఐక్యతకు తీవ్ర నష్టం కలిగించిందని చరిత్ర నిరూపించిన రాజకీయ దృక్పథాన్ని మళ్ళీ పునరుద్ధరించడం ఎంతమాత్రం సబబు కాదని బిజెపి హెచ్చరిస్తోంది.

పార్లమెంట్ ఒక చట్టం చేసినప్పుడు కాంగ్రెస్ ఇప్పుడు తన పార్టీ కార్యక్రమాల్లో జాతీయ గేయాన్ని దానికి భిన్నంగా ఆలపించాలని నిర్ణయించలేదు. సీడబ్ల్యూసీ తీర్మానం 1950 రాజ్యాంగ ప్రకటనకు, జాతీయ గౌరవానికి విఘాత నిరోధక (సవరణ) చట్టం 2026 కంటే పైన ఉండకూడదు. జాతీయ గేయం ఏ రాజకీయ పార్టీ సొత్తు కాదని బిజెపి పునరుద్ఘాటిస్తోంది. దాన్ని సమకాలీన ఎన్నికల రాజకీయాలు, మతవాద బేరసారాలు లేదా ఓటు బ్యాంక్ రాజకీయాలకు అతీతంగా గౌరవించాల్సిందే.

అందువల్ల బిజెపి పార్టీ ఇలా తీర్మానిస్తోంది:

  1. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ 2026 ఆగస్టు 19న తన 1937 నాటి తీర్మానాన్ని పునరుద్ఘాటిస్తూ కాంగ్రెస్ కార్యక్రమాలలో వందేమాతరాన్ని మొదటి రెండు చరణాలకే పరిమితం చేయాలని తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించడం, స్పష్టంగా నిరసించడం.
  2. భారత్ జాతీయ గేయంగా, భారతదేశ జాతీయ చైతన్యానికి, స్వాతంత్య్ర పోరాటానికి అమర సంకేతంగా సంపూర్ణ వందేమాతరం గేయం గౌరవాన్ని, మర్యాదను, వారసత్వాన్ని, జాతీయ హోదాను పరిరక్షించడం.
  3. రాజ్యాంగ సభ 1950 నాటి ప్రకటన కల్పించిన, జాతీయ గీతంతో సమానమైన చట్టబద్ధమైన రక్షణను జాతీయ గేయానికి విస్తరిస్తూ పార్లమెంట్ చేసిన 2026 సవరణ ద్వారా బలపరిచిన వందేమాతరం గేయ రాజ్యాంగ, చట్టబద్ధమైన హోదాను ధృవీకరించడం.
  4. జాతీయ గేయాన్ని మతవాద ఒత్తిళ్లకు, రాజకీయ సంతుష్టీకరణకు లేదా సకుచిత ఓటు బ్యాంకు ఆలోచనలకు గురిచేసే ప్రతి ప్రయత్నాన్ని తిరస్కరించడం.
  5. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానం భారత గణతంత్ర రాజ్యాంగ వ్యవస్థలను లేదా చట్టాలకు అతీతంగా ఉండదని, 1937 నాటి రాజకీయ రాజీని 1950 రాజ్యాంగ పరిష్కారం కంటే, 2026లో పార్లమెంట్ చేసిన చట్టం కంటే పైస్థానంలో ఉంచలేమని కాంగ్రెస్‌కు గుర్తు చేయడం.
  6. ముస్లిం లీగ్ లేవనెత్తిన అభ్యంతరాలు, తదనంతరం వచ్చిన మతవాద, వేర్పాటువాద డిమాండ్ల రాజకీయంతో సహా వందేమాతరం కుదింపు జరిగిన చారిత్రక, రాజకీయ నేపథ్యాన్ని భారత ప్రజలకు తెలియజేయడం.
  7. వందేమాతరం “సామ్రాజ్యవాద వ్యతిరేక నినాదం”గా మారిందని, దానిని తాను “అత్యంత పవిత్రమైన జాతీయ స్ఫూర్తి”తో అనుసంధానించానని మహాత్మా గాంధీ స్వయంగా చెప్పిన మాటలను గుర్తు చేయడం, విస్తృతంగా ప్రచారం చేయడం, తద్వారా నిర్దిష్ట చరణాల సాహిత్య లేదా మతపరమైన ప్రస్తావనలకు అతీతంగా వాటి విస్తృత జాతీయ అర్థాన్ని, ప్రాముఖ్యాన్ని నిరూపించడం.
  8. వందేమాతరం చరిత్ర, అర్థం, జాతీయ ప్రాముఖ్యత, ఘనమైన వారసత్వాన్ని భారత్‌ నలుదిక్కులకూ తీసుకెళ్లేందుకు బిజెపి కార్యకర్తల ద్వారా దేశవ్యాప్త ప్రచార కార్యక్రమాన్ని చేపట్టడం.
  9. మొత్తం ఆరు చరణాల జాతీయ గేయం, దాని చరిత్రను ప్రజలు మరచిపోకుండా ఉండేలా, అలాగే వందేమాతరంతో విడదీయరాని విధంగా ముడిపడి ఉన్న త్యాగాలు, పోరాటాలు, దేశభక్తి జాగృతిని భవిష్యత్ తరాలు అర్థం చేసుకునేలా ప్రజలను, ముఖ్యంగా యువతను చైతన్యపరచడం, సమీకరించడం.
  10. రాజకీయ సౌలభ్యం లేదా సంతుష్టీకరణ కోసం వందేమాతరం గౌరవం, వారసత్వం విషయంలో ఎటువంటి రాజీని అంగీకరించబోమని స్పష్టం చేయడం.

ఇది కేవలం ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన విషయం కాదు. ఇది భారత గౌరవానికి, దేశ స్వాతంత్య్రం కోసం త్యాగాలు చేసిన అసంఖ్యాక దేశభక్తుల స్మృతికి సంబంధించిన విషయం. ఒకప్పుడు వందేమాతరం అనే పదాలు ఒక సామ్రాజ్యాన్ని భయపెట్టేంత శక్తిమంతంగా ఉండేవని ప్రతి పౌరుడు గుర్తుంచుకోవాలని బిజెపి పిలుపునిస్తోంది. బ్రిటిష్ వారు ప్రతిఘటన జ్వాలలను రగిలిస్తోందనే కారణంతో దానిని అణచివేయాలని చూశారు. తరతరాల భారతీయులు దానిని స్వాతంత్య్రం, త్యాగం, జాతీయ గౌరవానికి చిహ్నంగా పరిగణించారు. ఆ వారసత్వాన్ని సమకాలీన ఓటు బ్యాంకు రాజకీయాల కోసం అవమానించలేం. వందేమాతరం భారతదేశానికి చెందినది.