sickil Cell Anemia

సికిల్ సెల్ వ్యాధిపై నిరంతర పోరాటం

భారతదేశంలోని గిరిజన జనాభాలో చాలామంది సికిల్ సెల్ వ్యాధి అని పిలిచే జన్యుపరమైన వ్యాధితో మౌనంగా పోరాడుతున్నారు. దశాబ్దాలుగా ఈ వ్యాధి వారి ఆరోగ్యాన్ని, సామాజిక ఆర్థిక అభివృద్ధిని దెబ్బతీసింది. మారుమూల ప్రాంతాల్లో నివాసం, ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు లేకపోవడం వల్ల ఇది వారికీ మరింత తీవ్రనష్టం కలిగించింది. ఈ పరిస్థితిని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం జూలై 2023లో జాతీయ సికిల్ సెల్ అనీమియా నిర్మూలన మిషన్ (NSCAEM)ను ప్రారంభించింది. ఈ విప్లవాత్మక కార్యక్రమం సికిల్ సెల్ జన్యు వ్యాప్తిని నిర్మూలించడమే కాకుండా, ఈ వ్యాధితో బాధపడుతున్న లక్షల మంది మందికి గౌరవప్రదమైన జీవనాన్ని, ఆరోగ్యాన్ని కల్పించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

సికిల్ సెల్ వ్యాధి వల్ల ఎర్ర రక్త కణాల ఆకారం మారుతుంది. దీనివల్ల అవి ఆక్సిజన్‌ను మోసుకెళ్లే సామర్థ్యం కోల్పోయి, కాలక్రమేణా తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయి. గిరిజన జనాభాలో ఈ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే ఈ జన్యు వ్యాధి వారినే ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ అనే సంస్థ 2021లో విడుదల చేసిన నివేదిక ప్రకారం భారతదేశంలో ఏటా 82,500 మంది పిల్లలు ఈ వ్యాధితో పుడుతున్నారు. 2017 నాటి జాతీయ ఆరోగ్య విధానం ఈ సమస్యను పరిష్కరించడానికి ఒక పునాది వేసింది. దీని ఆధారంగా 2023 బడ్జెట్‌లో NSCAEMను ప్రకటించారు. 2026 ఆర్థిక సంవత్సరం నాటికి 40 ఏళ్ల లోపు ఉన్న 7 కోట్ల మందికి స్క్రీనింగ్ (వైద్య పరీక్షలు) చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ కార్యక్రమాన్ని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ అమలు చేస్తోంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద జనాభా ఆధారిత జన్యు పరీక్ష కార్యక్రమాలలో ఒకటిగా నిలిచింది. ఈ మిషన్ 2047 నాటికి సికిల్ సెల్ జన్యు వ్యాప్తిని పూర్తిగా నిర్మూలించడమే కాకుండా ఇప్పటికే బాధపడుతున్న వారికి సమగ్ర సంరక్షణ అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

మొదటి రెండేళ్లలోనే ఈ మిషన్ అద్భుతమైన ఫలితాలను సాధించింది, దీనికి ఆరోగ్య శాఖ, రాష్ట్రాల ఉమ్మడి కృషి కారణం. జూలై 31 నాటికి వ్యాధి ఎక్కువగా ఉన్న 17 రాష్ట్రాల్లోని 300 జిల్లాల్లో 6.07 కోట్ల మందికి పైగా స్క్రీనింగ్ చేశారు. వీరిలో 2,16,000 మందికి వ్యాధి ఉన్నట్లు, 16.9 లక్షల మందిలో ఈ వ్యాధి జన్యువులు (క్యారియర్లు) ఉన్నట్లు గుర్తించారు. 95 శాతం కేసులు ఒడిషా, మధ్యప్రదేశ్, గుజరాత్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర.. ఈ ఐదు రాష్ట్రాల్లోనే కేంద్రీకృతమై ఉన్నట్లు విశ్లేషణలో తేలింది. ఛత్తీస్‌గఢ్‌లోని అంబికాపూర్ నవాపరాకు చెందిన మీనా అనే యువ గిరిజన అమ్మాయి కథ ఈ మిషన్ ప్రభావానికి ఒక ఉదాహరణ. స్క్రీనింగ్ కార్యక్రమంలో వ్యాధి నిర్ధారణ అయిన తర్వాత, మీనాను దగ్గర్లోని ఆరోగ్య ఉపకేంద్రంలో చేర్పించారు. అక్కడి శిక్షణ పొందిన కమ్యూనిటీ ఆరోగ్యాధికారి (CHO), ఏఎన్ఎం, ఆశా వర్కర్ ఆమెకు సికిల్ సెల్ వ్యాధి లక్షణాలను గణనీయంగా తగ్గించే హైడ్రాక్సీయూరియా అనే మందును ఉచితంగా అందించారు. ఈ రోజు మీనా ఆరోగ్యకరమైన జీవితాన్ని గడుపుతోంది. ఆమె తన సమాజంలో జన్యు కౌన్సిలింగ్ గురించి అవగాహన కల్పిస్తోంది.

స్క్రీనింగ్ ప్రయత్నాలను వేగవంతం చేయడానికి, భారతీయ వైద్య పరిశోధనా మండలి (ICMR) ఆమోదించిన పాయింట్-ఆఫ్-కేర్ (POC) రోగనిర్ధారణ పరికరాలను ఉపయోగించారు. మొదట మూడు మాత్రమే ఉన్న ఈ కిట్‌ బ్రాండ్ల సంఖ్య ఇప్పుడు 30కి పైగా పెరిగింది. దీనివల్ల ఒక్కో కిట్ ధర రూ.100 నుంచి రూ.28కి తగ్గింది. ఈ కార్యక్రమం తక్కువ ఖర్చుతో కూడుకున్న, సమర్థమైన వ్యాధి నిర్ధారణ సామర్థ్యాలను కల్పించింది. ఈ మిషన్ కేవలం స్క్రీనింగ్‌పై మాత్రమే దృష్టి సారించలేదు; సికిల్ సెల్ వ్యాధి నిర్ధారణ అయిన వారికి సంపూర్ణ సంరక్షణకు ప్రాధాన్యం ఇస్తుంది. ఉచిత ఆరోగ్య సంరక్షణ సేవలు, అవసరమైన మందులు, రోగ నిర్ధారణలు వంటివి ఈ మిషన్ లో భాగంగా ఉన్నాయి. సికిల్ సెల్ వ్యాధి చికిత్సకు ముఖ్యమైన మందు అయిన హైడ్రాక్సీయూరియాను ముఖ్యమైన జాతీయ ఔషధాల జాబితా (EDL)లో చేర్చారు. ఈ మిషన్ జన్యు కౌన్సిలింగ్, ప్రజలకు అవగాహన కల్పించడం వంటివి సికిల్ సెల్ వ్యాధిని నిర్మూలించడానికి కీలక వ్యూహాలుగా పరిగణిస్తుంది. దీనికింద 2.62 కోట్లకుపైగా జన్యు స్థితి కార్డులను పంపిణీ చేశారు. ఇవి వ్యక్తులకు కీలకమైన ఆరోగ్య సమాచారాన్ని అందించి, జన్యువుల వ్యాప్తి ప్రమాదాన్ని తగ్గించేందుకు కుటుంబాలు సరైన నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడతాయి.

కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం, గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిధుల సహాయంతో సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయడానికి పదిహేను ఆరోగ్య సంరక్షణ సంస్థలు/వైద్య కాలేజీలను ఎంపిక చేశారు. ఈ సంస్థలు గర్భధారణకు ముందు వ్యాధి నిర్ధారణ, తీవ్రమైన సికిల్ సెల్ వ్యాధి సమస్యల నిర్వహణపై దృష్టి సారించి, వ్యాధి ముప్పును ఎదుర్కొంటున్న ఉన్న కుటుంబాలకు ప్రత్యేక సంరక్షణను అందిస్తాయి. ఇదిగాక అక్టోబర్ 2024లో నిర్వహించిన జాతీయ స్థాయి శిక్షణా కార్యక్రమం ఆరోగ్య సంరక్షణ నిపుణులకు సికిల్ సెల్ వ్యాధి నిర్వహణలోని సంక్లిష్టతలను సమర్థంగా పరిష్కరించడానికి అవసరమైన నైపుణ్యాలు, పరిజ్ఞానం కల్పించింది. గిరిజన వ్యవహారాలు, సామాజిక న్యాయం, సాధికారత, విద్య, మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖలతో సమన్వయంతో ఆరోగ్య శాఖ చేపట్టిన సమగ్ర ప్రభుత్వ విధానం ఈ మిషన్ విజయానికి ఆధారం. వివిధ మంత్రిత్వ శాఖల ఈ సమన్వయం గిరిజనుల ఆరోగ్యానికి సంబంధించిన సామాజిక-సాంస్కృతిక, భౌగోళిక కోణాలను పరిగణనలోకి తీసుకుంటూ మిషన్ విజయానికి దోహదం చేస్తోంది. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలోని ఆరోగ్య పరిశోధన విభాగం మద్దతుతో చేసిన పరిశోధనలు తక్కువ ఖర్చుతో రోగుల ఆరోగ్యం విషయంలో మరింత మెరుగైన ఫలితాలకు దారితీశాయి.

సాధించిన విజయాలు ప్రశంసనీయం అయినప్పటికీ, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇప్పుడు ఈ మిషన్ భవిష్యత్తు ప్రాధాన్యాలపై దృష్టి సారించింది. ప్రస్తుతం జన్యు కౌన్సిలింగ్, ప్రజలకు అవగాహన కల్పించే ప్రచారాలు, జన్యు స్థితి కార్డుల పంపిణీని విస్తరించడంపై దృష్టి సారించింది. స్థానిక వేదికలను ఉపయోగించడం ద్వారా ప్రతి క్యారియర్, వ్యాధిగ్రస్తులకు అవసరమైన సంరక్షణ, మద్దతు అందేలా చూడటం చాలా ముఖ్యం. మెరుగైన పరిశోధనల ప్రయత్నాలు ప్రభుత్వ కార్యక్రమాలు మరింత మెరుగైన ఫలితాలను అందించేందుకు అవసరమైన ఆచరణాత్మక ఆలోచనలను అందిస్తాయి. ఈ మిషన్ నిజమైన స్ఫూర్తి దాని నినాదంలో ఉంది: ‘మా పోరాట యోధులకు మద్దతు ఇస్తున్నాం, వ్యాధిపై విజయం సాధించినవారిని అలోపేతం చేస్తున్నాం, మా యోధులతో కలిసి నిలబడుతున్నాం.’ రాజకీయ సంకల్పం, శాస్త్రీయ ఆవిష్కరణ, క్షేత్రస్థాయి అమలును మేళవించడం ద్వారా సికిల్ సెల్ అనీమియాను నిర్మూలించి లక్షల మంది జీవితాలను మార్చడానికి భారతదేశం సిద్ధంగా ఉంది.

భారత్ సికిల్ సెల్ వ్యాధిని నిర్మూలించే 2047 లక్ష్యం వైపు నమ్మకంగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో NSCAEM ఒక దారిదీపంగా నిలిచింది. ప్రభుత్వం, ఆరోగ్య సంరక్షణ నిపుణులు, స్వచ్చంద సంస్థలు ఒకే లక్ష్యం కోసం ఐక్యంగా ఉన్నప్పుడు ఏమి సాధించవచ్చో ఇది నిరూపిస్తుంది. సికిల్ సెల్ అనీమియాపై భారత్ పోరాటం కేవలం జన్యు వ్యాధితో పోరాడటం మాత్రమే కాదు — ఇది సమానత్వం, గౌరవం, మన దేశంలోని అత్యంత అట్టడుగు వర్గాల ఆరోగ్యం పట్ల ఉన్న నిబద్ధతకు సూచిక. ఈ మిషన్ కింద అందించే ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాలు ప్రజల జీవితాల్లో ఎంతటి సమూలమైన మార్పులు తీసుకురాగలవో మీనా వంటి వ్యక్తుల అనుభవం తెలియజేస్తుంది. ఇది గిరిజనుల ఆరోగ్య సవాళ్లను పరిష్కరించడంలో ఒక చారిత్రాత్మక ముందడుగు.

జగత్ ప్రకాష్ నడ్డా,
బిజెపి జాతీయ అధ్యక్షులు,
కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి