Scindia

అన్ని వ్యవస్థలను అవమానిస్తున్న రాహుల్

jyothiradityaదేశభక్తులెవరూ దేశంలోని వ్యవస్థలను చులకన చేయరని కాంగ్రెస్ లోక్ సభ పక్షనేత రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ కేంద్ర కమ్యూనికేషన్లు, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖల మంత్రి జ్యోతిరాదిత్య సింధియా విమర్శించారు. ప్రజలెవరూ వారిని పట్టించుకోవడం లేదని ఎద్దేవా చేశారు. భారతదేశం మాత్రమే కాకుండా మొత్తం ఆగ్నేయాసియా అభివృద్ధికి దోహదం చేసే సామర్థ్యం ఈశాన్య ప్రాంతానికి ఉందన్నారు. ఇండియా పోస్ట్ ను లాభాల బాట పట్టించడం తన లక్ష్యమని పేర్కొన్నారు. ఒక జాతీయ ఆంగ్ల దినపత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన భారత్ లో ఎలాన్ మస్క్ స్టార్ లింక్ ప్రవేశం, సైబర్ నేరాలను ఎదుర్కోవడం, ఈశాన్యంలో అభివృద్ధి ప్రాజెక్టులు తదితర అంశాలపై తన అభిప్రాయాలు వెల్లడించారు. ఆ ఇంటర్వ్యూలోని ముఖ్యాంశాలు చూద్దాం..

ప్ర: మీరు ఏడాదికి పైగా ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ (ఎండీఈఆర్)ను నిర్వహిస్తున్నారు. మీ దృష్టిలో ఈ ప్రాంతంలో కీలకమైన క్షేత్ర స్థాయి సవాళ్లు ఏమిటి ? వాటిని ఎలా పరిష్కరించాలని అనుకుంటున్నారు?

జ: ఈశాన్య ప్రాంతం భారతదేశం మాత్రమే కాకుండా మొత్తం ఆగ్నేయాసియా అభివృద్ధికి దోహదం చేసే సామర్థ్యాన్ని కలిగి ఉందని ప్రధాని తన పదవీకాలం ప్రారంభ సంవత్సరాల నుండి చాలా స్పష్టంగా చెబుతున్నారు. అనేక కార్యక్రమాలు, పథకాల ద్వారా ఈ రంగానికి ప్రభుత్వం మద్దతు పెంచుతూ వస్తోంది. స్థూల బడ్జెట్లో ఈశాన్య ప్రాంతానికి 2014లో ఏడాదికి రూ.24,000 కోట్లు కేటాయించగా 2023-24 నాటికి గరిష్ఠ స్థాయిలో రూ.1,02,000 కోట్లకు పెంచారు. అంటే బడ్జెట్ లో 10 శాతం అన్నమాట. జాతీయ రహదారులను పరిశీలిస్తే నెట్ వర్క్ 10,000 కిలోమీటర్ల నుంచి 16,200 కిలోమీటర్లకు పెరిగింది. రైల్వే నెట్ వర్క్ ద్వారా దాదాపు ఐదు రాష్ట్రాలు అనుసంధానమై ఉన్నాయి. దాదాపు రూ.80,000 కోట్ల విలువైన 19 ప్రాజెక్టులు క్షేత్రస్థాయిలో అమలవుతున్నాయి. బోగీబీల్ వంతెన భారతదేశపు పొడవైన రోడ్-రైల్ వంతెన. ప్రస్తుతం ఈశాన్య రాష్ట్రాల్లో 17 విమానాశ్రయాలు ఉన్నాయి. అరుణాచల్ ప్రదేశ్, సిక్కింలో ఒకప్పుడు ఒక్క విమానాశ్రయం కూడా లేదు. ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్ లో నాలుగు విమానాశ్రయాలు ఉన్నాయి. మార్పు బ్రహ్మాండంగా ఉంది. ఈశాన్య రాష్ట్రాలన్నీ దశాబ్ద సగటు సమ్మిళిత వార్షిక వృద్ధి రేటు 11-13 శాతం స్థాయిలో వృద్ధి చెందుతున్నాయి. నిర్దిష్ట ప్రాజెక్టులను కూడా పరిశీలిస్తున్నాం. ప్రపంచంలోనే అత్యుత్తమ పైనాపిల్ త్రిపురకు చెందిన క్వీన్ పైనాపిల్. ఉత్తమమైన మిరపకాయలు నాగ మిరపకాయలు. మన అహింసా సిల్క్ (ఎరి సిల్క్), ముగా సిల్క్ కు అద్భుతమైన డిమాండ్ ఉంది. ప్రతి రంగానికి ప్రత్యేకమైన ప్రాజెక్టులపై పనిచేస్తున్నాను. ప్రతి రాష్ట్రానికి టూరిజం సర్క్యూట్ ఏర్పాటు చేయాలని చూస్తున్నాం.

ప్ర: స్టార్ లింక్ భారత్ కు వస్తోంది. అధిక చార్జీల దృష్ట్యా ఇది ఎక్కువగా పట్టణాలకే పరిమితం అవుతుందా?

జ: ప్రతి వినియోగదారుడికి వీలైనన్ని ఎక్కువ అవకాశాలను అందించడమే టెలికాం మంత్రిగా నా పని. ఐఎస్ పీలు (ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ ), టెల్కోలు, బ్రాడ్ బ్యాండ్ ప్రొవైడర్లు, శాటిలైట్ ప్రొవైడర్లతో సహా ప్రతి రంగంలోనూ మేం ఆ పని చేశాం. ఇప్పటి వరకు మూడు లైసెన్సులు ఇచ్చాం. ఇప్పటివరకు వన్ వెబ్, జియో ఉన్నాయి. ఇప్పుడు మీకు స్టార్ లింక్ ఉంది. ప్రతి కస్టమర్ తన స్తొమత, వారు కోరుకునే సర్వీస్ ఆధారంగా ఏ సేవ కావాలో దాన్ని ఎంచుకోవచ్చు. శాట్ కామ్ కు సంబంధించి, ఇది మొబైల్ ఫోన్ కు అనుబంధమైన సేవ అవుతుందని నమ్ముతున్నాను. నివాసయోగ్యం కాని ప్రదేశాలు, టవర్లను ఏర్పాటు చేయలేకపోవడం, ఆప్టికల్ ఫైబర్ కేబుల్ సౌకర్యం కల్పించలేక పోవడం వంటి కారణాల వల్ల మొబైల్ ఫోన్ చేరుకోలేని ప్రాంతాలు ప్రపంచంలోని అనేకం ఉన్నాయి. అటువంటి ప్రాంతాలలో శాట్ కామ్ మాత్రమే ఆచరణీయ ప్రత్యామ్నాయం. అలాగే, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు, సంస్థాగత వ్యవస్థలు విచ్ఛిన్నమైనప్పుడు, కనెక్టివిటీని అందించగల ఏకైక మాధ్యమం శాట్ కామ్.

 ప్ర: పెరుగుతున్న సైబర్ నేరాల ముప్పును మీ మంత్రిత్వ శాఖ ఎలా పరిష్కరిస్తోంది?

జ: భారతదేశం ఇప్పుడు ప్రపంచ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించే దేశం నుంచి ప్రపంచ సాంకేతిక పరిజ్ఞాన ఆవిష్కర్తగా మారుతోంది, ఇది ఒక పెద్ద మార్పు. మన వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించడం కూడా మా బాధ్యత. అందువల్ల టెలికాం మంత్రిత్వ శాఖ డాట్ (డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాం) ద్వారా గత ఏడాదిన్నరగా కీలక పాత్ర పోషించింది. నేను కొన్ని ఉదాహరణలు ఇస్తాను. వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించడానికి భాగస్వాములందరూ ఒకే వేదికపైకి వచ్చేలా మేం ఒక సంస్థాగత నమూనాను రూపొందించాం. డిజిటల్ ఇంటెలిజెన్స్ ప్లాట్ ఫారంలో చట్టాన్ని అమలుచేసే సంస్థలు, టెలికాం శాఖ, హోం మంత్రిత్వ శాఖ, సుమారు 32 రాష్ట్ర పోలీసు బలగాలు, 570 ఆర్థిక రంగ సంస్థలు ఉన్నాయి. వీరు ఎప్పటికప్పుడు సమాచారం పంచుకుంటారు. అది మొదటి దశ.

రెండవ దశ – ప్రతి ఒక్క పౌరుడిని భాగస్వామ్యం చేయాల్సి ఉంది. ఇది ప్రభుత్వం మాత్రమే చేయగలదని నేను భావించడం లేదు. అందుకే టెలికాం శాఖ సంచార్ సాథీ పోర్టల్ ను ప్రారంభించింది. ఆ పోర్టల్ ను 15.5 కోట్ల మంది సందర్శించారు. సంచార్ సాథీ యాప్ ను 50 లక్షల మంది డౌన్ లోడ్ చేసుకున్నారు. సంచార్ సాథీ పోర్టల్ ద్వారా 1.36 కోట్ల మొబైల్ ఫోన్లను ‘నాట్ మై నంబర్’, ‘నాట్ రిక్వెస్ట్’ అనే సదుపాయం ద్వారా పౌరుల నుంచి ఫీడ్ బ్యాక్ ద్వారా డిస్ కనెక్ట్ చేశారు. చోరీ అయినా, పోయిన దాదాపు 36 లక్షల మొబైల్ నంబర్లను సంచార్ సాథీ ద్వారా బ్లాక్ చేశారు. సుమారు 21 లక్షల మొబైల్స్ ను కనుగొని, ఐదు లక్షల మొబైల్స్ ను స్వాధీనం చేసుకుని వాటి యజమానులకు అప్పగించారు.

మేం కృత్రిమ మేధను కూడా వాడాం. అస్త్ర అనే వ్యవస్థను రూపొందించాం. ఇక్కడ ప్రజలు వేరేవేరే గుర్తింపు కార్డులతో ఫోన్ నంబర్లను తీసుకోవడం చూశాం, ఇది చట్టవిరుద్ధం. ఆ వ్యవస్థ ద్వారా దాదాపు 82 లక్షల ఫోన్లను డిస్ కనెక్ట్ చేశాం. మేం ఆర్ధిక మోసాల రిస్క్ సూచీని కూడా ఏర్పాటు చేశాం, డిజిటైజ్ ఇండియా ప్లాట్ ఫామ్ ద్వారా మోసాలకు పాల్పడే విషయంలో మీడియం-రిస్క్ కేటగిరీ, హై-రిస్క్ కేటగిరీ, చాలా హై-రిస్క్ కేటగిరీలో ఉన్నవారి వివరాలు సంబంధిత సంస్థలకు తెలియజేస్తాం. దీని ద్వారా దాదాపు మూడు లక్షల బ్యాంకు ఖాతాలను బ్లాక్ చేశాం. మోసాలకు పాల్పడే సామర్థ్యం ఉన్న వ్యక్తుల 1.5 లక్షల డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులను స్తంభింపజేశాం.

ప్ర: లీజు కోసం కొన్ని పోస్టాఫీసులను పునర్నిర్మించే ప్రణాళికలు కూడా ఉన్నాయి. రియల్ ఎస్టేట్ ను కూడా నగదీకరించే యోచన ఉందా?

జ: భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఏ విలువ గొలుసులోనైనా ఇండియా పోస్ట్ అతిపెద్ద పంపిణీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. దురదృష్టవశాత్తూ నేడు ఇండియా పోస్ట్ భారత ప్రభుత్వానికి ఖర్చుల ఖాతాగా ఉంది. చివరకు దీన్ని లాభాల ఖాతాగా మార్చాలన్నది నా సంకల్పం. అందుకోసం మనం వ్యాపారాన్ని ఎలా పెంచుతాం, వ్యాపారానికి ఎలా నిర్వహిస్తాం, మనల్ని మనం ఎలా మార్చుకుంటున్నాం అనే విషయాల్లో పూర్తి మార్పు రావాలి. భారత పోస్ట్ సంస్థలో సమూల మార్పులు తీసుకొస్తున్నాం. తొలిసారిగా సంస్థను ఆరు విభాగాలుగా (వర్టికల్స్‌గా) విభజించాం. వీటిని స్ట్రాటజిక్ బిజినెస్ యూనిట్స్ అని పిలుస్తాం. అవి:

  1. సాధారణ పోస్టల్ సేవలు (మెయిల్)
  2. అంతర్జాతీయ మెయిల్
  3. పార్సిల్స్
  4. ఆర్థిక సేవలు
  5. పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ (పీఎల్ఐ)
  6. పౌర సేవల విభాగం (సిటిజన్-సెంట్రిక్ సర్వీసెస్)

ఈ ఆరు విభాగాలకు సహకరించడానికి ఆర్థిక, మానవ వనరుల, ఐటీ విభాగాలతో పాటు మరో అదనపు విభాగంతో కలిపి నాలుగు విభాగాలు కూడా ఏర్పాటు చేశాం. సంస్థ ఆధునీకరణ కోసం సీటీఓ (చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్)ను నియమించాం. ప్రతి విభాగం అధిపతితో కలిసి పనిచేసేందుకు డిప్యూటీ సీటీఓను కూడా ఏర్పాటు చేశాం. ప్రతి లావాదేవీకి అయ్యే ఖర్చును తగ్గించే మార్గాలను అన్వేషిస్తున్నాం. భారత పోస్ట్‌ను ఆధునీకరించడానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం. రాబోయే నెలల్లో, ప్రతి విభాగంలో రెండు కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టనున్నాం. గ్రామీణ తపాలా సేవకుల సామర్థ్యాన్ని పెంచడం, కొత్త వ్యాపార అవకాశాలను సృష్టించడంపై దృష్టి పెట్టాం. వారికి సాంకేతికతపై శిక్షణ ఇచ్చి, సేవలను మెరుగుపరచడానికి ప్రోత్సహిస్తున్నాం. పోస్ట్ ఆఫీసులను ఆధునికీకరించే కార్యక్రమం కూడా ప్రారంభించాం. వాటి ఆస్తులను అమ్మకుండా, అద్దెల ద్వారా ఆదాయాన్ని పెంచే మార్గాలను పరిశీలిస్తున్నాం.

ప్ర: భారతదేశాన్ని మృత ఆర్థిక వ్యవస్థ అని పిలిచే వారు దేశం లోపల, వెలుపల ఉన్నారు. వాళ్లకు మీరేం చెబుతారు?

జ: దేశం వెలుపల ఉన్న వారితో నేను మాట్లాడను, ఎందుకంటే ప్రతి ఒక్కరికీ వారి అభిప్రాయం ఉంటుంది. కానీ మీరు భారతీయుడైతే, మీరు దేశభక్తుడైతే, దేశంలోని ప్రతి సంస్థను ఇలా చులకన చేయరు. ఎన్నికల సంఘాన్ని విమర్శిస్తారు, అది చచ్చిపోయిందని శపిస్తారు, మన సాయుధ దళాల సామర్థ్యాన్ని తగ్గించడానికి ఏ మాత్రం వెనుకాడరు. న్యాయవ్యవస్థను అపహాస్యం చేస్తారు, ఎన్నికల సంఘాన్ని ఎగతాళి చేస్తారు, మన ఆర్థిక వ్యవస్థను చచ్చిపోయూయిందంటారు. శుభాకాంక్షలు. దేశం మిమ్మల్ని పక్కన పెట్టి ముందుకు సాగిపోయింది.