Dharmendra Pradhan

ఎన్ఈపీ ఎవరి మీదా ఏ భాషనూ రుద్దడం లేదు

Dharmendra Pradhanదేళ్ల క్రితం అమల్లోకి వచ్చిన జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ) లోని త్రిభాషా సూత్రం, భారతీయ జ్ఞాన వ్యవస్థలు, అది భిన్నత్వాన్ని గుర్తించడం లేదన్న ఆరోపణలు వంటి వివిధ అంశాలపై విమర్శలను కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తిప్పి కొట్టారు. భారత యువత ఉజ్వల భవిష్యత్తు కోసం కేంద్రం భారతీయతను, భిన్న విజ్ఞాన విభాగాల సమ్మేళనాన్ని ప్రోత్సహిస్తోందని అన్నారు. దీనిపై ప్రతిపక్షాల విమర్శలు, ఆరోపణలు రాజకీయ ప్రేరేపితమేనని వ్యాఖ్యానించారు. అమెరికా వీసా ఆంక్షలు వంటి సవాళ్లను ఎదుర్కోవటానికి భారత్ సిద్ధంగా ఉందన్నారు. ఒక ఆంగ్ల జాతీయ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన గవర్నర్ల పాత్ర సహా అనేక అంశాలపై మాట్లాడారు.
ఆ ఇంటర్వ్యూలో ముఖ్యాంశాలు:

 ప్ర: మీరు విద్యా మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సరిగ్గా ఒక సంవత్సరం తర్వాత జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ) అమలులోకి వచ్చింది. ఇప్పుడు ఐదేళ్ల తర్వాత, ఈ విధానం విద్యా రంగంలో తీసుకొచ్చిన ప్రధాన మార్పు ఏమిటని మీరు భావిస్తున్నారు?

జ: జాతీయ విద్యా విధానం 2020 జూలై 29న అమల్లోకి వచ్చింది. అయితే, కోవిడ్-19 మహమ్మారి కారణంగా దానిని ఆచరణలో అమలు చేయడానికి మాకు నాలుగు సంవత్సరాలు మాత్రమే సమయం లభించింది. ఈ ఎన్‌ఈపీ ఒక సమూలమైన మార్పును తీసుకొచ్చింది. ఇది రెండు విషయాలపై దృష్టి పెడుతుంది: ఇది భారతీయ విలువలు, సంస్కృతి, నాగరికతలో దీని మూలాలు ఉంటాయి. అదే సమయంలో ఇది భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ఉంటుంది. దీన్ని భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రూపొందించారు. నేడు భారతదేశ జనాభాలో యువత సంఖ్యే ఎక్కువ. ఈ పరిస్థితి రాబోయే మూడు దశాబ్దాల వరకు ఉంటుంది. మాతృభాష ఆధారిత విద్య, నైపుణ్యం ఆధారిత విద్య, బహుళ-విద్యా విభాగాల విధానం వంటివి న్యాయమైన, సమానత్వంతో కూడిన సమాజాన్ని నిర్మించడానికి అవసరం.

విద్య అందరికీ అందుబాటులో ఉండాలి, నాణ్యంగా ఉండాలి. మన దేశంలో 25 కోట్ల మంది యువ విద్యార్థులు పాఠశాలల్లో ఉన్నారు. 14 లక్షల పాఠశాలలు ఉన్నాయి. ఉన్నత విద్యలో దాదాపు ఐదు కోట్ల మంది విద్యార్థులు ఉన్నారు. మొత్తం 30 కోట్ల మంది విద్యార్థులు భారతదేశంలో ఉన్నారు. దాదాపు 1,200 విశ్వవిద్యాలయాలు, సుమారు 50,000 కళాశాల స్థాయి సంస్థలు ఉన్నాయి. విద్య ఉమ్మడి జాబితాలో ఉంది. దీనికి ప్రాథమిక బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే. ఎన్‌ఈపీ అమలులోకి వచ్చిన ఐదవ సంవత్సరం తర్వాత, ఈ కొత్త విధానాన్ని అమలు చేయడానికి విస్తృత ఏకాభిప్రాయం ఏర్పడింది. దేశం దీనిని చాలా సులభంగా అమలు చేస్తుందన్న నమ్మకం నాకుంది.

ప్ర: ఈ ఐదేళ్ళలోనూ ఎన్‌ఈపీపై పార్లమెంటులో చర్చలు జరగలేదని విమర్శలు వచ్చాయి. భాషా విధానం గురించి ఆందోళనలు ఉన్నాయి. మౌలిక సదుపాయాల భారం రాష్ట్రాలపై పడుతోందని రాష్ట్రాలు చెబుతున్నాయి. అలాగే, భారతీయ జ్ఞాన వ్యవస్థ ఇందులో భాగం చేయడాన్ని ప్రశ్నిస్తున్నారు, ఎందుకంటే సాంప్రదాయ జ్ఞానం రాష్ట్రం నుండి రాష్ట్రానికి మారుతుంది.

జ: ప్రతిపక్ష పార్టీలు ఎన్‌ఈపీని వ్యతిరేకిస్తున్నాయి. ప్రతిపక్ష పార్టీలు ఈ విధానానికి భాష్యం చెప్పడంలో, చేసే వాదనల విషయంలో మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. దివంగత డాక్టర్ కె. కస్తూరిరంగన్ (మాజీ ఇస్రో చైర్మన్) ఎన్‌ఈపీపై జాతీయ ఏకాభిప్రాయాన్ని సృష్టించారు. ఆయన దేశవ్యాప్తంగా పర్యటించి అన్ని వర్గాల వారితో చర్చలు జరిపారు. ఎన్‌ఈపీని వ్యతిరేకిస్తున్న వారు కేవలం వ్యతిరేకించడం కోసమే చేస్తున్నారు; ఇది పూర్తిగా రాజకీయ ప్రేరేపితం. వారి సొంత రాష్ట్రాలలో, ఎన్‌ఈపీ స్ఫూర్తి ఆమోదం పొందింది. భాష గురించి చెప్పాలంటే, ప్రాథమిక దశలో పిల్లలకు బోధించడం కోసం మాతృభాషను ఉపయోగించాలని ఎన్‌ఈపీ సిఫార్సు చేస్తుంది. ఈ దేశంలో ఏ ప్రతిపక్ష పార్టీ అయినా దీనికి భిన్నమైన అభిప్రాయం కలిగి ఉంటుందని మీరు అనుకుంటున్నారా? ప్రారంభ దశలలో మాతృభాషలో నేర్చుకోవడం, బోధించడం అనే విధానాన్ని అందరూ సమర్థిస్తారు. వారి వ్యతిరేకత రాజకీయపరమైనది. దురదృష్టవశాత్తు, ఇది జరగకూడదు. సమాజం ఈ విషయాలన్నింటినీ గమనిస్తోంది. సమాజం ఈ రకమైన రాజకీయ కథనాల కంటే ఉన్నతమైన వాటిని కోరుకుంటోంది. భారతీయ జ్ఞాన వ్యవస్థపై, కొందరికి భారతదేశంపై, భారతీయ ఆలోచనపై ఫోబియా ఉంది. 

పాశ్చాత్య ఆలోచనల కోసం, వ్యతిరేకించడం కోసం వారు వ్యతిరేకిస్తున్నారు. కానీ వారు ఒక అతి చిన్న మైనారిటీ. ఈ దేశం ఈ రకమైన శృంఖలాల నుంచి బయటపడింది. కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రాయోజిత పథకాలతో రాష్ట్రాలకు తగినంత నిధులు అందిస్తోంది. రాష్ట్రాలు కూడా తమ బడ్జెట్ నుండి తగినంత నిధులు వెచ్చిస్తున్నాయి. విద్యా మంత్రిగా కొత్త విద్యా నమూనాను స్వీకరించడానికి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి మరిన్ని నిధులు అందుబాటులో ఉండాలని ఒప్పుకుంటున్నాను. మనం సాంకేతికతలో పెట్టుబడి పెట్టాలి. రాబోయే మూడు సంవత్సరాలలో, ప్రతి పాఠశాల బ్రాడ్‌బ్యాండ్‌కు కనెక్ట్ అవుతుంది. మనం దేశంలో ఒక ఏఐ మిషన్‌ను కూడా ప్రతిపాదించాం. రాష్ట్రాలకు వారి సొంత బాధ్యతలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వానికి దాని సొంత బాధ్యత ఉంది. మన వంతు కృషి చేస్తున్నాం. ఇప్పటివరకు, మన విద్యా వ్యవస్థ ఉద్దేశ్యం కేవలం ఉద్యోగార్థులను తయారు చేయడమే. ఇప్పుడు, కొత్త ఉద్యోగాలను సృష్టించాలనే ఆకాంక్ష ఉంది. ఇది ఒక జ్ఞానాధారిత సమాజం, జ్ఞానాధారిత ఆర్థిక వ్యవస్థకు సంకేతం. మనం భవిష్యత్ సమాజం కోసం ఒక జ్ఞానాధారిత నమూనా, జ్ఞానాధారిత విద్య, ఆర్థిక వ్యవస్థను ఊహించుకుంటున్నాం.

 ప్ర: అమెరికా వీసా రుసుములను పెంచడం విద్యార్థులలో ఆందోళన కలిగించింది. మీరు దీనిని ఎలా పరిష్కరిస్తారు?

జ: ఐదు కోట్ల మంది విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు. వారిలో, కేవలం 10 లక్షల మంది మాత్రమే ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్తున్నారు. మనం మారుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితులతో జీవించాలి. ప్రతి రెండు మూడు దశాబ్దాలకు ఈ రకమైన షాక్ వస్తుంది. అది ఈ రోజు ఉంది. రేపు కూడా ఉంటుంది. కానీ బాధ్యతాయుతమైన దేశంగా, ప్రగతిశీలమైన, ఆత్మగౌరవం గల దేశంగా మన యువతపై మనకు నమ్మకం ఉంది. మన విద్యావేత్తలపై మనకు నమ్మకం ఉంది. మన సంస్థలపై మనకు నమ్మకం ఉంది. ఇక్కడి నుంచి మనం ప్రపంచస్థాయి ప్రమాణాలను సృష్టించగలం. అదే నేటి వాస్తవం. భారతదేశం ఒక పెద్ద ముందడుగుకు సిద్ధంగా ఉంది.

ప్ర: విశ్వవిద్యాలయాలతో గవర్నర్ల పాత్రకు దగ్గరి సంబంధం ఉంది. ముఖ్యంగా ఉన్నత విద్యకు సంబంధించిన పలు బిల్లులు గవర్నర్ల వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. వైస్-ఛాన్సలర్లు, అధ్యాపకుల నియామకాలలో కూడా సమస్యలు ఉన్నాయి. ఒక గవర్నర్ పాత్ర ఆదర్శంగా ఉండాలంటే ఏం చేయాలి?

జ: స్వాతంత్ర్యానికి ముందు నుంచి గవర్నర్‌లు విద్యా సంస్థల అధిపతులుగా ఉన్నారు. ఈ సంప్రదాయం కొనసాగాలి. సాధారణంగా గవర్నర్ పదవి రాజకీయాలకు అతీతమైంది. రాష్ట్రం-కేంద్రం మధ్య వారధిగా పనిచేస్తుంది. కొన్ని రాష్ట్రాలు ముఖ్యమంత్రులను, విద్యా మంత్రులను ఛాన్సలర్‌లుగా నియమించాలని కోరుతున్నాయి, దీన్ని న్యాయస్థానాలు అంగీకరించలేదు. కొన్ని రాష్ట్రాలు యూజీసీ నిబంధనలను ఉల్లంఘించి రాజకీయ నాయకుల అనుయాయులను వైస్-ఛాన్సలర్‌లుగా నియమిస్తున్నాయి. గవర్నర్ దీనిని ప్రశ్నించకూడదా? స్సమస్యను రెండు కోణాల నుంచీ చూడాలి.

ప్ర: యూడీఐఎస్ఈ డేటా ప్రకారం, 2024-25లో 3, 11 సంవత్సరాల మధ్య వయస్సు గల దాదాపు 25 లక్షల మంది విద్యార్థులు బడి మానేశారు. దీనికి ఎలాంటి నివారణ చర్యలు సూచిస్తున్నారు?

జ: ఎన్ఈపీ ప్రకారం ఒకటో తరగతి ప్రవేశ వయస్సు 6 సంవత్సరాలు. బాలవాటిక 1, 2, 3 తరగతులు మూడేళ్ల పాఠశాల పూర్వపు (ప్రి-స్కూల్) విద్య కోసం ఉన్నాయి. అంగన్‌వాడీలతో కలిసి పనిచేస్తున్నాం. 99 శాతం మంది పిల్లలు పాఠశాలల్లో చేరుతున్నారు. 10వ తరగతి నుంచి డ్రాపౌట్ రేటు పెరుగుతోంది. రాష్ట్రాలు ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. విద్య ఆకర్షణీయంగా, భయం లేకుండా ఉండాలి.

ప్ర: ఐఐటీలు, ఐఐఎంలలో విద్యార్థుల ఆత్మహత్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. దీనిపై మీ స్పందన ఏమిటి? 

జ: మానసిక ఆరోగ్యం ముఖ్యమైన సమస్య. దీన్ని నేను కాదనలేను. ఒక బిడ్డ ఆత్మహత్య చేసుకుంటే అది నా బాధ్యత. నేనూ ఒక తండ్రినే. ఇక్కడ అనేక అంశాలు ఉన్నాయి. క్రీడలు, సామాజిక కార్యక్రమాలపై దృష్టి పెట్టాలి. కొత్త పద్ధతులను అన్వేషించాలి. కొత్త ఉద్యోగ అవకాశాలు, స్వనిధి, ఉజ్వల యోజన వంటి పథకాలు కొత్త ఉద్యోగాలను సృష్టిస్తున్నాయి.

ప్ర: రిజర్వేషన్లు జనరల్ కేటగిరీ విద్యార్థులకు అన్యాయం చేస్తున్నాయనే అభిప్రాయం ఉంది. ఇప్పుడు ప్రైవేట్ రంగానికి కూడా రిజర్వేషన్లు విస్తరించాలన్న చర్చ జరుగుతోంది. 

జ: రిజర్వేషన్ రాజ్యాంగ బాధ్యత. అణగారిన వర్గాల ఉద్ధరణపై సమాజం ఏకాభిప్రాయంతో ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉన్నత కులాల్లోని పేదలకు రిజర్వేషన్‌ను ప్రవేశపెట్టారు. ప్రైవేట్ సంస్థలలో రిజర్వేషన్‌పై చర్చ జరుగుతోంది. కొన్ని సంస్థలు ఇప్పటికే రిజర్వేషన్‌ను అమలు చేస్తున్నాయి. ఇప్పుడు ఈ డిమాండ్ చేస్తున్న పార్టీలు గతంలో ఈ బాధ్యతను నిర్వర్తించలేదు, అనేక దశాబ్దాల అధికారంలో ఉండి కూడా ఏమీ చేయకుండా ఇప్పుడు సామాజిక న్యాయం గురించి మాట్లాడుతున్నాయి.

ప్రశ్న: హిందీ మాట్లాడే రాష్ట్రాలలో రెండవ, మూడవ భాష ఏమిటి?

జ: ఎన్‌ఈపీ ఎవరికీ ఏ భాషనూ నిర్దేశించలేదు. 1 నుండి 5 తరగతుల వరకు, రెండు భాషలు ఉంటాయి: ఒకటి సబ్జెక్ట్‌గా, బోధనా మాధ్యమంగా. బోధనా మాధ్యమం సంబంధిత రాష్ట్రం మాతృభాష. రెండవ భాష ఎంపికను విద్యార్థికి వదిలేశారు. ఈ విధానం వారిపై ఏ నిర్దిష్ట భాషను రుద్దదు. ఇది రాష్ట్రంపై ఆధారపడి ఉంటుంది. 6 నుండి 10 తరగతుల వరకు మూడు భాషలు ఉంటాయి. కచ్చితంగా ఒకటి మాతృభాష అవుతుంది. మిగిలిన రెండు భాషలు విద్యార్థి ఎంపిక ప్రకారం ఏ భాష అయినా కావచ్చు. కానీ మూడు భాషలలో రెండు భారతీయ భాషలు ఉండాలి. భాష ఒక విభజనకారి కాదు. కొందరికి భాష ఒక రాజకీయ సమస్య కావచ్చు. ఒక విద్యాపరంగా మాత్రం భాష ఒక వారధి లాంటింది.

ప్ర: విదేశాల్లో అవకాశాలు తగ్గుతున్న నేపథ్యంలో తరుణోపాయాలు ఏమిటి? 

జ: భారత్ ఏదో ఒక చిన్న, అల్లాటప్పా దేశం కాదు. మనం ఏ దేశంపై ఆధారపడం. మన జాతీయ గౌరవం, ప్రయోజనాలు మనకు ముఖ్యం. ప్రపంచ రాజకీయ పరిస్థితులను ఎదుర్కొనేందుకు మనం సిద్ధంగా ఉన్నాం.

ప్ర: అమెరికా వీసాలు పొందలేని విద్యార్థులకు మీ సలహా ఏమిటి? 

జ: మన ఐఐటీలు, ఐఐఎంలు, ఎన్ఐటీలు, రాష్ట్ర విశ్వవిద్యాలయాల విద్యార్థులు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అద్భుతంగా రాణిస్తున్నారు. మన విద్యా వ్యవస్థ సామర్థ్యం అపారం. ప్రపంచ ఉత్తమ పద్ధతులను స్వీకరిస్తూ, భౌగోళిక రాజకీయ పరిస్థితులను ఎదుర్కోవాలి.

నాగార్జున