వైద్య సాంకేతిక రంగంలో స్వావలంబన దిశగా భారత అడుగులు
గడచిన దశాబ్ద కాలంలో భారత్ లో ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలు గణనీయంగా మారిపోయాయి. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, రోగ నిర్ధారణ కేంద్రాలు, వైద్య కళాశాలల సంఖ్య వేగంగా పెరగడమే పౌర-కేంద్రిత ఆరోగ్య భద్రతా విధానాలకు ప్రత్యక్ష నిదర్శనం. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో నాణ్యమైన వైద్య సేవలను ప్రతి ఒక్క పౌరుడికీ చేరువ చేసేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోంది. ఈ అచంచలమైన నిబద్ధత ఫలితంగా దేశంలో వైద్య ఖర్చుల కోసం ప్రజలు తమ సొంతంగా పెట్టే నిధుల వాటా గతంలో ఉన్న 65 శాతం నుంచి గణనీయంగా తగ్గి ఇటీవల 43 శాతానికి చేరింది. జిల్లా ఆస్పత్రిలోని పసికందు నుంచి నిపుణుల సంరక్షణ కేంద్రంలోని (టెర్షియరీ కేర్) క్యాన్సర్ రోగి వరకు ఆధునిక ఆరోగ్య సంరక్షణకు అత్యంత విశ్వసనీయమైన, నాణ్యమైన, సరసమైన ధరల్లో లభించే వైద్య పరికరాలు అత్యంత ఆవశ్యకంగా మారాయి. ప్రధాన్ మంత్రి – ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మిషన్ (PM-ABHIM) కింద ల్యాబొరేటరీల ఆధునికీకరణ, అత్యవసర చికిత్స (క్రిటికల్ కేర్) మౌలిక సదుపాయాలు, వ్యాధి నిఘా వ్యవస్థలు, అత్యవసర స్పందన వ్యవస్థలలో భారీ పెట్టుబడుల ద్వారా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ప్రజా ఆరోగ్య వ్యవస్థలను ప్రభుత్వం బలోపేతం చేస్తోంది.
‘వికసిత భారత్ 2047’ దిశగా దేశం పయనిస్తున్న తరుణంలో ఆరోగ్య సంరక్షణను మరింత చవకగా, సులభంగా, స్థితిస్థాపకంగా మార్చడానికి ఒక ఆత్మనిర్భర్ మెడ్ టెక్ (వైద్య సాంకేతికత) పర్యావరణ వ్యవస్థను నిర్మించడంపై ప్రధానంగా దృష్టి సారించింది. దిగుమతులపై ఆధారపడటం తగ్గించడం చారిత్రాత్మకంగా, అనేక సంక్లిష్టమైన వైద్య పరికరాల కోసం భారతదేశం దిగుమతులపైనే ఎక్కువగా ఆధారపడింది. ఈ సాంకేతికతలు వైద్య సంరక్షణను మెరుగుపరిచినప్పటికీ, వైద్య వ్యయం పెరగడానికి, సరఫరా గొలుసు లోపాలకు, పరికరాల కొరతకు దారితీశాయి. దీనిని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ‘జాతీయ వైద్య పరికరాల విధానం 2023’ని తీసుకొచ్చింది. నూతన సాంకేతికతలలో స్వదేశీ తయారీ సామర్థ్యాన్ని పెంచడం ద్వారా వైద్య పరికరాలను చౌకగా అందుబాటులోకి తేవడం, రోగ నిర్ధారణ ఖర్చులను తగ్గించడం ఈ విధానం ప్రధాన లక్ష్యం. ఉత్పత్తితో ముడిపెట్టిన ప్రోత్సాహకాలు (పీఎల్ఐ) పథకం, మెడికల్ డివైస్ పార్కులు, ఫార్మా-మెడ్ టెక్ పరిశోధన ప్రోత్సాహక పథకం వంటి కార్యక్రమాల ద్వారా ప్రభుత్వం వైద్య పరికరాల పర్యావరణ వ్యవస్థను విస్తృతంగా బలోపేతం చేస్తోంది. ఈ చర్యలు స్వదేశీ తయారీ, ఆవిష్కరణలు, పెట్టుబడులు, అంతర్జాతీయ పోటీతత్వానికి అనుకూల వాతావరణాన్ని కల్పిస్తున్నాయి.
విశ్వసనీయ అంతర్జాతీయ మెడ్-టెక్ భాగస్వామిగా భారత్ ఈ ప్రయత్నాల ఫలితాలు ఎంతో ప్రోత్సాహకరంగా ఉన్నాయి. పీఎల్ఐ పథకం కింద 50 కి పైగా అత్యున్నత స్థాయి వైద్య పరికరాల తయారీ ఇప్పటికే ప్రారంభమైంది. అంతేకాకుండా, ఈ రంగంలో స్థిరమైన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ప్రవాహం అంతర్జాతీయ ఇన్వెస్టర్లకు భారత్‌పై పెరుగుతున్న నమ్మకానికి అద్దం పడుతోంది. అంతర్జాతీయ మెడ్-టెక్ విలువ శ్రేణిలో భారతదేశం ఒక విశ్వసనీయ భాగస్వామిగా గుర్తింపు పొందుతోందని ఈ విజయాలు నిరూపిస్తున్నాయి. కేవలం తయారీ కేంద్రంగా మారడమే కాకుండా పౌరుల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే దిశగా వైద్య సాంకేతిక పురోగతిని భారత్ వేగంగా పుణికిపుచ్చుకుంటోంది. అధునాతన రోగ నిర్ధారణ పరీక్షలు, ఇమేజింగ్ వ్యవస్థలు, ఇంప్లాంట్లు, ఐసీయూ (అత్యవసర సంరక్షణ) పరికరాలు, డిజిటల్ పరిష్కారాలు సరసమైన ధరలకు లభించడం వల్ల రోగుల వైద్య సంరక్షణ నాణ్యత, సమయపాలన మెరుగుపడటమే కాకుండా వారిపై పడే ఆర్థిక భారం గణనీయంగా తగ్గుతుంది. దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం, సరఫరా గొలుసును బలోపేతం చేయడం, ఖర్చులను తగ్గించడం ద్వారా స్వదేశీ తయారీ రంగం ఈ లక్ష్య సాధనకు నేరుగా తోడ్పడుతోంది.
ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఔషధ పరిశ్రమ, బలమైన ఇంజనీరింగ్ నైపుణ్యాలు, వేగంగా విస్తరిస్తున్న డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలు, ఉత్సాహపూరితమైన స్టార్టప్ పర్యావరణ వ్యవస్థ, నైపుణ్యం కలిగిన మానవ వనరులు తదుపరి తరం వైద్య సాంకేతికతలను అభివృద్ధి చేయడానికి భారత్‌కు బలమైన పునాదిని అందిస్తున్నాయి. కృత్రిమ మేధ, వైద్య పరికరంగా సాఫ్ట్ వేర్ (SaMD), అనుసంధానిత వైద్య పరికరాలు, రోబోటిక్స్, రిమోట్ డయాగ్నోస్టిక్స్ వంటి నూతన రంగాలు స్వదేశీ, అంతర్జాతీయ ఆరోగ్య సంరక్షణ అవసరాలను తీర్చే వినూత్న ఆవిష్కరణలకు భారతదేశానికి అపారమైన అవకాశాలను కల్పిస్తున్నాయి. భారతీయ తయారీదారులు ప్రపంచవ్యాప్తంగా తమ ప్రభావాన్ని విస్తరిస్తున్న వేళ, నాణ్యత ‘బ్రాండ్ ఇండియా మెడ్-టెక్’ ముఖ్య లక్షణంగా మారుతోంది. రోగుల భద్రతను పెంచడంతో పాటు అంతర్జాతీయ పోటీ సామర్థాన్ని పెంపొందించడానికి నియంత్రణ వ్యవస్థలను పునర్నిర్మించడం, గుర్తింపు పొందిన ల్యాబ్ పరీక్షల మౌలిక సదుపాయాలను విస్తరించడం, క్లినికల్ ఆధారాల సేకరణను ప్రోత్సహించడం, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా మారడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోంది.
అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడగల మెడ్-టెక్ పర్యావరణ వ్యవస్థను నిర్మించాలంటే ప్రభుత్వం, పరిశ్రమలు, విద్యాసంస్థలు, ఆరోగ్య సంరక్షణ సంస్థలు, స్టార్టప్‌లు, ఇన్వెస్టర్ల మధ్య సమర్థమైన భాగస్వామ్యం అత్యవసరం. ప్రయోగశాలల నుంచి తయారీ కేంద్రాలకు, అక్కడి నుంచి నేరుగా రోగులకు ఆలోచనలు అడ్డంకులు లేకుండా చేరినప్పుడే ఆవిష్కరణలు వికసిస్తాయి. పరిశోధనలు, పెట్టుబడులు, సాంకేతిక భాగస్వామ్యాలు, సులభతర వాణిజ్యాన్ని ప్రోత్సహించే స్థిరమైన, పారదర్శక విధాన వాతావరణాన్ని అందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. భారత్ అభివృద్ధి చెందిన దేశంగా అవతరించే దిశగా ముందుకు సాగుతున్న తరుణంలో, ఆరోగ్య రక్షణ, ఆర్థిక వృద్ధి ఒకదానికొకటి అండగా ఉంటాయి. బలమైన వైద్య పరికరాల రంగం ఒకవైపు అధిక విలువ కలిగిన స్వదేశీ తయారీని, నైపుణ్యంతో కూడిన ఉపాధిని, ఎగుమతులను, సాంకేతిక సామర్థ్యాలను సృష్టిస్తూనే మరోవైపు ఆరోగ్య సంరక్షణను మరింత చౌకైనదిగా, అందుబాటులో ఉండేదిగా, పరిస్థితులకు స్పందించేదిగా మారుస్తుంది.
భారతదేశ మెడ్-టెక్ రంగం ఆసియాలోనే నాల్గవ అతిపెద్ద మార్కెట్‌గాను, ప్రపంచవ్యాప్తంగా టాప్ 20 మార్కెట్లలో ఒకటిగాను నిలిచింది. ప్రస్తుతం 15-16 బిలియన్ డాలర్ల పరిమాణంతో ఉన్న ఈ మార్కెట్, దాదాపు 12 శాతం వార్షిక వృద్ధితో పురోగమిస్తూ, దేశంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న తయారీ రంగాలలో ఒకటిగా నిలిచింది. నాణ్యత, ఆవిష్కరణ, సమాజంలోని ప్రతి వర్గాన్నీ కలుపుకొనిపోయే నమూనా ఆధారంగా అంతర్జాతీయ నాయకత్వాన్ని నిర్మించాలని ‘వికసిత భారత్’ దృక్పథం స్పష్టం చేస్తోంది. తల్లి-పిల్లల ఆరోగ్యం మొదలుకుని అసాంక్రమిక వ్యాధులు, అత్యవసర సంరక్షణ, క్యాన్సర్, గుండె సంబంధిత వ్యాధులు, గ్రామీణ ఆరోగ్య సంరక్షణ సేవల వరకు భారత్ ప్రజారోగ్య ప్రాధాన్యాలను తీర్చే సాంకేతికతలను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం శ్రమిస్తోంది. భారతదేశం వైద్య పరికరాలను స్వదేశంలో తయారు చేయడమే కాకుండా నాణ్యమైన వైద్య సంరక్షణను ప్రతి ఒక్క పౌరుడికి సకాలంలో అందిస్తూ, ఆరోగ్య భద్రతను బలోపేతం చేస్తూ, మానవాళికి మెరుగైన ఆరోగ్యాన్ని అందించే దిశగా ప్రపంచవ్యాప్తంగా ఒక విశ్వసనీయ భాగస్వామిగా భారత్‌ను నిలబెట్టే ఒక దృఢమైన ‘ఆత్మనిర్భర్ మెడ్-టెక్’ పర్యావరణ వ్యవస్థను సగర్వంగా నిర్మిస్తోంది.
జగత్ ప్రకాష్ నడ్డా,
కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ, రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి

