వికసిత భారత్ సాధనలో కీలక అడుగు కార్మిక కోడ్లు
భౌతిక మౌలిక సదుపాయాల బలాన్ని, సాంకేతిక సామర్థ్యాలను, మూలధన పునాదులను మెరుగుపరచుకోవడంతో పాటు దేశీయ కార్మిక రంగాన్ని ఆధునికీకరించడంపైనే 2047 నాటికి ‘వికసిత భారత్’ స్వప్న సాకారం ఆధారపడి ఉంటుంది. కేవలం యువ జనాభా ఎక్కువగా ఉన్నంత మాత్రాన ఆర్థిక వృద్ధి తానంతట తానే సాధ్యపడదు; ఉత్పాదకత, శ్రామికుల గతిశీలత (మొబిలిటీ), శ్రామిక శక్తిని భారీ స్థాయిలో అధికారిక వ్యవస్థలోకి తీసుకురావడం వంటి అంశాలకు ఊతమిచ్చే వ్యవస్థాగత మద్దతు అత్యంత ఆవశ్యకం. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ‘కార్మిక కోడ్లు’ వ్యూహాత్మక ప్రాధాన్యన్యం సంతరించుకున్నాయి. ఇవి కేవలం 29 రకాల పాత కార్మిక చట్టాల సమాహారం మాత్రమే కాదు; భారత కార్మిక మార్కెట్లో సమర్థత, శ్రామికుల సంక్షేమం, అంతర్జాతీయ పోటీతత్వాల మధ్య సమతుల్యతను సాధించేందుకు చేపట్టిన ఒక నూతన విధానపరమైన సంస్కరణ.
వేతన కోడ్ (ది కోడ్ ఆన్ వేజెస్): మరింత సామరస్యపూర్వకమైన, సమానత్వంతో కూడిన వేతన వ్యవస్థను నెలకొల్పడం ఈ కోడ్ ప్రధాన లక్ష్యం. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించే ‘చట్టబద్ధ కనీస వేతనం’ (స్టాట్యుటరీ ఫ్లోర్ వేజ్) ద్వారా రాష్ట్రాలు, విభిన్న రంగాల మధ్య ఉన్న వేతన వ్యత్యాసాలను తగ్గించి, ఆదాయ భద్రతను పెంపొందించడానికి జాతీయ వేతన పునాదిని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. దీనికి తోడు వేతనం అనే పదానికి ఒకే నిర్వచనాన్ని ఇవ్వడం ద్వారా చట్టపరమైన వ్యాఖ్యానాలలో ఉండే సందిగ్ధతలను నివారించవచ్చు. నిబంధనల అమలులో పారదర్శకత, స్థిరత్వం ఏర్పడటంతో పాటు పన్ను లేదా నిబంధనల నుంచి తప్పించుకునే అవకాశాలు తగ్గి, వేతన నిర్ణాయక ప్రక్రియలో విశ్వసనీయత పెరుగుతుంది.
కార్మిక మార్కెట్ సౌలభ్యాలు, రక్షణలు: కార్మిక మార్కెట్‌కు అవసరమైన సౌలభ్యాన్ని కల్పిస్తూనే, కార్మికుల ప్రాథమిక హక్కులను, ప్రయోజనాలను కాపాడటం ఈ సంస్కరణల్లో రెండవ ముఖ్యమైన అంశం. ‘నిర్దిష్ట కాలపరిమితి ఉపాధి’ నిబంధన ద్వారా పరిశ్రమలు తమ ఉత్పత్తి అవసరాలకు అనుగుణంగా సిబ్బందిని నియమించుకునే వీలు కలుగుతుంది. అదే సమయంలో ఈ తాత్కాలిక శ్రామికులకు శాశ్వత ఉద్యోగులతో సమానంగా వేతనాలు, చట్టబద్ధ ప్రయోజనాలను అందించాల్సి ఉంటుంది. దీనికి తోడు పని గంటలు, షిఫ్టుల నిర్ణయం, ఓవర్ టైం నిబంధనలలో కల్పించిన వెసులుబాటు — ముఖ్యంగా గ్లోబల్ సరఫరా గొలుసులు, అంతర్జాతీయ సేవలందిస్తున్న రంగాలు సజావుగా కార్యకలాపాలు సాగించడానికి తోడ్పడుతుంది.
పారిశ్రామిక సంబంధాల సరళీకరణ: దేశంలోని పారిశ్రామిక సంబంధాల వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి, క్రమబద్ధీకరించడానికి ఈ కోడ్లు ప్రయత్నిస్తున్నాయి. ఏకైక ప్రాతినిధ్య యూనియన్ లేదా ఏ ఒక్క యూనియన్‌కు స్పష్టమైన మెజారిటీ లేని పక్షంలో ‘చర్చల మండలి’ ఏర్పాటుకు ఈ కోడ్ అవకాశం కల్పిస్తుంది. దీనివల్ల యాజమాన్యాలు, కార్మికుల మధ్య సంఘటిత చర్చలు సాగేందుకు ఒక వ్యవస్థాగతమైన వేదిక ఏర్పడుతుంది. పారిశ్రామిక వివాదాల పరిష్కార ప్రక్రియను మరింత వేగవంతం, సమర్థవంతం చేయడానికి ‘జాతీయ పారిశ్రామిక ట్రిబ్యునల్’ నిబంధనను కూడా ఇందులో చేర్చారు. అలాగే సంస్థల మూసివేత, లేఆఫ్ లు, ఉద్యోగుల తొలగింపు వంటి అంశాలలో ముందస్తు ప్రభుత్వ అనుమతి నిబంధనల మినహాయింపు పరిమితిని పెంచడం ద్వారా పెద్ద పరిశ్రమలకు వ్యాపార నిర్వహణ సులభతరమవుతుంది.
నిబంధనల భారం తగ్గింపు: కార్పొరేట్, వ్యాపార సంస్థలపై ఉన్న నియంత్రణ నిబంధనల భారాన్ని తగ్గించడమే ఈ కోడ్ల ముఖ్య ఉద్దేశం. ఒకే రిజిస్ట్రేషన్, అనేక రాష్ట్రాల్లో వ్యాపారం చేసే సంస్థలకు ‘అఖిల భారత లైసెన్స్’ పొందే వెసులుబాటును ఈ చట్టాలు కల్పిస్తున్నాయి. దీనివల్ల వివిధ రాష్ట్రాల్లో కార్యకలాపాలు నిర్వహించే కంపెనీల వ్యాపార విస్తరణకు ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. డిజిటల్ విధానంలో రిజిస్ట్రేషన్లు, నిబంధనల తనిఖీలు చేపట్టడం వల్ల దరఖాస్తు వ్యయం తగ్గుతుంది. ఇది ముఖ్యంగా సంఘటిత రంగంలోకి అడుగుపెడుతున్న సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు (MSMEs) ‘వాణిజ్య సౌలభ్యం’ కల్పించేందుకు ఎంతగానో తోడ్పడుతుంది.
సామాజిక భద్రత, సమ్మిళితత్వం: ఈ సంస్కరణల ప్రక్రియలో శ్రామిక సంక్షేమానికి, సమాన అవకాశాలకు పెద్దపీట వేశారు. గిగ్, ప్లాట్‌ఫామ్ వర్కర్లను ప్రత్యేక శ్రామిక వర్గంగా గుర్తించి, వారికి సామాజిక భద్రతా పథకాలను వర్తింపజేయడం మారిన ఆధునిక ఉద్యోగ స్వభావానికి, పెరుగుతున్న డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు అద్దం పడుతోంది. అలాగే మహిళా ఉద్యోగుల సమ్మతి, భద్రతా ఏర్పాట్లకు లోబడి నైట్ షిఫ్ట్ పనులకు అనుమతించడం, పని ప్రదేశాల్లో శిశు సంరక్షణ (క్రెచ్) సౌకర్యాలు కల్పించడం వంటి చర్యలు కార్మిక రంగంలో మహిళా భాగస్వామ్యాన్ని గణనీయంగా పెంచుతాయి. దీంతోపాటు వృత్తిపరమైన భద్రత, ఆరోగ్యం, పని పరిస్థితుల నిబంధనలను ఒకే ఛత్రం కిందకు తీసుకువచ్చారు. దీనికై ప్రభుత్వం, యాజమాన్యాలు, శ్రామిక ప్రతినిధులతో కూడిన ‘జాతీయ వృత్తి భద్రత, ఆరోగ్య సలహామండలి’ని ఏర్పాటు చేయనున్నారు.
ఈ నిబంధనలన్నీ కలిపి, భారత కార్మిక రంగాన్ని అంతర్జాతీయ స్థాయి ఆర్థిక వ్యవస్థల అవసరాలకు అనుగుణంగా ఆధునికీకరించే ప్రక్రియను సూచిస్తున్నాయి. ఎలక్ట్రానిక్స్, జౌళి, ఆటో విడిభాగాల వంటి తయారీ రంగాలలో మెరుగైన నియామక సౌలభ్యం, స్పష్టమైన పారిశ్రామిక సంబంధాలు, సులభతరమైన నియంత్రణ వ్యవస్థలు ఉత్పాదకతను పెంచి, అంతర్జాతీయ విలువ గొలుసులతో భారత్ కీలకమైన భాగస్వామీ అయ్యేలా చేస్తాయి. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు (MSME) ఈ చట్టాలు నియమబద్ధతను, బ్యాంకింగ్ రుణాలు, మార్కెట్ లభ్యతను సులభతరం చేస్తాయి. సేవా రంగంతో పాటు గిగ్ ఎకానమీ వంటి వర్ధమాన రంగాలలో నూతన ఉద్యోగుల గుర్తింపు వారి సంక్షేమానికి, మార్కెట్ సమర్థతకు తోడ్పడుతుంది.
అమలులో సవాళ్లు: అయితే ఈ సంస్కరణల విజయవంతమైన అమలు భారతదేశ సమాఖ్య వ్యవస్థపై ఆధారపడి ఉంటుంది. రాజ్యాంగంలో కార్మిక రంగం ‘ఉమ్మడి జాబితా’లో ఉన్నందున, వివిధ రాష్ట్రాల నోటిఫికేషన్లు, అమలు శైలిలోని వ్యత్యాసాలు అసమాన ఫలితాలకు దారితీయవచ్చు. మహారాష్ట్రలోని ‘మథాడీ చట్టం (1969)’, కేరళలోని ‘హెడ్‌లోడ్ వర్కర్స్ చట్టం (1978)’ వంటి పాత రాష్ట్ర చట్టాలు అమలులో ఉండటం వల్ల చట్టపరమైన చిక్కులు, గందరగోళాలు ఏర్పడి జాతీయ స్థాయిలో ఏకరూపత తీసుకురావాలనే లక్ష్యానికి అడ్డంకిగా మారవచ్చు. అదేవిధంగా పరిపాలనా సామర్థ్యం కూడా ఈ సంస్కరణల విజయాన్ని నిర్ణయిస్తుంది. డిజిటల్ తనిఖీలు, వివాదాల పరిష్కార వ్యవస్థల పనితీరు రాష్ట్రాల స్థాయిలోని వ్యవస్థాగత సన్నద్ధతపై ఆధారపడి ఉంటుంది. ఈ సవాళ్లను అధిగమించడానికి కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నిరంతర సమన్వయం, పారిశ్రామికవర్గాలు, కార్మిక సంఘాలు మరియు భాగస్వామ్య పక్షాలతో పారదర్శక చర్చలు అవసరం. డిజిటల్ మౌలిక సదుపాయాలు, వ్యవస్థాగత సామర్థ్యం, అవగాహన పెంపొందించడంపై చేసే పెట్టుబడులు మాత్రమే ఈ సంస్కరణల ఫలాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లగలవు.
సమగ్రంగా పరిశీలిస్తే భారత కార్మిక రంగాన్ని పునర్నిర్మించేందుకు ఈ నూతన కార్మిక కోడ్లు ఒక నిర్మాణాత్మక సాధనంగా నిలుస్తాయి. నియంత్రణ, పోటీతత్వం, శ్రామిక సంక్షేమాల మధ్య ఇవి సమతుల్యత సాధిస్తాయి. ‘వికసిత భారత్’ లక్ష్యం దిశగా భారత్ అడుగులు వేస్తున్న తరుణంలో నిరంతర ఉత్పాదకత, నియమబద్ధత, అంతర్జాతీయ పోటీతత్వం కలిగిన శ్రామిక శక్తిని తయారు చేయడంలో ఈ కార్మిక కోడ్లు ఒక కీలకమైన చోదక శక్తిగా ఉపయోగపడతాయి.
అపూర్వ చంద్ర, కౌశల్ మహాన్

