Modi

వికసిత్ భారత్ నిర్ణయాధికారం యువతదే

Modi Railway Inauguration

వికసిత్ భారత్ తాలూకు సిసలైన లబ్ధిదారులు యువతీ యువకులే అని, వికసిత్ భారత్ ఎలా రూపొందించుకోవాలో నిర్ణయించే అత్యధిక అధికారాలు యువతకే ఉన్నాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఈ అభివృద్ధి ప్రాజెక్టులు లక్షలాది యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను అందిస్తాయన్నారు. యువత కలలు, కఠోర శ్రమ వికసిత్ భారత్ హామీ నెరవేర్చుతాయని ధీమా వ్యక్తం చేశారు. రూ.41,000 కోట్ల పైగా విలువ గల దాదాపు 2,000 రైల్వే మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఫిబ్రవరి 26న వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. ఇందులో భాగంగా 12 రాష్ట్రాలలోని 300కు పైగా జిల్లాలలో 550 స్టేషన్ లను అభివృద్ధి చేయనున్నారు. దేశంలో 500 రైల్వే స్టేషన్ లను అమృత్ భారత్ స్టేషన్ ప్రాజెక్టులో భాగంగా మోదీ ప్రభుత్వం ఆధునికీకరిస్తోంది. ఈ రైల్వే స్టేషన్ లు దివ్యాంగులు, సీనియర్ సిటిజన్ లకు అనుకూలమైన ఏర్పాటులతో కొలువుదీరనున్నాయి. రూ.21,520 కోట్ల విలువ గల 1500 రోడ్ ఓవర్ బ్రిడ్జిలు, అండర్‌‌పాస్‌లకు ప్రధానమంత్రి శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేశారు. ఈ ప్రాజెక్టులు రద్దీని తగ్గించడంతో పాటు, భద్రతను, కనెక్టివిటీని పెంచుతాయి, రైలు ప్రయాణంలో సామర్థ్యాన్ని, దక్షతను మెరుగుపరుస్తాయి. ఈ శంకుస్థాపనల్లో తెలంగాణకు చెందిన 15 అమృత్ భారత్ స్టేషన్లు, 1 రైల్ ఫ్లై ఓవర్ కు, 16 రైల్ అండర్ పాస్ లు… ప్రారంభోత్సవాల్లో 3 రైల్ ఫ్లై ఓవర్ లను, 29 రైల్ అండర్ పాస్ లు ఉన్నాయి. 500 రైల్వే స్టేషన్లలో, 1500 ఇతర స్థలాలలో ప్రజలు ‘వికసిత్ భారత్, వికసిత్ రైల్వేస్’ కార్యక్రమంతో పాలుపంచుకొన్నారు.

 ఈ సందర్భంగా ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, ఈ కార్యక్రమం న్యూ ఇండియాలో కొత్త శ్రమ సంస్కృతికి ఒక ప్రతీకగా ఉందని అన్నారు. ‘‘ప్రస్తుతం భారతదేశం ఏం చేస్తున్నా గతంలో ఎన్నడూ లేని వేగంతోను, భారీ స్థాయిలోను చేస్తోంది. మనం పెద్ద పెద్ద కలలను కంటూ, వాటిని నెరవేర్చుకునేందుకు అలుపు అనేదే ఎరుగకుండా పని చేస్తాం. ఈ సంకల్పం తాజాగా చేపట్టిన ‘వికసిత్ భారత్, వికసిత్ రైల్వే’’ కార్యక్రమంలో కనిపిస్తోంది’’ అని ఆయన అన్నారు. త్వరలో ఏర్పాటయ్యే అమృత్ భారత్ స్టేషన్ లు ఇటు అభివృద్ధికి, అటు వారసత్వానికి చిహ్నాలుగా రూపుదిద్దుకొంటాయన్నారు. ఒడిశాలోని బాలేశ్వర్ స్టేషన్ ను భగవాన్ జగన్నాథ్ దేవాలయం ఇతివృత్తం ఆధారంగా రూపొందించారని, సిక్కిమ్ లోని రంగ్‌పుర్ స్టేషన్ లో స్థానిక వాస్తు కళ కొలువుదీరుతుందన్నారు. రాజస్థాన్ లోని సాంగనేర్ స్టేషన్ పదహారో శతాబ్దికి చెందిన హ్యాండ్-బ్లాక్ ప్రింటింగ్ ను చాటి చెబుతుందని, తమిళనాడులోని కుంభకోణం స్టేషన్ లో చోళ రాజరికం ఛాయలను చూడవచ్చన్నారు. అహ్మదాబాద్ స్టేషన్ లో మొఢేరా సూర్య మందిరం తాలూకు ముద్ర, ద్వారక స్టేషన్ లో ద్వారకాధీశ్ దేవాలయం నుండి ప్రేరణగా స్వీకరించిన గుర్తులు, ఐటీ సిటీ గురుగ్రామ్ స్టేషన్ లో సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని తలపించే అలంకరణలు ఆకట్టుకుంటాయన్నారు. ‘‘అమృత్ భారత్ స్టేషన్ ఆ నగరం ప్రత్యేకతలను ప్రపంచానికి వివరించేదిగా ఉంటుంది’’ అని ప్రధాన మంత్రి అన్నారు.

గడచిన 10 సంవత్సరాలలో అభివృద్ధి చెందిన భారతదేశాన్ని (‘వికసిత్ భారత్’) ఆవిష్కరించడానికి కృషి జరిగిందని, ప్రత్యేకించి రైల్వే పరంగా ఈ మార్పు ప్రస్ఫుటంగా కనిపిస్తోందని ప్రధాన మంత్రి పునరుద్ఘాటించారు. ఒకప్పుడు అసాధ్యం అనుకున్న సదుపాయాలు అన్నీ కూడాను ప్రస్తుతం వాస్తవరూపాన్ని దాల్చాయన్నారు. వందేభారత్ వంటి సెమీ-హైస్పీడ్ రైళ్ళు, ‘అమృత్ భారత్’, ‘నమో భారత్’, రైలు మార్గాలను శరవేగంగా విద్యుదీకరించడం, రైళ్ళ లోపల రైల్వే స్టేషన్ ప్లాట్ ఫారమ్ లలో పరిశుభ్రతకు పెద్దపీట వేయడం వంటి అంశాలను ఉదహరించారు. విమానాశ్రయాల తరహా ఆధునిక సదుపాయాలను రైల్వే స్టేషన్లలో పేదలు, మధ్య తరగతి వర్గాలకు అందుబాటులోకి తీసుకొస్తున్నామని చెప్పారు.

రైల్వే బడ్జెట్ పదేళ్ళ క్రిందట రూ.45,000 కోట్లు ఉంటే ఇవాళ రూ.2.5 లక్షల కోట్లకు పెరిగిందని అన్నారు. స్కాంలకు తావు లేకపోవడం వల్ల మిగిలిన సొమ్మును కొత్త రైలు మార్గాల నిర్మాణంలో వేగాన్ని రెట్టింపు చేయడంలోను, జమ్ము కశ్మీర్ నుండి ఈశాన్య ప్రాంత రాష్ట్రాలలోని కొత్త ప్రాంతాలకు రైల్వేను తీసుకుపోవడానికి, అలాగే 2,500 కిలో మీటర్ ల మేరకు డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ పనులకు వెచ్చించగలుగుతున్నామని అన్నారు. ప్రజలు చెల్లించే పన్నుల్లో ప్రతి పైసా ప్రయాణికుల సంక్షేమం కోసం వినియోగిస్తున్నామన్నారు. ప్రతి రైల్వే టికెట్ పై 50 శాతం డిస్కౌంట్ లభిస్తోందని అన్నారు. ‘‘బ్యాంకులలో జమ చేసిన డబ్బు మీద వడ్డీ మాదిరిగా మౌలిక సదుపాయలపై ఖర్చు పెట్టే ప్రతి ఒక్క పైసా ఆదాయాన్ని, నూతన ఉద్యోగాలను సృష్టిస్తుంది’’ అని ప్రధాన మంత్రి నొక్కి చెప్పారు. కొత్త రైలు మార్గాలు వేయడం వల్ల అనేక మందికి ఉద్యోగ అవకాశాలు.. అది కూలీ నుంచి ఇంజినీర్ వరకు.. అంది వస్తాయని అన్నారు. సిమెంటు, ఉక్కు, రవాణా రంగాలలో కొత్తగా కొలువులు ఏర్పడ్డాయని చెప్పారు. ఒక రైలు వేగం పెరిగితే, అది రవాణా సమయాన్ని ఆదా చేస్తుందని, పరిశ్రమకు అయ్యే ఖర్చులను కూడా తగ్గిస్తుందని వివరించారు. అందువల్ల ‘మేక్ ఇన్ ఇండియా’కు, ‘ఆత్మనిర్భర్ భారత్’కు ఉత్తేజాన్ని అందిస్తుందని నరేంద్ర మోదీ అన్నారు.

తెలంగాణలోని 40 అమృత్ భారత్ స్టేషన్లు

తెలంగాణలోని 40 రైల్వేస్టేషన్లను అమృత్ భారత్ స్టేషన్లుగా అభివృద్ధి చేయాలని భావించిన రైల్వేశాఖ మొత్తం రూ.2,245 కోట్ల నిధులను కేటాయించింది. రూ. 230 కోట్లకు పైగా నిధులతో 15 అమృత్ భారత్ స్టేషన్లలో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు నరేంద్రమోదీ తాజాగా శంకుస్థాపన చేశారు. గత ఆగస్టులో రూ. 894 కోట్ల అంచనా వ్యయంతో 21 అమృత్ భారత్ స్టేషన్లలో అభివృద్ధి పనులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు.

తెలంగాణలో అమృత్ భారత్ స్టేషన్లు, కేటాయించిన నిధుల వివరాలు..

○                జడ్చర్ల – రూ. 10.94 కోట్లు

○                గద్వాల్ – రూ. 9.49 కోట్లు

○                షాద్ నగర్ – రూ. 9.59 కోట్లు

○                మేడ్చల్ – రూ. 8.37 కోట్లు

○                మెదక్ – రూ. 15.31 కోట్లు

○                ఉందా నగర్ – రూ. 12.37 కోట్లు

○                బాసర – రూ. 11.33 కోట్లు

○                యాకుత్ పుర – రూ. 8.53 కోట్లు

○                మిర్యాలగూడ – రూ. 9.50 కోట్లు

○                నల్గొండ – రూ. 9.50 కోట్లు

○                వికారాబాద్ – రూ. 24.35 కోట్లు

○                పెద్దపల్లి – రూ. 26.49 కోట్లు

○                మంచిర్యాల – రూ. 26.49 కోట్లు

○                వరంగల్ – రూ. 25.41 కోట్లు

○                బేగంపేట – రూ. 22.57 కోట్లు కేటాయించబడ్డాయి.

   అమృత్ భారత్ స్టేషన్లలో ప్రయాణికుల రద్దీని బట్టి సౌకర్యాలను కల్పించనున్నారు. అందులో ఐకానిక్ స్టేషన్ బిల్డింగ్, స్టేషన్ కు రెండు వైపులా ఉన్న బిల్డింగులను, అన్ని ప్లాట్ ఫామ్ లను కలుపుతూ ఫుట్ ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం, పార్కింగ్ సౌకర్యం, ట్రాఫిక్ ఇబ్బందుల తొలగింపు, ప్రయాణికులకు ప్రత్యేక మార్గాల ఏర్పాటు, లిఫ్ట్ లు, ఎస్కలేటర్ల ఏర్పాటు, దివ్యాంగుల రాకపోకలకు వీలుగా సౌకర్యవంతమైన ఏర్పాట్లు, ఇల్యూమినేషన్, సైన్ బోర్డ్ ల ఏర్పాటు, ప్రయాణికుల రక్షణ కోసం అధునాతనమైన CCTVల ఏర్పాటు, స్వయంగా స్టేషన్ కు అవసరమైన విద్యుత్ ను తయారు చేసుకునేలా గ్రీన్ బిల్డింగ్ ఏర్పాట్లు తదితరాలు ఉన్నాయి.

   అమృత్ భారత్ స్టేషన్లతో పాటు ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాష్ట్రంలో రూ. 169 కోట్లకు పైగా నిధులతో నిర్మించనున్న 1 రైల్ ఫ్లై ఓవర్ కు, 16 రైల్ అండర్ పాస్ లకు కూడా శంకుస్థాపన చేశారు. అందులో

  • హైదరాబాద్ డివిజన్ లోని బోధన్ వద్ద రైల్ ఫ్లై ఓవర్, మేళ్ల చెరువు, కురుముర్తి వద్ద 2, చిలకమర్రి, గౌడవల్లి, కీసర, రామాంతపూర్, పాలాట, కూచవరం వద్ద 2 మదనపూర్, గద్వాల్ వద్ద రైల్ అండర్ పాస్ లు
  • సికింద్రాబాద్ డివిజన్ లోని కురచపల్లి, వెలమల, చాగల్ వద్ద రైల్ అండర్ పాస్ లు,
  • గుంతకల్ డివిజన్ లోని నారాయణపేట వద్ద రైల్ అండర్ పాస్.

వీటితో పాటు ఆయా డివిజన్లలో రూ. 221 కోట్లకు పైగా నిధులతో ఇప్పటికే నిర్మాణం పూర్తి చేసుకున్న 3 రైల్ ఫ్లై ఓవర్ లను, 29 రైల్ అండర్ పాస్ లను ప్రధానమంత్రి నరేంద్రమోదీ జాతికి అంకితం చేశారు.

  • హైదరాబాద్ డివిజన్ లోని మహబూబ్ నగర్ రూరల్, పెద్దదిన్నె, తిప్పాపూర్, గద్వాల్, సిద్దరామేశ్వర్ నగర్, బైరవాపురం, తలమడ్ల, ఇతిక్యాల, అడ్లూర్, నవీపేట్, ఉండవల్లి వద్ద రైల్ అండర్ పాస్ లు.
  • సికింద్రాబాద్ డివిజన్ లోని ఎర్రగుంట, ఉంకిచర్ల/నిరుపమకొండ, చర్లపల్లి వద్ద రైల్ ఫ్లై ఓవర్ లు, విలాసాగర్, బిస్ బాగ్, శివపురం, కాశీపేట్, మంచిర్యాల, బూడ, కాజీపేట్, గరిడపల్లి, మీనవోలు, బయ్యారం, దెందుకూరు, ముత్యాలగూడెం, రాజనెల్లి, ఉప్పరపల్లి వద్ద రైల్ అండర్ పాస్ లు.
  • గుంటూర్ డివిజన్ లోని నర్కెట్ పల్లి, కీసరజూపల్లి, బుదారం వద్ద రైల్ అండర్ పాస్ లు.
  • గుంతకల్ డివిజన్ లోని తంగడి వద్ద ఉన్న రైల్ అండర్ పాస్.