దేశప్రజల ఆశ, ఆకాంక్ష బిజెపి
(ఫిబ్రవరి 18, 2024న దిల్లీలోని భారత్ మండపంలో జరిగిన బిజెపి జాతీయ సదస్సు రెండవ రోజున ‘బిజెపి–దేశ్ కీ ఆశా, విపక్ష్ కి హతాశా’ పేరుతొ కేంద్ర హోం, సహకార మంత్రి అమిత్ షా ప్రవేశపెట్టగా కేంద్ర గిరిజన, వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రి అర్జున్ ముండా, హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ లు బలపరిచారు. ఈ తీర్మానం కాంగ్రెస్ స్వార్థ, ఆశ్రిత పక్షపాత, అవినీతి, ప్రతికూల, పరాజయ రాజకీయాల బండారాన్ని బయటపెట్టింది. ‘ఇండీ’ కూటమిని ఓడించాలని, అభివృద్ధి చెందిన భారత్ అనే సంకల్పంతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బలమైన నాయకత్వంలో ప్రజలంతా ఏకం కావాలని పిలుపునిచ్చింది. జనసందేశ్ పాఠకుల కోసం తీర్మానం పూర్తి పాఠాన్ని ఇక్కడ ఇస్తున్నాము.)
ప్రతికూలత, సంకుచిత మనస్తత్వం, వారి చుట్టూ ఉన్న అవినీతి కారణంగా ప్రతిపక్షాలు తగిన సహకారం అందించలేకపోతున్నాయి. కాంగ్రెస్, పరస్పర స్వప్రయోజనాలు, విభేదాలు, దిశానిర్దేశం లేని నాయకత్వంతో నిరంతరం విచ్ఛిన్నమవుతున్న ఇటీవల ఏర్పడిన ‘ఇండీ’ కూటమి ఇక్కడ మనకు ప్రతిపక్షం. ఒకవైపు కాంగ్రెస్ లాంటి రాజకీయ పార్టీ అహంకారంతో క్షీణించిపోతుంటే మరోవైపు ఎక్సైజ్ కుంభకోణంలో పీకల్లోతు కూరుకుపోయిన ‘ఆమ్ ఆద్మీ పార్టీ’ జాతీయ నాయకత్వమంతా జైల్లో ఉంది. డీఎంకే నేతలు చేస్తున్న నిరాధారమైన ప్రకటనలు భారత మౌలిక స్ఫూర్తిని అనవసరంగా దెబ్బతీస్తున్నాయి. విపక్షాల మనస్తత్వానికి ఇవి అద్దం పడుతున్నాయి. ‘ఇండీ’ కూటమి తాను ప్రజాస్వామ్య విలువల ప్రతిరూపమని గొప్పలు చెప్పుకొంటుంటే క్షేత్రస్థాయిలో దాని ప్రధాన భాగస్వాములలో ఒకటైన టిఎంసి మహిళలు, ఇతర పౌరుల హక్కులను హరించడానికి ప్రభుత్వ యంత్రాంగాన్ని అడ్డగోలుగా ఉపయోగిస్తోంది.
వరుసగా రెండు ఎన్నికల్లో ఓడిపోయినా, దాని మద్దతు, ప్రాబల్యం నిరంతరం క్షీణిస్తున్నా కాంగ్రెస్ పార్టీ, దాని నాయకుల అహంకార ప్రదర్శన తార స్థాయికి చేరుకోవడం విడ్డూరం. కాంగ్రెస్ ప్రధాన నాయకుడు విదేశాలకు వెళ్లి భారతదేశ ప్రజాస్వామ్యాన్ని ప్రశ్నించడం, దాని ప్రజాస్వామ్య ప్రక్రియలో విదేశీ జోక్యాన్ని కూడా ఆహ్వానించడం ఈ అహంకారానికి పరాకాష్ట. గత దశాబ్దంలో భారతదేశం అనేక ముఖ్యమైన మైలురాళ్లను దాటి ప్రజల్లో దేశం పట్ల గర్వాన్ని నింపింది.
జీఎస్టీ అమలు ద్వారా ఆర్థిక న్యాయం వైపు గణనీయమైన పురోగతి, భారత రాష్ట్రపతిగా గిరిజన మహిళా శ్రీమతి ద్రౌపది ముర్ము చారిత్రాత్మక ఎన్నిక, భారతదేశ నాయకత్వంలోని ‘అమృత్ కాల్’లో కొత్త పార్లమెంటు భవనం ప్రారంభోత్సవం ఈ కీలక ఘట్టాలలో ఉన్నాయి. జి-20 వంటి అంతర్జాతీయ వేడుకలను, రాజకీయాల్లో న్యాయం, విధానం, భారతీయ సాంస్కృతిక విలువలను సూచించే ‘సెంగోల్’ చిహ్నాన్ని ఏర్పాటు చేయడం వంటి సందర్భాలను కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు బహిష్కరించాలని నిర్ణయించుకున్నాయి.
కాంగ్రెస్, దాని మిత్రపక్షాల మనస్తత్వం వారి రాజకీయాలు, విధానాలు, సిద్ధాంతాలపై ఆధారపడి ఉండవని, కేవలం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పట్ల వ్యతిరేకతే వారికి చుక్కాని అని స్పష్టమవుతోంది. ఒకవైపు వారి ప్రతికూల ఆలోచనలకు ఆధారాలు అనేకం ఉన్నాయి, మరోవైపు, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సమాజంలోని అన్ని వర్గాలతో సంభాషించి, వారిని తన వెంట తీసుకెళ్లడం ద్వారా దేశంలో సానుకూల వాతావరణాన్ని సృష్టించడానికి ప్రయత్నించారు.
2014లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వ హయాంలో అవినీతి పెచ్చరిల్లిన కాలాన్ని దేశం వీక్షించింది. నేటికీ జార్ఖండ్‌లో పట్టుబడిన రూ.350 కోట్ల నగదులోను, తమిళనాడులో దొరికిన కోట్ల రూపాయలలోను, ఛత్తీస్‌గఢ్‌లో మహాదేవ్ పేరును కూడా వదిలిపెట్టకుండా కోట్లాది రూపాయలను మహాదేవ్ బెట్టింగ్ యాప్ ద్వారా కాజేయడంలోను కాంగ్రెస్ నాయకులు, వారి మిత్రపక్షాల ప్రమేయం ఉంది. కాంగ్రెస్‌కు అధికార వ్యామోహం, అవినీతి దాహం ఇంకా తీరలేదని దీన్నిబట్టి తెలుస్తోంది.
దురదృష్టవశాత్తు, ప్రతిపక్షం పదేపదే పార్లమెంటు కార్యకలాపాలకు అంతరాయం కలిగిస్తోంది. పార్లమెంటు కార్యకలాపాలను అడ్డుకోవడమే కాకుండా రాజ్యాంగ పదవుల్లో ఉన్న అత్యున్నత వ్యక్తులను అవహేళన చేశారు. విశ్వసనీయమైన ప్రతిపక్ష పాత్రను కాంగ్రెస్ మసకబార్చింది. ప్రతిపక్షాలు చేసిన ఆరోపణలను కోర్టు ప్రతిసారీ ఎందుకు తిరస్కరించిందో కూడా సమాధానం చెప్పాలి. ఓబీసీ వర్గాల నుంచి వచ్చిన ప్రధానమంత్రి గురించి కులపరమైన వ్యాఖ్యలు చేసినందుకు కోర్టు తమను దోషులుగా నిర్ధారించినప్పుడు కూడా వారు విచారం వ్యక్తం చేయలేదు. కేంద్ర సంస్థల పరువు పదే పదే తీస్తున్న కాంగ్రెస్.. అవినీతి సొమ్ము ఎవరి ఇళ్లలో దొరికిందో, ఆ పార్టీ నేతలపై ఏం చర్యలు తీసుకుందో చెప్పాలి. ప్రపంచంలోని బలహీనమైన ఆర్థిక వ్యవస్థ (యుపిఎ హయాంలో) నుంచి ప్రపంచంలోని ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందిన దేశ ఆర్థిక వ్యవస్థ గురించి కాంగ్రెస్ కూడా ఆందోళన చెందడం అత్యంత హాస్యాస్పదం. ప్రతిపక్షాల ప్రతికూల ఆలోచన దేశ ప్రజాస్వామ్యానికి మంచి సంకేతం కాదు.
అస్థిరతకు మూలం కాంగ్రెస్
కాంగ్రెసేతర ప్రభుత్వాలను అస్థిరపరిచేందుకు జవహర్‌లాల్ నెహ్రూ కాలం నుండి అధికరణం 356 నిరంతర దుర్వినియోగానికి భారత ప్రజాస్వామ్య చరిత్రలో అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఎమర్జెన్సీ విధించి కాంగ్రెస్ పార్టీ దేశాన్ని అల్లకల్లోలం చేయడంతో దేశంలో సంక్షోభం తారస్థాయికి చేరుకుంది. చౌధురి చరణ్ సింగ్, సి రాజగోపాలాచారి, ఇందర్ కుమార్ గుజ్రాల్ లేదా దేవెగౌడ నేతృత్వంలోని ప్రభుత్వాలను అస్థిరపరచడం ద్వారా కాంగ్రెస్ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తుంది. ఈరోజు దిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వానికి కాంగ్రెస్ మద్దతు ఇస్తోంది. గతంలో, కాంగ్రెస్ ఆప్ పార్టీని వ్యతిరేకించింది, ఇప్పుడు వారు ఇండీ కూటమిలో కలిసి ఉన్నారు.
ఒకప్పుడు మమతా బెనర్జీని అత్యంత అవినీతి నాయకురాలిగా పిలిచిన కాంగ్రెస్ పార్టీ టిఎంసిని ఇండీ కూటమిలో భాగం చేసింది. ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీతో కాంగ్రెస్ తో రాగద్వేషాలు బంధాన్ని కొనసాగిస్తోంది. నేడు కాంగ్రెస్ కూటమిలో చేరిన చిన్న పార్టీలన్నీ ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో కాక, బంధుప్రీతి, అనువంశిక లక్ష్యాల సాధన కోసం చేస్తున్నాయి. నిశితంగా చూస్తే దేశంలో అస్థిరతకు మూలం కాంగ్రెస్ అని స్పష్టమవుతుంది.
వైషమ్యాలు, మోసం, వంచనలకు మారుపేరు ‘ఇండీ’ కూటమి
బిజెపి దేశంలో అనువంశిక లేదా కుటుంబ రాజకీయాలను వ్యతిరేకించింది. బంధుప్రీతి, వారసత్వం ఆధారంగా రాజకీయ పార్టీలను నడపరాదని వాదించింది. అయితే కాంగ్రెస్ పార్టీ, దాని ఇండీ కూటమి భాగస్వాములు ప్రజాస్వామ్యంలో ఆమోదయోగ్యం కాని అనువంశికత ఆధారంగా దేశ రాజకీయాలను నడపాలని కోరుకుంటున్నారు. పదేళ్ళ అవినీతి కుంభకోణాల పాలన కారణంగా ప్రజల నమ్మకం కోల్పోయిన కాంగ్రెస్ నేతృత్వంలోని యుపిఎ కూటమి ఇప్పుడు తెలివిగా ఇండీ కూటమి పేరుతో కొత్త ముసుగు వేసుకుందని దేశ ప్రజలకు బాగా తెలుసు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలు కాంగ్రెస్ భ్రమలను పటాపంచలు చేశాయి. ప్రభుత్వాన్ని మారుస్తామని చెప్పిన ఇండీ కూటమి ఇప్పుడు విభేదాలు, వైషమ్యాలు, మోసం, వంచనలకు పర్యాయపదంగా మారింది.
రానున్న 2024 ఎన్నికల్లో ఈ పొత్తు తమకు గుదిబండగా మారుతుందని కూడా కూటమిలోని ప్రాంతీయ పార్టీలు గ్రహిస్తున్నాయి. అందుకే పంజాబ్ నుంచి బెంగాల్ వరకు ప్రాంతీయ పార్టీలు ఇండీ కూటమిని వదిలించుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. 2019లో దేశాన్ని విభజించేందుకు కుట్ర పన్నిన ‘తుక్డే-తుక్డే’ ముఠా ఇప్పుడు కాంగ్రెస్ సలహా మండలిలో భాగం కావడం అత్యంత దురదృష్టకరం.
ఇండీ కూటమి వింత కలయిక
కేవలం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని వ్యతిరేకించేందుకు ఏర్పడిన ‘ఇండీ’ కూటమికి సైద్ధాంతిక ప్రాతిపదిక లేదు. ఇందులో భాగమైన వివిధ పార్టీలు ఎన్నికలలో ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నాయి. రాజకీయంగా కూడా ఒకరంటే ఒకరికి పొసగదు. కేరళలో కాంగ్రెస్, కమ్యూనిస్టులు పరస్పరం పోరాడుతుండగా, పంజాబ్‌లో కాంగ్రెస్‌పై ఆప్ పోటీ చేస్తోంది. పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ), కాంగ్రెస్ బద్ధ శత్రువులు. వారి మధ్య సైద్ధాంతిక సారూప్యత, సామరస్యం లేవు, వారికి ఉమ్మడి ఎజెండా లేదు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని అడ్డుకోవడమే వారి ఏకైక లక్ష్యం.
పేదల వ్యతిరేకి కాంగ్రెస్
కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు పేదరిక నిర్మూలన జరగాలని వాదించింది, అయితే దాని పాత్ర ఎప్పుడూ పేదలకు, దళితులకు, వెనుకబడిన వారికి, రైతులకు, కార్మికులకు వ్యతిరేకమే. పేద టీ అమ్మేవారి కుటుంబంలో పుట్టిన వ్యక్తి నేడు ప్రధానమంత్రి కావడాన్ని కాంగ్రెస్ జీర్ణించుకోలేక పోవడానికి ఇదే కారణం. మొదటి నుంచీ పేదల పేరుతో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అవినీతికి ఆలవాలాలని, ప్రతి రూపాయిలో 15 పైసలు మాత్రమే ప్రజలకు చేరుతున్నాయని రాజీవ్ గాంధీ స్వయంగా అంగీకరించారు. ఈ విస్తారమైన అవినీతి, దోపిడి కారణంగా స్వాతంత్య్రం వచ్చి ఎన్నో దశాబ్దాలు గడిచినా దేశం అభివృద్ధి చెందలేదు. పేదరికం, ఆకలి, నిరుద్యోగం సామాన్య ప్రజలను పీడించగా, కాంగ్రెస్ నాయకులు మాత్రం విలాసవంతమైన, సౌకర్యవంతమైన జీవితాన్ని అనుభవిస్తున్నారు.
కాంగ్రెస్‌కు పేదల అవసరాలపై అవగాహన లేదు. దేశంలో పేదరికాన్ని నిర్మూలించాలనే ఉద్దేశ్యం కూడా వారికి లేదు. నేడు వివిధ వినూత్న పథకాల ద్వారా దేశంలోని నిరుపేదలు కూడా ఇళ్లు, ఆరోగ్య బీమా, గ్యాస్ సిలిండర్లు, స్వచ్ఛమైన తాగునీరు, విద్యుత్, బ్యాంకింగ్, ఉచిత రేషన్ పొందుతున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కేవలం ఒక దశాబ్దంలో 25 కోట్ల మంది ప్రజలు బహుమితీయ పేదరికాన్ని అధిగమించారు. కోవిడ్-19 వంటి ప్రపంచ మహమ్మారి తర్వాత కూడా దేశంలో తీవ్ర పేదరికం రేటు 1 శాతం కంటే తక్కువకు చేరుకుంది.
కాంగ్రెస్, దాని మిత్రపక్షాలలో వేళ్లూనుకున్న అవినీతి
అవినీతిని వీసమెత్తు సహించకుండా అవినీతికి వ్యతిరేకంగా నరేంద్ర మోదీ ప్రభుత్వం చేస్తున్న అవిశ్రాంత పోరాటం అప్రతిహతంగా సాగుతోంది. కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడి నివాసంలో వందల కోట్ల నగదు దొరికింది. ఒక ముఖ్యమంత్రికి చెందిన దిల్లీ నివాసంలో నగదు స్వాధీనం చేసుకున్నారు. దిల్లీలో మద్యం కుంభకోణాలు, ఛత్తీస్‌గఢ్‌లో ‘మహదేవ్ యాప్ కుంభకోణం’ ప్రజానీకాన్ని దిగ్భ్రాంతపరిచాయి. దేశాన్ని దోచుకున్న వారు దోచుకున్న సంపదను దేశానికి తిరిగి ఇవ్వాల్సి ఉంటుందని మోదీ ప్రభుత్వం స్పష్టమైన సందేశం ఇస్తోంది. ఎంతటివారైనా అవినీతి కేసుల్లో ఎవరినీ వదిలిపెట్టరు. దేశానికి అవినీతి రహిత పాలన అందించడంలో విజయవంతమైన కృషికి గాను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ఈ జాతీయ సదస్సు అభినందిస్తోంది.
కాంగ్రెస్ విభజన రాజకీయాలు
కాంగ్రెస్ నాయకత్వం చాలా కాలంగా దేశాన్ని విభజించే చర్యలకు పాల్పడుతోంది. తాజాగా కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వంలోని ఓ ఉప ముఖ్యమంత్రి సోదరుడు, కాంగ్రెస్‌కు చెందిన లోక్‌సభ ఎంపీ ఒకరు దక్షిణ భారతాన్ని ప్రత్యేక దేశంగా గుర్తించాలని బహిరంగంగా డిమాండ్ చేశారు. ఈ విషయంపై కాంగ్రెస్ అధిష్టానం మౌనం వహిస్తోంది.
సాంప్రదాయ సంస్కృతికి మద్దతు ఇస్తున్నందుకు తమ పార్టీతో సంబంధం ఉన్న హిందూ సాధువును బహిష్కరించిన కాంగ్రెస్, విభజనవాద ప్రకటనలు చేసే వారిని మాత్రం కాపాడుతుంది. కాంగ్రెస్ మద్దతు ఇచ్చేది విభజనవాద శక్తులకే అని స్పష్టమైంది. దేశ విదేశాల్లోని అన్ని రకాల విభజనవాద శక్తులతో కాంగ్రెస్ నేతలు సంబంధాలు కలిగి ఉంటున్నారు. కోయంబత్తూరు బాంబు పేలుడులో పాల్గొన్న వ్యక్తులను విడుదల చేస్తారు “భారత్ తేరే తుక్డే హోంగే” వంటి నినాదాలు చేసే వారిని కాంగ్రెస్ ప్రచార కర్తలుగా చేసుకున్నారు.
విభజనవాద కార్యకలాపాలను ప్రోత్సహించే జార్జ్ సోరోస్ వంటి వ్యక్తులతో కాంగ్రెస్ సంబంధాలు స్పష్టంగా కనిపిస్తాయి. విదేశాలకు వెళ్ళి భారతదేశ ప్రజాస్వామ్యంలో విదేశీ శక్తులు జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేస్తారు. కాంగ్రెస్ నాయకులు మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పాకిస్తాన్ నుండి సహాయం కోరుతున్నారు, పాకిస్తాన్‌ను ప్రశంసించారు.
చాలా మంది కాంగ్రెస్ నేతలు పాకిస్థాన్‌లో పర్యటించి భారత వ్యతిరేక శక్తులకు సహకరించారు. అధికరణం 370 రద్దు సమయంలో, లోక్‌సభలో కాంగ్రెస్ నాయకుడు అధిర్ రంజన్ చౌదరి పాకిస్తాన్ ఆమోదాన్ని కోరారు. పాకిస్తాన్ తో ఈ సహకారం ఇక్కడితో ఆగదు. ఐరాసలో తమ ప్రయోజనాల కోసం అధికరణం 370పై రాహుల్ గాంధీ అధికారిక ప్రకటనలను పాకిస్తాన్ ఉపయోగించుకుంటుంది.
భారతీయ సంస్కృతిపై దాడి
అయోధ్య శ్రీరామ జన్మభూమిలో రామలల్లా ‘ప్రాణ ప్రతిష్ఠ’ వేడుకను బహిష్కరించడం ప్రతిపక్షాల సంతుష్టీకరణ రాజకీయాలకు ప్రతిరూపం. కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ, రాష్ట్రీయ జనతాదళ్, తృణమూల్ కాంగ్రెస్, ఆప్, డీఎంకేతో సహా ‘ఇండీ’ కూటమిలోని పార్టీలు శ్రీరామ మందిరం గురించి అవమానకరమైన వ్యాఖ్యలు చేస్తున్నాయి.
2024లో నరేంద్ర మోదీ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తే భారతదేశంలో సనాతన ధర్మ స్థాపన జరుగుతుందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అన్నారు. ఆయన కుమారుడు, కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే సనాతన సంస్కృతిని కించపరిచేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ సంకీర్ణ భాగస్వామి డీఎంకే సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియా, ఎయిడ్స్ వంటి వ్యాధులతో పోల్చినప్పుడు కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం దాన్ని సమర్థించారు.
‘ఇండీ’ కూటమిలోని రాష్ట్రీయ జనతాదళ్, సమాజ్‌వాదీ పార్టీ వంటి సంకీర్ణ భాగస్వాముల నాయకులు సనాతన ధర్మంపై నిరంతరం విషం చిమ్ముతున్నారు. ఈ జాబితాలో ఆప్ నాయకులు అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా మొదలుకుని హిందూ దేవతలను అవమానించే రాజేంద్ర గౌతమ్, గోపాల్ ఇటాలియా వరకు ఉన్నారు.
ప్రగతిశీల పథకాలన్నింటికీ కాంగ్రెస్ మోకాలడ్డు
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో గడచిన దశాబ్ద కాలంలో అభివృద్ధి చెందిన భారతదేశం అనే లక్ష్యాన్ని సాధించడానికి తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయాలను, చర్యలను అన్నింటినీ కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు వ్యతిరేకించాయి. అధికరణం 370 రద్దు, ట్రిపుల్ తలాక్‌పై కఠినమైన చట్టాలను అమలు చేయడం, పౌరసత్వ చట్టం సవరణ, కఠినమైన ఉగ్రవాద నిరోధక చట్టాలు లేదా జమ్మూ కాశ్మీర్ ప్రజలకు, దళితులు, గిరిజనులు, వెనుకబడిన వర్గాలకు భద్రత కల్పించడం వరకు కాంగ్రెస్ ప్రతిదాన్నీ వ్యతిరేకించింది. అంతేకాకుండా, సాయుధ దళాల విజయాలను, సంసిద్ధతను ఎప్పటికప్పుడు ప్రశ్నించడం ద్వారా మన దేశ సైనికుల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసేందుకు అది గర్హనీయమైన ప్రయత్నాలు చేసింది.
వ్యతిరేక రాజకీయాలు
గత దశాబ్ద కాలాన్ని పరిశీలిస్తే, ప్రతి సందర్భంలోనూ కాంగ్రెస్ తన హయాంలో మద్దతు ఇచ్చిన అన్ని పథకాలను తాను అధికారంలో లేనప్పుడు అలవాటుగా వ్యతిరేకించడం మనకు కనిపిస్తుంది. డిజిటల్ విప్లవంపై ప్రస్తుత ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలను కాంగ్రెస్ విమర్శించింది. ‘గరీబీ హఠావో’ నినాదాన్ని ఇచ్చిన కాంగ్రెస్ జన్‌ధన్ బ్యాంకు ఖాతాలను వ్యతిరేకించింది. యూపీఐ, ఆధార్ ఇలా అన్ని అంశాలనూ కాంగ్రెస్ వ్యతిరేకించింది. అదే జీఎస్టీ (వస్తువులు, సేవల పన్ను)ని సమర్థించడం, ఆచరణాత్మకంగా అమలు చేయడానికి సమయం వచ్చినప్పుడు కాంగ్రెస్ వ్యతిరేకించడం ప్రారంభించింది.
కాంగ్రెస్ హయాంలో కొత్త పార్లమెంట్ భవనం కోసం అనేక ప్రతిపాదనలు వచ్చాయి, అయితే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కొత్త పార్లమెంట్ భవన నిర్మాణాన్ని ప్రారంభించినప్పుడు, కాంగ్రెస్ దానిని వ్యతిరేకించింది. నిజానికి ఇది ప్రజాస్వామ్య దేవాలయాన్ని అవమానించడమే. వెనుకబడిన వర్గాల కోసం మొసలి కన్నీరు కారుస్తున్న కాంగ్రెస్ పదేళ్ల హయాంలో వెనుకబడిన తరగతుల కమిషన్ కు రాజ్యాంగ హోదా కల్పించలేకపోయింది. బిసి రిజర్వేషన్లను రాజీవ్ గాంధీ ఎంతగా వ్యతిరేకించారో అందరికీ తెలిసిందే. కోవిడ్ మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్నప్పుడు, భారతదేశం మహమ్మారితో పోరాడుతున్నప్పుడు, కాంగ్రెస్ దేశం మనోస్థైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేయడమే కాకుండా ఈ ప్రపంచ మహమ్మారిపై పోరాడటానికి తీసుకున్న చర్యలకు అడ్డంకులను కూడా సృష్టించింది. ‘మేడ్ ఇన్ ఇండీయా’ వ్యాక్సిన్‌ను కూడా వ్యతిరేకించింది. జాగ్రత్తగా గమనిస్తే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీసుకున్న చారిత్రాత్మకమైన, పరివర్తనాత్మక చర్యలు దేశానికి ఇంత మంచి చేసినా వాటిలో ప్రతి దాన్నీ కాంగ్రెస్ వ్యతిరేకించింది.
రాజ్యాంగ వ్యవస్థలకు, శాస్త్రవేత్తలకు అవమానం
దేశంలోని అన్ని రాజ్యాంగ వ్యవస్థలను అగౌరవపరచడం ఇండీ కూటమికి మొదటి నుంచి అలవాటు. న్యాయవ్యవస్థ, శాసనసభ, కార్యనిర్వాహక వ్యవస్థ, ఎన్నికల సంఘం గురించి బాధ్యతారాహిత్య ప్రకటనలు చేయడమే కాకుండా దేశ శాస్త్రవేత్తలను విమర్శించడానికి కూడా వెనుకాడరు. దేశ సైనిక దళాల ప్రధానాధికారిపై ఇప్పటికే కించపరిచే పదజాలం ఉపయోగించారు. పేదరిక నిర్మూలనను చంద్రయాన్ మిషన్‌తో పోల్చి చంద్రయాన్ మిషన్ విజయవంతానికి గణనీయమైన కృషి చేసిన శాస్త్రవేత్తలను కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రశ్నిస్తున్నారు! కోవిడ్ సమయంలో కూడా ప్రముఖ శాస్త్రవేత్తలను అగౌరవపరిచేలా దేశంలోని వ్యాక్సిన్‌ల గురించి సందేహాలు వ్యక్తం చేశారు. పైగా విదేశీ కంపెనీలపై ఆంక్షలు విధింపజేసేందుకు విఫల ప్రయత్నాలు జరిగాయి.
కాంగ్రెస్ అపరిణత , బాధ్యతారహిత రాజకీయాలు
రాజ్యాంగం, న్యాయవ్యవస్థ, పార్లమెంటు, ఎన్నికల సంఘం, ఓటింగ్ యంత్రాలు, ఓటర్లతో సహా దేశంలోని రాజ్యాంగ వ్యవస్థలను నిందించడం ద్వారా కాంగ్రెస్ తన తప్పులపై ఆత్మపరిశీలనను విస్మరించే ప్రయత్నం చేసింది. ఫలితంగా, రాహుల్ గాంధీ ఇప్పుడు విదేశాలకు వెళ్లి భారత ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని, విదేశాలు భారతదేశ అంతర్గత విషయాలలో జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఒకవైపు ప్రజాస్వామ్యానికి తల్లిగా పేరొందిన భారతదేశాన్ని అవమానిస్తూనే మరోవైపు ఎన్ని హెచ్చరికలు చేసినా అవే తప్పులు పునరావృత్తం చేస్తున్నారు. ‘చౌకీదార్ చోర్ హై’ వంటి ప్రకటనలకు వారు సుప్రీంకోర్టు ముందు ఎలా క్షమాపణలు చెప్పవలసి వచ్చిందో దేశం ఇప్పటికీ మర్చిపోలేదు. కాంగ్రెస్ తన తప్పుల నుంచి గుణపాఠాలు నేర్చుకోలేక మోసపూరిత రాజకీయాలను కొనసాగిస్తోంది. కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు ఇటువంటి అపరిపక్వ, బాధ్యతారహిత రాజకీయాలతో తమ విశ్వసనీయతను కోల్పోతున్నాయి.
ఇండీ కూటమి హింసాత్మక, చట్టవిరుద్ధ రాజకీయాలు
భారత జాతీయ కాంగ్రెస్, ఇండీ కూటమిలోని పలు భాగస్వామ్య పక్షాలు చట్టవిరుద్ద, హింసాత్మక రాజకీయాలకు పాల్పడుతున్నాయి. తాజాగా పశ్చిమ బెంగాల్‌లోని సందేశ్‌ఖాలీలో అందరినీ కలచివేసిన భయానక ఘటనలు వెలుగులోకి వచ్చాయి. తృణమూల్ కాంగ్రెస్ పశ్చిమ బెంగాల్‌లో బిజెపి కార్యకర్తలను నిరంతరం లక్ష్యంగా చేసుకుంటూ, హింస ద్వారా ప్రజల గొంతును అణిచివేసేందుకు ప్రయత్నిస్తోంది. అదేవిధంగా కేరళలో సిపిఎం ప్రభుత్వం, దాని మిత్రపక్షాల హయాంలో బిజెపి కార్యకర్తలపై అనేక హత్యలు, హింసాత్మక సంఘటనలు జరిగాయి. బీహార్‌లో రాష్ట్రీయ జనతాదళ్ స్థాపించిన ఆటవిక రాజ్యం ఇప్పటికీ దేశం గుర్తుంచుకుంటుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న ప్రతి చోటా దళితులు, గిరిజనులు, మహిళలు, రైతులు, సామాన్య ప్రజలు అనేక రకాల అణచివేతలను, వేధింపులను, దౌర్జన్యాలను ఎదుర్కొన్నారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు ప్రచారం చేస్తున్న హింస, అన్యాయాలకు వ్యతిరేకంగా తమ ప్రాణాలను పణంగా పెట్టి పోరాడుతున్న తమ కార్యకర్తల అంకితభావాన్ని బిజెపి అభినందిస్తోంది. ఇటువంటి ప్రతికూల రాజకీయాలకు వ్యతిరేకంగా మా పోరాటాన్ని కొనసాగించేందుకు కట్టుబడి ఉన్నాం.
కాంగ్రెస్ పతనం తథ్యం
కాంగ్రెస్, దాని సంకీర్ణ భాగస్వాములు అయోధ్యలో శ్రీరాముని ‘ప్రాణ ప్రతిష్ఠ’ వేడుక జాతీయ ప్రాధాన్యాన్ని అర్థం చేసుకోలేకపోవడం అత్యంత దురదృష్టకరం. ఈ శుభ సందర్భాన్ని పండుగలా జరుపుకోవడానికి, శ్రీరాముని పట్ల భక్తిని చాటుకోవడానికి దేశం మొత్తం ఏకతాటిపైకి వచ్చినప్పుడు కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు వారి సంకుచిత, దిశారాహిత్య రాజకీయాల కారణంగా దూరంగా ఉండిపోయాయి. తన ఓటు బ్యాంకు రాజకీయాలతో కళ్ళు మూసుకుపోయిన కాంగ్రెస్ ఏ జాతీయ సమస్యలోనూ పౌరుల పక్షాన నిలబడలేదు. అంతే కాదు, దేశ గౌరవాన్ని పెంపొందించే జాతీయ ప్రాముఖ్యత కలిగిన అంశం వచ్చినప్పుడల్లా కాంగ్రెస్ అడ్డంకులు సృష్టిస్తుంది. రామమందిర ఉద్యమాన్ని వ్యతిరేకించడమే కాకుండా రాముడి ఉనికిని ప్రశ్నించేంతగా దిగజారింది. ఈనాటికీ, బహుశా ‘రామసేతు’ను విచ్ఛిన్నం చేయలేకపోయినందుకు ఆ పార్టీ బాధపడుతోంది. ఇప్పుడు అయోధ్యలో అద్భుతమైన శ్రీరామ మందిర నిర్మాణాన్ని అంగీకరించలేక పోతోంది.
కాంగ్రెస్, మిత్రపక్షాల అవకాశవాద ఓటు బ్యాంకు రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారు. దేశం వారిని ఎప్పటికీ క్షమించదు అనడంలో సందేహం లేదు. నిరంతరాయంగా పతనమైన కాంగ్రెస్ కోలుకోలేని స్థితికి చేరుకుంది. స్వాతంత్ర్యం తరువాత ప్రారంభమైన మేధో క్షీణత దాని సంస్థాగత క్షీణతకు దారితీసింది. ఫలితంగా అధికారమే పరమావధిగా, దిశారహితంగా నడిపిన రాజకీయాలు ఆ పార్టీ పతనానికి దారితీశాయి.
నేడు ఈ రాజకీయం రాజకీయాలలోని అన్ని రకాల దురాచారాలకు, రుగ్మతలకు ప్రతీకగా మారింది. వంశపారంపర్య రాజకీయాలకే కాదు, ఓటు బ్యాంకు రాజకీయాల వల్ల కులం, ప్రాంతం, వర్గం, సంతుష్టీకరణ ఆధారిత విభజన రాజకీయాలకు కాంగ్రెస్, దాని మిత్రుల రాజకీయాలు పర్యాయపదంగా మారాయి. నేడు ప్రజలు తిరస్కరించినా, ప్రతి ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెబుతున్నా కాంగ్రెస్ మాత్రం ప్రతికూల ప్రచారం, రాజకీయాలలో అబద్ధాల మీద ఆధారపడుతోంది. నిరాధారమైన ఆరోపణలను పదే పదే చేయడం ద్వారా మళ్లీ అధికారంలోకి రావచ్చని అనుకుంటోంది.
కాంగ్రెస్ నిర్మాణాత్మక రాజకీయాలకు దూరంగా, ప్రజాస్వామ్య వ్యవస్థలను సంస్థలను అగౌరవపరుస్తూ, దేశాన్ని విచ్ఛిన్నం చేసే వారికి మద్దతుగా నిలిచినంత కాలం ప్రజలు ఎన్నికల్లో దానికి గుణపాఠం చెబుతూనే ఉంటారు. కాంగ్రెస్, ఇండీ కూటమి స్వార్థం, బంధుప్రీతి, అవినీతి, ప్రతికూల, పరాజయ రాజకీయాలను ఓడించి, అభివృద్ధి చెందిన భారతదేశం అనే సంకల్పంతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బలమైన నాయకత్వంలో ఏకం కావాలని బిజెపి జాతీయ సదస్సు ప్రజలకు పిలుపునిస్తోంది.