Modi at Adilabad

కాళేశ్వరంపై బీఆర్ఎస్, కాంగ్రెస్ కుమ్మక్కు

Modi in Adilabad Sabha

బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం కుంగిపోతే…. ఆ పార్టీతో కాంగ్రెస్‌ కుమ్మక్కవుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విమర్శించారు. గతంలో మీరు తిన్నారు.. ఇప్పుడు మేం తింటాం అన్నట్లు కాంగ్రెస్‌ పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ పోయి కాంగ్రెస్‌ వచ్చినా పాలనలో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేశారు. మార్చ్ 4న ఆదిలాబాద్ లో జరిగిన ‘‘విజయ సంకల్ప సభ’’లో పాల్గొన్న మోదీ, పెద్దఎత్తున తరలివచ్చిన ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. నా తెలంగాణ కుటుంబ సభ్యులారా .. అంటూ తెలుగులో ప్రసంగం మొదలుపెట్టి అందరినీ ఆకట్టుకున్నారు. ఇది ఎన్నికల సభ కాదు… అభివృద్ధి ఉత్సవంగా అభివర్ణించారు. ‘‘బిజెపి  పాలనలో దేశం అభివృద్ధి చెందుతోంది. గత 15 రోజుల కాలంలోనే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. గత 15 రోజుల్లో రెండు ఐఐటీలు, ఒక ట్రిపుల్‌ ఐటీ, 3 ఐఐఎం, ఒక ఐఐఎస్ జాతికి అంకితమిచ్చాం. 5 ఎయిమ్స్‌ను జాతికి అంకితమిచ్చాం. ప్రపంచంలోనే అతిపెద్ద స్టోరేజీ స్కీం ప్రారంభించుకున్నాం.’’ గత 15 రోజుల్లే జరిగిన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల జాబితాను చదివి వినిపించారు.

దేశాభివృద్ధి కోసం రూ.వేల కోట్ల పనులను చేపట్టామన్నారు. తెలంగాణలో కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, 15 రోజుల్లోనే ఆత్మనిర్భర్ భారత్ నుండి వికసిత్ భారత్ వైపు అడుగులు వేశామన్నారు. వికసిత్‌ భారత్‌పై నిన్న మంత్రులు, అధికారులతో సుదీర్ఘంగా చర్చించామని అన్నారు. బిజెపితోనే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని స్పష్టం చేశారు. ‘‘కుటుంబ పార్టీలను నమ్ముకోవద్దు. వారిలో ఉండేవి రెండే రెండు.. ఒకటి దోచుకోవడం.. రెండు అబద్ధాలు… బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు పార్టీలు ఒక్కటే.’’ అని విమర్శించారు.

ఆదివాసీ మహిళను రాష్ట్రపతిని చేసిన ఘనత బిజెపికే దక్కుతుందన్నారు. ఆదివాసీల ప్రగతి కోసం, వారి గౌరవాన్ని పెంచేందుకు బిజెపి  సర్కార్ ఎంతో కృషి చేస్తోందన్నారు. మోదీ గ్యారంటీపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుందంటూ ‘‘మోదీ గ్యారెంటీ అంటే…. గ్యారెంటీ అమలయ్యే గ్యారెంటీ’’ అని వివరించారు. ‘‘రాంజీ గోండ్ పేరుతో హైదరాబాద్‌లో మ్యూజియం ఏర్పాటు చేస్తున్నాం. దేశవ్యాప్తంగా ఏడు టెక్స్‌టైల్‌ పార్కుల్లో తెలంగాణకు ఒకటి కేటాయించాం. సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్‌ యూనివర్సిటీ, రైతుల కోసం పసుపు బోర్డును ఏర్పాటు చేశాం.’’ అంటూ తెలంగాణకు కేంద్రం చేసిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. రానున్న ఎన్నికల్లో 400 సీట్లకు పైగా లోక్‌సభ స్థానాల్లో గెలుపే లక్ష్యమని తేల్చి చెప్పారు. బిజెపికి ఓటేయాలంటూ ‘‘గత పదేళ్లలో పేదరికం నుంచి 25 కోట్ల మంది బయటపడ్డారు. వికసిత్‌ భారత్‌ కోసం బిజెపి  కృషి చేస్తుంది. తెలంగాణ ఏర్పడి పదేళ్లు అయింది. ఈ రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం సహకరిస్తుంది. పేదలు, దళితులు, ఆదివాసీల అభివృద్ధికి కృషి చేస్తుంది. బీఆర్ఎస్ పాలనలో ప్రజలకు జరిగింది ఏమీ లేదు… కాంగ్రెస్ పాలనలో కూడా ఏమీ జరగదు. బిజెపితోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యం.’’ అని అన్నారు.

ఈ సభలో రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి, బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్, ఎంపీ సోయం బాపూరావు, ఎమ్మెల్యేలు ఏలేటి మహేశ్వర్ రెడ్డి, పాయల్ శంకర్, పాల్వాయి హరీష్ బాబు, రామారావు పటేల్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. కాసం వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Modi Adilabad Memento

Adilabad Crowd