Kakatiya Toranam

వరంగల్‌కు పూర్వవైభవం తీసుకొస్తాం: కిషన్ రెడ్డి

మన భారతదేశ చరిత్రలో కాకతీయ పాలన సువర్ణ అధ్యాయమని, ఓరుగల్లు పేరు Kakatiya Toranam వినగానే కాకతీయుల ద్వారం మన కళ్లలో మెదులుతుందని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖల మంత్రి జి. కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ వైభవాన్ని తర్వాతి తరాలకు తెలియజేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఫసాడ్ ఇల్యుమినేషన్, సౌండ్ అండ్ లైట్ షో వంటి ఏర్పాట్లు  చేస్తోందన్నారు. త్వరలో సౌండ్ లేజర్ లైట్‌ షోను ప్రారంభించి, కాకతీయుల పరిపాలనను, పరాక్రమాన్ని కళ్లకు కట్టినట్లుగా చూపిస్తామన్నారు. కేంద్ర పురావస్తుశాఖ, ఇండియన్ ఆయిల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఖిలా వరంగల్ మధ్య కోట కీర్తితోరణాల నడుమ రూ.5 కోట్లతో నూతనంగా ఏర్పాటు చేసిన ఫసాడ్ లైటింగ్ ను మార్చ్ 7న ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లైటింగ్ ఏర్పాటుతో కాకతీయుల పరిపాలనా వైభవానికి ప్రతీకగా నిలిచిన కట్టడాలు మరింత శోభాయమానంగా కనిపిస్తాయన్నారు. తాను కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టగానే.. ప్రధానమంత్రి సహకారంతో రామప్ప దేవాలయానికి  యునెస్కో గుర్తింపు వచ్చేలా కృషి చేసినట్లు కిషన్ రెడ్డి తెలిపారు. రామప్ప దేవాలయం అభివృద్ధి పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వానికి రూ. 62 కోట్లు మంజూరు చేశామన్నారు. ములుగు, లక్నవరం, తాడ్వాయి ట్రైబల్ సర్కూట్ క్రింద రూ.62 కోట్లతో అభివృద్ధి చేశామన్నారు. పాండవుల గుట్టను క్షేత్ర స్థాయిలో పరిశీలించామని, అటవీ శాఖ అనుమతిస్తే అభివృద్ధి చేస్తామని కిషన్ రెడ్డి తెలిపారు. భద్రాచలం, జోగులాంబ దేవాలయాల అభివృద్ధి కోసం రూ.46 కోట్ల నిధులు కేటాయించామని అన్నారు. రూ.15 కోట్లతో వెయ్యి స్తంభాల గుడి మండపాన్ని పునరుద్ధరించామన్నారు. రూ.900 కోట్ల రూపాయల వ్యయంతో ములుగులో సమ్మక్క సారలమ్మ గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నామని.. తాత్కాలిక భవనంలో వచ్చే విద్యా సంవత్సరం నుంచే తరగతులు ప్రారంభిస్తామని ఆయన వెల్లడించారు.

Opening

ఖిలా వరంగల్ కోటలో విలువైన సంపద కబ్జాకు గురికాకుండా అధికారులతో పాటు ప్రజలు కూడా బాధ్యత తీసుకోవాలన్నారు. అమృత్ పథకం, హెరిటేజ్ సిటీ, స్మార్ట్ సిటీగా వరంగల్ నగరాన్ని గుర్తించి కేంద్రం నిధులు విడుదల చేసిన విషయాన్ని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. తెలంగాణలో మొదటి సిమెంట్ హైవేను హైదరాబాద్ నుండి వరంగల్ వరకు నిర్మించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. తెలంగాణలో హైదరాబాద్ తర్వాత రెండో అతిపెద్ద నగరమైన వరంగల్ ను రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేస్తామని అన్నారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ,శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్ బండా ప్రకాష్, వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, మాజీ మంత్రి విజయరామరావు, మాజీ ఎమ్మెల్యేలు ధర్మారావు, కొండేటి శ్రీధర్, స్థానిక కార్పొరేటర్లు సువర్ణ సురేష్, ఉమా దామోదర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.