Prashnistunna Telangana Rytu

బీఆర్ఎస్, కాంగ్రెస్ లను నమ్మి మోసపోవద్దు

Prashnistunna Telangana Rytuగత కేసీఆర్‌ ప్రభుత్వం కేవలం వారి కుటుంబ ప్రయోజనాల కోసమే పాటుపడితే.. ఆచరణ సాధ్యం కాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తోందని, ఆ పార్టీలను నమ్మి మోసపోవద్దని బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు డా. కె.లక్ష్మణ్‌ పేర్కొన్నారు. మార్చ్ 19న మేడ్చల్ జిల్లా కీసర మండలం కరీంగూడలో బిజెపి మేడ్చల్‌-మల్కాజ్ గిరి జిల్లా అధ్యక్షులు పి.విక్రంరెడ్డి అధ్యక్షతన జరిగిన ‘ప్రశ్నిస్తున్న తెలంగాణ రైతు’ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. పంటనష్టాన్ని పూడ్చేందుకు ప్రధాని మోదీ ఫసల్‌ బీమా యోజన ప్రవేశపెడితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో అమలు చేయలేదని, ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా అమలు చేసే ఆలోచన చేయడం లేదని విమర్శించారు. రైతు లేనిదే రాజ్యం లేదని, ప్రశ్నించే రాష్ట్ర రైతులకు ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాలనే ఈ సభలు నిర్వహిస్తున్నామన్నారు. భవిష్యత్తు బాగుండాలంటే మోదీని మళ్లీ ప్రధానిని చేయాలన్నారు. బిజెపి మల్కాజ్ గిరి లోక్‌సభ అభ్యర్థి ఈటల రాజేందర్‌ మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి రైతులను గోస పెడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి అత్యధిక స్థానాల్లో గెలుపొందడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం కుందన్‌పల్లికి చెందిన ఆదర్శ రైతు, ద్రాక్షరత్న చింతల వెంకట్‌రెడ్డిని ఘనంగా సత్కరించారు. కిసాన్‌ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కె. శ్రీధర్‌ రెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యులు జి. మధుసూదన్‌ రెడ్డి, నాయకులు ఎం.అంజయ్య యాదవ్‌, పి. జగన్‌మోహన్‌ రెడ్డి, సుదర్శన్‌ రెడ్డి, బి.శ్రీనివాస్‌, శోభా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.