Health

ఆరోగ్య వ్యవస్థకు కొత్త జవసత్వాలు

జాతీయ ఆరోగ్య విధానం (ఎన్ హెచ్ పి) 2017 నాణ్యమైన, సరసమైన ఆరోగ్య సంరక్షణను పౌరులందరికీ కల్పించడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. ఇటీవల సంవత్సరాల్లో ప్రజారోగ్యంపై మరిన్ని నిధులు వెచ్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని జాతీయ ఆరోగ్య ఖాతాల (ఎన్ హెచ్ ఏ) సమాచారం స్పష్టం చేస్తోంది. వీటిలో 2020-21, 2021-22 సంవత్సరాల తాత్కాలిక అంచనాలు కూడా ఉన్నాయి. 2014-15, 2021-22 మధ్య స్థూల జాతీయోత్పత్తి (జిడిపి) నిష్పత్తిలో ప్రభుత్వ ఆరోగ్య వ్యయం మున్నెన్నడూ లేనివిధంగా 63 శాతం పెరిగిందని ఇవి తెలియజేస్తున్నాయి. ఆరోగ్యంపై ప్రభుత్వ వ్యయం 2014-15లో జిడిపిలో 1.13 శాతం నుంచి 2019-20లో 1.35 శాతానికి పెరిగింది. ఇది 2020-21లో 1.60 శాతానికి, 2021-22లో 1.84 శాతానికి పెరిగింది. తలసరిపరంగా ప్రభుత్వ ఆరోగ్యం వ్యయం 2014-15 నుంచి 2019-20 మధ్య రూ.1,108 నుంచి రూ .2,014కి పెరిగింది. ఈ పెరుగుదల ధోరణి కొనసాగి 2020-21లో తలసరి ప్రభుత్వ వ్యయం రూ. 2,322కి, 2021-22లో రూ .3,156కి చేరుకుంది. తాత్కాలిక అంచనాల ప్రకారం 2014-15 స్థాయితో పోలిస్తే ఇది దాదాపు మూడు రెట్లు ఎక్కువ. మరో ముఖ్యమైన ధోరణి ఏమిటంటే ప్రభుత్వ ఆర్థిక బీమాపై వ్యయం 2013-14లో రూ.4,757 కోట్ల నుంచి 2021-22 నాటికి రూ .20,771 కోట్లకు, అంటే 4.4 రెట్లు పెరిగింది.

ఇది ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన (ఎబి పిఎం జెఏవై), రాష్ట్ర ఆరోగ్య బీమా/బీమా పథకాలలో పెరుగుతున్న పెట్టుబడులను సూచిస్తుంది. ఆరోగ్యంపై సామాజిక భద్రతా వ్యయం వాటా (ప్రభుత్వ నిధులతో కూడిన ఆరోగ్య బీమా, ప్రభుత్వ ఉద్యోగులకు వైద్య రీయింబర్స్‌మెంట్, సామాజిక ఆరోగ్య బీమా కార్యక్రమాలతో సహా) మొత్తం 2014-15లో 5.7 శాతం నుంచి 2019-20లో 9.3 శాతానికి పెరిగింది. మొత్తం ఆరోగ్య వ్యయంలో రోగులు సొంతంగా పెట్టుకునే ఖర్చు స్థిరంగా తగ్గుతోంది. ఇది 2014-15 నుంచి 2019-20 మధ్య 62.6 శాతం నుంచి 47.1 శాతానికి పడిపోయింది. తాత్కాలిక ఎన్.హెచ్.ఏ (జాతీయ ఆరోగ్య ఖాతాల) అంచనాల ప్రకారం ఈ ధోరణి కొనసాగి ఈ వ్యయం (రోగులు తమ జేబుల నుంచి పెట్టాల్సిన ఖర్చు) వాటా 2020-21లో 44.4 శాతానికి, 2021-22లో 39.4 శాతానికి తగ్గిపోయి ప్రజలకు ఎంతో ఊరట లభించింది. కోవిడ్-19 ఉధృతంగా వ్యాపించిన సమయంలో (2020-21, 2022) సొంత ఖర్చుల వాటా తగ్గడం మన ఆరోగ్య వ్యవస్థ స్థితిస్థాపకతను (పరిస్థితులకు అనుగుణంగా మారే సామర్థ్యం) వెల్లడిస్తోంది. రోగులు సొంత డబ్బు వాడకం తగ్గడానికి ప్రభుత్వం అనుసరిస్తున్న అనేక విధానాలు దోహదం చేశాయి. ఈ రోజు ఎబి-పిఎంజెఏవై లబ్ధిదారులు క్యాన్సర్‌తో సహా తీవ్రమైన అనారోగ్యాలకు శస్త్రచికిత్స, వైద్య చికిత్సను పొందేందుకు ఆస్తులను తాకట్టు పెట్టడమో, అమ్ముకోవడమో చేయనక్కర్లేదు.

జాతీయ నమూనా సర్వే (2017-18) ప్రకారం ప్రభుత్వ సౌకర్యాల వినియోగం, ప్రత్యేకించి ఇన్‌పేషెంట్ కేర్, ఆస్పత్రి ప్రసవాల విషయంలో పెరిగింది. ఉచిత అంబులెన్స్ సేవలు, పటిష్టమైన ప్రభుత్వ ద్వితీయ (వైద్య నిపుణులు అందించే సేవలు), తృతీయ సేవలు (తీవ్రమైన వ్యాధులకు ఆస్పత్రుల్లో చికిత్స), ప్రధానమంత్రి జాతీయ డయాలసిస్ కార్యక్రమం (దీని కింద 2016 నుండి 2.59 కోట్ల ఉచిత డయాలసిస్ లు చేశారు) రోగుల సొంత వ్యయాన్ని తగ్గించడంలో కీలకపాత్ర పోషించాయి. మందులకు, రోగ నిర్ధారణ పరీక్షలకు ప్రధానంగా రోగులు సొంత డబ్బును వెచ్చించాల్సి వస్తుంది. 1,69,000కు పైగా ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు (ఏఏఎంలు), ఆరోగ్యం, వెల్నెస్ కేంద్రాలతో సహా వివిధ ప్రభుత్వ ప్రాయోజిత కేంద్రాల్లో ఉచిత మందులు, రోగ నిర్ధారణ సేవలు అందించడంతో కుటుంబాలకు పెద్దమొత్తంలో ఖర్చులు ఆదా అవుతున్నాయి. సబ్ సెంటర్ ఏఏఎంలు 105 రకాల మందులను, 14 రోగ నిర్ధారణ పరీక్షలను ఉచితంగా అందిస్తాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్ర ఏఏఎంలు 172 మందులు, 63 రోగనిర్ధారణ పరీక్షలను ఉచితంగా అందించాలి. అసంక్రామిక వ్యాధుల (మధుమేహం, రక్తపోటు వంటివి) నివారణకు ఏఏఎంలలో నిర్వహించే ముందస్తు పరీక్షలు, ఉచిత చికిత్స ఆరోగ్యకరమైన జీవితాన్ని అందిస్తాయి. దీనివల్ల భవిష్యత్తులో తీవ్రమైన, ప్రాణాంతకమైన వ్యాధులు, తద్వారా కుటుంబాలపై పడే ఆర్థిక భారం తగ్గుతాయి. 

నేడు 10,000 కంటే ఎక్కువ జన్ ఔషధి కేంద్రాల ద్వారా, 1,900 పైగా నాణ్యమైన జనరిక్ మందులు,  దాదాపు 300 శస్త్రచికిత్సా వస్తువులు అన్ని జిల్లాల్లో తక్కువ ధరకు విక్రయిస్తున్నారు. 2014 నుంచి ఈ పథకం ద్వారా వినియోగదారులకు రూ 28,000 కోట్లు ఆదా అయినట్లు అంచనా. అదేవిధంగా, కరోనరీ స్టెంట్‌లు, ఆర్థోపెడిక్ మోకాలి ఇంప్లాంట్లు, క్యాన్సర్ మందులు, ఇతర అవసరమైన మందుల ధరల నియంత్రణ ఫలితంగా ప్రజలకు సంవత్సరానికి రూ.27,000 కోట్లు ఆదా అయ్యింది. ఆర్థిక సర్వేలు కూడా ఆరోగ్యంపై ప్రభుత్వ వ్యయం పెరుగుతున్న విషయాన్ని వెల్లడిస్తున్నాయి. జీడీపీలో ఆరోగ్యంపై 2020-21 ఆర్థిక సంవత్సరంలో 1.6 శాతం ఖర్చు చేయగా  2021-22లో 2.2 శాతం (సవరించిన అంచనా) ఖర్చు చేశారు. ఆరోగ్య సేవలు, వస్తువులపై ఖర్చు మాత్రమే కాకుండా, ఆర్థిక సర్వేల అంచనాల్లో ఆరోగ్యానికి దోహదం చేసే కీలకమైన సామాజిక అంశాలు, ముఖ్యంగా నీటి సరఫరా, పారిశుద్ధ్యం వంటి వాటిపై వ్యయాలు కూడా భాగంగా ఉంటాయి. సురక్షితమైన తాగునీరు, పారిశుద్ధ్యం ప్రజారోగ్యంపై విశేషమైన సానుకూల ప్రభావం చూపుతాయి. 2019లో జల్ జీవన్ మిషన్ ప్రారంభించిన సమయంలో కేవలం 17 శాతం గ్రామీణ కుటుంబాలకు మాత్రమే నల్లా నీరు అందుబాటులో ఉండేది. ఇప్పుడు దాదాపు 76 శాతం మంది ఇళ్ళకు నల్లా కనెక్షన్‌ని కలిగి ఉన్నారు. 

ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం ప్రతి గ్రామీణ ఇంటికి నల్లా నీరు అందుబాటులోకి వస్తే అది ఐదేళ్లలో నాలుగు లక్షల మంది ప్రాణాలను కాపాడుతుంది. అదేవిధంగా, గ్రామీణ భారతదేశాన్ని బహిరంగ మల విసర్జనరహితంగా మార్చడానికి ఉద్దేశించిన స్వచ్ఛ్ భారత్ మిషన్-గ్రామీణ్ 2014-2019 అక్టోబర్ మధ్యకాలంలో అతిసారం, పోషకాహార లోపం కారణంగా సంభవించే మూడు లక్షలకు పైగా మరణాలను నివారించిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వేసింది. ప్రజారోగ్య వ్యయంలో పెరుగుదల, సొంత వ్యయంలో స్థిరమైన తగ్గుదల, ఆరోగ్య సంరక్షణలో ప్రభుత్వ వ్యయం, సామాజిక భద్రతా పథకాల వాటా పెరుగుదల ఇవన్నీ భారత్ మరింత ప్రగతిశీల ఆరోగ్య వ్యవస్థ వైపు దిశగా పయనించడాన్ని సూచిస్తున్నాయి.

ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్ష యోజన (వైద్య కళాశాలలు, కొత్త ఎయిమ్స్ ల ఏర్పాటు), ప్రధాన మంత్రి ఆయుష్మాన్ భారత్ మౌలిక సదుపాయాల మిషన్, అత్యవసర ప్రతిస్పందన, ఆరోగ్య వ్యవస్థ సన్నద్ధత ప్యాకేజీ (పిల్లల, వయోజనుల ఐసియుల అభివృద్ధి కోసం) వంటి వివిధ పథకాల కింద ఆరోగ్య మౌలిక సదుపాయాలను పటిష్టం చేస్తున్నారు. అలాగే 15వ ఆర్థిక సంఘం నిధుల కింద స్థానిక సంస్థలకు ఆరోగ్య గ్రాంట్లు (రూ.70,000 కోట్లు) ప్రాథమిక ఆరోగ్య వ్యవస్థకు సమకూరుస్తున్నారు. సార్వత్రిక ఆరోగ్య సేవలను సమీప భవిష్యత్తులోనే సాకారం చేసేందుకు భారత ఆరోగ్య వ్యవస్థ అవసరమైన సంస్కరణలు చేపడుతూ, పనితీరును మెరుగుపరుచుకుంటూ, అవసరమైన మార్పులను చేపడుతోంది. ఆరోగ్యం కోసం ప్రభుత్వ నిధులను పెంచడం, కుటుంబాలపై సొంత ఖర్చుల ఒత్తిడి తగ్గడం వంటి ఇటీవలి పరిణామాలు ఈ పరివర్తనకు అద్దం పడుతున్నాయి.

వినోద్ కె పాల్,
నీతి ఆయోగ్ సభ్యుడు