సందడిగా18వ లోక్‌సభ తొలి సమావేశాలు
18వ లోక్‌సభ తొలి సమావేశాలు జూన్ 24న సందడిగా ప్రారంభమయ్యాయి. ఉదయం 11 గంటలకు సభ ప్రారంభం కాగానే ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్.. సభ్యులతో ప్రమాణం చేయించే కార్యక్రమం చేపట్టారు. లోక్‌సభాపక్ష నేతగా ప్రధాని మోదీ తొలుత ఎంపీగా హిందీలో ప్రమాణం చేశారు. ఆయన పోడియం వద్దకు రాగానే ఎన్డీయే కూటమి సభ్యులంతా ‘జై శ్రీరాం’ అంటూ నినాదాలు చేశారు. అమిత్ షా ప్రమాణం చేసేటప్పుడు అధికారపక్ష సభ్యులు రాజ్యాంగం ప్రతులను పట్టుకుని తమ సీట్లలోనే కూర్చుని ఉన్నారు. ఆ తరువాత వరుసగా రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ సహా కేంద్రమంత్రులు ప్రమాణం చేశారు.
తొలిరోజు సమావేశాల్లో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సికింద్రాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న జి.కిషన్‌రెడ్డి పంచెకట్టుతో వచ్చి తెలుగు సంప్రదాయాన్ని ప్రతిబింబించారు. ఆయనతో పాటు రాష్ట్రానికి చెందిన మరో కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ తెలుగులోనే ప్రమాణం చేశారు. కేంద్రమంత్రులు మినహా తెలంగాణ ఎంపీలు మరుసటి రోజు జూన్ 25న ప్రమాణం చేశారు.
కేంద్రమంత్రుల తరవాత అక్షర క్రమంలో అండమాన్ నికోబార్ నియోజకవర్గానికి చెందిన లోక్‌సభ సభ్యుడు బిష్ణు పాద రేతో ఎంపీల ప్రమాణం మొదలైంది. లోక్‌సభలో ఎంపీల ప్రమాణం సందర్భంగా భాషా వైవిధ్యం కనిపించింది. పలువురు సభ్యులు తెలుగు, సంస్కృతం, డోగ్రి, బెంగాలీ, అస్సామీ, ఒడియా తదితర భాషల్లో ప్రమాణం చేశారు. బిహార్‌లోని సారణ్ నుంచి ఎంపీగా గెలుపొందిన బిజెపి సభ్యుడు రాజీవ్ ప్రతాప్ రూడీ తన మాతృభాష భోజ్‌పురిలో ప్రమాణం చేయలేకపోయారు. రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో పొందుపరిచిన 22 భాషల్లో భోజ్‌పురి లేకపోవడమే దీనికి కారణం.
లోక్‌సభ సమావేశాల ప్రారంభానికి ముందు ప్రొటెం స్పీకర్‌గా భర్తృహరి మహతాబ్‌తో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రమాణం చేయించారు. ఎంపీల ప్రమాణం ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్, ప్యానల్ స్పీకర్ రాధామోహన్‌సింగ్‌ల ఆధ్వర్యంలో సాగింది. అంతకు ముందు బిజెపి సీనియర్ సభ్యులు, ప్రొటెం స్పీకర్‌కు సహాయకులుగా వ్యవహరిస్తున్న రాధా మోహన్ సింగ్, ఫగ్గన్ సింగ్ కులస్తే ఎంపీలుగా ప్రమాణం చేశారు. ఒక్కో ఎంపీ తరఫున ఐదుగురు అతిథులను అనుమతించారు. వారంతా ప్రేక్షకుల గ్యాలరీలో కూర్చొని కార్యక్రమాన్ని తిలకించారు.