Modi

అణగారిన వర్గాలకు అండగా ఎన్డీయే ప్రభుత్వం

2016 ఏప్రిల్ 5న భారతదేశ రాజకీయ చరిత్రలో ఒక ముఖ్యమైన ఘట్టం చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్‌లో ఎస్సీ, ఎస్టీ, మహిళా పారిశ్రామికవేత్తల సాధికారత కోసం స్టాండ్ అప్ ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు బాబు జగ్జీవన్ రామ్‌ దేశానికి చేసిన ఎనలేని సేవలను స్మరించుకుంటూ ఆయనకు నివాళులర్పించారు. ప్రధానమంత్రి సభను ఉద్దేశించి ప్రసంగిస్తున్నప్పుడు ఆయన చిత్రపటం వేదికపై ఉంది. బాబూజీ వారసత్వాన్ని స్మరించుకోవడానికి, ఈ రకమైన కార్యక్రమాన్ని ప్రారంభించటానికి ఇంతకంటే ముఖ్యమైన సందర్భం మరొకటి లేదు.

మోదీ నేతృత్వంలోని పార్టీలకు అతీతమైన ఈ ప్రభుత్వ విధానం లక్ష్యం సకల జనుల సాధికారత, సామాజిక న్యాయమే. పార్లమెంటు సెంట్రల్ హాల్, రాజ్యాంగం ముందు సాష్టాంగం చేయడం, రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకోవడం లేదా సమాజంలోని సామాజికంగా వెనుకబడిన వర్గాలకు ప్రాతినిధ్యాన్ని కల్పించడం వంటివి ఇప్పుడు మూడోసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీయే ప్రభుత్వానికి సామాజిక న్యాయం పట్ల గల నిబద్దతను వెల్లడిస్తున్నాయి. ఇటీవల ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో, ముఖ్యంగా యూపీ వంటి కీలక రాష్ట్రంలో దళితుల ఓట్లు ‘ఇండీ’ కూటమికి రావడంపై మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇది నిజమే అయినప్పటికీ సామాజిక న్యాయాన్ని కల్పించడంలో ప్రభుత్వ అచంచల నిబద్ధతను ఎవరూ కాదనలేరు. రాజకీయాల్లో కొన్ని రోజుల్లోనే మార్పులు సాధ్యమైనందున మధ్యంతర కాలం నుంచి దీర్ఘకాలంలో కోల్పోయిన ఓట్లను బిజెపి నేతృత్వంలోని ఎన్డీయే తిరిగి పొందే అవకాశాన్ని పూర్తిగా తోసిపుచ్చలేం. ఏది ఏమైనప్పటికీ ఎన్నికలు, పాలన, విధానంలో సామాజిక న్యాయం కీలక పాత్ర పోషిస్తుందని మనం గుర్తించాలి.

2014లో అధికారం చేపట్టినప్పటి నుంచి బిజెపి నేతృత్వంలోని ఎన్డీయే అట్టడుగు వర్గాల కృషిని స్మరించుకోవడం, వారికి ప్రాతినిధ్యం కల్పించడంపై వినూత్న వైఖరిని అనుసరించింది. వర్తమానం, గతం నుంచి కొన్ని ఉదాహరణలను పరిశీలిద్దాం. ఒడిశాలో మొదటి బిజెపి ప్రభుత్వంలో కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన మోహన్ మాంఝీనే తీసుకోండి. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన గిరిజన నేత. రాష్ట్రంలోని గిరిజన సోదరులతో ఆయనకున్న గాఢమైన అనుబంధం ఆయనను ఈరోజు ఈ స్థాయికి చేర్చింది. భారతదేశ తొలి గిరిజన రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ఎన్నికపై కాంగ్రెస్ వ్యతిరేకతను కూడా చరిత్ర విస్మరించకూడదు. రాష్ట్రపతి ముర్ము అయోధ్యలోని రామ మందిరంలో గర్భగుడిని సందర్శించారని గుర్తుంచుకోవాలి. ఈ ప్రదేశాన్ని ఏదైనా దేవాలయంలో కొన్ని వర్గాల ప్రజలు మాత్రమే సందర్శిస్తారు.
జీసీ ముర్ము ఒక గిరిజనుడు. దేశ కంప్ట్రోలర్, ఆడిటర్ జనరల్ (సిఏజి). భారతదేశపు అత్యుత్తమ బ్యూరోక్రాట్లలో ఒకరు. స్వతంత్ర భారత చరిత్రలో ఉన్నత స్థాయి అధికారాలలో ఆదివాసీల ప్రాతినిధ్యానికి ఇది ఒక సమున్నత నిదర్శనం. దీనికి అనుగుణంగా, గిరిజన దిగ్గజం బిర్సా ముండా 150వ జయంతిని పురస్కరించుకుని 2025ని జన జాతీయ గౌరవ్ వర్ష్‌గా జరుపుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది.

80 ఏళ్ల ‘యువ’ యోధుడు జీతన్ రామ్ మాంఝీ ఓటమిని అంగీకరించని ధీరుడు. 2024లో సార్వత్రిక ఎన్నికల సమయంలో ప్రధాన మంత్రి మోదీ, ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలోని ఎన్డీయే నిర్మించిన సామాజిక న్యాయ సంకీర్ణం బీహార్‌లో ఆయన ఎన్నికల విజయానికి కారణం. 2014, 2019లో ఓడిపోయిన మాంఝీ, ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ఈ సారి విజయం సాధించారు. అనుభవజ్ఞుడైన ఈ దళిత నాయకుడు బీహార్‌లోని అణచివేతకు గురైన ముసహర్ కులానికి చెందినవాడు. ఆయన భారతదేశ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడికీ లేని అద్భుతమైన ఎదుగుదలను రాజకీయ జీవితం సూచిస్తుంది. నేడు ఆయన కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల మంత్రిగా ఉన్నారు.

మేధో పెట్టుబడిగా దళితులను ప్రధాన రాజకీయ స్రవంతిలోకి తీసుకురావడం ఎన్డీయేకు ఇదే మొదటిసారి కాదు. 2001లో ప్రధానమంత్రి వాజ్‌పేయి హయాంలో అంతగా తెలియని రాణి ఝల్కారీబాయి గౌరవార్థం భారత ప్రభుత్వం ఒక స్టాంపును విడుదల చేసింది. దళితులు, ఓబీసీలు కేంద్ర మంత్రివర్గంలో కీలకమైన శాఖలు నిర్వహించడం బిజెపి నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వంలో నిజమైన సామాజిక న్యాయానికి ప్రతీక. సామాజిక న్యాయం సారథ్యంలోని సాధికారతకు మోదీ 3.0 కొనసాగింపు.

2015 కి ముందు నవంబర్ 26ని న్యాయ దినోత్సవంగా పిలిచేవారు. దాన్ని మోదీ ప్రభుత్వం రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకోవడం ప్రారంభించింది. యాదృచ్ఛికంగా ఈ నిర్ణయం అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా జరిగింది. ఒక నాగరిక జాతీయ-రాజ్యంగా మన పునాదిని ఉత్తమంగా వ్యక్తీకరించే రెండు పదాలు ఉంటే అవి ‘రాజ్యాంగ ప్రజాస్వామ్యం’. మన రాజ్యాంగం, దాని అత్యుత్తమ వ్యాఖ్యాతలలో ఒకటిగా నిలిచిన సుప్రీం కోర్టు ప్రపంచానికి శక్తిమంతమైన ఉదాహరణగా నిలిచాయి. రాజ్యాంగ దినోత్సవం పౌరులందరికీ రాజ్యాంగాన్ని చదవడమే కాక దాన్ని ఆచరణలో పెట్టాలని సున్నితంగా గుర్తు చేస్తుంది. నిస్సందేహంగా భారత రాజ్యాంగం, అట్టడుగు వర్గాలకు సాధికారత కల్పించే రిజర్వేషన్ల వంటి కీలకమైన నిబంధనలను పునరుద్ఘాటించే ఈ వినూత్న నిర్ణయానికి (రాజ్యాంగ దినోత్సవం) గాను భారత ప్రభుత్వాన్ని, ప్రధాని మోదీని మనం అభినందించాలి. ఈ దినోత్సవం భారత్ మృదుశక్తికి కూడా ఒక అద్భుతమైన మూలం. ఇది భారతదేశానికి విశేష ప్రాధాన్యాన్ని, నైతిక ఆధిక్యతను ఇస్తుంది. ఇది ఇప్పటివరకు మనకు మార్గనిర్దేశం చేసిన రాజ్యాంగపు మౌలిక విలువలను, న్యాయం, సమానత్వం, సౌభ్రాతృత్వం, స్వేచ్ఛను భారతీయ దృక్కోణం నుంచి దేశ ప్రజలకే కాక యావత్ ప్రపంచానికి చాటి చెబుతుంది.

గత దశాబ్దంలో బిజెపి ‘బ్రాహ్మణ-బనియా’ పార్టీగా కాకుండా నిర్ణయాత్మకంగా అందరిపార్టీగా మన్నన పొందిందని ఈ కీలక ఉదాహరణలు స్పష్టం చేస్తున్నాయి. దాని ‘సంప్రదాయ’ ఓటర్లను కోల్పోయే ప్రమాదం ఉన్నప్పటికీ, ఓబీసీలు, దళితులు, గిరిజనులు, వెనుకబడిన, అత్యంత వెనుకబడిన వర్గాలను తన విధానాలు, నిశ్చయాత్మక చర్యలు , పాలనలో భాగం చేసే తన నైతిక కర్తవ్యాన్ని పార్టీ ధైర్యంగా నిర్వర్తిస్తూనే ఉంది. ప్రజలు ప్రభుత్వం వద్దకు రాకూడదని, ప్రభుత్వమే ప్రజల వద్దకు వెళ్లాలని, ముఖ్యంగా సమాజంలోని అట్టడుగు వర్గాల వద్దకు వెళ్లాలని 2014 నుంచి కేంద్రం నిర్దేశించుకుంది. సామాజిక న్యాయం పట్ల పార్టీ లేదా ప్రభుత్వ నిబద్ధతను ఒక ఎన్నిక నిర్ణయించడమో, అంచనా వేయడమే చేయలేవు. అట్టడుగు వర్గాల సాధికారత గురించి నిశితంగా, నిష్పక్షపాతంగా విశ్లేషిస్తేనే వాస్తవం తెలుస్తుంది.

గురు ప్రకాష్,
బిజెపి జాతీయ అధికార ప్రతినిధి