అంబేద్కర్‌ను ఘోరంగా అవమానించిన కాంగ్రెస్ మొసలి కన్నీరు

రాహుల్ గాంధీ అతితెలివి చేష్టల కారణంగా అంబేద్కర్ పేరు మీద బిజెపిని బదనాం చేద్దామని కుట్ర పన్నిన కాంగ్రెస్ బాబాసాహెబ్ విషయంలో తమ దగాకోరు చరిత్రను బయటపెట్టుకొని బొక్కబోర్లాపడ్డది.

స్వాతంత్ర్యం పూర్వం, స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్లలో అంబేద్కర్‌కు, నెహ్రూకు ఎప్పుడూ పొసగలేదు. వారిద్దరూ ఒకరిపై ఒకరు ఘాటు విమర్శలు చేసుకున్న సంగతి లోకవిదితమే. ముఖ్యంగా నెహ్రూ పనిగట్టుకొని 1952 సార్వత్రిక ఎన్నికల్లో, 1954 భండారా ఉప ఎన్నికల్లో అంబేద్కర్‌ను ఓడించడాన్ని దళిత సమాజంతో పాటు, యావత్ దేశభక్తులు జీర్ణించుకోలేదు. నెహ్రూ, ఇందిరా, రాజీవ్ గాంధీ ఓట్ల కోసం అంబేద్కర్ పేరును దశాబ్దాలుగా వాడుకున్నారు కానీ, అంబేద్కర్ ఫోటోను కూడా పార్లమెంటులో పెట్టే ప్రయత్నం చేయలేదు. మహాత్మా గాంధీ ఒత్తిడితో దేశ తొలి క్యాబినెట్ లో నెహ్రూ చేర్చుకున్న ఇద్దరు గొప్ప దేశభక్తులు డా. బాబాసాహెబ్ అంబేద్కర్, డా. శ్యామ ప్రసాద్ ముఖర్జీ. నెహ్రూ అవకాశవాద, ఓటుబ్యాంకు, దేశవ్యతిరేక చర్యల కారణంగా వీరిద్దరూ వేరువేరు సందర్భాల్లో మంత్రివర్గం నుంచి బయటకు రావాల్సి వచ్చింది. ఈ అసమాన దేశభక్తులను, సమర్థ నాయకులను పొమ్మన లేక పొగబెట్టినట్టు కుట్రపూరితంగా బయటకు పంపించారు. నెహ్రూ-లియాఖత్ ఒప్పందం, ఆర్టికల్ 370, ఇతర ముస్లిం ఓటుబ్యాంకు రాజకీయ నిర్ణయాలే ఇందుకు కారణం.

నెహ్రూ కుటుంబం మూడు తరాలు వరసగా తమకు తాము భారతరత్న అవార్డు ఇచ్చుకుందే కానీ, ఏనాడూ రాజ్యాంగ నిర్మాత, నిష్కళంక దేశభక్తుడు, దళిత జనోద్ధారకుడు అయిన అంబేద్కర్ కు దేశ అత్యున్నత పురస్కారం ఇచ్చే ప్రయత్నం చేయలేదు. 1980వ దశకంలో రామజన్మభూమి ప్రభావం కారణంగా బిజెపి బలపడ్డ తర్వాత అంబేద్కర్ కు కాంగ్రెసేతర ప్రభుత్వం భారతరత్న అవార్డు ప్రకటించింది.

నెహ్రూ, ఇందిర, సంజయ్, రాహుల్ గాంధీలకు దిల్లీలో ఎకరాల కొద్ది స్థలాల్లో స్మారక చిహ్నాలు నిర్మించారు కానీ, అంబేద్కర్‌కు మాత్రం నిర్మించలేదు. 1959 జూన్ 18న ఒక మేయరు అంబేద్కర్ స్మారక చిహ్నం గురించి విజ్ఞప్తి చేస్తే తీవ్ర వ్యతిరేకతతో దానిని తోసిపుచ్చారు. 1956లో అంబేద్కర్ మృతి చెందితే వారి పేరు మీద ఒక్క పోస్టల్ స్టాంపు కూడా ఆ సందర్భంలో విడుదల చేయలేదు. 1966లో అంబేద్కర్ 75వ జయంతి సందర్భంగా ఒక పోస్టల్ స్టాంపు విడుదల అయినా ఆ స్టాంపు బ్రోచర్‌లో బాబాసాహెబ్ గురించి అవమానకరంగానే రాశారు.

నెహ్రూ ప్రభుత్వం దళితులకు, ఆదివాసీలకు, బీసీలకు చేస్తున్న అన్యాయం కారణంగా, నెహ్రూ తన పూర్తి శ్రమను, సమయాన్ని ముస్లింల కోసమే వినియోగిస్తున్న కారణంగా, కమ్యూనిస్టుల ప్రభావంతో నెహ్రూ విదేశీ విధానం దేశ వ్యతిరేకంగా ఉండడం కారణంగా తాను రాజీనామా చేయాల్సి వచ్చిందని 10 అక్టోబర్ 1951లో పార్లమెంటులో (రాజ్యాంగసభ) అంబేద్కర్ బాహాటంగా ప్రకటించి కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేశారు.

అంబేద్కర్ మృతి చెందిన 5 దశాబ్దాల తర్వాత కూడా బాబాసాహెబ్ ను అవమానించే విధంగానే కాంగ్రెస్ వ్యవహరించింది. ‘‘అంబేద్కర్ నత్తపై కూర్చుండగా నెహ్రూ వారిని కొరడాతో చితకబాదుతున్నట్టు’’ ఉండే కార్టూన్ ను 2006లో ఎన్సీఈఆర్టీ పుస్తకంలో ముద్రించి 2012 వరకు కొనసాగించింది. ఈ కార్టూన్ వేసిన నెహ్రూ మిత్రుడు కేశవ శంకర్ పిళ్లైకు పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ అవార్డులను కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రదానం చేశాయి. 2012లో పార్లమెంటులో పెద్ద గలాభా జరగడంతో అప్పటి మానవ వనరుల మంత్రి కపిల్ సిబల్ ఆ కార్టూన్ ను ఎన్సీఆర్టీ పుస్తకం నుంచి తొలగించారు. బిజెపి బలపడ్డ తర్వాత వాజ్‌పేయి ప్రధాని అయినప్పటి నుంచి ముఖ్యంగా మోదీ అధికారంలోకి వచ్చాక అంబేద్కర్ చరిత్రను బయటకు తీయడం, వారి ఫోటో పార్లమెంటులో పెట్టడం, అంబేద్కర్‌తో అనుబంధం ఉన్న ఐదు ముఖ్యక్షేత్రాలను పంచతీర్థగా జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసి బాబాసాహెబ్ గౌరవాన్ని నిలిపే ప్రయత్నం చేశారు.

మరొక దళిత దేశభక్తుడైనా బాబూ జగ్జీవన్ రాంను కూడా కాంగ్రెస్ దశాబ్దాల పాటు హరిజనుల ఓట్ల కోసం వాడుకుంది. 1975లో అలహాబాద్ హైకోర్టు ఇందిరా గాంధీ రాయ్ బరేలీ ఎన్నిక అక్రమమని, అది చెల్లదని, 6 సంవత్సరాలు రాజకీయాలకు దూరంగా ఉండాలని తీర్పు ఇచ్చినప్పుడు, అప్పుడు సీనియర్‌గా ఉన్న బాబూ జగ్జీవన్ రాంకు ప్రధాన మంత్రి అవకాశం వస్తే, అది జీర్ణించుకోలేని ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ విధించి, వేలాది మందిని జైల్లో నిర్బంధించి, మానవ హక్కులు కాలరాసింది. సీనియారిటీ కాదని తీసుకున్న చీఫ్ జస్టిస్ తీర్పు అండతో అధికారంలో కొనసాగిన ఇందిరా గాంధీని భరించలేక బాబూ జగ్జీవన్ రాం కూడా కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. కాంగ్రెస్ దళితులకు, దేశానికి వ్యతిరేకమని అంబేద్కర్ ఏనాడో చెప్పారు. దళితులను ఎన్నో సార్లు దగా చేసిన నెహ్రూ కుటుంబం, కాంగ్రెస్ ఇప్పుడు దళితుల ఓట్ల కోసం అంబేద్కర్ పేరును మళ్లీ మళ్లీ జపించడం, మొసలి కన్నీరు కార్చడం దేశభక్తుల్లో ఆగ్రహం తెప్పించి, ఓపిక నశించే పరిస్థితి తీసుకొచ్చింది. ఇలాంటి విద్రోహ కాంగ్రెస్‌ను, నెహ్రూ కుటుంబాన్ని దళిత సమాజమే కాదు, యావత్ దేశభక్తులు ఎన్నడూ నమ్మరు, క్షమించరు.