అమెరికాలో భారతీయులపై ‘మాగా’ పంజా
గత ఏడాది ఆగస్టు నుంచి ఈ ఏడాది జనవరి మధ్య కేవలం నాలుగు నెలల వ్యవధిలో నేను చేసిన రెండు అమెరికా పర్యటనలు, ఆ దేశం ఎన్నడూ లేనంతగా ఒక ప్రమాదకరమైన ధోరణిలోకి వెళ్తోందన్న కఠిన వాస్తవాన్ని కళ్లకు కట్టాయి. గతేడాది ఆగస్టులో నేను వాషింగ్టన్ డీసీని సందర్శించినప్పుడు, అక్కడి చర్చ అంతా ప్రధానంగా ‘సుంకాల’ చుట్టూనే సాగింది. ట్రంప్ ప్రభుత్వం భారత్‌తో సహా దాదాపు మూడు డజన్ల దేశాలపై సుంకాలను విధించింది. భారత్‌పై తొలుత 25 శాతంగా ఉన్న సుంకాన్ని ఆ తర్వాత 50 శాతానికి పెంచారు. అప్పటికే భారత్ అమెరికాతో కుదుర్చుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం తుది దశకు చేరుకుంది, అది పూర్తయితే ఈ సుంకాల సమస్య పరిష్కారమయ్యేది. ట్రంప్ సుంకాల విధానం వల్ల ద్రవ్యోల్బణం పెరిగి ఆర్థిక సవాళ్లు ఎదురవుతాయని ఆయన రాజకీయ ప్రత్యర్థులు వాదించగా, దీనివల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థ, పరిశ్రమలు బలపడతాయని మద్దతుదారులు వాదించారు. ఏడాదికి 600 బిలియన్ డాలర్ల నుండి 1 ట్రిలియన్ డాలర్ల వరకు ఆదాయం వస్తుందని, భవిష్యత్తులో ఆదాయపు పన్ను కట్టాల్సిన అవసరం కూడా ఉండదని ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు.
అప్పట్లో భారత్ ప్రధాన లక్ష్యం వాణిజ్య ఒప్పందాన్ని త్వరగా కుదుర్చుకుని ఎగుమతులపై ప్రభావం చూపుతున్న భారీ సుంకాల సమస్యను పరిష్కరించుకోవడమే. అటు అమెరికాలోని భారతీయ వలసదారులు ఇరకాటంలో పడ్డారు. వాణిజ్య ఒప్పందం కోసం అక్కడ స్థానికంగా ఒత్తిడి తీసుకురావడం లేదని కొందరు భారతీయ నేతలు వారిని నిలదీస్తుంటే, మరోవైపు ట్రంప్ ‘మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్’ (మాగా) నినాదానికి విధేయత చూపాల్సిన పరిస్థితి వారికి ఎదురైంది. పెరుగుతున్న మాగా ఉద్యమం అమెరికన్ పౌరుల నుంచి పూర్తి విధేయతను ఆశిస్తుండటం, వలసదారులపై నిఘా పెరగడంతో వారిలో ఒక రకమైన సందిగ్ధత నెలకొంది. అయితే జనవరి తొలివారంలో నేను మళ్లీ వాషింగ్టన్ వెళ్ళినప్పుడు, ఆ సందిగ్ధం కాస్తా ఆందోళనగా మారినట్లు అనిపించింది. అమెరికన్ సమాజంలో, రాజకీయాల్లో వస్తున్న కొన్ని మౌలిక మార్పులు భారతీయ వలసదారులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నాయి. గతేడాది సెప్టెంబరు 10న ఉటాలోని ఒక విశ్వవిద్యాలయంలో 31 ఏళ్ల మితవాద ఉద్యమకారుడు, ‘టర్నింగ్ పాయింట్’ అనే మితవాద సంస్థ వ్యవస్థాపకుడు చార్లీ కిర్క్ హత్యకు గురయ్యారు. ఈ హత్య అమెరికాలోని ‘మాగా’ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించింది. నిందితుడు టైలర్ జేమ్స్ రాబిన్సన్ వలసదారుడు కాకపోయినప్పటికీ, ఈ ఘటన తర్వాత మాగా ఉద్యమం తీవ్రస్థాయిలో ‘వలస వ్యతిరేకత’ను సంతరించుకుంది.
గత ఐదు శతాబ్దాలుగా వివిధ దేశాల నుంచి వలసవచ్చిన వారి కృషితో నిర్మితమైన దేశం అమెరికా అనే భావన ప్రపంచవ్యాప్తంగా ఉంది. 1908లో ఇస్రాయెల్ జాంగ్‌విల్ తన ‘ది మెల్టింగ్ పాట్’ నాటకంలో అమెరికాను వివిధ సంస్కృతుల సమ్మేళనంగా అభివర్ణించారు. దీన్నే కొందరు ఉదారవాదులు ‘సలాడ్ బౌల్’ (అన్నీ కలిసినా దేని ప్రత్యేకత దానికే ఉంటుందన్న అర్థం) అని పిలిచేవారు. కానీ ఇప్పుడు ‘మాగా’ ఉద్యమం ఈ బహుళ సంస్కృతీవాదాన్ని తిరస్కరిస్తోంది. అమెరికా అంటే కేవలం ‘తెల్లజాతి క్రైస్తవుల’ దేశం మాత్రమే అనే ‘టొమాటో సూప్’ జాతీయవాదాన్ని అది బలంగా రుద్దుతోంది. ఈ ఒత్తిడి ఎంతలా పెరిగిపోయిందంటే చివరకు ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సైతం తన భార్య (ఆమె ఒక హిందువు) మతం గురించి వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ”నేను క్రైస్తవ సువార్తను నమ్ముతాను, నా భార్య కూడా ఏదో ఒక రోజు దాన్ని గుర్తిస్తుందని ఆశిస్తున్నాను,” అని చార్లీ కిర్క్ సంతాప సభలో ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ విద్వేషం వలసదారులందరిపై వ్యక్తమవుతున్నప్పటికీ ముఖ్యంగా భారతీయులే లక్ష్యంగా మారుతున్నారు. ”మీ దేశాలకు వెనక్కి వెళ్లిపోండి” అనే నినాదాలు, అమెరికన్ల ఉద్యోగాలను భారతీయులు కొల్లగొడుతున్నారనే ఆరోపణలు బహిరంగంగా వినిపిస్తున్నాయి. కాలిఫోర్నియా, ఫ్లోరిడాల్లో సిక్కు ట్రక్ డ్రైవర్లకు సంబంధించి జరిగిన రెండు ప్రమాదాల్లో అమెరికన్ పౌరులు మరణించిన ఘటనలను ‘మాగా’ వర్గాలు వలస వ్యతిరేక ప్రచారానికి ఆయుధాలుగా వాడుకుంటున్నాయి.
సోషల్ మీడియాలో వలసదారుల మతాలను ”దెయ్యాల ఆరాధన” అని కించపరుస్తున్నారు. అక్టోబరులో దీపావళి వేడుకలు నిర్వహించినందుకు ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాష్ పటేల్, టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబాట్‌లపై తీవ్రవాద ‘మాగా’ గ్రూపులు విరుచుకుపడ్డాయి. ”క్రైస్తవ దేశమైన అమెరికాలో విదేశీ దేవుళ్లను ప్రోత్సహించడం సరికాదు” అంటూ సామాజిక మాధ్యమాల్లో విద్వేషాన్ని వెళ్లగక్కారు. గతంలో ఇవి చిన్నపాటి అల్లరి మూకల చర్యలుగా అనిపించేవి. కానీ ఇప్పుడు ఫ్లోరిడా, టెక్సాస్ వంటి రాష్ట్రాల్లో భారతీయులకు ఇవి నిత్యకృత్యంగా మారాయని నా పర్యటనలో అర్థమైంది. విమానాశ్రయాల్లో, నివాస ప్రాంతాల్లో ఐసీఈ (వలసవ్యవహారాలు, కస్టమ్స్ చట్టాల అమలు విభాగం) అధికారుల తనిఖీలు, బలవంతపు బహిష్కరణలు పెరిగాయి. ‘అమెరికా దుర్గం’లో పెరుగుతున్న వర్ణవివక్ష తమ భవిష్యత్తును ఎటు తీసుకెళ్తుందోనని అక్కడి భారతీయులు ఆందోళన చెందుతున్నారు. భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం త్వరగా కుదిరితే, అది భారతీయ వలసదారులపై జరుగుతున్న విద్వేష ప్రచారానికి కొంతవరకు అడ్డుకట్ట వేస్తుందని వారు భావిస్తున్నారు. ఈ ఆందోళన అతిశయోక్తి కాదు.. ఇది ముమ్మాటికీ నిజం.
రాం మాధవ్,
ఇండియా ఫౌండేషన్ అధ్యక్షుడు, బిజెపి నాయకుడు

