సైద్ధాంతిక గందరగోళంతో పతనమైన భారత కమ్యూనిస్టులు
భారత రాజకీయాల్లో ఒకప్పుడు కీలకమైన శక్తిగా, బలమైన గొంతుకగా ఉన్న కమ్యూనిస్టు ఉద్యమం ఇప్పుడు ఎన్నికల్లో మాత్రమే కాకుండా కార్మిక, కర్షక వర్గాల్లో కూడా తన ప్రభావాన్ని కోల్పోయింది. ప్రస్తుతం ట్రేడ్ యూనియన్ రంగంలో ఆర్‌ఎస్‌ఎస్ అనుబంధ సంస్థ అయిన భారతీయ మజ్దూర్ సంఘ్ (బీఎంఎస్) ఆధిపత్యం వహిస్తోంది. తమ సిద్ధాంత-రాజకీయ ప్రస్థానం వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో కూడా వామపక్షాల పతనానికి గల కారణాలపై కనీసం అంతర్గత చర్చలు గానీ, బహిరంగ విశ్లేషణలు గానీ జరిగిన దాఖలాలు లేవు. తీవ్రమైన చర్చలు, మేధోమథనాలకు పేరొందిన తమ సొంత వారసత్వానికే ఇది విరుద్ధం. కమ్యూనిస్టుల కొత్త తరం తమ సిద్ధాంత పితామహుల మౌఖిక ప్రకటనలను (ప్రధానమంత్రి మ్యూజియం, లైబ్రరీలో అందుబాటులో ఉన్నాయి) పరిశీలిస్తే వారి అజ్ఞానం వీడుతుంది. అయితే ప్రపంచవ్యాప్తంగా రాజకీయాల స్వభావం మారిపోయింది. నేడు మితవాద పక్షంలో పిలూ మోదీ లేదా మీనూ మసాని వంటి వారు లేనట్టే వామపక్షంలో కూడా ఎం.ఎన్. రాయ్ లేదా ఎం. బసవపున్నయ్య వంటి దిగ్గజాలు లేరు.
గత కొన్ని దశాబ్దాలుగా కమ్యూనిస్టులు ఎటువంటి లోతైన సిద్ధాంత వ్యాసాలను కానీ, రాజకీయ పరిశోధనలను కానీ వెలువరించలేదు. 1990ల నుండి వారు కేవలం ఆర్‌ఎస్‌ఎస్-బిజెపిని వ్యతిరేకించడంపైనే దృష్టి పెట్టారు, అది కూడా చాలా పైపైన మాత్రమే. ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ యాజమాన్యంపై గట్టిగా మాట్లాడే సీపీఐ, సీపీఎం, సీపీఐ(ఎంఎల్) పార్టీలు కలిసి కూడా నూతన ఆర్థిక విధానాలు (నయా ఉదారవాదం) విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డిఐ), ప్రైవేటీకరణ, అసమానతలపై ఒక ప్రత్యామ్నాయ దృక్పథాన్ని తీసుకురాలేకపోయాయి. ఇటువంటి అంశాలపై ఆర్‌ఎస్‌ఎస్ అనుబంధ సంస్థలైన స్వదేశీ జాగరణ్ మంచ్, బీఎంఎస్ వంటివే వామపక్షాల కంటే ఎంతో ముందున్నాయి.
యూరప్, భారతీయ కమ్యూనిస్టు పార్టీల మధ్య స్పష్టమైన తేడా ఉంది. యూరోపియన్ పార్టీలు అస్తిత్వ సంక్షోభాన్ని ఎదుర్కోవడం లేదు. కానీ భారత్ లో ‘మనం ఎవరు?’ అనే ప్రశ్నకు సమాధానం వెతికే క్రమంలో కమ్యూనిస్టుల మధ్య వివాదాలు, ఘర్షణలు, చివరకు చీలికలు వచ్చాయి. ఇందులో మొదటిది ‘సైద్ధాంతిక జాతీయత’కు సంబంధించింది. సీపీఐ వ్యవస్థాపకుల్లో ఒకరైన సత్యభక్త, పార్టీ స్వదేశీ మూలాలను కలిగి ఉండాలని, భారతీయ పరిస్థితులు, ప్రజల మనస్తత్వానికి అనుగుణంగా కమ్యూనిస్టు సూత్రాలను వర్తింపజేయాలని ఆకాంక్షించారు. 1929 నాటి మీరట్ కుట్ర కేసు పత్రాల్లో ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి: “మేం మా చేతులను కట్టేసుకోవడానికి సిద్ధంగా లేం, అలాగే ఇతరుల నుంచి ఆదేశాలు లేదా నియంతృత్వాన్ని ఆశించడం లేదు.” అయితే, సోవియట్ అనుకూల వర్గం ఆయనను అణచివేసి పార్టీని వీడేలా చేసింది. వారు సోవియట్ నేతృత్వంలోని ‘కొమిన్టర్న్’ (కమ్యూనిస్టు ఇంటర్నేషనల్) నుంచి సైద్ధాంతిక మార్గదర్శకాలను తీసుకున్నారు. ఇండో-చైనా యుద్ధం సమయంలో కూడా ఇదే విధేయత ప్రశ్న సీపీఐని చీల్చింది. పార్టీలోని ఒక వర్గం చైనాను దురాక్రమణదారుగా పిలవడానికి సిద్ధపడలేదు. తదనంతర కాలంలో సీపీఎంలో ప్రముఖ నేతగా ఎదిగిన బీ.టీ. రణదివే అప్పట్లో మాట్లాడుతూ.. “ఒక సోషలిస్టు దేశం దురాక్రమణకు పాల్పడుతుందని కేవలం మూర్ఖులు, మోసగాళ్లు మాత్రమే నమ్ముతారు, మార్క్సిస్టులు, కమ్యూనిస్టులు కాదు,” అని వ్యాఖ్యానించారు.
కమ్యూనిస్టు పార్టీల నాయకత్వం ఎక్కువగా ప్రజల ఉద్యమాల్లో అనుభవం లేని, శ్రామికేతర నేపథ్యం ఉన్న వ్యక్తుల చేతుల్లోనే ఉండిపోయింది. కార్మికులకు, మేధావి వర్గ నాయకత్వానికి మధ్య ఉన్న ఈ అంతరం అలాగే కొనసాగింది. పార్లమెంటరీ రాజకీయాల్లో సంపూర్ణంగా భాగస్వాములు కావాలనే విషయంలో తమ అంతర్గత గందరగోళం నుంచి ఈ ఉద్యమం బయటపడలేకపోయింది. తమ మద్దతుదారుల పునాదిని పటిష్టం చేసుకోవడం కంటే విచ్ఛిన్నం చేసుకోవడమే ఎక్కువగా జరిగింది. బీహార్ వంటి రాష్ట్రాల్లో కుల ప్రాతిపదికన నడిచే పార్టీలు కమ్యూనిస్టు నాయకులను, సభ్యులను తమతో కలిపేసుకున్నాయి. నేడు కమ్యూనిస్టుల పాత్ర కేవలం సెమినార్లకు పరిమితమైన మేధావుల స్థాయికి పడిపోయింది తప్ప, ప్రజలను నడిపించే అగ్రగామి శక్తులుగా లేరు. అందుకే వారు ప్రజల్లో స్పూర్తి నింపలేకపోతున్నారు. వారిపై విశ్వసనీయత పెరగకపోగా, ప్రజల దృష్టిలో విలువ కూడా కోల్పోయారు. అంతేకాకుండా ఒకవైపు పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో పాల్గొంటూనే, మరోవైపు దానిని కూల్చివేయాలని బోధించే తమ సిద్ధాంతాల మధ్య ఉన్న వైరుధ్యాన్ని వారు పరిష్కరించుకోలేకపోయారు. వారి కార్యకర్తలు ఇప్పటికీ స్టాలినిస్టు, మావోయిస్టు సాహిత్యాన్నే చదువుతున్నారు. దీనివల్ల వారు ఇటు ప్రజాస్వామ్యానికి, అటు విప్లవానికి కాకుండా మధ్యలో ఉండిపోయారు. కాల్పనిక సిద్ధాంతాల ద్వారా అధికారాన్ని చేజిక్కించుకోవచ్చనే భ్రమ ఇంకా వారిని వీడలేదు. అభిప్రాయాలను ప్రభావితం చేసే రంగంలో వారి పాత్ర ఎక్కువగా ఉన్నప్పటికీ, అది వారి సంస్థాగత బలోపేతానికి ఏమాత్రం ఉపయోగపడటం లేదు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే వారు తమ ప్రణాళికలో ‘సంస్కృతి’కి ఎటువంటి స్థానం ఇవ్వలేదు. శ్రామిక వర్గం కంటే హిందూ మతతత్వంపై చర్చలకే వారు ఎక్కువ సమయం, శక్తిని వెచ్చించారు. నేటికీ పాత కలలు, కాలం చెల్లిన ఆలోచనలతో బతుకుతూ మారుతున్న వాస్తవాలకు అనుగుణంగా స్పందించే ధైర్యం చూపలేకపోతున్నారు.
సమకాలీన రాజకీయాల్లో సోషలిస్టు ఆలోచనలకు కచ్చితంగా చోటు ఉంది. 1967 వరకు జరిగిన ప్రతి సార్వత్రిక ఎన్నికల్లోనూ సోషలిస్టు భావజాలం ఉన్న పార్టీలు సుమారు 20 శాతం ఓట్ల వాటాను సాధించాయి. అయితే రానురాను కమ్యూనిస్టులు ఆ బలాన్ని నిలబెట్టుకోలేకపోయారు. ఒకప్పుడు బ్రిటిష్ అధికారి ఒకరు కమ్యూనిస్టులను ‘ట్రోజన్ హార్స్’ (నమ్మకంగా ఉండి ద్రోహం చేసేవారు) గా వర్ణించారు. నేడు వారు ఆ పాత్రను కూడా పోషించే స్థితిలో లేరు. విప్లవం సాధించాలనే ఆశయంతో మొదలైన వారి 100 ఏళ్ల ప్రయాణం ఇప్పుడు సొంత బలం మీద కాకుండా, కేవలం మిత్రపక్షాల దయాదాక్షిణ్యాలపై ఆధారపడి కొనసాగుతోంది.
రాకేష్ సిన్హా, బిజెపి మాజీ ఎంపీ

