భారత్ ఆర్థిక వృద్ధికి చోదక శక్తి ‘స్టార్టప్ ఇండియా’
ఒక్క 2025 లోనే దేశంలో 44,000 స్టార్టప్‌లు నమోదయ్యాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. స్టార్టప్ ఇండియా పథకం పదవ వార్షికోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత ఆర్థిక వ్యవస్థలో స్టార్టప్‌లు కీలక పాత్ర పోషిస్తున్నాయని, 2030 నాటికి 7.3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలన్న లక్ష్యంలో, ‘వికసిత భారత్ 2047’ స్వప్న సాకారంలో ఈ స్టార్టప్ వ్యవస్థే చోదక శక్తిగా నిలవనుందని అన్నారు. జనవరి 16, 2016న ప్రారంభించిన ఈ భారీ పథకం ప్రధాన లక్ష్యం ఆవిష్కరణలను, వ్యవస్థాపకతను ప్రోత్సహించడం, పెట్టుబడి ఆధారిత వృద్ధిని ప్రేరేపించడమని ఆయన పేర్కొన్నారు. “స్టార్టప్ ఇండియా వేగం క్రమంగా పెరుగుతున్నందుకు నేను మరింత సంతోషిస్తున్నాను” అని మోదీ అన్నారు. “నేటి స్టార్టప్‌లు యునికార్న్ లు (100 బిలియన్ డాలర్ల కంపెనీలుగా) గా మారుతున్నాయి. యునికార్న్ లు తమ ఐపిఓలను ప్రారంభిస్తున్నాయి, మరిన్ని ఉద్యోగాలను సృష్టిస్తున్నాయి. ఒక్క గత ఏడాది 2025లోనే దాదాపు 44,000 కొత్త స్టార్టప్‌లు నమోదు అయ్యాయి. స్టార్టప్ ఇండియా ప్రారంభించినప్పటి నుంచి ఒకే సంవత్సరంలో ఇంత పెద్దమొత్తంలో సంస్థలు రిజిస్టర్ కావడం ఎప్పుడూ జరగలేదు,” అని ఆయన అన్నారు.
- ప్రపంచ స్థాయికి భారత్: 2025 డిసెంబర్ నాటికి దేశంలో 2 లక్షలకు పైగా పారిశ్రామిక, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక శాఖ (DPIIT) గుర్తింపు పొందిన స్టార్టప్‌లు ఉన్నాయి. దీనితో ప్రపంచంలోని అతిపెద్ద స్టార్టప్ పర్యావరణ వ్యవస్థల్లో ఒకటిగా భారత్ సగర్వంగా నిలుస్తోంది.
- సమగ్ర మద్దతు వ్యవస్థ: గడిచిన పదేళ్లలో ‘స్టార్టప్ ఇండియా’ ఆలోచన దశ నుంచి నిధుల సమీకరణ, మార్గదర్శకత్వం, విస్తరణ వరకు ఒక పరిపూర్ణమైన మద్దతు వ్యవస్థను నిర్మించింది.
- వికేంద్రీకరణ: సుమారు 50 శాతం స్టార్టప్‌లు ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల నుంచి రావడం పారిశ్రామిక రంగంలో వచ్చిన ప్రజాస్వామ్యీకరణకు నిదర్శనం.
- గ్రామీణ వికాసం: గ్రామీణ స్థాయి కార్యక్రమాలు, పథకాలు సూక్ష్మ పరిశ్రమలను, మహిళా పారిశ్రామికులను ప్రోత్సహిస్తూ స్థానికంగా ఉపాధిని కల్పిస్తున్నాయి.
ఆర్థిక పరివర్తనలో స్టార్టప్‌ల కీలక పాత్ర
2026 జనవరి 16న నిర్వహించిన ‘జాతీయ స్టార్టప్ దినోత్సవం’, స్టార్టప్ ఇండియా కార్యక్రమం ప్రయాణంలో ఒక చరిత్రాత్మక మైలురాయిని సూచిస్తుంది. 2016లో వ్యవస్థాపకతను ప్రోత్సహించడానికి ఒక చిన్న విధానపరమైన చర్యగా ప్రారంభమైన ఈ కార్యక్రమం నేడు ప్రపంచంలోనే అత్యంత వైవిధ్యభరితమైన స్టార్టప్ వ్యవస్థల్లో ఒకటిగా రూపాంతరం చెందింది. ‘స్టార్టప్ ఇండియా’ మార్గదర్శకత్వంలో సాగుతున్న ఈ ప్రస్థానం భారత పారిశ్రామిక ఆవిష్కరణలపై విప్లవాత్మక ప్రభావాన్ని చూపింది. ఇది ‘వికసిత్ భారత్ 2047’ లక్ష్యానికి అనుగుణంగా ఆర్థిక ఆధునీకీకరణను, ప్రాంతీయ అభివృద్ధిని మేళవిస్తోంది.
ఆవిష్కరణలు, ఉద్యోగ కల్పన, సమ్మిళిత వృద్ధికి స్టార్టప్‌లు నేడు వెన్నెముకగా మారాయి. 2025 డిసెంబర్ నాటికి దేశంలో 2 లక్షలకు పైగా స్టార్టప్‌లు ఉండటం గమనార్హం. బెంగళూరు, హైదరాబాద్, ముంబై, దిల్లీ-ఎన్సీఆర్ (జాతీయ రాజధాని ప్రాంతం) వంటి నగరాలు ఈ మార్పులో ముందుండగా, ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలు కూడా 50 శాతం వాటాతో తమ ఉనికిని చాటుకుంటున్నాయి.
ఆర్థిక వృద్ధికి ప్రేరణ
స్టార్టప్‌లు దేశ ఆర్థిక వృద్ధిని వివిధ మార్గాల్లో ప్రభావితం చేస్తున్నాయి:
- సాంకేతిక ఆవిష్కరణలను, ఉత్పాదకతను పెంపొందించడం.
- భారీ స్థాయిలో ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలను కల్పించడం.
- ఆర్థిక సమ్మిళితత్వం, డిజిటల్ సేవల లభ్యతను సులభతరం చేయడం.
- ప్రాంతీయ, గ్రామీణ స్థాయి వ్యవస్థాపకతను ప్రోత్సహించడం.
వ్యవసాయ సాంకేతికత (అగ్రి-టెక్), టెలిమెడిసిన్, సూక్ష్మరుణాలు (మైక్రోఫైనాన్స్), పర్యాటకం, విద్యా సాంకేతికత (ఎడ్-టెక్) వంటి రంగాల్లో వినూత్న విధానాలను తీసుకురావడం ద్వారా స్టార్టప్‌లు గ్రామీణ-పట్టణ వ్యత్యాసాలను తగ్గిస్తున్నాయి. ముఖ్యంగా మహిళా ప్రాతినిధ్యం గణనీయంగా పెరిగింది; 2025 డిసెంబర్ నాటికి 45 శాతం పైగా గుర్తింపు పొందిన స్టార్టప్‌లలో కనీసం ఒక మహిళా డైరెక్టర్ లేదా భాగస్వామి ఉండటం సామాజిక సమానత్వానికి నిదర్శనం.
ఆవిష్కరణల వెన్నెముకగా స్టార్టప్ ఇండియా
కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలోని పారిశ్రామిక, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక శాఖ నేతృత్వంలో ఈ పథకం దేశ ఆవిష్కరణల వ్యవస్థకు పునాదిగా నిలిచింది. ఒకప్పుడు కేవలం విధానపరమైన చట్రంగా ప్రారంభమై, నేడు స్టార్టప్‌ల ఎదుగుదలకు అవసరమైన అన్ని దశల్లో అండగా నిలుస్తోంది. ఈ పురోగతి ఫలితంగా 2014లో కేవలం 4 బిలియన్ డాలర్లకు పైగా విలువ కలిగిన యూనికార్న్ (పెద్ద స్టార్టప్) కంపెనీలు ఉండగా, నేడు వాటి సంఖ్య 120కి చేరింది. వీటి మొత్తం విలువ 350 బిలియన్ డాలర్లకు పైగా ఉండటం భారత స్టార్టప్ రంగ అంతర్జాతీయ ప్రాముఖ్యతకు నిదర్శనం.
భారతదేశ యువ జనాభా శక్తిని వినియోగించుకుంటూ స్టార్టప్‌లు సాంకేతిక, సేవా, తయారీ రంగాల్లో ఉపాధి కల్పిస్తున్నాయి. అలాగే ‘గిగ్’ ఆర్థిక వ్యవస్థ, సరఫరా గొలుసుల ద్వారా పరోక్ష ఉద్యోగాలను సృష్టిస్తున్నాయి. స్టార్టప్‌లు కేవలం స్వతంత్రంగానే కాకుండా, పెద్ద కార్పొరేట్ సంస్థలు, బహుళజాతి కంపెనీలతో జతకట్టి సాంకేతిక బదిలీకి, ప్రపంచ మార్కెట్లలో భారతీయ ఉత్పత్తుల విస్తరణకు దోహదపడుతున్నాయి. ఉదాహరణకు హేసా వంటి అగ్రి-టెక్ ప్లాట్‌ఫారమ్‌లు రైతులకు మార్కెట్ ప్రవేశాన్ని మెరుగుపరుస్తున్నాయి. జిప్ వంటి స్వచ్ఛ ఇంధన సంస్థలు విద్యుత్ వాహనాల ద్వారా రవాణా రంగంలో మార్పులు తెస్తున్నాయి. ఈ ఆవిష్కరణలు ఫైనాన్స్, సుస్థిర వృద్ధి, డిజిటల్ మౌలిక సదుపాయాలపై బహుముఖ ప్రభావం చూపుతున్నాయి. దేశవ్యాప్తంగా నిధులు, మార్గదర్శకత్వం, ఇతర ప్రోత్సాహకాలను అందించడానికి DPIIT అనేక భారీ పథకాలు, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లను అందుబాటులోకి తెచ్చింది. వీటిలో అత్యంత కీలకమైనది FFS. అంటే స్టార్టప్ లకు నిధులు అందించే సంస్థలకే నిధులు సమకూరుస్తుంది. దీనిని ‘సిడ్బీ’ నిర్వహిస్తుంది. రూ.10,000 కోట్ల మూలధనంతో దీన్ని ప్రారంభించారు. అలాగే స్టార్టప్‌లకు ఎటువంటి పూచీకత్తు లేకుండా స్టార్టప్‌లకు పరపతి హామీ పథకం ద్వారా ఇప్పటివరకు రూ.800 కోట్ల స్టార్టప్‌ల రుణాలకు హామీ ఇచ్చారు.
అటల్ ఇన్నోవేషన్ మిషన్ (AIM)
నీతి ఆయోగ్ 2016లో ప్రారంభించిన ఈ కార్యక్రమం పాఠశాలలు, విశ్వవిద్యాలయాల స్థాయిలో ఆవిష్కరణల సంస్కృతిని పెంపొందిస్తుంది. మార్చి 2028 నాటికి దీని కోసం రూ.2,750 కోట్లను కేటాయించారు.
- అటల్ టింకరింగ్ ల్యాబ్స్ (ATL) : దేశవ్యాప్తంగా 733 జిల్లాల్లో 10,000కి పైగా ల్యాబ్‌లు ఉన్నాయి. 1.1 కోట్లకు పైగా విద్యార్థులు AI, రోబోటిక్స్ వంటి సాంకేతికతలపై అవగాహన పొందుతున్నారు.
- సామాజిక ఆవిష్కర్తల ఫెలోషిప్ : ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం (UNDP) భాగస్వామ్యంతో గ్రామీణ ఆవిష్కర్తలకు శిక్షణ ఇస్తారు.
- యూత్ కో:ల్యాబ్ : ఆసియా-పసిఫిక్ ప్రాంతంలోని యువతలో సామాజిక వ్యవస్థాపకతను ప్రోత్సహిస్తుంది. 2024-25లో వికలాంగుల సమస్యలకు పరిష్కారాలు చూపే యువ పారిశ్రామికవేత్తలపై ఇది దృష్టి సారించింది.
- AIM 2.0: ఇది ప్రాంతీయ భాషలలో ఆవిష్కరణలను ప్రోత్సహించే ‘లిపి’ కార్యక్రమం, జమ్మూ కాశ్మీర్, ఈశాన్య రాష్ట్రాలపై దృష్టి సారించే ‘ఫ్రాంటియర్ ప్రోగ్రామ్’ వంటి కొత్త కార్యక్రమాలను చేపట్టింది.
ఇతర మంత్రిత్వ శాఖలు కూడా స్టార్టప్‌లకు తమ పరిధిలో అవసరమైన మద్దతు అందించేందుకు వివిధ కార్యక్రమాలు అమలు చేస్తున్నాయి.

