ఆరోగ్య, ఆర్థిక రంగాలలో ‘స్వచ్ఛ భారత్’ విప్లవం
స్వచ్ఛ భారత్ మిషన్ (ఎస్బిఎం) వంటి ఒక జాతీయ అభివృద్ధి కార్యక్రమం పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇది దాని విజయాలను సమీక్షించుకోవడానికి సరైన సమయం. ‘నేచర్’ అనే ఒక ప్రముఖ పత్రిక దేశంలో శిశువులు, బాలల మరణాలను తగ్గించడంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించిన పాత్ర గురించి ఇటీవల విడుదల చేసిన ఒక వైజ్ఞానిక పత్రంలో ఈ కార్యక్రమం పదేళ్ల విజయాలను గుర్తు చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2014 ఆగస్టు 15న ఎర్రకోట బురుజు నుంచి చేసిన స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ఈ స్వచ్ఛభారత్ మిషన్ ను ప్రకటించగా అదే ఏడాది అక్టోబర్ 2 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. 2019 అక్టోబర్ 2 నాటికి బహిరంగ విసర్జనను దేశవ్యాప్తంగా నిర్మూలించాలన్న బృహత్తర లక్ష్యంతో ఈ పథకాన్ని ప్రకటించారు. ఈ లక్ష్యంలో భాగంగా బహిరంగ మలవిసర్జన చేసే 55 కోట్ల మంది భారతీయులను వారి పాత అలవాటు మాన్పించి 10 కోట్ల వ్యక్తిగత మరుగుదొడ్లను వాడేటట్లు చేయడంపై ఈ కార్యక్రమం ప్రధానంగా దృష్టి కేంద్రీకరించింది. ఈ మరుగుదొడ్లను ప్రభుత్వం వారి కోసమే నిర్మించింది. మహిళలు, బాలికల ఆత్మ గౌరవాన్ని పెంచి వారికి భద్రత కల్పించడం వంటి అనేక సానుకూల ఫలితాలను సాధించడంతో పాటు ఈ కార్యక్రమం వల్ల ప్రజారోగ్యం మెరుగుపడిన అంశాన్ని ‘నేచర్’ పత్రిక విశ్లేషించింది. ఈ కార్యక్రమం కింద నిర్మించిన మరుగుదొడ్లు ఏడాదికి ఐదేళ్లలోపు వయసు గల 60 నుంచి 70 వేల మంది పిల్లలు, నవజాత శిశువుల ప్రాణాలను కాపాడినట్టు ఆ పత్రిక తెలిపింది.
ఎస్బిఎం వంటి ఒక జాతీయ అభివృద్ధి కార్యక్రమం దశాబ్ద కాలంలో సాధించిన విజయాలు ఏమిటో సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. మరుగుదొడ్ల వంటి సున్నితమైన విషయాన్ని కోట్ల మంది ప్రజల ముందు ప్రస్తావించి 2014 ఆగస్టు 15న ప్రధాని చేసిన సాహసోపేత ప్రకటన దేశ ప్రజలనే కాదు ప్రపంచం మొత్తాన్ని అబ్బురపరిచింది. దేశంలో బహిరంగ మల విసర్జన దురలవాటును ఒక నిర్దిష్టమైన గడువు లోపల పరిష్కరిస్తానని ప్రకటించడం నిజంగా సాహసమే. ఇప్పటివరకు ఎవరూ ప్రస్తావించని ఒక అంశాన్ని ప్రధానమంత్రి మొదటిసారిగా బహిరంగ చర్చలో ఒక అంశంగా తీసుకువచ్చారు. రెండవది, ఆయన నిర్దేశించిన లక్ష్యం బృహత్తరమైనది. అంటే ఐదేళ్ళలో 55 కోట్ల మంది ప్రజల అలవాటును మార్చాలి. ప్రధానమంత్రి ప్రకటనపై ఆశ్చర్యం, దిగ్భ్రాంతి రెండూ వ్యక్తమైన మాట నిజం. కానీ ప్రధానమంత్రి స్వీయ నేతృత్వంలో ఈ కార్యక్రమం రూపుదిద్దుకొని ఒక ప్రజా ఉద్యమంగా మారి దేశవ్యాప్తంగా విజయవంతంగా అమలైంది. ‘మన్ కీ బాత్’ రేడియో ప్రసంగం సహా బహిరంగ వేదికల నుంచి ప్రధానమంత్రి ఈ కార్యక్రమంపై ప్రజల్లో స్ఫూర్తి రగిలించారు, ఒక సామాజిక ఉద్యమంగా, గ్రామాలే సారథ్యం వహించే కార్యక్రమంగా మలిచారు. గ్రామ ప్రజలంతా ఒక తాటిపైకి వచ్చి తమ తమ గ్రామాల్లో బహిరంగ మలవిసర్జన (ఓడిఎఫ్)ను అంతమొందించడానికి భావోద్వేగంతో కలిసికట్టుగా కృషి చేశారు. ఆ లక్ష్యాన్ని నెరవేర్చిన తర్వాత వారు గౌరవ యాత్రలు నిర్వహించారు. తమ గ్రామం బహిరంగ మలవిసర్జన రహిత గ్రామం (ఓడిఎఫ్) అని ప్రకటించడానికి వారు ఎంతో గర్వించారు.
ఆ వెంటనే దేశవ్యాప్తంగా మలవిసర్జన రహిత ప్రాంతాలుగా మారేందుకు గ్రామాల మధ్య, జిల్లాల మధ్య, చివరికి రాష్ట్రాల మధ్య కూడా స్నేహపూర్వక పోటీ ప్రారంభమైంది. ముందుగా హిమాచల్ ప్రదేశ్, కేరళ, ఉత్తరాఖండ్, హర్యానాలు ఓడిఎఫ్ రాష్ట్రాలుగా తమను తాము ప్రకటించుకున్న తర్వాత ఇతర రాష్ట్రాలు కూడా అదే బాటలో నడిచాయి. చివరికి ప్రధాని నిర్దేశించిన గడువు 2019 అక్టోబర్ 2 నాటికి అన్ని రాష్ట్రాలూ బహిరంగ మలవిసర్జన రహిత రాష్ట్రాలుగా ప్రకటించుకున్నాయి. అయితే ప్రజల ప్రవర్తనను, అలవాట్లను మార్చడంపై, బహిరంగ మలవిసర్జన ఎక్కడా తిరిగి జరగకుండా నివారించడంపై స్వచ్ఛ భారత్ మిషన్ రెండవ దశలో కృషి కొనసాగుతోంది. ఎస్బిఎం ఫలితాల విషయానికి వస్తే ‘నేచర్’ పత్రిక ప్రముఖంగా ప్రస్తావించిన ఆరోగ్య ప్రయోజనాలు, మహిళలు, బాలికల గౌరవం, భద్రతతో పాటు ఇతర సానుకూల పరిణామాలు కూడా ఉన్నాయి. వాటిలో ఒకటి ఆర్థిక ప్రయోజనం. యూనిసెఫ్ నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం ఒక గ్రామం బహిరంగ మలవిసర్జన రహితంగా మారడం వల్ల ప్రతి కుటుంబానికి ఆరోగ్య వ్యయాల కింద ఏడాదికి రూ.50 వేల వరకు ఆదా అవుతుంది. అనారోగ్యాల నివారణ జరిగి వైద్య ఖర్చులు, సమయం ఆదా అయ్యాయి. ఎస్బిఎంపై ఏటా సుధీర్ దార్ ఏటా వెలువరించిన కార్టూన్ క్యాలెండర్లలో ఒకదానిలో ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యుడు రోగులు ఎవరూ లేక బయట కూర్చుని ఈగలు తోలుకుంటూ ఉంటాడు. ఎందుకంటే బహిరంగ మలవిసర్జనకు తెరపడటంతో గ్రామంలో ఎవరికీ డయేరియా లాంటి వ్యాధులు ఏమీ లేవు. ఎస్బిఎం ప్రపంచానికి అనేక పాఠాలను, అనుభవాలను నేర్పగలదు. 2018 అక్టోబర్లో మహాత్మా గాంధీ అంతర్జాతీయ పారిశుద్ధ్య సదస్సు ముగింపు సమావేశానికి ఐక్యరాజ్యసమితి సార్వత్రిక కార్యదర్శితో పాటు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షత వహించారు. ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్న దేశాలకు చెందిన 55 మంది ఆరోగ్య, పారిశుద్ధ్య మంత్రులు ఈ సదస్సులో పాల్గొన్నారు. స్వచ్ఛత కార్యక్రమం, దాని అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోవడానికి వచ్చారు. ఈ సదస్సుకు హాజరైన నైజీరియా జల వనరులు, పారిశుద్ధ్యం మంత్రి భారత దేశంలో అమలు జరుగుతున్న స్వచ్ఛభారత్ మిషన్ పట్ల ఎంతగా ప్రభావితమయ్యారంటే ఆయన తమ దేశానికి తిరిగి వెళ్ళిన తర్వాత ‘స్వచ్ఛ నైజీరియా’ ఉద్యమాన్ని అమలు చేయడం ప్రారంభించారు. ఈ సదస్సు దిల్లీ ప్రకటనలో పొందుపరిచిన నాలుగు ఎస్బిఎం పాఠాలను నాలుగు ‘పి’ లుగా వ్యవహరిస్తారు. ఆ నాలుగు ‘పి’లు ‘పొలిటికల్ లీడర్షిప్’ ( రాజకీయనాయకత్వం), ‘పబ్లిక్ ఫైనాన్సింగ్’ (ప్రభుత్వ నిధులు), ‘పార్టనర్ షిప్స్’ (భాగస్వామ్యాలు), ‘పీపుల్స్ పార్టిసిపేషన్’ (ప్రజాభాగస్వామ్యం). అనేక భారీ, పరివర్తనాత్మక అభివృద్ధి కార్యక్రమాల విజయానికి ఈ నాలుగు సూత్రాలు పునాదుల వంటివని ప్రపంచవ్యాప్తంగా గుర్తించారు. ఈ నాలుగు పాఠాలనే ప్రపంచవ్యాప్తంగా పారిశుద్ధ్యరంగంలో అమలు చేస్తున్నారు.
ఐక్యరాజ్యసమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో ఆరవది అయిన పారిశుద్ధ్యం, నీటి లభ్యత సాధనకు ఇది దోహదం చేస్తోంది. గత పదేళ్ల కాలంలో ప్రభుత్వం విజయవంతంగా నిర్వహించి, అమలు చేసిన పథకాల్లో స్వచ్ఛభారత్ మిషన్ ఒకటి అన్న విషయం మనందరికీ తెలుసు. ప్రజల జీవన నాణ్యతను, జీవన సౌలభ్యాన్ని మెరుగుపరచిన ఇతర జాతీయ ప్రాథమిక సేవల కార్యక్రమాలలో ఉజ్వల గ్యాస్ సిలిండర్ల పంపిణీ, జన్ ధన్ బ్యాంకు ఖాతాలు, ఆవాస్ యోజన, ఆయుష్మాన్ భారత్ వైద్య బీమా పథకం, అలాగే 18 కోట్ల కుటుంబాలకు తాగునీటి సదుపాయం కల్పించిన జలజీవన్ మిషన్ మొదలైనవి ఉన్నాయి. ఇటువంటి పరివర్తనాత్మక కార్యక్రమాలకు ప్రధానమంత్రి దార్శనికత, రాజకీయ నాయకత్వమే పట్టుగొమ్మలనేది నిస్సందేహం.
పరమేశ్వరన్ అయ్యర్,
ప్రపంచ బ్యాంకు భారతదేశపు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్

