EVMs

భారతీయ ఈవీఎంలు విశిష్టం, సురక్షితం

లక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎం) గురించి ప్రముఖ అంతర్జాతీయ సాంకేతిక వాణిజ్యవేత్త ఎలాన్ మస్క్ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. “మనం ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను తొలగించాలి” అని ఆయన చేసిన వ్యాఖ్య బహుశా అమెరికన్ ప్రజాస్వామ్య ప్రక్రియ, అమెరికాలో ఈవీఎంల గురించి మాత్రమే అయిఉండొచ్చు. అవి సురక్షితం కాకపోవచ్చు, హ్యాక్ చేయడానికి అనువుగా ఉండవచ్చు. ఆయన ప్రకటన భారతీయ ఇవీఎంలకు వర్తించదు. తాజా అంచనాల ప్రకారం భారతదేశంలో ఇప్పటి వరకు దాదాపు 400 కోట్ల ఓట్లు ఇవీఎంలలో పోలయ్యాయి. ఒక్క హ్యాకింగ్ ఆరోపణ కూడా రుజువు కాలేదు. వాస్తవానికి ఈ 400 కోట్ల ఓట్ల భారీ నమూనా పరిమాణం మోసం చేసినట్లు రుజువు లేకుండా ప్రపంచంలో ఇప్పటివరకు చేపట్టిన ఏకైక అతిపెద్ద శాస్త్రీయ ప్రయోగం.

ఈవీఎం ట్యాంపరింగ్‌ (అక్రమంగా మార్పులు, చేర్పులు చేయడం)కు సంబంధించి ఎలాంటి ఘటనలు జరగలేదని భారత ఎన్నికల సంఘం ఉద్ఘాటించింది. ఈవీఎంలను హ్యాక్ చేయడం సాధ్యం కాదని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ అన్నారు. సుప్రీం కోర్టు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తంచేసింది. ఈవీఎంలపై నిపుణుడు, ఐఐటి గాంధీనగర్ డైరెక్టర్, కంప్యూటర్ శాస్త్రవేత్త ప్రొఫెసర్ రజత్ మూనా ఇటీవల టీవీలో మాట్లాడుతూ, ‘‘భారతదేశం అక్రమాలకు అవకాశం లేని, దేశీయంగా తయారు చేసిన ఈవీఎంలను వాడుతుంది. 64.2 కోట్ల మంది భారతీయులు డిజిటల్‌గా ఓటు వేసిన 2024 ప్రజాస్వామ్యం ఉత్సవం, ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛగా, సక్రమంగా ప్రజలు ఓట్లు వేయడానికి ప్రత్యేకమైన ఇవీఎంలు కీలకంగా నిలిచాయని నిరూపించింది. ఎన్నికల ప్రక్రియ నుంచి ఈవీఎంల తొలగింపు ఇప్పట్లో సాధ్యంకాదు,’’ అని అన్నారు. 

1971లో పుట్టిన మస్క్ ఇంకా పిల్లవాడిగా ఉన్నప్పుడే 1982 నుంచి ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం ఈవీఎంలను ఉపయోగించడం ప్రారంభించింది. ఈ ఎన్నికలలో ఎత్తైన హిమాలయాల నుంచి గ్రేట్ నికోబార్ ద్వీపం వరకు 55 లక్షల ఈవీఎంలను మోహరించారు. ఆశ్చర్యకరమైన ఎన్నికల ఫలితాలు ఈవీఎంలు కీలకంగా ఉన్న ఎన్నికల ప్రక్రియ ఎంత విశ్వసనీయంగా, పటిష్టంగా ఉందో భారతీయ ఓటరుకు అర్థమయ్యేలా చేసింది. ఈవీఎంల హ్యాకింగ్, ప్రైవేట్ రంగం తయారు చేసిన నెట్‌వర్క్ ఈవీఎంల వల్ల వచ్చే సమస్యలు… ఈ కథనాలన్నీ అమెరికా ఎన్నికలకు సంబంధించినవి. 2024 భారత్ ఎన్నికల్లో ఇవేవీ జరగలేదు. స్వతంత్ర, సమర్థ భారతీయ ఎన్నికల సంఘం అత్యంత పకడ్బందీగా ఈ బృహత్తరమైన ప్రక్రియను నిర్వహించింది. మస్క్ చేస్తున్న వాదనలు భారతీయ ఈవీఎంలకు వర్తించవని చెప్పడానికి ఇక్కడ కొన్ని కారణాలు ఉన్నాయి.

ఈవీఎంల గురించి ధర్మబోధలు, సాధారణీకరణలు చేస్తూ మస్క్ ‘‘మానవులు లేదా కృత్రిమ మేధ (ఏఐ) హ్యాక్ చేసే ప్రమాదం తక్కువే అయినా దాని పర్యవసానాలు మాత్రం తీవ్రంగా ఉంటాయి,” అని చెప్పారు. అయితే మస్క్ ఇంతకుముందు మాదిరిగా ఈసారి భారత్ కు వచ్చేటప్పుడు చివరి నిముషంలో తన పర్యటనను రద్దు చేసుకోకుండా ఉంటే భారతీయ ఈవీఎంలను ఏఐ, మానవులు హ్యాకింగ్ చేయడం కూడా అసాధ్యమని భారత ఎన్నికల అధికారులు ఆయనకు సులభంగా చూపగలరు. నేడు భారత్ మూడో తరం ఈవీఎంలు లేదా ఎం3 ఈవీఎం యంత్రాలను ఉపయోగిస్తోంది. అవి ట్యాంపరింగ్ కు వీలులేనివి. ట్యాంపరింగ్ చేస్తే ‘‘సేఫ్టీ మోడ్’’లోకి వెళ్లి పని చేయకుండా పోతాయి. ప్రతి ఒక్కటి ప్రాథమిక కాలిక్యులేటర్‌తో సమానమైన స్వతంత్ర పరికరం. ఎన్నికల కమిషన్ (ఇసి) ఉపయోగిస్తున్న తాజా మూడో తరం ఈవీఎంలు ఇంటర్నెట్‌కు అనుసంధానం చేసి ఉండవు. బ్లూటూత్ లేదా వైఫైకి అనుసంధానం కావు. అందువల్ల రిమోట్ పరికరాలు వీటిని చేరుకోవడం కుదరదు. హ్యాకర్లకు ఒక పరికరాన్ని హ్యాక్ చేయడానికి ప్రధాన సాధనం ఇంటర్నెట్. ఈ రోజు చాలా హ్యాకింగ్‌లు దీని ద్వారానే జరుగుతున్నాయి. అసలు ఇంటర్నెట్ తో కనెక్ట్ కాని యంత్రాన్ని హ్యాక్ చేయడం అసాధ్యం. 

‘‘భారతీయ ఈవీఎంలు ప్రపంచంలోని ఇతర ఈవీఎంల కంటే భిన్నంగా ఉంటాయి. ఎం3 ఈవీఎంకు మరే ఇతర పరికరానికి కనెక్షన్ లేదు. మెయిన్స్ విద్యుత్ సరఫరా కూడా ఉండదు,’’ అని ఐఐటి బాంబే మైక్రోఎలక్ట్రానిక్స్, సాలిడ్-స్టేట్ ఎలక్ట్రానిక్స్‌ విభాగం నిపుణుడు ప్రొఫెసర్ దినేష్ కె శర్మ నొక్కిచెప్పారు. “ఈవీఎం అనేది ఓటింగ్ కోసం రూపొందించిన ప్రత్యేక వ్యవస్థ. ఎలక్ట్రానిక్ ఓటింగ్ కోసం లోడ్ చేసిన ప్రోగ్రామ్‌తో కూడిన సాధారణ-ప్రయోజన కంప్యూటింగ్ పరికరం కాదు,’’ అని ప్రొఫెసర్ శర్మ చెప్పారు. ప్రతి ఈవీఎం దానికదే ప్రత్యేకమైన ఎలక్ట్రానిక్ ద్వీపం. ఈ స్వతంత్రత వాటిని చాలా సురక్షితంగా ఉంచుతుందని ఆయన అన్నారు. కంప్యూటర్ సైన్స్, సైబర్‌సెక్యూరిటీ, స్మార్ట్ కార్డ్‌లు, సైబర్-ఫిజికల్ సెక్యూరిటీలో సుప్రసిద్ధ నిపుణుడు ప్రొఫెసర్ మూనా ఎన్డీటీవీతో మాట్లాడుతూ, ‘‘భారతీయ ఈవీఎంలలో ఎటువంటి ట్యాంపరింగ్ నమోదు కాలేదు. అది భారతీయులు భారత ప్రజాస్వామ్యం ప్రత్యేక అవసరాలకు అనుగుణంగా తయారు చేసిన అసాధారణమైన, వినియోగదారులకు అనుకూలమైన సాంకేతికత,” అని అన్నారు. 

నేడు ప్రపంచంలోని దాదాపు 25 దేశాలు డిజిటల్ ఓటింగ్‌ను ఉపయోగిస్తున్నాయి. భారత ఎన్నికల సంఘం ప్రకారం ఇవీఎంలను ఉపయోగించే దేశాలలో అమెరికా, ఆస్ట్రేలియా, బెల్జియం, బల్గేరియా, ఇటలీ, స్విట్జర్లాండ్, కెనడా, మెక్సికో, అర్జెంటీనా, బ్రెజిల్, చిలీ, పెరూ, వెనిజులా, నమీబియా, నేపాల్, భూటాన్, అర్మేనియా, బంగ్లాదేశ్ ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ ఓటింగ్‌లో అనేక రకాలు ఉన్నాయి. భారతదేశం మాదిరిగా కొన్ని దేశాల్లో ఓటింగ్ మొత్తం ఎలక్ట్రానిక్ విధానంలో జరుగుతుంది. మరికొన్ని దేశాలలో లెక్కింపు మాత్రమే ఎలక్ట్రానిక్ పద్దతిలో ఉంటుంది. ఎస్తోనియా వంటి కొన్ని దేశాలు ఇంటర్నెట్ ఆధారిత రిమోట్ ఓటింగ్‌ని ఉపయోగించడం ప్రారంభించాయి. కొన్ని నిర్దేశిత పోలింగ్ స్టేషన్‌లలో ఇంటర్నెట్ ఆధారిత ఓటింగ్‌ను ఏర్పాటు చేస్తారు. కొన్ని దేశాలు ఆప్టికల్ స్కానర్‌లను ఉపయోగిస్తాయి. ఇందుకు నెట్‌వర్క్ నాన్-నెట్‌వర్క్ యంత్రాలు రెండింటినీ వాడతారు.

చాలా దేశాల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ పరికరాలను ప్రైవేట్ కంపెనీలు తయారు చేస్తాయి. ఇవి భారత్ లో ఈవీఎంలను తయారు చేసే ప్రభుత్వ యాజమాన్యంలోని సంస్థలతో పోలిస్తే తక్కువ సైబర్ భద్రత కలిగి ఉంటాయి. ప్రపంచంలోని అత్యంత అభివృద్ధి చెందిన దేశం అమెరికా అనేక రకాల ఎలక్ట్రానిక్ ఓటింగ్‌ల పద్ధతులను ఉపయోగిస్తుంది. దేశవ్యాప్తంగా ఒకే ప్రమాణం లేదు. చాలా మంది విదేశీ నిపుణులు భారత ఈవీఎంలు పురాతనమైనవని, వాటిని ఆధునీకీకరించాల్సిన అవసరం ఉందని తరచుగా అంటూ వుంటారు. ఇసిఐ నిపుణులు మాత్రం ఒకోసారి వాడుకలో లేని ఎలక్ట్రానిక్ సాంకేతికత అదనపు భద్రతను ఇస్తుందని చెప్పారు. ఎందుకంటే ఎవరైనా ఈవీఎంలను హ్యాక్ చేయవలసి వస్తే 55 లక్షల యంత్రాలను విడివిడిగా హ్యాక్ చేయాల్సి ఉంటుంది. ఇది దాదాపు అసాధ్యం. అంతేగాక ర్యాండమైజేషన్ అదనపు భద్రతను అందిస్తుంది. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే భారతదేశ అణుబాంబును తయారు చేసిన శాఖలు, విభాగాలలే ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను కూడా తయారు చేసినందున నేడు మనదేశంలో జరిగే ఎన్నికలు అత్యంత సురక్షితమైనవి, అధునాతనమైనవి.

‘‘భారత ఈవీఎంల గొప్పదనం ఏమిటంటే అవి 21వ శతాబ్దపు ఎలక్ట్రానిక్ సాంకేతికత కంటే తక్కువ స్థాయిలో రూపొందించబడ్డాయి, అందువల్ల వాటిని ట్యాంపర్, హ్యాకింగ్ చేయడం సాధ్యం కాదు,’’ అని ఈవీఎంల రూపకల్పనలో ఇసిఐకి సహకరించిన ప్రొఫెసర్ మూనా వివరించారు. భారతదేశంలో ఎవరూ ఈవీఎంలను తొలగించమని అడగడం లేదు. అంతగా అధునాతనం కాని ఈ యంత్రాలు ప్రపంచం మునుపెన్నడూ చూడని విధంగా స్వచ్ఛమైన, పర్యావరణ అనుకూల ఎన్నికలను అందించాయి. “అమెరికా స్వేచ్ఛగా, న్యాయంగా, తిరుగుబాట్లు లేని ఎన్నికలను నిర్వహించే కళను, నైపుణ్యాన్ని భారతదేశం నుంచి నేర్చుకోవచ్చు!’’ అని ప్రొఫెసర్ మూనా సలహా ఇచ్చారు.