MSP

14 పంటలకు ఎంఎస్‌పీ గణనీయంగా పెంపు

మోదీ 3.0 కొలువుదీరిన 10 రోజుల్లోనే రైతులకు శుభవార్త చెప్పింది. రైతులు పండించిన పంటలకు మద్దతు ధర గణనీయంగా పెంచింది. జూన్ 19న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే 14 ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధర కల్పించేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. వరి పంటకు కొత్త మద్దతు ధర క్వింటాల్ కు రూ.2,300 కు చేరుకుంది. ఇది గతంలో ఉన్న ఎంఎస్‌పీ కంటే రూ.117 ఎక్కువ. నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో రైతులకు దాదాపు రూ.2 లక్షల కోట్లు అందుతాయి. ఇది గత సీజన్‌తో పోల్తిస్తే రూ.35 వేల కోట్ల కంటే ఎక్కువ. పంట పండించే ఖర్చు కంటే కనీస మద్దతు ధర ఒకటిన్నర రెట్లు ఎక్కువ ఉండాలని మోదీ సర్కార్ నిర్ణయానికి అనుగుణంగా వరి ఎంఎస్‌పీని 5.35 శాతం అంటే రూ. 117 పెంచి క్వింటాల్‌కు రూ.2,300 చేశారు. 2013-2014లో వరికి మద్దతు ధర కేవలం రూ.1,310. పత్తి కనీస మద్దతు ధర సాధారణ రకానికి రూ.7,121, నాణ్యత గల మరో రకం పత్తికి రూ.7,521 కి పెంచారు. ఇది గత ఎంఎస్పీ కంటే రూ.510 ఎక్కువ. జొన్నకు ఎంఎస్పీ రూ.3,371, రాగులకు రూ.4,290, మొక్కజొన్నకు రూ.2,225గా నిర్ణయించారు. పప్పుల విషయానికి వస్తే పెసర్లకు రూ.8,682, కందులకు రూ.7,550, మినుములకు రూ.7,400గా ఎంఎస్పీ నిర్ణయించారు. పొద్దుతిరుగుడు, వేరుశెనగ వంటి నూనె గింజల ఎంఎస్‌పీ కూడా పెంచారు.

కేంద్ర మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న ఇతర నిర్ణయాల్లో మ‌హారాష్ట్ర‌లోని ద‌హ‌ను స‌మీపంలో వ‌ధ‌వ‌న్‌లో మేజ‌ర్ పోర్ట్ ఏర్పాటుకు ఆమోదం లభించింది. జవహర్‌లాల్ నెహ్రూ పోర్ట్ అథారిటీ (జేఎన్పిఏ), మహారాష్ట్ర మారిటైమ్ బోర్డ్ (ఎంఎంబి) ద్వారా ఏర్పడిన స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్పివి) వధవన్ పోర్ట్ ప్రాజెక్ట్ లిమిటెడ్ (విపిపిఎల్) ద్వారా ఈ ప్రాజెక్ట్‌ను వరుసగా 74 శాతం, 26 శాతం వాటాతో నిర్మిస్తారు. వధవన్ ఓడరేవు మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లా వధావన్‌లో ఆల్-వెదర్ గ్రీన్‌ఫీల్డ్ డీప్ డ్రాఫ్ట్ మేజర్ పోర్ట్‌గా అభివృద్ధి చేస్తారు. భూసేకరణ భాగంతో సహా మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ.76,220 కోట్లు. ఇందులో ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్య (పీపీపీ) మోడ్‌లో కోర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, టెర్మినల్స్, ఇతర వాణిజ్య మౌలిక సదుపాయాల అభివృద్ధి ఉంటుంది. రోడ్డు రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ ద్వారా పోర్ట్, జాతీయ రహదారుల మధ్య రహదారి కనెక్టివిటీని ఏర్పాటు చేయడానికి, ప్రస్తుత రైలు నెట్‌వర్క్‌కు రైలు అనుసంధానం, రైల్వే మంత్రిత్వ శాఖ ద్వారా రాబోయే డెడికేటెడ్ రైల్ ఫ్రైట్ కారిడార్‌ను కూడా మంత్రివర్గం ఆమోదించింది.

 “నేషనల్ ఫోరెన్సిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఎన్‌హాన్స్‌మెంట్ స్కీ’’ (ఎన్ఎఫ్ఐఈఎస్) కోసం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 2024-25 నుండి 2028-29 మధ్య కాలానికి రూ.2254.43 కోట్లతో i. దేశంలో నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీ (NFSU) క్యాంపస్‌ల స్థాపన, ii. దేశంలో సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీల ఏర్పాటు, iii. ఎన్ఎఫ్ఎస్‌యూ దిల్లీ క్యాంపస్‌లో ఇప్పటికే ఉన్న మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం వంటివి చేపడుతారు. రూ. 2,869.65 కోట్లతో వారణాసిలోని లాల్ బహదూర్ శాస్త్రి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ అభివృద్ధికి ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.  ఈ విమానాశ్రయాన్ని గ్రీన్ ఎయిర్‌పోర్ట్‌గా అభివృద్ధి చేస్తారు. కేంద్ర కేబినెట్ రూ.7453 కోట్ల పెట్టుబడితో ఆఫ్ షోర్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు వయబులిటీ గ్యాప్ ఫండింగ్ (విజిఎఫ్) పథకానికి ఆమోదముద్ర వేసింది. ఇందులో రూ.6853 కోట్లు 1 గిగావాట్ సామర్థ్యం గల ఆఫ్ షోర్  విండ్ ఎనర్జీ ప్రాజెక్టుల స్థాపన, ప్రారంభం (గుజరాత్, తమిళనాడు కోస్తాల్లో ఒక్కోటి 500 మెగావాట్ల సామర్థ్యం గలవి) కోసం ఉద్దేశించగా రూ.600 కోట్లు ఆఫ్ షోర్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు అవసరం అయిన లాజిస్టిక్స్ సమకూర్చుకోవడానికి వీలుగా రెండు పోర్టుల అప్ గ్రేడేషన్ కు కేటాయించారు. భారతదేశానికి చెందిన ప్రత్యేక ఆర్థిక మండలి ప్రాంతంలో విస్తారంగా అందబాటులో ఉన్న ఆఫ్ షోర్ విండ్  సామర్థ్యాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోవడం లక్ష్యంగా 2015 సంవత్సరంలో నోటిఫై చేసిన జాతీయ ఆఫ్ షోర్ విండ్ ఎనర్జీ పాలసీ అమలు దిశగా విజిఎఫ్ స్కీమ్ ప్రకటన  ఒక పెద్ద ముందడుగు.