బయో ఆర్థిక వ్యవస్థలో అగ్రగామిగా భారత్
సైన్స్, అంతరిక్ష శాఖ సహాయ మంత్రి జితేందర్ సింగ్ ఒక జాతీయ ఆంగ్లపత్రికకు ఇచ్చిన ఈ ఇంటర్వ్యూలో బయో ఆర్థిక వ్యవస్థ (అంటే ఆహారం, ఇంధనం వంటి వస్తువులు, సేవల ఉత్పత్తికి పునరుత్పాదక వనరులను వినియోగించే వ్యవస్థ), అంతరిక్ష పరిశోధన, యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఖాళీలు ఎందుకు తగ్గాయి వంటి విషయాల గురించి మాట్లాడారు. ఇంటర్వ్యూలోని ముఖ్యాంశాలు:
ప్ర: మూడో లాంచ్ ప్యాడ్ ప్రాజెక్టుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇస్రోకు విజన్ 2040 ఉంది – మన సొంత అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయడం, చంద్రుడిపైకి మనుషులను పంపడం ఇందులో భాగం. ఈ మిషన్లను ఆమోదించడానికి ప్రాతిపదిక ఏమిటి?
జ: మన దగ్గర నావిగేషన్ ఉపగ్రహాలు ఉన్నాయి. కమ్యూనికేషన్ ఉపగ్రహాలను మీడియా కూడా ఉపయోగిస్తోంది. విపత్తు సన్నద్ధతను పర్యవేక్షించే అన్వేషణాత్మక ఉపగ్రహాలు, భూమిని పరిశీలించే కేంద్రం మొదలైనవి మనకు ఉన్నాయి. 1969లో ఇస్రోను స్థాపించారు. శ్రీహరికోట ప్రాథమిక అంతరిక్ష కేంద్రంగా అవతరించింది. 1979లో మనం మొదటి ప్రయోగాన్ని నిర్వహించాం. మొదటి లాంచ్ ప్యాడ్ రావడానికి చాలా సంవత్సరాలు పట్టింది. ఆ తర్వాత 2005 నాటికి రెండో లాంచ్ ప్యాడ్ వచ్చింది. శ్రీహరికోటతో పాటు తమిళనాడులోని తూత్తుకుడి జిల్లాలో రెండో స్పేస్ పోర్టు (అంతరిక్ష కేంద్రం) ఏర్పాటు చేయనున్నారు.
ప్రశ్న: వ్యోమగాములు శుభాన్షు శుక్లా, ప్రశాంత్ నాయర్ యాక్సియోమ్-4 మిషన్ (పైలట్ గా శుక్లా, మద్దతుగా నాయర్) కోసం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్ఎస్) వెళ్లడానికి శిక్షణ తీసుకున్నారు. ఈ మిషన్ కోసం నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ఈఎస్ఏ), జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ ప్లోరేషన్ ఏజెన్సీ (జాక్సా) నుంచి శిక్షణ పొందుతున్నప్పుడు భారత్‌కు కలిగే ప్రయోజనం ఏమిటి? అది మన గగన్‌యాన్ మిషన్‌కు ఎలా ఉపయోగపడుతుంది?
జ: ప్రధాని మోదీ వాషింగ్టన్ వెళ్ళినప్పుడు అప్పటి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో చర్చల సందర్భంగా వారి వ్యోమగాములతో పాటు ఒక భారతీయ వ్యోమగామి ఉండాలని వారి వైపు నుంచి సూచన వచ్చింది. భారతీయ ప్రతిభకు విశ్వవ్యాప్త గుర్తింపు ఉందనడానికి ఇది నిదర్శనం. ఇప్పుడు అదే నలుగురు వ్యోమగాములు కూడా గగన్‌యాన్ మిషన్ కోసం ఎదురు చూస్తున్నారు. వీరిలో ఒకరు 2026లో జరగనున్న తొలి స్వదేశీ మానవ మిషన్‌లో ప్రయాణించనున్నారు.
ప్రశ్న: యాక్సియోమ్-4 మిషన్ కొన్ని భారతీయ ప్రయోగాలు చేస్తుందంటున్నారు. వాటి గురించి వివరాలు చెప్పగలరా?
జ: కొన్ని ప్రయోగాలు ఉమ్మడిగా ఉంటాయి, కొన్ని ప్రత్యేకమైనవి. కానీ స్పేడెక్స్ (భారత్ విజయవంతంగా నిర్వహించిన స్పేస్ డాకింగ్ మిషన్) ఇప్పుడు మొక్కలపై కొన్ని ప్రయోగాలు చేస్తోంది. ఈ విధంగా చూస్తే భారతదేశం ఇప్పటికే కొంత పురోగతి సాధించింది. అంతరిక్షంలో మనం మొక్కలు పెంచుతున్నాం. కనుక అంతరిక్షంలో ఎక్కువ కాలం జీవించాల్సి వస్తే అక్కడ సేంద్రియ ఆహారం పొందవచ్చు. అంతరిక్ష బయోటెక్నాలజీ పరిశోధనలో సహకారం కోసం బయోటెక్నాలజీ శాఖ , ఇస్రో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. రానున్న రోజుల్లో అంతరిక్ష బయాలజీ కొత్త రంగం కాబోతోంది. స్పేస్ ఫిజీషియన్లు, స్పేస్ డాక్టర్లు కావాలి. మానవ శరీరధర్మశాస్త్రం అక్కడ ఎలా ఉంటుంది? శరీర సౌష్టవం, మనుగడ ఎలా సాధిస్తాం? ఒక వ్యక్తికి ఎటువంటి ఆహారం అవసరం? ఇటువంటి విషయాల్లో ఇప్పుడు మనం పరిశోధనలు చేస్తున్నాం.
ప్ర: సముద్రయాన్, సముద్ర గర్భ (డీప్ సీ) మిషన్, అందుకు సంబంధించిన ప్రణాళికల గురించి చెప్పగలరా?
జ: ఈ రంగంలో ఇప్పటివరకు పెద్దగా పరిశోధనలు జరగలేదు. అంతరిక్షం వేరు, లోతైన సముద్రం (డీప్ సీ) వేరు. మనకు 7,500 కిలోమీటర్ల పొడవైన సముద్రతీరం ఉంది, కానీ మనం దాని వైపు ఎప్పుడూ చూడలేదు. ఇది సంపద, ఖనిజాలు, లోహాలు, చేపల పెంపకం, జీవవైవిధ్యాల గొప్ప ఖజానా. హిందూ మహాసముద్రం- ఇలా తన పేరు మీద ఒక మహాసముద్రం ఉన్న ఏకైక దేశం మనదే. మనకు చాలా సుసంపన్నమైన సముద్రం ఉంది. లోతైన సముద్ర అన్వేషణ జరిగిన తర్వాత మనం భారీయెత్తున విలువ జోడింపు కార్యకలాపాలు చేపట్టవచ్చు. ఇది త్వరలో జరగబోతోంది.
రెండోది అంతరిక్షం, మూడోది హిమాలయాలు. మనకు హిమాలయాల ఒడిలో ఐదారు రాష్ట్రాలు ఉన్నాయి. గత ఏడాది వైజ్ఞానిక, పారిశ్రామిక పరిశోధనా మండలి రిపబ్లిక్ దినోత్సవ శకటంపై ఊదా విప్లవాన్ని ప్రదర్శించింది. అంటే లావెండర్ పంట విప్లవం. జమ్మూ కాశ్మీర్ లో మొదలైన ఈ ఉద్యమం ఇప్పుడు ఈశాన్య రాష్ట్రాలు, ఉత్తరాఖండ్ , హిమాచల్ ప్రదేశ్ లలోనూ విస్తరిస్తోంది. ఇది భారీ స్టార్టప్ అవకాశం మాత్రమే కాదు, ఆదాయ వనరు కూడా. ఈ రంగాలన్నింటినీ సద్వినియోగం చేసుకుంటే వికసిత్ భారత్ కోసం 2047 వరకు వేచి చూడాల్సిన అవసరం ఉండదని నేను భావిస్తున్నాను.
ప్రశ్న: అనుసంధాన్ జాతీయ పరిశోధనా సంస్థ (ఏఎన్ఆర్ఎఫ్) కొంతకాలంగా పనిచేస్తోంది. ఏఎన్ఆర్ఎఫ్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి మీరు చూసిన మార్పులేమిటి?
జ: జాతీయ పరిశోధనా మండలిని కలిగి ఉన్న అతికొద్ది దేశాల్లో మనమూ ఉండటం సంతోషంగా ఉంది. చాలా దేశాల్లో ఇటువంటి సంస్థ లేదు. అమెరికాకు ఉంది, జర్మనీకి కూడా ఇటువంటిది ఉంది. వారి నమూనాలను అధ్యయనం చేసి భారత్ జాతీయ నమూనాను ప్రవేశపెట్టాం. ఉదాహరణకు మా పాలకమండలిలో, మా సలహా బృందంలో సైన్స్ నుంచి మాత్రమే కాక సామాజిక, మానవ శాస్త్రాల ప్రతినిధులు కూడా ఉన్నారు. నాసా మాదిరిగా 60-70 శాతం వనరులు ప్రభుత్వేతరంగా ఉంటాయి. కానీ ఇది పూర్తిస్థాయిలో పనిచేయడానికి కొంత సమయం పడుతుంది.
ప్రశ్న: బయోటెక్ లో జీనోమ్ ఇండియా ప్రాజెక్టు వంటి పెద్ద కార్యక్రమాలతో సహా అనేక మిషన్లు అమలు జరిగాయి. ఈ రంగంలో మున్ముందు చేపట్టబోయే పెద్ద ప్రాజెక్టులు ఏమిటి?
జ: గత కొన్ని నెలల్లో జరిగిన ఒక ప్రధాన పరిణామం ఏమిటంటే, బయో-ఈ3 అని పిలిచే బయో ఆర్థిక వ్యవస్థకు అంకితమైన ఒక ప్రత్యేక బయోటెక్నాలజీ విధానాన్ని రూపొందించాం. మూడు ఈలు-ఎకానమీ, ఎన్విరాన్మెంట్, ఎంప్లాయిమెంట్ (ఆర్థిక వ్యవస్థ, పర్యావరణం, ఉపాధి) లను సూచిస్తాయి. ఇది మన సముద్ర గర్భం, హిమాలయ వనరులకు సంబంధించినది. తదుపరి పారిశ్రామిక విప్లవం బయో ఆర్థిక వ్యవస్థ ఆధారితంగా ఉంటుంది. ఆర్థిక వ్యవస్థ స్వభావం తయారీ నుంచి రీసైక్లింగ్ (పునరుత్పత్తి) ప్రక్రియలకు మారుతుంది. ప్రయోగశాలల్లో తయారు చేసిన పాలు, మట్టి వస్తాయి. బెంగళూరులోని ఓ స్టార్టప్ జంతు రహిత పాలను అభివృద్ధి చేసి ఎగుమతి చేస్తోంది. కాబట్టి, మనం బయో రంగంలో ఎంత నిమగ్నమైతే ఇతరుల కంటే అంత ముందుంటాం.
అదేవిధంగా బయో ఆర్థిక వ్యవస్థ, బయోటెక్నాలజీ వైరస్ లకే పరిమితం కాదు, ఇది మానవ ఆరోగ్యానికి కూడా సంబంధించినది. ఆరోగ్య రంగం కూడా ఎక్కువగా చికిత్సకు వాడే మందుల నుంచి వ్యాధులను నివారించే మందులకు మారబోతోంది. ఇది భారతదేశంలో ఇంతకు ముందు జరగలేదు. మీకు చివరిసారి జ్వరం వచ్చినప్పుడు, మీరు వైద్యుడి దగ్గరికి వెళ్ళి ఉండరు కదా? ఇదీ అంతే. మనం చికిత్సలను పెద్దగా పట్టించుకోవడం లేదు. ఈ రోజు మనం వ్యాధులను నివారించే ఆరోగ్య సంరక్షణ రంగంలో అగ్రస్థానంలో ఉన్నాం. కోవిడ్ కు డీఎన్ఏ వ్యాక్సిన్ తీసుకొచ్చిన తొలి కంపెనీ మనదే. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ కు హెచ్పీవీ వ్యాక్సిన్ ఉంది. 2014కు ముందు మన బయో ఆర్థికం కేవలం 1,000 కోట్ల డాలర్లు మాత్రమే. మన దగ్గర 50 స్టార్టప్‌లు మాత్రమే ఉంటే నేడు 9,000 ఉన్నాయి. మన బయో ఆర్థిక వ్యవస్థ 1,000 కోట్ల డాలర్ల నుంచి దాదాపు 14,000 కోట్ల డాలర్లకు పెరిగింది. రాబోయే కొన్నేళ్లలో 25,0000 కోట్ల డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నాం.
ప్రశ్న: పూజా ఖేడ్కర్ ఘటన తర్వాత యూపీఎస్సీలో మీరు తీసుకువచ్చిన సంస్కరణలేంటి?
జ: సంస్కరణల పరంగా, కాలక్రమంలో కాలం చెల్లిపోయిన 1,600కి పైగా చట్టాలను మేం తొలగించాం. పాలనా సౌలభ్యం, పారదర్శకత, జవాబుదారీతనం, ఉద్యోగికి అనుకూలమైన పనివాతావరణం సృష్టికి ఇది ఉపయోగపడుతుంది. మే 26, 2014న ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారం చేసిన మూడు నెలల తరువాత, గెజిటెడ్ అధికారులు పత్రాలను ధృవీకరించే (అటెస్టేషన్) పద్ధతిని మేం రద్దు చేశాం. ఎందుకంటే ఇది అవినీతి, బంధుప్రీతికి దారితీసింది. దేశ యువతను నమ్మే సత్తా ఈ ప్రభుత్వానికి ఉంది. ఇవి భారీ సామాజిక, ఆర్థిక సంస్కరణలు. పూజా ఖేడ్కర్ ఘటనకు ముందు, సిబ్బంది, శిక్షణ శాఖ పేపర్ లీకేజీలు, అక్రమాలను ఎదుర్కోవటానికి పబ్లిక్ పరీక్షలు (అక్రమ పద్దతుల నివారణ) చట్టం, 2024ను తీసుకువచ్చింది. దీని కింద భారీగా జరిమానాలు విధిస్తారు. కానీ విద్యార్థులకు మాత్రం కాదు.
ప్రశ్న: కేంద్ర ప్రభుత్వంలో 9 లక్షలకు పైగా ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. 2013-14లో యూపీఎస్సీకి రిక్రూట్‌మెంట్ కోసం 29 లక్షల దరఖాస్తులు రాగా, మొత్తం 9 వేల దరఖాస్తులను సిఫారసు చేసింది. అయితే 2022-23 నివేదిక ప్రకారం దరఖాస్తులు 45 లక్షలకు పెరగ్గా యూపీఎస్సీ సిఫార్సులు 6 వేలకు తగ్గాయి. ఉపాధి కల్పించడంలో ప్రభుత్వ వైఫల్యంపై మీరేమంటారు?
జ: మా అతిపెద్ద రిక్రూట్‌మెంట్ సంస్థ సెంట్రల్ స్టాఫ్ సర్వీసెస్. పదేళ్ల యూపీఏ ప్రభుత్వ పాలనతో పోలిస్తే నియామకాలు 70 శాతం పెరిగాయి. అదేవిధంగా రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు, ఇతర రిక్రూట్‌మెంట్ సంస్థల్లో నియామకాలు దాదాపు 70 శాతం పెరిగాయి. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ నుంచి సెక్షన్ ఆఫీసర్ కు పదోన్నతులు 140 శాతం పెరిగాయి. ఓబీసీ బ్యాక్ లాగ్ ఖాళీలను కూడా భర్తీ చేశాం. ఉపాధి అంటే కేవలం ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రమే కాదని ప్రజలకు అవగాహన కల్పించడంలో విజయం సాధించాం. ఏ అభివృద్ధి చెందిన దేశమూ కేవలం ప్రభుత్వ ఉద్యోగాలను మాత్రమే ఇవ్వదు. అందుకే స్టార్టప్ ఉద్యమం మొదలైంది. గతంలో 4,500 స్టార్టప్‌లు మాత్రమే ఉండేవి. ప్రస్తుతం 1.45 లక్షల స్టార్టప్‌లు ఉన్నాయి. స్టార్టప్‌ల విషయానికి వస్తే ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉన్నాం. ఇప్పుడు మనకు అంతరిక్ష రంగ, బయోటెక్ స్టార్టప్స్ ఉన్నాయి. ప్రజలు ఇప్పుడు ఉద్యోగాలను వదిలేసి ఈ దిశగా వెళ్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగానికి వెలుపల జీవనోపాధి వల్ల కలిగే ప్రయోజనాలను చూస్తున్నారు.
ప్ర: తలసరి ఆదాయంలో ప్రపంచవ్యాప్తంగా మనది 125వ స్థానం. ప్రపంచం మన వైపు చూస్తుండగా, మనకు కూడా హెచ్1బీ వీసా భయం ఉంది. అభివృద్ధి చెందుతున్న దేశంగా భారత్ ప్రస్తుతం ఎదుర్కొంటున్న సవాళ్ళేమిటి?
జ: మనకు గల అతిపెద్ద మానవ వనరు అయిన యువశక్తిని ఎలా సద్వినియోగం చేసుకోవాలనేది మన ముందున్న అతిపెద్ద సవాలు. జనాభాలో 70 శాతానికి పైగా 40 ఏళ్ల లోపు వారే. వికసిత్ భారత్ గురించి మాట్లాడుకుంటాం. నేటి టీనేజర్లు కొంత కాలం తర్వాత భారతదేశ ముఖచిత్రాన్ని తీర్చిదిద్దే స్థితిలో ఉంటారు. దేశంలో ప్రజలు ఇప్పటికీ పాతకాలకు భూస్వామ్య మనస్తత్వంతోనే ఉన్నారు. ఇది గుజరాత్ మినహా ఉత్తరాదిలో ఎక్కువగా ఉంది. ఇక్కడ ప్రజలు సివిల్ సర్వీసెస్ వైపే మక్కువ చూపుతారు. ఆలోచనా ధోరణి మారాలి. మన సామర్థ్యాన్ని సద్వినియోగం చేసుకుని, దాన్నుంచి గరిష్ట ప్రయోజనం పొందే మార్గాలు అన్వేషించాలి.
ప్ర: ప్రధాని ఆదేశాల మేరకు లేటరల్ ఎంట్రీ (సమర్థులైన వ్యక్తులను నేరుగా ప్రభుత్వ ఉద్యోగాల్లో నియమించడం) పోస్టుల ప్రకటనను నిలిపివేశారు. లేటరల్ ఎంట్రీ పథకం పరిస్థితి ఏమిటి? ఈ పోస్టుల్లో రిజర్వేషన్లు ఏవైనా ఉంటే ఎలా అమలు చేస్తారు?
జ: ఏకాభిప్రాయం అనే ప్రజాస్వామిక స్ఫూర్తికి అనుగుణంగా వివిధ అభిప్రాయలు వ్యక్తం కావడం వల్ల ఆ ఉద్యోగాల ప్రకటన ఆగిపోయి ఉండవచ్చు. గతంతో పోలిస్తే ఈ ప్రభుత్వ లేటరల్ ఎంట్రీ విధానం చాలా సంస్థాగతంగా ఉంది. యూపీఎస్సీ ద్వారా లేటరల్ ఎంట్రీ ఉద్యోగాల నియామకం ప్రతిపాదించాం. ఈ రోజు నాకు ఆర్బీఐ గవర్నర్ అవసరం అయితే నేను అత్యంత అర్హుడైన వ్యక్తి కోసం వెదుకుతాను. కానీ ఆయన లేదా ఆమె ఫలానా కులానికి లేదా వర్గానికి చెందిన వారై ఉండాలని మీరు నిర్దేశిస్తే సమర్థులైన వ్యక్తిని నియమించాలన్న ఉద్దేశమే నీరుగారిపోతుంది. సరైన సమయంలో ఈ అంశాన్ని పునఃసమీక్షిస్తాం.