Modi

బీఆర్ఎస్-కాంగ్రెస్ ఒకే నాణేనికి బొమ్మా బొరుసు

 

Modi waving

బీఆర్ఎస్-కాంగ్రెస్ ఒకే నాణేనికి బొమ్మా బొరుసు వంటివని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో బీఆర్ఎస్ ప్రభుత్వం కుంభకోణానికి పాల్పడితే.. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చర్యలు తీసుకోవడానికి బదులు ఆ ఫైలును మూసేసిందన్నారు. ‘మీరు తిన్నారు… మేం కూడా తింటాం’ అన్నట్టుగా రెండు పార్టీల తీరు ఉందని ఆరోపించారు. మార్చ్ 5న పటాన్ చెరులో జరిగిన బిజెపి ‘‘విజయ సంకల్ప సభ’’లో ప్రసంగించిన మోదీ కాంగ్రెస్, బీఆర్ఎస్ సహా కుటుంబవాదంపై విమర్శలు గుప్పించారు. గత పదేళ్ల ఎన్డీఏ పాలనలో సాధించిన విజయాలను వివరించారు.

నా తెలంగాణ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు అంటూ తెలుగులో ప్రసంగాన్ని మొదలు పెట్టిన మోదీ ప్రపంచ దేశాల్లో తెలుగు ప్రజలు కీలకభూమిక పోషిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో బిజెపి పట్ల ఆదరణ పెరుగుతోందని, మీ ఆశీర్వాదాలు వృథా కానివ్వనని స్పష్టం చేశారు. మోదీ ఏదైతే చెబుతాడో అదే చేసి చూపుతాడంటూ ‘‘మోదీ గ్యారంటీ అంటే.. గ్యారెంటీని పూర్తి చేసే గ్యారంటీ.’’ అని స్పష్టం చేశారు. మేం మాట ఇస్తే తప్పక నెరవేరుస్తామన్నారు. ‘‘ఆర్టికల్‌ 370ని రద్దు చేస్తామని చెప్పాం… చేశాం. అయోధ్య రామజన్మ భూమిలో రాముడి గుడి కడుతామన్నాం… ప్రపంచం గర్వించే రీతిలో అయోధ్యలో రాముడి ప్రతిష్ఠాపన జరిగింది. ఇవాళ మీ అందరికి ఒక గ్యారంటీ ఇస్తున్నా… అది ప్రపంచంలో భారతదేశాన్ని మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతాం.’’ అని అన్నారు.

కాంగ్రెస్ పాలనలో వారి కుటుంబాలు మాత్రమే బాగుపడ్డాయి కానీ ప్రజలు బాగుపడలేదన్నారు. కుటుంబ వాదాన్ని వ్యతిరేకిస్తున్నానని కాంగ్రెస్ నేతలు నాపై విమర్శలు చేస్తున్నారని తెలిపారు. కుటుంబ వాదం ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తుందన్నారు. కుటుంబవాదులకు దోపిడీ చేసే లైసెన్స్ ఏమైనా ఉందా…..? అని ప్రశ్నించారు. ‘‘కొంతమంది నాకు అసలు కుటుంబమే లేదని విమర్శిస్తున్నారు. ఆ నాయకులకు తమ కుటుంబమే ముఖ్యం. నాకు మాత్రం దేశమే ముఖ్యం… దేశంలో ప్రతి కుటుంబం ముఖ్యం. ఆ నాయకులు దేశంలో అనేక మందిని రాజకీయంగా ఎదగనివ్వలేదు. యువకులకు కాకుండా వృద్ధులకు మాత్రమే వారు అవకాశం ఇస్తారు. కుటుంబవాదులు తమ ఖజానా నింపుకొంటారు. వారి దొంగసొత్తును బయటకు కక్కిస్తున్నాం. కొందరు నల్లధనం దాచుకోవడానికి విదేశీ బ్యాంకుల్లో ఖాతాలు తెరిచారు. తమ కుటుంబాలకు విలాసవంతమైన భవనాలు కట్టించారు. మేం మాత్రం దేశంలో 4 కోట్ల పేదలకు ఇండ్లు కట్టించాం. అందుకే నాకు కుటుంబం లేదంటూ కొందరు నేతలు విమర్శిస్తున్నారు. 140 కోట్ల మంది భారతీయులు నా కుటుంబం. దేశంలోని ప్రతి చెల్లి, ప్రతి తల్లి నా కుటుంబమే. తామంతా మోదీ కుటుంబ సభ్యులమని ప్రజలందరూ అంటున్నారు. ఇండీ కూటమికి ఇది అర్థం కావడంలేదు.’’ అని అన్నారు.

దళితుల సమస్యలు అర్థం చేసుకున్నామని, దళితుల అభ్యున్నతి కోసం అనేక చర్యలు చేపట్టామన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ లపై విమర్శలు సంధిస్తూ ‘‘బీఆర్ఎస్-కాంగ్రెస్ రెండూ ఒకటే. నాణేనికి బొమ్మా బొరుసు లాంటివి. బీఆర్ఎస్ నాయకులు కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో వేలకోట్లు దోచుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో బీఆర్ఎస్ ప్రభుత్వం కుంభకోణానికి పాల్పడితే.. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చర్యలు తీసుకోవడానికి బదులు ఆ ఫైలును మూసేసింది. ‘మీరు తిన్నారు… మేం కూడా తింటాం’ అన్నట్టుగా రెండు పార్టీల తీరు ఉంది. బీఆర్ఎస్, కాంగ్రెస్‌లు రెండింటిదీ ఒకే బాట.. ఝూట్‌.. లూట్‌ (అబద్ధాలు.. దోపిడీ)’’ అని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణను కొత్త ఏటీఎంగా మార్చుకుందన్నారు.

రానున్న లోక్‌సభ ఎన్నికల్లో 400 సీట్లు గెలవడమే లక్ష్యంగా బిజెపి శ్రేణులు పనిచేయాలి. ‘‘ఈసారి 400 దాటాలి… బిజెపికి ఓటు వెయ్యాలి…’’ అంటూ తెలుగులో నినాదమిచ్చారు. వేదిక వద్దకు ఓపెన్ టాప్ జీప్ లో వచ్చిన మోదీపై బిజెపి కార్యకర్తలు, ప్రజలు పూల వర్షం కురిపించి తమ అభిమానాన్ని చాటుకున్నారు.

Modi Patancheru Sabha

Patancheru Crowd