Amit Shah

దక్షిణాది రాష్ట్రాలు సొంత భాషల్లో నడవాలనే మేం అంటున్నాం

Amit Shah అంతర్జాతీయ స్థాయి నుంచి జాతీయ, ప్రాంతీయ స్థాయి వరకు మోదీ ప్రభుత్వం అన్ని రంగాల్లో మార్పులు తెచ్చిందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. దక్షిణ భారతానికి చెందిన ఒక ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమిత్ షా దక్షిణాదికి సంబంధించిన అనేక అంశాల గురించి మాట్లాడారు. ముఖ్యంగా నిధుల బదిలీ, నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణకు సంబంధించి భయాలను తొలగించే ప్రయత్నం చేశారు. ఇక రాజకీయ అంశాలపై నిర్మొహమాటంగా తన అభిప్రాయాలు చెప్పారు. ఇంటర్వ్యూ లోని ముఖ్యాంశాలు: 

ప్ర: మోదీ ప్రభుత్వం 11 ఏళ్లు పూర్తి చేసుకుంది. దాని మూడు అత్యంత ప్రభావవంతమైన సంస్కరణలు ఏమిటి?

జ: 2014కు ముందు దశాబ్దంలో, భారతదేశ భవిష్యత్తు గురించి పాత్రికేయులు, శాస్త్రవేత్తలు, విద్యార్థులు, రైతులు, వ్యాపార వర్గాలు ఇలా వివిధ వర్గాలలో సర్వత్రా సందేహాలు ఉండేవి. అనిశ్చితి విపరీతంగా నెలకొని ఉండేది. భారత్‌లోనే కాదు, యావత్ ప్రపంచమూ భారత్‌కు ఉజ్వల భవిష్యత్తు లేదని భావించింది. ప్రధానిగా నరేంద్ర మోదీ ఎదుర్కొన్న అతిపెద్ద సవాళ్లు ఏమిటి అని ప్రజలు నన్ను తరచుగా అడుగుతారు. అది అంతర్గత భద్రతా? అవినీతా? లేక అస్తవ్యస్తంగా మారిన పరిపాలనా వ్యవస్థా? వీటన్నిటికంటే అప్పట్లో ఆయన ముందున్న అతిపెద్ద సవాలు భారతదేశ భవిష్యత్తుపై విశ్వాసాన్ని పునరుద్ధరించడం అని నేను నమ్ముతున్నాను.

మనం వెనక్కి తిరిగి చూసినప్పుడు, ఒక నాయకుడిగా, ప్రధానిగా, దేశ ప్రజలతో పాటు ప్రపంచం మళ్లీ భారతదేశం వైపు చూసేలా చేయడానికి మోదీ కృషి చేశారని నేను నమ్ముతున్నాను. 2047 నాటికి భారత్ పూర్తిగా అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందని 140 కోట్ల మంది విశ్వసిస్తున్నారు. ప్రపంచం భారతదేశాన్ని వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా పరిగణిస్తోంది. ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే దేశంగా భారత్ నిర్వహిస్తున్న పాత్రను ప్రపంచం గుర్తించింది. గత 11 ఏళ్లలో ఇదే అత్యంత కీలకమైన మార్పు అని నేను భావిస్తున్నాను. రంగాలవారీగా కూడా గొప్ప మార్పు కనిపిస్తోంది. విమర్శకులు చెదురు మదురు అంశాల గురించి మాత్రమే మాట్లాడతారు. కానీ సమగ్ర విశ్లేషణ చేయండి-మెరుగుదల కనిపించని రంగం ఏదైనా ఉందా? ఆహారధాన్యాల ఉత్పత్తి, అంతరిక్షంలో పురోగతి, పారిశ్రామిక వృద్ధి, అంతర్గత భద్రత, దౌత్యం, అవినీతి నిర్మూలన… మొత్తంగా చూస్తే తేడా కనిపిస్తుంది.

ప్రశ్న: జాతీయ సవాళ్ళ విషయానికి వస్తే చైనా విద్య, ఆరోగ్య రంగాల్లో భారీగా పెట్టుబడులు పెడుతోంది. అక్కడ విద్య దాదాపు ఉచితం. ఏటా లక్షలాది మంది విద్యార్థులు పరిశోధనల్లో ప్రవేశిస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంలో అమెరికాతో పోటీ పడుతోంది. విద్యపై మనం చేసే ఖర్చు చైనాకు దరిదాపుల్లో అయినా ఉందా?

జ: చైనాలో 50 ఏళ్లుగా జరుగుతున్న అభివృద్ధి ప్రభావాలను ప్రపంచం చూస్తోంది. కానీ వాస్తవంగా మన ప్రయాణం 2014లోనే మొదలైంది. నిజానికి రాహుల్ గాంధీని ఈ ప్రశ్న అడగాలి. ఇన్నాళ్లూ కాంగ్రెస్ ఏం చేసింది? ఆ సమయంలోనే సమగ్ర దృక్పథంతో పనిచేయడం ప్రారంభించి ఉంటే ఈ పనులన్నీ ఇలా పేరుకుపోయేవి కావు. 

ప్రశ్న: భారత్‌లో ఆదాయ అసమానతలు ఇంకా ఎక్కువగానే ఉన్నాయి. మనది పూర్తిగా మధ్య ఆదాయ దేశం కూడా కాదు….

జ: మనం అల్పాదాయ విషవలయంలో చిక్కుకున్నామనే అపోహను తొలగించడానికి నేను మీకు కొన్ని గణాంకాలు ఇస్తాను. 2014లో ఆరోగ్య బడ్జెట్ రూ.37,000 కోట్లు. ఇప్పుడు అది రూ.1లక్ష కోట్లకు చేరింది. వ్యవసాయ బడ్జెట్ రూ.22 వేల కోట్లు కాగా నేడు రూ.1.37 లక్షల కోట్లుగా ఉంది. మౌలిక సదుపాయాల బడ్జెట్ అప్పట్లో రూ.2 లక్షల కోట్ల నుంచి రూ.11.21 లక్షల కోట్లకు పెరిగింది. పదేళ్లలో 60 కోట్ల మంది పేదలకు ఇళ్లు, వంటగ్యాస్, విద్యుత్, తాగునీరు, 5 కిలోల ఉచిత రేషన్, రూ.5 లక్షల వరకు ఉచిత వైద్యం అందించాం. అంటే 75 ఏళ్లలో ఏ ప్రభుత్వం చేయలేని విధంగా దాదాపు 14 కోట్ల కుటుంబాలు ప్రాథమిక సౌకర్యాల లేమి నుంచి విముక్తమయ్యాయి. మేం విషయాలను దేనికి అదే విడిగా చూడలేదు. ఆరోగ్యం వంటి రంగంలో మేం అనుసరించిన సమగ్ర విధానాన్ని తీసుకోండి. స్వచ్ఛభారత్ కింద మరుగుదొడ్లు నిర్మిస్తామని చెప్పినప్పుడు అది కేవలం నినాదం మాత్రమేనని ప్రజలు భావించారు. కానీ ఇది నేరుగా ఆరోగ్యంతో ముడిపడి ఉంది. అలాగే నల్లాల ద్వారా నీటి సరఫరా. ఇది ప్రతి ఇంటికీ ఫ్లోరైడ్ కలుషిత నీటి సమస్యను పరిష్కరిస్తుందని ఎవరూ గుర్తించడం లేదు. అందుబాటు ధరల్లో మందుల పథకాన్ని తీసుకొచ్చాం. కేన్సర్, రక్తపోటు, మధుమేహం వంటి వాటికి అసలు ధరలో 20 శాతంకే మందులు అందుబాటులో ఉన్నాయి. పిల్లలకు ఉచితంగా టీకాలు ఇచ్చాం. పౌష్టికాహార లోపం కార్యక్రమాన్ని పునర్వ్యవస్థీకరించాం. అంగన్‌వాడీ నుంచి 9వ తరగతి వరకు చిన్నారుల ఆరోగ్యాన్ని పరిశీలిస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం. మహిళల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి మేం 13 కోట్ల కుటుంబాలకు కట్టెల ఆధారిత వంట పద్ధతుల స్థానంలో వంట గ్యాస్‌ను ప్రవేశపెట్టాం. భావజాలం ఆధారంగా ఏళ్ల తరబడి నినాదాలు మాత్రమే చేసేవారు. కానీ వారు ఏం చేశారు? ఆంగ్లంలో వ్యాసాలు ప్రచురించడం తప్ప?

ప్రశ్న: భాష, విద్యా మాధ్యమంపై ఇంకా ఎందుకు వివాదాలు చోటు చేసుకుంటున్నాయి?

జ: మాకు సంబంధించినంత వరకు ఎలాంటి గొడవలు లేవు. మాకు దృఢమైన విధానం ఉంది: భారతదేశాన్ని భారతీయ భాషలలో నడపాలి. విదేశీ భాషల మీదే దేశం నడవాలని ఇప్పటికీ నమ్ముతున్న వారి మనసులోనే ఈ వివాదం ఉంది. మీరు చైనాను ఉదాహరణగా ఇచ్చారు. వారి నుంచి నేర్చుకోండి. రష్యాను చూసి నేర్చుకోండి. జపాన్ కూడా. జర్మనీ కూడా.. అలాగే ఫ్రాన్స్.. మేం అన్ని భారతీయ భాషలను గౌరవిస్తాం. దక్షిణాదిని సొంత భాషల్లో నడపాలని మేం నమ్ముతున్నాం. రెండు రాష్ట్రాలు తెలుగులోనే నడవాలి. తమిళనాడు తమిళంలో పనిచేయాలి. కేరళ మలయాళంలో పనిచేయాలి. అక్కడ హిందీకి అంత స్థాయి లేదు.

ప్రశ్న: హిందీ సంగతేంటి?

జ: అన్ని భారతీయ భాషల వైపు మా మొగ్గు ఉంది. సీఏపీఎఫ్ కానిస్టేబుల్ జీడీ పరీక్షను 13 భాషల్లో నిర్వహించాం. జేఈఈ, నీట్, యూజీసీలను 12 భాషల్లో నిర్వహిస్తారు. ప్రాథమిక, సాంకేతిక, వైద్య విద్యను ప్రాంతీయ భాషల్లో అందించడానికి నూతన విద్యా విధానం (ఎన్ఈపీ) వీలు కల్పిస్తుంది. స్టాలిన్ ఏం చేశారో తమిళనాడు ప్రజలకు చెప్పాలి.

ప్రశ్న: ఇద్దరు ఠాక్రే సోదరులూ భాష విషయంలో ఒక్కటయ్యారు?

జ: అదొక్కటే కారణం కాదు. ఇద్దరి పరిస్థితి రాజకీయంగా దిగజారిపోయింది, అదే అసలు సమస్య.

ప్రశ్న: తమిళనాడులో అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకున్నారు. అక్కడ భాషా సమస్య ఎలా ఉంది?

జ: నేను భారతీయ భాషలు అంటున్నానంటే అందులో తమిళం కూడా ఉంటుంది. స్టాలిన్‌కు చెబుతున్నాను. తమిళంలో వైద్యం బోధించండి. మీరెందుకు చేయరు? తమిళంలో ఇంజినీరింగ్ బోధించాలి. మీరు ఎందుకు చేయరు? తమిళంలో బోధనను వ్యతిరేకిస్తున్నామని తమిళనాడు అంటే మాత్రం నేను వ్యతిరేకిస్తాను.

ప్రశ్న: అన్నాడీఎంకే-బిజెపి విజయావకాశాలపై మీరేమనుకుంటున్నారు?

జ: భారీ మెజార్టీతో గెలుస్తాం.

ప్ర: అది మీ రాజకీయ చతురత, వ్యూహంపై ఆధారపడి ఉంటుందా లేదా క్షేత్రస్థాయిలో పరిస్థితి మీదా?

జ: నేను ప్రజల మూడ్ గురించి మాట్లాడుతున్నాను. అవినీతి, క్షీణిస్తున్న శాంతిభద్రతలు, బంధుప్రీతి, కుటుంబ కలహాలతో తమిళనాడు ప్రజలు విసిగిపోయారు.

ప్ర: గెలిస్తే ప్రభుత్వంలో చేరుతారా?

జ: చేరతాం.

ప్రశ్న: విజయ్ మీతో చేరే అవకాశం ఉందా, లేదా పీఎంకే, చిన్న పార్టీలతో చేరే అవకాశం ఉందా? లేదంటే బహుముఖ పోటీ నెలకొంటుంది.

జ: అది ఇప్పుడే చెప్పలేం. పార్టీలను ఒకే వేదికపైకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తాం.

ప్రశ్న: జీఎస్టీ, 15వ ఆర్థిక సంఘంలో పన్నుల బదిలీ విధానంలో మార్పుల తర్వాత నిధుల కేటాయింపుపై దక్షిణాది రాష్ట్రాలు, ముఖ్యంగా తమిళనాడు వ్యక్తం చేస్తున్న ఆందోళనలపై మీ వైఖరి ఏమిటి?

జ: నిధుల దుర్వినియోగాన్ని కప్పిపుచ్చుకునేందుకు ‘ఇండీ’ కూటమి ఆడుతున్న అబద్ధాలు ఇవి. మోదీ ప్రభుత్వం సమగ్ర అభివృద్ధి నమూనాను అనుసరిస్తోంది తప్ప ఏకపక్షంగా లేదు. ఈ ఆరోపణలకు భిన్నంగా దక్షిణాదికి నిధులు గణనీయంగా పెరిగాయి. మోదీ ప్రభుత్వ హయాంలో పన్ను బదిలీల కింద ఐదు రాష్ట్రాలకు కేటాయించిన మొత్తం కేటాయింపులు రూ.3,55,466 కోట్ల నుంచి రూ.10,96,754 కోట్లకు పెరిగాయి. యూపీఏ హయాంలో రూ.2,18,053 కోట్లుగా ఉన్న గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఇప్పుడు రూ.9,38,518 కోట్లకు చేరింది. అంటే 330 శాతం పెరుగుదల. తమిళనాడు పన్నుల బదలాయింపుల 207 శాతం వృద్ధితో రూ.94,977 కోట్ల నుంచి రూ.2.92 లక్షల కోట్లకు పెరిగింది. గ్రాంట్ ఇన్ ఎయిడ్ 342 శాతం పెరిగి రూ.57,924 కోట్ల నుంచి రూ.2.55 లక్షల కోట్లకు చేరింది.

ప్ర: మరి లోక్ సభ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ?

జ: దక్షిణాది రాష్ట్రాలకు ఏవైనా సమస్యలు ఉంటే పరిష్కరిస్తామని స్పష్టంగా చెప్పాను. అన్యాయం జరగదు. పునర్వ్యవస్థీకరణ (డీలిమిటేషన్) కమిషన్ చట్టం ఇంకా రాలేదు. అలాంటప్పుడు దాని గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? ఎందుకంటే తమిళనాడులో ఎన్నికలు వస్తున్నాయి. ఇది రాజకీయం. చట్టం రావడానికి ముందు పార్లమెంటులో చర్చలు జరుగుతాయి.

ప్రశ్న: హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల జోరును బిజెపి బీహార్, తమిళనాడు, కేరళ, పశ్చిమబెంగాల్ ఎన్నికలలో కూడా కొనసాగించగలదా?

జ: మాకు అన్ని చోట్లా మంచి విజయావకాశాలు ఉన్నాయి. అస్సాంలోనూ మా విజయాన్ని పునరావృతం చేస్తాం. నేను ఈ మధ్య బెంగాల్ లో పర్యటించలేదు కానీ మమతపై వ్యతిరేకత ఉంది. దాని నుంచి ప్రయోజనం పొందే పార్టీ మాదే అవుతుంది. ఒకప్పుడు కేవలం మూడు స్థానాల నుంచి 77 స్థానాలకు ఎదిగాం. గణితం అర్థం చేసుకున్న వారెవరైనా ఈ ధోరణిని గమనించవచ్చు. 34 ఏళ్లు పాలించిన వామపక్షాలు సున్నాకు పడిపోయాయి. 30 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ కూడా సున్నానే.

ప్రశ్న: బీహార్ సంగతేంటి?

జ: బీహార్ విషయంలో మాకు మంచి నమ్మకం ఉంది. పెద్ద సమస్య ఏమీ లేదు. ఎన్డీయే కచ్చితంగా గెలుస్తుంది.

ప్రశ్న: ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఓటర్ల జాబితా ప్రత్యేక ముమ్మర సవరణ చేపట్టారు. ధ్రువీకరణ పత్రాలు లేని నిస్సహాయ ఓటర్లు పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఈబీసీ ఓటర్లు కూడా.. దీనిపై మీ సొంత పార్టీ నాయకులు, మిత్రపక్షాల నేతలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

జ: ఈ ప్రక్రియపై ఎవరికైనా ఆందోళనలు ఉంటే ఎన్నికల సంఘాన్ని సంప్రదించాలి. కేవలం ఊహలతో కాదు, ప్రక్రియ ఫలితాల ఉదాహరణలతో. ఓటర్ల జాబితా సవరణ జరగడం ఇదే మొదటిసారి కాదు. ఇది 1991లో కూడా జరిగింది. ఇది కేవలం బీహార్ లో మాత్రమే జరగడం లేదు. ఇది భారతదేశం అంతటా జరుగుతుందని నేను అనుకుంటున్నాను. ఏదేమైనా ఈ వ్యవహారం సుప్రీంకోర్టులో ఉంది.

ప్రశ్న: ప్రతిపక్షాలు దీన్ని పౌరసత్వ సవరణ చట్టం (CAA), జాతీయ పౌరుల రిజిస్ట్రీ (NRC)లను మరో రూపంలో అమలు చేయడంగా అభివర్ణిస్తున్నాయి? 

 జ: ఎన్నికల సంఘం చేసే ప్రతి పనిని వ్యతిరేకిస్తున్నారు. వారు తమ ఎన్నికల పరాజయాలను సమర్థించుకోవాల్సిన అవసరం ఉంది, కాబట్టి వారు “మేం ఈవీఎంల వల్ల ఓడిపోయాం” వంటి తప్పుడు కథనాలను ప్రచారం చేసుకున్నారు. తమిళనాడులో అవే ఈవీఎంలతో వారికి ఎలాంటి ఇబ్బంది లేదు. అదే ఈవీఎం తమకు విజయాన్ని అందించిన తర్వాత వారు ప్రమాణ స్వీకారం చేస్తారు. తెలంగాణలో ప్రమాణ స్వీకారం చేశారు. అయితే మహారాష్ట్రలో మాత్రం ఈవీఎంలు లోపభూయిష్టంగా ఉన్నాయని చెబుతున్నారు.

ప్ర: అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ ఓటర్ల జాబితా సవరణలు బెంగాలీలను, ముఖ్యంగా బెంగాలీ రాజ్ బన్షీలను లక్ష్యంగా చేసుకున్నారని మమతా బెనర్జీ ఆరోపించారు?

జ: మమతా బెనర్జీ సంగతి మీకు తెలియదా? ఒకసారి సాధారణ సైనిక విన్యాసాల సమయంలో కేంద్రం తన సెక్రటేరియట్‌కు బలగాలను పంపిందని ఆమె ఆరోపించారు. ఆమె చెప్పేదాన్ని మీరు ఎలా సీరియస్‌గా తీసుకుంటారు?

ప్ర: బిజెపి, ఆర్ఎస్ఎస్ మధ్య విభేదాలున్నాయా?

జ: లేదు. ఇవన్నీ జర్నలిస్టుల కల్పిత గాథలు.

ప్రశ్న: మీ ప్రభుత్వం ప్రతిపక్షాల నుంచి ఒత్తిడితోనే కుల గణన ప్రారంభించిందని అంటున్నారు.

జ: దీనికి జవాబు అవసరమా? ప్రజలు కోరింది ప్రభుత్వం చేస్తే ఆ ఘనత ప్రభుత్వానికి దక్కకుండా నిరాకరించగలరా?

ప్ర: ఇది సామాజిక ఆర్థిక సర్వేనా లేక కేవలం కుల సర్వేనా?

జ: ఇది కులం గురించిన ప్రశ్నలతో కూడిన జనాభా గణన అవుతుంది.

ప్రశ్న: సామాజిక, ఆర్థిక కుల గణన?

జ: లేదు, ఒక కుల గణన. సామాజిక, ఆర్థిక ప్రశ్నలు సాధారణ జనాభా గణనలో ప్రత్యేక భాగం.

ప్ర: తెలంగాణ మోడల్ గురించి ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి?

జ: తెలంగాణలో వారు చేస్తున్నది ఒక సర్వే. మేం చేసేది జనగణన. రెండింటి మధ్య తేడా ఉంది. కర్ణాటకలో వారు ప్రయత్నించినా దాన్ని విరమించుకోవాల్సి వచ్చింది.

ప్రశ్న: భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) అమల్లోకి వచ్చింది. దాని ప్రభావాన్ని మీరు ఎలా చూస్తారు?

జ: మూడు కొత్త క్రిమినల్ చట్టాలు స్వతంత్ర భారతదేశంలో అతిపెద్ద న్యాయ సంస్కరణలు. న్యాయ వితరణ ప్రక్రియలో గుణాత్మక, పరిమాణాత్మక మార్పులను మీరు చూడవచ్చు. ఈ చట్టాలు పూర్తిస్థాయిలో అమల్లోకి వస్తే మూడేళ్లలో ప్రతి బాధితుడికి సుప్రీంకోర్టు వరకు న్యాయం జరుగుతుంది.

ప్రశ్న: 2026 నాటికి నక్సలిజాన్ని నిర్మూలిస్తామని మీరు చెప్పారు. ఎలాంటి వ్యూహాలు అనుసరించారు?

జ: 2026 నాటికి నక్సల్స్ ఉద్యమం దాదాపు నిర్మూలప అవేతేందపి నేను నమ్ముతున్నాను. గత ప్రభుత్వాల రక్షణాత్మక వ్యూహానికి మేం స్వస్తి చెప్పాం. అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తూనే కీలకమైన నక్సల్స్ ప్రాంతాల్లో భద్రతా లోపాన్ని భర్తీ చేశాం. మేం వారి సరఫరా వ్యవస్థలకు అంతరాయం కలిగించాం, నిధులు, ఆహారం, మందులు, ఆయుధాల సరఫరా నిలిపి వేశాం. అదే సమయంలో నిర్మాణాత్మకమైన లొంగుబాటు విధానాన్ని ప్రవేశపెట్టాం. తత్ఫలితంగా, నక్సలిజం హింసాత్మక సంఘటనలు 52 శాతం తగ్గాయి- 2004-14 లో 16,463 నుండి 7,856 కు తగ్గాయి. భద్రతా దళాలలో 71 శాతం, పౌరులకు 68 శాతం మరణాలు తగ్గాయి.