గ్రామసభలలో ప్రభుత్వంపై ప్రజల తిరుగుబాటు
అధికారంలోకి వచ్చి 13 నెలలు అవుతున్నా 100 రోజులలో అమలు చేస్తామన్నా ఆరు గ్యారంటీల అమలు గురించి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాయమాటలతో కాలక్షేపం చేస్తూ వస్తోంది. అధికారంలోకి రాగానే ఆర్భాటంగా గ్రామసభలు పెట్టి ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించిన ప్రభుత్వం వాటిని ఏం చేశారో అర్థం కావడం లేదు. ఈ సభలలో దరఖాస్తు చేస్తుకున్న ఒక్కరికి కూడా కొత్తగా రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. ఇప్పుడు తాజాగా మరోసారి గ్రామసభలు జరుపుతూ ఉండడంతో సహజంగానే ప్రజల నుండి ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. జనవరి 21న రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 3000 పంచాయతీల్లో గ్రామసభలు నిర్వహించగా, అన్నిచోట్లా సర్కారుపై ప్రజలు తిరగబడ్డారు. చాలాచోట్ల ప్రజల నిలదీతలు, ఆందోళనలు, నిరసనలతో సభలు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో ముందస్తు సమాచారం లేక వెలవెలబోయాయి. దాదాపు అన్ని చోట్లా పోలీసులను మోహరించి ప్రజలపై ఉక్కుపాదం మోపుతూ సభలను మమ అనిపించడం కనిపించింది.
అర్హులను వదిలేసి కాంగ్రెస్ నాయకులు చెప్పిన వారినే పథకాలకు ఎంపిక చేశారని, ఇందిరమ్మ ఇండ్లకు ఒకే ఇంటి నుంచి ఇద్దరు, ముగ్గుర్ని ఎంపిక చేశారని, లేనివాళ్లను వదిలి ఉన్నోళ్లకే లబ్ధి కలిగేలా జాబితాలు తయారు చేశారని అధికారులను, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను, పార్టీ నాయకులను నిలదీశారు. ఏ గ్రామసభలో చూసినా సర్కార్‌పై ప్రజలు తమలో నిండిపోయిన తీవ్ర అసంతృప్తిని వెల్లగక్కారు. ‘దరఖాస్తులు ఎప్పుడు తీసుకున్నారు? ఏ ప్రాతిపదికన అర్హుల జాబితా తయారు చేశారు. మాకు ఎందుకు ఇవ్వరు?’ అని ఎక్కడికక్కడ నిలదీయడంతో అధికారులు మధ్యలోనే వదిలేసి వెళ్లిపోయారు. జాబితాలో మొత్తం కాంగ్రెస్ కార్యకర్తలు, నేతల పేర్లే ఉన్నాయంటూ అనేకచోట్ల అధికారులు, నేతలు, ప్రజల మధ్య వాగ్వాదం జరిగింది. మంచిర్యాల, సూర్యాపేట, నల్లగొండ, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, మేడ్చల్ మల్కాజిగిరి, జనగామ తదితర జిల్లాల్లోని పలు గ్రామాల్లో అధికారులపై ప్రజలు మూకుమ్మడిగా తిరగబడడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రాజన్నసిరిసిల్ల జిల్లాలో గుంట భూమి లేకున్నా ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు ఎందుకివ్వడంలేదని మహిళలు నిలదీశారు. ఆరు గ్యారెంటీల అమలు ఏమైందని, ఆడబిడ్డలకు తులం బంగారం ఏదని? ఏడాదైనా రైతుభరోసా ఎందుకిస్తలేరని? ప్రశ్నల వర్షం కురిపించారు. నాలుగు పథకాలకు కొత్తగా దరఖాస్తులు ఇవ్వాలంటూ అధికారులు పత్రాలు విడుదల చేయడంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాపాలనలో దరఖాస్తులు ఇచ్చామని, కులగణన సర్వేలో కూడా తమ వివరాలన్నీ చెప్పామని, తమకు సంబంధించిన అన్ని రకాల వివరాలు ప్రభుత్వం దగ్గర ఉన్నాయని స్పష్టంచేశారు. మళ్లీ ఇప్పుడు ఎందుకు దరఖాస్తులు తీసుకుంటున్నారని ప్రశ్నించారు. గతంలో ఇచ్చిన దరఖాస్తులు ఏమయ్యాయని నిలదీశారు.
ఓట్లప్పుడు చెప్పినదానికి, ఇప్పుడు చేస్తున్నదానికి పొంతన లేదని అధికార పార్టీ నేతలపై నిప్పులు చెరిగారు. మార్పు అంటే ఇదేనా? అంటూ నిలదీశారు. మరోవంక, ఇందిరమ్మ ఇండ్లను పొందేందుకు ఆధార్ కార్డులు కీలకంగా చేస్తూ ఉండడంతో పట్టణాలు, నగరాలకు వలస వెళ్లిన సొంత ఊర్లో ఇల్లు పొందాలనుకున్నా గ్రామసభ అభ్యంతరం చెబితే ఇల్లు మంజూరయ్యే అవకాశం పోతున్నది. లబ్ధిదారుల ఎంపిక కోసం దరఖాస్తులను మూడంచెల్లో వడపోస్తున్నారు. ఈ ప్రక్రియలో ఆధార్ కార్డు కీలకంగా మారింది. రాష్ట్రంలో లక్షల సంఖ్యలో ప్రజలు జిల్లాల నుంచి ప్రధాన పట్టణాలకు, హైదరాబాద్‌కు వచ్చి జీవిస్తున్నారు. వృత్తి-ఉద్యోగాల కోసం, కూలీ పనుల కోసం వచ్చి, అద్దె ఇండ్లలో ఉంటూ.. పిల్లల చదువు కోసం ఇక్కడి చిరునామాపైనే ఆధార్ కార్డులు తీసుకున్నారు. ఇటువంటివారు ఇప్పుడు సొంత ఊళ్లలో ఇల్లు పొందే అర్హతను కోల్పోతున్నారు. వారికి ఎలాగూ హైదరాబాద్‌లో ఇంటి జాగా లేకపోగా సొంత ఊళ్లో కూడా ఇల్లు లభించే వీలు లేకుండా పోతున్నది. దీంతో వీరి పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా తయారైంది. రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికకు గ్రామసభలు నిర్వహిస్తున్నారు. ఇండ్ల కోసం 82 లక్షలకుపైగా దరఖాస్తులు అందగా, వాటిలో సగం దరఖాస్తుల పరిశీలన కూడా పూర్తికాలేదు. ఇంటి లబ్ధిదారుల ఎంపిక కోసం విధించిన నిబంధనల వల్ల సగానికిపైగా దరఖాస్తులు తిరస్కారానికి గురయ్యే అవకాశం ఉందని అధికారులే అంటున్నారు. 10 లక్షల కొత్త కార్డులు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ సర్కారు ఇప్పుడు సగం కోత పెట్టింది. రాష్ట్రవ్యాప్తంగా 6.68 లక్షల రేషన్‌కార్డులు మాత్రమే ఇవ్వబోతున్నట్టు తెలిసింది. ఈ నెల 18న జిల్లాలవారీగా అర్హుల జాబితాను సిద్ధం చేసిన ప్రభుత్వం ఇదే జాబితాను జిల్లాలకు పంపించినట్లు తెలిసింది. ఈ జాబితా ప్రకారమే గ్రామసభల్లో చర్చించి కొత్త కార్డులు జారీ చేయనుంది.
కుల గణన సర్వేలో కొత్త కార్డుల కోసం 12 లక్షల దరఖాస్తులు వచ్చాయని, ఇందులో సుమారు 10 లక్షల వరకు ఇచ్చే అవకాశం ఉన్నదని పలు సందర్భాల్లో మంత్రులు వ్యాఖ్యానించారు. కానీ, ఇప్పుడు వీటిని వివిధ కొర్రీలతో వడపోయగా 6.68 లక్షల మందిని అర్హులుగా తేల్చింది. కొత్త రేషన్‌కార్డుల జారీకి కులగణన సర్వేను లింకు చేయడంపై ప్రజల నుంచి తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమైన నేపథ్యంలో ఇప్పుడు రానివారి నుంచి గ్రామసభల్లోనూ దరఖాస్తులు స్వీకరిస్తామని ప్రభుత్వం తెలిపింది. అయితే, ఇది కేవలం ప్రజలను మభ్య పెట్టేందుకు, కోపాన్ని తగ్గించడానికేనని, గ్రామసభల్లో స్వీకరించనున్న దరఖాస్తులకు ఇప్పట్లో మోక్షం కష్టమేనని తెలుస్తున్నది. ఆరోగ్యశ్రీతో ఇతర పథకాలకు రేషన్‌కార్డు లింకును తొలగిస్తామని పేర్కొన్నది. ఇందులోభాగంగా రేషన్‌కార్డుల స్థానంలో స్మార్ట్‌కార్డులను (ఏటీఎం మాదిరిగా) జారీ చేస్తామని వెల్లడించింది. కానీ, ఇప్పుడు స్మార్ట్‌కార్డులపై ప్రభుత్వం సప్పుడు చేయడం లేదు. పాత పద్ధతిలోనే రేషన్‌కార్డులను జారీ చేస్తున్నది.
కృష్ణ చైతన్య