Hamara Sankalp Vikasit Bharat
G Kishan Reddy

గ్యారంటీలు అమలు చేయని కాంగ్రెస్ ను నిలదీయాలి

Raitu Deekshaకాంగ్రెస్ రైతు డిక్లరేషన్ బోగస్ డిక్లరేషన్.. రైతులకు ఇచ్చిన గ్యారంటీ బోగస్ గ్యారంటీ అని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖల మంత్రి జి. కిషన్ రెడ్డి విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో ఓటు అడిగేందుకు వచ్చే కాంగ్రెస్ నాయకులను రైతులకు ఇచ్చిన అన్ని హామీలు, గ్యారంటీల అమలు ఏమైందని నిలదీయాలన్నారు. అనేక హామీలు ఇచ్చి అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఏప్రిల్ 15న బిజెపి రాష్ట్ర కార్యాలయంలో జి. కిషన్ రెడ్డి రైతు దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా దీక్షకు దిగే ముందు, ముగిసిన తర్వాత మాట్లాడారు.

రైతు దీక్షలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ ‘‘బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో అనేక రకాలుగా రైతులకు అన్యాయం చేసింది. కేసీఆర్ మాటలు కోటలు దాటేవి.. కాని, పనులు ఫాంహౌస్ దాటేవి కాదు. రైతు రుణమాఫీ చేస్తామని, ప్రతి నియోజకవర్గంలో లక్ష ఎకరాల సాగు చేస్తామని చెప్పి రైతు వ్యతిరేక విధానాలతో ఇబ్బంది పెట్టారు. అందుకే, రైతులను మోసం చేసిన కేసీఆర్ ప్రభుత్వానికి గత ఎన్నికల్లో ప్రజలు బుద్ధిచెప్పారు. కాంగ్రెస్ డిక్లరేషన్లు, గ్యారంటీలు, మేనిఫెస్టో పేరుతో అనేక రకాలుగా 400 పైగా హామీలు ఇచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు, రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చే పరిస్థితి లేదు. ప్రజలకు వెన్నుపోటు పొడవడమే ఇందిరమ్మ రాజ్యమా..? రైతుల కష్టాలు తీరుస్తామని, అనేక రకాల ఆశలు రైతు సమాజంలో రేకెత్తించి.. గ్యారంటీల పేరుతో మభ్యపెట్టారు. వంద రోజుల్లోనే ఇచ్చిన గ్యారంటీలు అమలు చేస్తామని కాంగ్రెస్ నాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే, రేవంత్ రెడ్డి వంటివారు అనేక ప్రాంతాల్లో చెప్పారు. కాని, ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు.

కాంగ్రెస్ గ్యారంటీ అంటే… ప్రజలను మభ్యపెట్టే, మోసం చేసే గ్యారంటీ. రైతులకు వెన్నుపోటు పొడిచే, దగా చేసే గ్యారంటీ.. సోనియమ్మ పాలన రాగానే డిసెంబరు 9న తక్షణమే రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. కాని ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేదు. ఏ ఒక్కరు కూడా బ్యాంకులకు అప్పులు కట్టొద్దని, కొత్తగా రుణాలు తీసుకోండని రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఆయన మాటలను నమ్మి కాంగ్రెస్ కు ఓటేస్తే రైతులను మోసం చేశారు. నేడు రైతులకు తీసుకున్న అప్పులు చెల్లించలేకపోవడంతో బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదు. రైతులు దళారీల దగ్గర మిత్తీలకు అప్పులు తెచ్చుకొని పంటలు పండిస్తే రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల ధాన్యం కొనుగోలు చేయడంలో శ్రద్ధ లేదు. వారికి వసూళ్లకు పాల్పడి ఆ పైసలను దిల్లీకి పంపడంపైనే శ్రద్ధ ఉంది. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు ఎలాంటి కార్యాచరణ ప్రణాళిక ఉందో రేవంత్ రెడ్డి స్ఫష్టం చేయాలి. అబద్ధపు హామీలతో తెలంగాణ రైతులను మోసం చేయడమే వారి ఉద్దేశం.

కేసీఆర్ మాదిరిగా రేవంత్ పాలన

రైతులకు ఆర్థిక సాయం, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసేందుకు కావాల్సిన నిధులు ఏవిధంగా సమకూర్చుకుంటారో తెలంగాణ ప్రజలకు చెప్పాలి. గత ముఖ్యమంత్రి కేసీఆర్ దళితబంధు పేరుతో దళితులను, గిరిజన బంధు పేరుతో గిరిజనులను మాయమాటలతో వెన్నుపోటు పొడిచారు. ఏ వర్గానికి ఎలాంటి బంధు ఇవ్వలేదు. నాలుగు నెలల కాంగ్రెస్ ప్రభుత్వ పాలన గత కేసీఆర్ ప్రభుత్వం మాదిరిగానే ఉంది. రాష్ట్రంలో ఒక కుటుంబ పాలన పోయి.. మరొక కుటుంబ పాలన వచ్చింది.. ఒక వసూలు రాజ్యం పోయి.. మరొక వసూలు రాజ్యం వచ్చింది. రాష్ట్రంలో మార్పు వస్తుందన్నారు.. ఒక మార్పు అయితే జరిగింది. కేసీఆర్ కుటుంబ పాలన పోయి.. సోనియా గాంధీ కుటుంబ పాలన వచ్చింది. అవసరమైతే తల నరుక్కుంటా కాని, మాట తప్పను అని మాట్లాడిన గత ముఖ్యమంత్రి కేసీఆర్ అనేకమార్లు మాట తప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎకరానికి రూ.15 వేల చొప్పున  ఇస్తామని ప్రకటించింది. కాని ఇవ్వలేదు.

రాష్ట్రంలో మార్పు తీసుకొస్తామని కాంగ్రెస్ నాయకులు చెప్పారు. మార్పు అంటే మతిమరుపు మార్పా..? ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడమే మార్పా..? రూ.2 లక్షల లోపు రైతు రుణాలను తక్షణమే మాఫీ, రూ.15 వేలు రైతు భరోసా, రైతు కూలీలకు రూ. 12 వేలు, వరికి క్వింటాలుకు రూ.500 చొప్పున బోనస్ వంటి హామీలు ఇచ్చారు. ఇంతవరకు అమలు చేయలేదు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి 2014 వరకు గత ప్రభుత్వాలు ధాన్యం కొనుగోలులో క్వింటాలుకు గరిష్టంగా రూ.1400 మద్దతు ధర మాత్రమే ఉండేది. నరేంద్ర మోదీ పాలనలో రూ.2200 మద్దతు ధరతో ధాన్యం కొనుగోలు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది రూ.26 వేల కోట్ల ఖర్చుతో ధాన్యం కొనుగోలు చేస్తోంది. ప్రతి బస్తాకు ఇచ్చే సుతిల్, కూలీ, ట్రాన్స్ పోర్ట్ చార్జీలు, రైస్ మిల్లులకు చార్జీలు.. రైతు కల్లాల నుంచి మొదలు ధాన్యం ఎఫ్సీఐ గోదాంలకు చేరే వరకు అన్ని రకాలుగా కేంద్ర ప్రభుత్వమే ఖర్చు భరిస్తోంది.

Raitu Deeksha GKR

ధాన్యం కొనుగోలులో అండగా కేంద్రం

కేంద్ర ప్రభుత్వం రైతుల ధాన్యం కొనుగోలులో అండగా ఉంటుంటే.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ధాన్యం కొనుగోలు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తోంది. కేంద్ర ప్రభుత్వం క్వింటాలు ధాన్యానికి రూ.2,200 కనీస మద్దతు ధర ఇస్తోంది. కేంద్ర ప్రభుత్వమిచ్చే ఎమ్ఎస్పీతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తామన్న రూ.500 బోనస్ కలుపుకుని రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలి. బీఆర్ఎస్ పాలనలో జరిగిన అన్యాయాలకు, కాంగ్రెస్ చేసిన మోసాలతో రైతులు పుట్టెడు దుఃఖంలో మునిగిపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులతో పరిహాసం చేస్తోంది.

గతంలో దేశంలో కరెంటు కోతలు, ఎరువుల కరువు ఉండేది. నరేంద్ర మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కరెంటు కోతలు లేని నవ భారతాన్ని నిర్మించారు. వ్యవసాయానికి, గృహ అవసరాలకు, పారిశ్రామిక రంగంతో పాటు అనేక రకాలుగా విద్యుత్ అందుబాటులోకి తీసుకొచ్చారు. కాంగ్రెస్ హయాంలో ఎరువుల బ్లాక్ మార్కెటింగ్, చెప్పులు బారులు తీరిన క్యూలైన్లు కనపడేవి. అనేకసార్లు లాఠీచార్జ్ లు జరిగాయి. రైతులు గుండెపోటుతో చనిపోయిన ఘటనలు ఉన్నాయి. నరేంద్ర మోదీ ప్రభుత్వం కాంగ్రెస్ చేసిన ఎరువుల బ్లాక్ మార్కెట్ కు అరికట్టి.. వేప పూతతో యూరియాను అందిస్తోంది. రైతుల కోసం యూరియా కొరతలేని భారతదేశాన్ని నరేంద్ర మోదీ నిర్మించారు. ప్రపంచంలో యూరియా ధరలు పెరిగాయి. దిగుమతి చేసుకున్న యూరియాతో రైతులపై ఎలాంటి భారం పడకుండా ఖర్చును కేంద్ర ప్రభుత్వమే భరిస్తోంది. తక్కువ ధరకే ఎరువులను అందిస్తోంది.

రైతులకు మేలు చేస్తున్న మోదీ ప్రభుత్వం

నరేంద్ర మోదీ ప్రభుత్వం ఒక ఎకరానికి ఏడాదికి రూ. 18 వేలు ఎరువుల సబ్సిడీ రైతులకు అందిస్తోంది. కూరగాయల పంటలు, ఫామాయిల్ ఉత్పత్తులను ప్రోత్సహించేలా అగ్రికల్చర్ క్లస్టర్లను ఏర్పాటు చేసేలా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. గత కేసీఆర్ ప్రభుత్వం క్రాప్ ఇన్సూరెన్స్ అమలు చేయకుండా రైతులను నిండా ముంచింది. ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టపోయిన రైతులకు క్రాప్ ఇన్సూరెన్స్ చెల్లించలేదు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఫసల్ బీమా యోజనను అమలు చేయకుండా బీఆర్ఎస్ సర్కారు అడ్డుకుంది. నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రతి నాలుగు నెలలకోసారి రూ.2వేలను రైతుల అకౌంట్లో జమ చేస్తోంది.

మోదీ గ్యారంటీ అంటే.. గ్యారెంటీని కచ్చితంగా అమలు చేసే గ్యారంటీ. జాతీయ రహదారుల నిర్మాణం, ఉగ్రవాదం నిర్మూలన, ఆర్టికల్ 370 రద్దు, అయోధ్యలో రామమందిరం నిర్మాణం వంటి అనేకమైన ఇచ్చిన గ్యారంటీలను అమలు చేసిన ప్రభుత్వం నరేంద్ర మోదీ ప్రభుత్వం. పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచాకే ఇచ్చిన హామీలు అమలు చేస్తామని రేవంత్ రెడ్డి అంటున్నారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేది లేదు. రాహుల్ గాంధీ తన జీవితంలో ప్రధానమంత్రి కాలేరు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలయ్యే పరిస్థితి లేదు. కాంగ్రెస్ మహిళలకు నెలకు రూ.2500 ఆర్థికసాయం, నిరుద్యోగులకు రూ.4 వేల చొప్పున భృతి, రూ.10 లక్షల వైద్య సాయం వంటి అనేక హామీలు ఇచ్చింది. హామీల అమలులో అతీగతి లేదు. రైతులకు అండగా బిజెపి ఉంటుంది. ఇచ్చిన హామీలను అమలు చేసేంతవరకు పోరాటం చేస్తాం.’’ అని అన్నారు.

కాంగ్రెస్ మొద్దునిద్ర వీడాలి

పార్లమెంట్ ఎన్నికల రాష్ట్ర ఇంచార్జ్ అభయ్ పాటిల్ మాట్లాడుతూ ‘‘తెలంగాణలో కాంగ్రెస్ రైతులకు ఇచ్చిన హామీలు నెరవేరలేదు. గత 30 రోజుల నుంచి రాష్ట్రంలో పరిస్థితులను గమనిస్తున్నాను. రైతుల ఇబ్బందులను నిశితంగా పరిశీలించా. కాంగ్రెస్ ప్రభుత్వం తీరుతో రాష్ట్రంలో రైతుల బాధలు వర్ణణాతీతం. రుణమాఫీ, వరి ధాన్యానికి రూ.500 బోనస్ తో పాటు కౌలు రైతులు, రైతు కూలీలకు గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలేవీ నెరవేరలేదు. రైతులకు అండగా ఉండేలా చేపట్టిన బిజెపి రైతుదీక్షతో కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దునిద్ర వీడాలి.’’ అని అన్నారు.

రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదు

బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొండపల్లి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ ‘‘ఎద్దేడ్చిన ఎవుసం.. రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదు. తెలంగాణలో ఏ పల్లెకు పోయిన రైతుల కన్నీళ్లే కనపడుతున్నాయి. ఇటీవల రైతుబంధు పైసలు పడలేదని కాంగ్రెస్ మంత్రులను అడిగితే.. రైతుబంధు పడలేదనన్నవారిని చెప్పుతో కొట్టాలంటూ మంత్రులు అహంకారంతో మాట్లాడుతున్నారు. రూ.2 లక్షల రుణమాఫీ తక్షణమే చేస్తానని ప్రకటించిన రేవంత్ రెడ్డి అసలు ఆ కార్యాచరణే చేపట్టలేదు. అతివృష్టి, అనావృష్టితో పంటలు నష్టపోయినప్పుడు నరేంద్ర మోదీ ప్రభుత్వం రైతులను ఆదుకునేలా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను తీసుకొచ్చింది. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఫసల్ బీమా యోజనను అమలు చేయకపోవడం వల్ల రైతులు నష్టపోయారు. రాష్ట్రంలో నేడు పంటలు ఎండిపోయి నష్టపోతే కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు. రైతులకు అండగా ఉన్నామనే భరోసా కల్పించేందుకే కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో రైతు దీక్ష చేపడుతున్నాం. రాష్ట్రంలో రైతాంగం తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటుంటే ప్రజల దృష్టిని మరల్చేలా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోంది.’’ అని అన్నారు.

ప్రజలే బుద్ధి చెబుతారు

బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి మాట్లాడుతూ ‘‘కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అనేక హామీలు ఇచ్చి అమలు చేయకుండా మోసం చేస్తోంది. రైతుల రుణాలు మాఫీ చేస్తామని, రైతులకు రూ. 15 వేలతో ఆర్థిక భరోసా కల్పిస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి అమలు చేయకుండా మోసం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలి. రూ.2 లక్షల లోపు రైతు రుణాలను తక్షణమే మాఫీ చేయాలి. రూ.15 వేలు రైతు భరోసా అందించాలి. రూ.12 వేలు రైతు కూలీల అకౌంట్ లో వేయాలి. వరికి క్వింటాలుకు రూ.500 చొప్పున బోనస్ అందించాలి. నష్టపోయిన రైతులకు పంట నష్టం రూ.25 వేలు పరిహారం విడుదల చేయాలి. నరేంద్ర మోదీ వ్యవసాయాన్ని పండుగలా మార్చేలా అనేక రాయితీలు, సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారు. తక్కువ ధరకే ఎరువులు అందించడంతో పాటు కిసాన్ రైలు వంటి అనేక కార్యక్రమాలతో రైతులకు అండగా నిలుస్తున్నారు. రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చని కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెబుతారు.’’ అని అన్నారు.

తుక్కుగూడ, వరంగల్ డిక్లరేషన్లు ఏమైనయ్?

రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. కాసం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ‘‘గత అసెంబ్లీ ఎన్నికల్లో అబద్ధపు హామీలిచ్చి మోసం చేసిన కాంగ్రెస్ ను ప్రజలు గమనిస్తున్నారు. ఈ మోసానికి ప్రతీకారం తీర్చుకునే రోజు దగ్గర్లోనే ఉంది. అబద్దపు హామీలంటే ఆరు గ్యారెంటీలు, 66 పథకాలు, 420 హామీలు. ఏ ఒక్క హామీ కూడా అమలు చేసే పరిస్థితి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు. తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ తీరని ద్రోహం చేసింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా రైతులను మోసం చేసింది. కాంగ్రెస్ అగ్ర నాయకత్వం డిక్లరేషన్ల పేరుతో ప్రజలను మోసం చేశారు. డిసెంబర్ 9న రెండు లక్షల రుణమాఫీ అని చెప్పి ప్రజల్ని మోసం చేశారు. తుక్కుగూడ, వరంగల్ డిక్లరేషన్లు ఏమైనయ్? గత ప్రభుత్వం రైతు బంధు కోసం విడుదల చేసిన రూ.7వేల కోట్లు ఎక్కడికి పోయాయి? రైతుల కోసం బ్యాంకులో వేసిన రైతు బంధు డబ్బులను అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఖర్చు పెట్టిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి బకాయిలు చెల్లించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయినప్పుడు ఆ ప్రాజెక్టు కాంట్రాక్ట్ ను కోమటిరెడ్డి బ్రదర్స్ కి ఇచ్చామని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకున్నారు. గత ప్రభుత్వంలో పనులు చేసిన బకాయిలనే కాంగ్రెస్ నాయకులు తీసుకుంటున్నరు. రైతులను మోసం చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారులు తెలంగాణ రాజ్యాన్ని ఏలుతున్నరు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులకు బుద్ధి చెప్పాలి.

రుణమాఫీపై ప్రకటన బిజెపి పోరాట ఫలితమే

కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన రైతు దీక్షతో కాంగ్రెస్ ప్రభుత్వంలో చలనం మొదలైంది. బిజెపి పోరాటానికి రైతులు, ప్రజల్లో వస్తున్న సానుకూల స్పందనతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రుణమాఫీ పై ప్రకటన చేశారు. రైతులకు ఏకకాలంలో 15 ఆగస్టు 2024 వరకు రూ.2లక్షల రుణాలను మాఫీ చేస్తానని చెప్పారు. ఇది బిజెపి పోరాట ఫలితమే, రైతు విజయం. రాష్ట్రంలో ప్రజలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చేంత వరకు పోరాటం చేస్తామని రాష్ట్ర అధికార ప్రతినిధి అమర్ నాథ్ సారంగుల ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచైనా 6 గ్యారంటీలతో పాటు హామీలన్నింటినీ నెరవేర్చేలా రానున్న రోజుల్లో మరింత ఒత్తిడి తీసుకొస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరిలో మార్పు రాకపోతే ప్రజా ఉద్యమాలు చేపట్టి ప్రజలకు న్యాయం జరిగేలా పోరాడుతామన్నారు. అలాంటి పోరాటాల్లో భాగంగానే రైతు రుణమాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటన తొలివిజయంగా పరిగణిస్తున్నామని తెలిపారు.

రైతు ఫిర్యాదుల కోసం మిస్డ్ కాల్

తెలంగాణ రైతుల కష్టాలు, సమస్యలు, ఫిర్యాదులు తెలుసుకునేందుకు బిజెపి తెలంగాణ శాఖ మిస్డ్ కాల్ నం: 9904 119 119  ను ఏర్పాటు చేసింది. రైతులకు ఏ కష్టమొచ్చినా, సమస్యలు వచ్చినా ఈ నెంబర్ కు మిస్డ్ కాల్ బిజెపి దృష్టికి తీసుకురావచ్చు. ఎరువుల సరఫరాలో రాష్ట్ర వైఫల్యం చెందినా, రైతుల రుణాలు కట్టాలని బ్యాంకులు ఒత్తిడి చేసినా, విత్తనాలు అందకపోయినా, కల్తీ విత్తనాలు అందించినా, ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బంది పెట్టినా బిజెపి రాష్ట్ర పార్టీకి ఫిర్యాదు చేయొచ్చు. కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించి అర్హులంతా పేరు నమోదు చేసుకోవాలనుకున్నా మిస్డ్ కాల్ చేయవచ్చు. కాంగ్రెస్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతుల సమస్యలు తెలుసుకునేందుకు బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ప్రత్యేక వింగ్ ఏర్పాటు చేశారు.