Hamara Sankalp Vikasit Bharat

హామీల అమలుకు డబ్బు ఎలా వస్తుందో కాంగ్రెస్ చెప్పాలి

ఎన్నికల్లో గెలిస్తే ప్రతి పేద కుటుంబానికి లక్ష రూపాయలు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్, ఆ డబ్బు ఎక్కడి నుంచి తెస్తుందో చెప్పాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. వేర్పాటువాద నినాదాలు చేసే వ్యక్తులతో పాటు కాంగ్రెస్ కూడా ఒక అప్రధాన పార్టీగా మారిపోయిందని, అందుకు ఆ పార్టీ ఏమీ బాధపడటం లేదని అన్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో బిజెపి ఉనికి అంతంత మాత్రమేనన్న సూచనకు స్పందిస్తూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఒక జాతీయ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె దక్షిణాదిలో బిజెపి పెద్ద ప్రభావం చూపలేకపోయిందనే అభిప్రాయంపై తీవ్రంగా స్పందిస్తూ మరో జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ దక్షిణాది రాష్ట్రాల్లో, ప్రత్యేకించి తమిళనాడులో డిఎంకెకు తందానా పార్టీగా మారిన విషయాన్ని గుర్తు చేశారు. తమిళనాడులో కాంగ్రెస్ ఎక్కడ ఉంది? ఆంధ్రప్రదేశ్ లేదా ఒడిశాలో ఎక్కడ ఉంది? అని నిర్మల ప్రశ్నించారు. నిధుల బదిలీపై దక్షిణాది రాష్ట్రాలైన కేరళ, కర్నాటక సుప్రీంకోర్టును ఆశ్రయించడాన్ని ప్రస్తావిస్తూ కేంద్రం వారి పట్ల భిన్న ప్రమాణాలేవీ అనుసరించడం లేదని, ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు లేని సమస్యను రాజకీయం చేస్తున్నాయని అన్నారు. రుణ సామర్థ్యంపై కేంద్రం విధించిన పరిమితిపై కేరళ సుప్రీంకోర్టును ఆశ్రయించగా, కరువు సహాయ నిధిని కేంద్రం బదిలీ చేయలేదని కర్ణాటక ఆరోపించింది. ఇంటర్వ్యూలోని ప్రధానాంశాలు:

ప్ర: సరళంగా అందరికీ అర్థమయ్యే రీతిలో ప్రజల్లో ప్రచారం చేస్తే తప్ప ఆర్థిక సమస్యలను సాధారణంగా ఓటర్లు పట్టించుకోరు. ప్రధానంగా ప్రజలను ఓటు వేయడానికి ప్రేరేపించే భావోద్వేగ సమస్యలే ఎన్నికల్లో ప్రాధాన్యం సంతరించుకుంటాయి. ఈసారి నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వంటి అంశాలపై ప్రతిపక్షాలు దృష్టి సారిస్తున్నాయి. వీటిని ప్రజలు తీవ్రంగా తీసుకుంటారని మీరు అనుకుంటున్నారా?

జ: ప్రతిపక్షం కేవలం ఎన్నికల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదో ఒకటి మాట్లాడటానికి ఈ అంశాలను లేవనెత్తుతోందని నేను భావిస్తున్నాను. కచ్చితంగా చెప్పాలంటే, ఈ ప్రభుత్వం 2014 నుండి నిరంతరం ద్రవ్యోల్బణాన్ని రిజర్వు బ్యాంకు నిర్దేశించిన పరిమితుల్లోనే ఉంచింది. ఒకటి రెండు సార్లు మాత్రమే అది దాటి ఉండవచ్చు. కాబట్టి, వాస్తవ సమాచారాన్ని, ప్రతిపక్షాల వాదనలకు పొంతనలేదు. యంత్రాంగాలన్నిటినీ మీరు స్వయంగా చూడవచ్చు. సరఫరా వైపు సమస్యలను మంత్రుల బృందం పరిష్కరించింది. మనం ఉత్పత్తి చేయని వస్తువులను ఎప్పటికప్పుడు దిగుమతి చేసుకున్నాం. వంటనూనెలు ఇందుకు మంచి ఉదాహరణ. అలాగే రకరకాల పప్పులు కూడా. కొన్ని వ్యవసాయ ఎగుమతులు రైతుకు గొప్ప ఆదాయాన్ని ఇస్తున్నాయి, అది ఉల్లిపాయ, లేదా బియ్యం బార్లీ, గోధుమలు, పంచదార కావచ్చు. కానీ ఎప్పుడైతే దేశంలో ధరలు పెరిగాయో అప్పుడు వెంటనే వాటి దిగుమతులపై నిషేధం విధిస్తూ వచ్చాం.

ప్ర: కానీ ప్రతిపక్షం నిరుద్యోగ సమస్యను చాలా గట్టిగా లేవనెత్తుతోంది?

జ: అవును, కానీ ప్రతిపక్షాలు అర్థం చేసుకోలేకపోతున్న విషయం ఏమిటంటే, మన కార్మిక మార్కెట్‌ లో సమూలమైన మార్పులు చోటు చేసుకున్నాయి. ఉద్యోగాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించగల రంగాలను విస్తరించే పని జరుగుతోంది. భారతదేశంలో ఉద్యోగాల పరిస్థితిని తగినంతగా ప్రతిబింబించే సమాచారం మన దగ్గర లేదు అనేది వాస్తవం. మేం అధికారిక ఉపాధికి సంబంధించిన సమాచారాన్ని (డేటా) సేకరిస్తాం, అయితే దేశంలోని మొత్తం ఉపాధిలో అధికారిక లేదా సంఘటిత ఉపాధి రంగం ప్రధాన భాగం కాదు. అనధికారిక లేదా అసంఘటిత రంగం నేడు విస్తరిస్తోంది. రకరకాల కొత్త ఉద్యోగాలు వస్తున్నాయి. గిగ్ ఆర్థిక వ్యవస్థ (యాప్ ఆధారిత ఉద్యోగాలు, ఊబర్, ఓలా, స్విగ్గీ, జొమాటో, అర్బన్ కంపెనీ మొదలైనవి) విపరీతంగా అభివృద్ధి చెందిన రంగాలకు అతిపెద్ద ఉదాహరణ. కానీ ఈ ఉపాధి ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం తగినంత లేదు.

కొన్ని రంగాల్లో (ఈ కొత్త) డేటాను సమీకరించగలుగుతున్నాం. ఇ-శ్రమ్ పోర్టల్ లో ప్రజలు తాము పని చేస్తున్న రంగాన్ని, ఇతర వివరాలను నమోదు చేసుకోవచ్చు. అసంఘటిత రంగానికి సంబంధించి సమాచార సేకరణకు వేరే మార్గం మేం ప్రారంభించిన పథకాలు, రుణాల ద్వారా వ్యాపారాలకు ఇచ్చిన ప్రోత్సాహం, లబ్ధిదారులకు వ్యాపారాన్ని విస్తరించడానికి లేదా వ్యాపారంలో కొంత పెట్టుబడి పెట్టడానికి బ్యాంకుల ద్వారా అందించిన డబ్బు. కొత్తగా సృష్టించిన ఉపాధి అవకాశాలను ఈ వివరాలను బట్టి కూడా అంచనా వేయవచ్చు.

పీఎం స్వనిధి ద్వారా పట్టణాల్లోని అసంఘటిత రంగంలోని వ్యక్తులు, అంటే వీధి వ్యాపారుల సమాచారం మనకు లభిస్తుంది. అదేవిధంగా మేం జీఎస్టీ రిటర్న్‌లు ఎక్కడ నుంచి వస్తున్నాయో ఆ పరిశ్రమల్లో ఉద్యోగాలను అంచనా వేస్తాం. జిఇఎం పోర్టల్ లో రిజిస్టర్ అయిన అసంఘటిత లేదా చిన్న ఎంఎస్ఎంఇల సంఖ్య కూడా ఉద్యోగ కల్పన వివరాలు వెల్లడిస్తుంది. కాబట్టి ఒకే చోట నుంచి నుంచి వచ్చే అదే గణాంకాలను చూపించి ఉద్యోగాలు పెరగడం లేదని యాగీ చేయడం సరికాదు. ఉద్యోగాల విషయంలో ప్రతిపక్షాల దగ్గర విశ్వసనీయమైన సమాచారం ఉందని అనుకోవడం లేదు. ప్రతిపక్షాలు ఈ అంశాన్ని లేవనెత్తుతున్నందుకు చాలా సంతోషంగా ఉన్నాను, వారికి సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను.

ప్ర: దక్షిణాదిలో ఎన్నికల విజయంపై బిజెపి దృష్టి సారించింది. కర్నాటక మినహా ఈ ప్రాంతంలో చాలా వరకు పార్టీ ఎదుగూబొదుగూ లేకుండా ఉండిపోయిన పరిస్థితి ఉంది. ఈసారి ఈ పరిస్థితి మారుతుందా?

జ: నేను వేరే పార్టీలను చూపి మా పార్టీని సమర్థించుకుంటున్నానని అనుకోవద్దు. బిజెపి కర్ణాటక దాటి వేరే రాష్ట్రాల్లో ఎందుకు జెండా ఎగరేయలేకపోతోందని మీరు అడుగుతున్నారు. ఈ దేశంలో ఎక్కడైనా కాంగ్రెస్ ఇప్పుడు ప్రవేశించగల చోటు ఒకటి చెప్పండి. తమిళనాడు నా పుట్టిల్లు, ఆంధ్ర ప్రదేశ్ మెట్టినిల్లు. ఈ రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఎక్కడ ఉంది? నాకు గుర్తున్నంత వరకు తమిళనాడు చివరి కాంగ్రెస్ ముఖ్యమంత్రి 1964లో కామరాజ్. ఆ తర్వాత ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ హయాంలో కూడా కాంగ్రెస్ లాంటి జాతీయ పార్టీ తమిళనాడులో అడుగు పెట్టలేకపోయింది. వారు డిఎంకెకు లేదా ఒకసారి ఎఐఎడిఎంకెకు అనుచర పార్టీగా మాత్రమే మిగిలిపోయారు. నేటికీ వారి అభ్యర్థులు డీఎంకే మద్దతు లేకుండా పని చేయలేరు. తమిళనాడులో ఎందుకు అడుగు పెట్టలేకపోయారని కాంగ్రెస్‌ని అడుగుతారా? క్రమక్రమంగా అన్ని ప్రాంతాలకు విస్తరిస్తున్న బిజెపిని మాత్రం మీరు ఈ ప్రశ్న అడుగుతారు. ఆంధ్రాలో కాంగ్రెస్ ఉందా? ఒడిశాలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందా? నేడు కాంగ్రెస్ లాంటి జాతీయ పార్టీ రాష్ట్రస్థాయి పార్టీలకు లొంగి ఉండే అనుచర పార్టీగా ఎందుకు మారిపోయిందనేది మన ప్రజాస్వామ్యానికి చాలా ముఖ్యమైన ప్రశ్న. భారతదేశానికి ప్రతిపక్షంగా మంచి, పటిష్టమైన జాతీయ పార్టీ అవసరం. కానీ ఆ విషయంలో కాంగ్రెస్ దేశ ప్రజల ఆశలను వమ్ముచేసింది.

Nirmala Seetharaman

ప్ర: కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలో ఉంది కదా?

జ: మీరు ఎల్లప్పుడూ విషయాన్ని ఒకే కోణం నుంచే చూస్తారు. కర్ణాటకలో మేం కూడా అధికారంలో ఉన్నాం. తమిళనాడులో కూడా మాకు కొందరు ఎంపీలు ఉండేవారు. తమిళనాడు బిజెపిని తిరస్కరిస్తోందని నిరూపించాలని మీరు ఉత్సాహ పడుతున్నారు. అంతకంటే ముఖ్యమైన ప్రశ్న, మన ప్రజాస్వామ్యానికి సంబంధించిన ప్రశ్నను మిమ్మల్ని అడిగాను. ఏ రాష్ట్రమూ ఏ పార్టీని తిరస్కరించదు. జన్ సంఘ్ రోజుల నుంచి తమిళనాడులో మా వాళ్ళు ఉన్నారు. పోన్ రాధాకృష్ణన్ కన్యాకుమారి నుంచి ఎన్నికయ్యారు. 2014 నుంచి 2019 వరకు వాజ్‌పేయి హయాంలో, తర్వాత మోదీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. కనుక బిజెపి ఎక్కడో తిరస్కరణకు గురవడం గురించి ఎవరూ సంతోషించనవసరం లేదు., ధైర్యం ఉంటే కాంగ్రెస్‌ను ఈ విషయంలో నిలదీయండి. ఒక రాష్ట్రం తర్వాత మరో రాష్ట్రంలో ఆ పార్టీ ఓడిపోతోంది. అది ఒక అప్రధానమైన పార్టీగా, వేర్పాటువాద నినాదాలు చేసే వ్యక్తులతో కలిసి వెళుతోంది. ఆ పార్టీ అందుకు సంతోషంగా కూడా ఉంది. స్వాతంత్ర్యం కోసం పోరాడామని చెప్పుకునే పార్టీకి ఇది ఎంతటి దుస్థితి!

ప్ర: దక్షిణాది రాష్ట్రాల్లో పోటీ ఎక్కడ తీవ్రమవుతోందని మీరు అనుకుంటున్నారు?

జ: బిజెపి ఒక్కో రాష్ట్రంలో ఒక్కొక్క రకమైన సవాలును ఎదుర్కొంటోంది. కొన్ని చోట్ల ఇప్పుడిప్పుడే ప్రవేశిస్తున్నాం. మరికొన్ని చోట్ల మా గత రాజకీయ ఉనికిని తిరిగి పొందేందుకు ప్రయత్నిస్తున్నాం. బిజెపి విశిష్ట గుణం ఏమిటంటే అది వేరే అభ్యర్థులను అందించడం, లేదా పాత ప్రముఖులను ఉపయోగించడం, ఆ రాష్ట్రంలో మనం ప్రధానంగా లేవనెత్తగల అంశాలను స్పష్టంగా వ్యక్తీకరించడం వంటి కొత్త మార్గాలను అనుసరిస్తుంది. కనుక అది ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు లేదా కేరళ అయినా మేం సాధ్యమైన వ్యూహాలనే ఎంచుకుంటాం. తిరువనంతపురంలో రాజీవ్ చంద్రశేఖర్, శశిథరూర్ మధ్య పోటీ చాలా ఆసక్తికరంగా సాగుతోంది. అదేవిధంగా, 2019లో (త్రిసూర్ నుంచి) ఓడిపోయిన సురేశ్ గోపి నిశ్శబ్దంగా క్షేత్రస్థాయిలో తన పని కొనసాగిస్తున్నారు. శోభా సురేంద్రన్ (అలప్పుజ) నిబద్దత కలిగిన రాటుదేలిన కార్యకర్తల్లో ఒకరు. అనిల్ ఆంటోనీ (పతనంతిట్ట) గెలిచే అవకాశం చాలా ఉంది. అలాగే వయనాడ్‌లో సీనియర్ బిజెపి నాయకుడు కె సురేంద్రన్ విజయావకాశాలు బాగున్నాయి.

ప్ర: రాష్ట్ర-కేంద్ర సంబంధాలపై కేరళ కోర్టును ఆశ్రయించగా, కర్ణాటక కూడా అదే పని చేసింది. విపక్షాల పాలనలో ఉన్న రాష్ట్రాలపై కేంద్రం సవతి తల్లి వైఖరిని ప్రదర్శిస్తోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. దీనిపై మీ అభిప్రాయం ఏమిటి?

జ: అన్నింటికంటే ముందు, రాష్ట్రాలు సుప్రీంకోర్టుకు వెళ్లకూడదని నేను చెప్పలేను, సుప్రీంకోర్టుకు వెళ్లడానికి వారికి హక్కు ఉంది. ఆర్థిక మంత్రిత్వ శాఖ నుంచి వారు కోరుకునే ఏ సమాచారాన్నైనా సంతోషంగా ఇస్తాను. మా శాఖే కాదు, ఈ ప్రభుత్వంలోని ఏ శాఖయినా ఈ పని చేస్తుందని భావిస్తున్నాను. ఎందుకంటే మేం ఒకప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న ప్రధానమంత్రి ఆధ్వర్యంలో పని చేస్తున్నాం. యుపిఎ హయాంలో సవతి తల్లి ప్రేమ అంటే ఏమిటో ఆయన స్వయంగా చూశారు. ఆ అనుభవం కలిగిన మోదీ ప్రధానమంత్రిగా ఉన్నందున, రాష్ట్రాలకు సకాలంలో డబ్బు అందకపోతే దేశ అభివృద్ధి దెబ్బతింటుందని బాగా తెలుసు. రాజకీయ విభేదాలు ఉండవచ్చు, ఎన్నికల సమయంలో దానిపై పోరాడండి, అంతేగాని ఏ రాష్ట్ర అభివృద్ధిని కుంటుపరిచే ఏ పనీ ప్రభుత్వం చేయదు. కేరళ కోర్టుకు వెళ్ళడానికి చాలా ముందు ఆ రాష్ట్రంలో జరిగిన ఒక బహిరంగ సభలో ఒక మాట చెప్పను. మొత్తం సమాచారాన్ని వారి ముందు ఉంచుతాను అన్నాను, ఆ పని చేశాను కూడా. అదే సమాచారాన్ని సుప్రీంకోర్టుకు సంతోషంగా ఇస్తాం. కేరళ విషయంలో మేం తప్పు చేశామని కోర్టు చెప్పలేదు. మధ్యంతర ఉపశమనం ఇవ్వాలని కోర్టు చెప్పలేదు. రుణాలు తదితర అంశాలను పరిశీలించేందుకు కోర్టు దానిని రాజ్యాంగ ధర్మాసనానికి పంపింది.

కేరళ గురించి మరొక విషయం, ఎఫ్ ఆర్ బిఎం చట్టం ప్రకారం ఎటువంటి షరతులు లేకుండా రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తి (జిఎస్ డిపి)లో 3 శాతం వరకు  రుణం తీసుకోవడానికి ప్రతి రాష్ట్రానికి అనుమతి ఉంది. ఇది అన్ని రాష్ట్రాలకూ వర్తిస్తుంది. కేరళ ప్రభుత్వం బడ్జెట్ వెలుపల తీసుకున్న అప్పులను ‘కాగ్’ తీవ్రంగా ఆక్షేపించింది. ఒక కేరళే కాదు, ఇతర రాష్ట్రాలు కూడా ఈ పని చేశాయి. ‘మీరు బడ్జెట్ కు వెలుపల అప్పు తీసుకున్నారు. అది సరిదిద్దండి,’ అని చెప్పి కాగ్ వారికి నాలుగేళ్ళ గడువు ఇచ్చింది.

కర్నాటక విషయానికి వస్తే అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం జీఎస్టీ కి ముందు తమకు పరోక్ష పన్నుల రూపంలో ఎక్కువ ఆదాయం వచ్చేదని ప్రజల్ని తప్పుదారి పట్టిస్తోంది. అందులో ఏమాత్రం వాస్తవం లేదు. ‘కర్ణాటక ఒక రూపాయి కేంద్రానికి చెల్లిస్తుంటే కేవలం 29 పైసలు మాత్రమే కర్ణాటకకు వస్తోంది’ అన్న వారి ఆరోపణ విషయానికి వస్తే దీన్నే తిరగేసి అడుగుతాను, కర్ణాటకలో అత్యధిక పన్నులు బెంగళూరు నగరం చెల్లిస్తోంది. బెంగుళూరు ప్రజలు కూడా మేం ఇంత చెల్లిస్తున్నాం, మొత్తం డబ్బు మాకే ఇవ్వండి. చిత్రదుర్గ, బళ్లారి మొదలైనవాటిని వదిలేయండి’ అంటే ఏమి చేస్తారు? కనుక ఇవన్నీ తప్పుడు, వేర్పాటువాద వాదనలు. కేంద్రం సెస్సులు, సర్‌ఛార్జీలు వసూలు చేస్తోందని, దాన్ని కూడా రాష్ట్రాలకు పంపిణీ చేర్చాలనేది ఇంకో డిమాండు. రాజ్యాంగం ప్రకారం సెస్, సర్‌చార్జిలు పన్నులకు అదనంగా వసూలు చేస్తారు. ఆ డబ్బు కూడా రాష్ట్రాలకు వెళుతుంది. కాబట్టి ఇది ప్రజలను పెడదోవ పట్టించే వాదన .

ప్ర: ఇతర రాష్ట్రాల కంటే మెరుగైన పనితీరు కనబరిచినందుకు, పారిశ్రామికంగా అభివృద్ధి చెందినందుకు, మెరుగైన ప్రగతిని సాధిస్తున్నందుకు తమపై ఎక్కువ భారం మోపుతున్నారని దక్షిణాది రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మీరు ఈ ఆందోళనను ఎలా పరిష్కరిస్తారు?

జ: ఇవి చాలా న్యాయమైన ఆందోళనలు. ఈ విషయంలో నాకు భిన్నాభిప్రాయం లేదు. కొన్ని రంగాలలో కొన్ని స్పష్టమైన పురోగతి జరిగిందని నాకు తెలుసు. అభివృద్ధి సాధిస్తున్నందుకు వారిపై మరింత భారం పడకూడదని నేనూ అంగీకరిస్తున్నాను. అయితే అది కేంద్ర ప్రభుత్వ వ్యవహారం కాదు, ఆర్థిక సంఘం వ్యవహారం. ఆర్థిక సంఘం నాకు సిఫారసు చేస్తే, దానిని పాటించడం నా బాధ్యత. కాబట్టి సమస్యను రాజకీయం చేయడం కంటే ఆర్థిక సంఘంతో ఈ విషయమై చర్చించడం మంచిందని నా అభిప్రాయం.

ప్ర: కాంగ్రెస్ మేనిఫెస్టోపై, ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన భాగాలపై మీ అభిప్రాయం ఏమిటి? కొన్ని ఇతర దేశాల్లో ఉన్న ఒకే శ్లాబ్ జీఎస్టీ గురించి వారు మాట్లాడుతున్నారు. అది ఇక్కడ అమలు చేయవచ్చా?

జ: వారు జిఎస్టీని మెరుగుపరచాలని సూచించడం నాకు విచిత్రంగా అనిపిస్తోంది. గబ్బర్ సింగ్ ట్యాక్స్ అని, అధికారంలోకి రాగానే దాన్ని విసిరికొడతామని చెప్పిన వాళ్ళు ఇప్పుడు దాన్ని సవరించి జీఎస్టీ 2.0 చేస్తామని అంటున్నారు. సింగిల్ (జిఎస్‌టి) రేట్ల సమస్యపై, జిఎస్‌టిని ప్రవేశపెట్టిన సమయంలో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, భారతదేశం వంటి దేశంలో ఆర్థిక స్థాయిలలో చాలా తేడాలు ఉన్నందున, ఒకే రేటు ఉండటం న్యాయం కాబోదని బహిరంగంగా చెప్పారు. ప్రస్తుతానికి దానికి వ్యతిరేకంగా నేను వాదించడం లేదు. కానీ చాలా స్పష్టంగా, జైట్లీ జీ చెప్పినది ఇప్పుడు కూడా నిజం.

ఆర్థిక వ్యవస్థ విషయానికి వస్తే దాన్ని సమగ్రంగా పరిగణనలోకి తీసుకున్నారో లేదో నాకు తెలీదు. ద్రవ్య వ్యవస్థ విషయంలో వారు చాలా భారీ వాగ్దానాలు చేశారు. ప్రతి (పేద) కుటుంబానికి రూ 1 లక్ష చెల్లిస్తామని చెబుతున్నారు, వారు డబ్బు ఎక్కడ నుంచి తీసుకు వస్తారో వివరించాలి. ఆర్థిక వ్యవస్థపై వారి తీరు ప్రజలను ఆకట్టుకోడానికే ఉద్దేశించిది తప్ప లోతుగా అలోచించినట్టు లేదు.

 

ప్ర: దేశంలో ఆర్థిక అసమానతలను మీరు ప్రస్తావించారు. ఇటీవల, ‘అసమానత ల్యాబ్’ అనే సంస్థ నివేదిక గత 10 సంవత్సరాలను ‘బిలియనీర్ రాజ్’ గా అభివరించింది. భారతదేశంలో అసమానతలు గరిష్ట స్థాయికి చేరుకున్నాయని పేర్కొంది.

జ: విదేశీ అధ్యయనాలను చూపించి ‘భారత్ లో ఏం జరుగుతోందో చూడు’ అనడం సరికాదు. ఈ విదేశీ అధ్యయనాలలో కొన్నింటిపై సందేహాలు ఉన్నాయి. మేం గత ఐదేళ్లుగా 80 కోట్ల మందికి ఉచిత ఆహార ధాన్యాలను అందిస్తున్నాం. ఇది వచ్చే ఐదేళ్లు కూడా కొనసాగుతుంది, అయినప్పటికీ ఆకలి సూచికలో భారతదేశం మన పొరుగు దేశాల్లో కొన్నింటి కంటే దిగువ స్థానంలో ఉంది. ఆదాయ వ్యత్యాసాలు, మౌలిక వసతులు, అందరికీ ఇళ్లు, అందరికీ మరుగుదొడ్లు, సురక్షితమైన తాగునీరు, స్వచ్ఛత అభియాన్‌ వంటి వాటిపై మేం దృష్టి సారించిన విధానం ప్రభావం చూపింది. భారత్ లో బహుముఖ పేదరికం గణనీయంగా తగ్గిపోయిందని ప్రపంచ బ్యాంకు అధ్యయనం వెల్లడించింది. నీతి ఆయోగ్ మదింపు ఫలితాలు కూడా అదే విషయం నిరూపించాయి.

ప్ర: ఎన్నికల బాండ్స్ వార్తలు సంచలనం సృస్తిస్తున్నాయి. ఎన్నికల నిధులలో పారదర్శకతను ఎలా తేవాలి? ఎన్నికల బాండ్ల విధానాన్ని రద్దుచేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో రాజకీయ నిధుల కోసం మీరు అనుసరించే ప్రణాళిక ఏమిటి?

జ: ఎన్నికల బాండ్లను సుప్రీం కోర్టు తిరస్కరించింది. మేం ఆ నిర్ణయాన్ని గౌరవిస్తాం. మేం ఆ ఆదేశాన్ని పాటించాలి. అయితే ఎన్నికల బాండ్‌లు గతంలో ఉన్న విధానం కంటే ఒక మెట్టు మెరుగ్గా ఉన్నాయి. ఇంతకు ముందు, ఎన్నికల విరాళాలకు విధివిధానాలంటూ ఏవీ లేవు. కనీసం ఇక్కడ మీరు బ్యాంక్ ఖాతా ద్వారా బాండ్లను కొనుగోలు చేసి, రీడీమ్ చేసుకోవచ్చు. వాస్తవానికి బ్యాంకింగ్ చట్టాల ప్రకారమే కాక బాండ్లు రావడానికి ముందు నిధులు అందజేసే విధానంలో కూడా విరాళాలు ఇచ్చేవారు గోప్యత కోరుకున్నారు. చట్టాలు కూడా అదే చెబుతున్నాయి. ఇప్పుడు, సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత, బాండ్ల ద్వారా లబ్ధి పొందిన వారు కూడా దీనిని ‘కుంభకోణం’ అని అభివర్ణిస్తున్నారు. ఇది అవకాశవాదం కాక మరేమిటి?

ప్ర: కానీ ఏ పార్టీ విరాళాలు తీసుకున్నా ‘క్విడ్ ప్రో కో’ (ప్రతిఫలం) అనే ప్రశ్న వస్తుంది. మీరు ఈ ఆరోపణపై ఎలా స్పదిస్తారు?

జ: క్విడ్ ప్రో కో విషయానికొస్తే, మీరు రెండు విషయాలను జతకలిపి ఇది క్విడ్ ప్రో కో అంటున్నారు. ఇవి బ్యాంకు ఖాతా నుంచి బ్యాంకు ఖాతాకు వస్తున్న సొమ్ము. ఎన్నికల నిధులలలో స్వచ్చతను తీసుకు రావడమే మా ఉద్దేశం. అందుకే పార్లమెంట్‌లో చర్చించి ఆమోదించిన తర్వాతే బాండ్ల విధానం ప్రవేశపెట్టాం. ఎన్నికల నిధుల విషయంలో మరింత పారదర్శకత అవసరం. దాన్ని తీసుకురావడానికి బిజెపి కట్టుబడి ఉంది.

ప్ర: బిజెపికిపై మరొక రాజకీయ ఆరోపణ ఏమిటంటే అది ఇతర రాజకీయ పార్టీల సభ్యులపై ఇడి, సిబిఐ మొదలైన వాటిని ఉపయోగిస్తోంది, వారిని బిజెపిలో చేరమని బలవంతం చేస్తోందని, వారు మీ పార్టీలో చేరిన తర్వాత అభియోగాలన్నీ కనుమరుగవుతున్నాయని….

జ: జనం ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి మారారు, మళ్ళీ ఆ పార్టీ నుంచి సొంత పార్టీకి వచ్చారు. రాజకీయ పార్టీలు క్లీన్ చిట్ ఇవ్వవు, కోర్టులు ఇస్తాయి. కొన్ని పార్టీలు తమ సొంత నాయకులను నిలబెట్టుకోలేక పోతున్నాయి, ఎందుకంటే వారు తమ పార్టీల పనితీరుపై ఆశలు కోల్పోయారు. వారు 24/7 నిరంతరాయంగా పని చేస్తున్న ప్రధానమంత్రిని, అలాంటి నాయకత్వం ద్వారా శక్తిని పొందిన పార్టీని చూస్తారు, వారు తప్పు పార్టీలో ఉన్నామని భావించి, బయటకు వెళ్లిపోతారు. కుటుంబ, కులాల ఆధారిత పార్టీల నుంచి ప్రజలు బయటకు వస్తున్నారు. వాల్ పోస్టర్లు అతికించే లేదా బూత్ స్థాయిలో పని చేసే వ్యక్తులు పార్టీలో ఎలా ఎదుగుతారో చూపించినందున వారు బిజెపిలో మంచి భవిష్యత్తును చూస్తున్నారు.

ప్ర: అయితే ప్రతిపక్షాల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు-ఎన్నికల ముందు బ్యాంకు ఖాతాలు స్తంభింపజేయడం, పదవిలో ఉన్న ముఖ్యమంత్రులను అరెస్టు చేయడంపై విమర్శల గురించేమిటి?

జ: ఆదాయం పన్ను తేడాలపై మొదటి పన్ను నోటీసును కాంగ్రెస్ కు 2021లో పంపించారు. వారు స్పందించలేదు, అసెస్‌మెంట్ పేపర్‌ను కూడా దాఖలు చేయలేదు. పన్ను పరిధిలోకి రాకుండా ఉండాలంటే రాజకీయ పార్టీ చేయాల్సిందల్లా అసెస్‌మెంట్ ఫైల్ చేయడమే. ఆపై మిమ్మల్ని కోర్టుకు తీసుకు వెళతారు, ఆ పరిస్థితి వస్తే ఎవరైనా పన్ను చెల్లిస్తారు. కాంగ్రెస్ చెల్లించలేదు. ఖాతాలను స్తంభింపజేయలేదు. మీరు ఆదాయపు పన్ను శాఖకు చెల్లించాల్సిన డబ్బు మేరకు ఖాతాల వినియోగంపై తాత్కాలిక పరిమితి విధించారు. మీరు కోర్టు అనుమతిని కోరవలసి ఉంటుంది. మీరు చట్టాన్ని అనుసరించలేదు. మీరు భిన్నంగా వ్యవహరించాలని భావిస్తున్నారు. ముఖ్యమంత్రులను అరెస్టు చేశారన్న విషయానికి వస్తే ఎనిమిది సమన్లు పంపినప్పటికీ ఆయన (ఈడీ ముందుకు) హాజరుకాలేదు. గుజరాత్ ఎన్నికలకు ముందు ప్రధాని, ఆ తర్వాత ముఖ్యమంత్రి సీబీఐ ముందు హాజరు కాలేదా? ఆయన వెళ్లి అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పారు. అయితే ఇప్పుడు దీనిపై పెద్ద రాద్ధాంతం చేస్తున్నారు. ఆ రకంగా సానుభూతిని పొందడం, బాధితులుగా నటించడం, ఆ తర్వాత ఈ ‘ప్రభుత్వం దారుణమ’ని అనడం ఈ దేశంలో అలవాటుగా మారిందని అనుకుంటున్నాను.