Hamara Sankalp Vikasit Bharat

ఇండియా పొలిటికల్ లీగ్… ఐపీఎల్ కప్ బిజెపిదే: బండి సంజయ్

‘‘ఐపీఎల్ క్రికెట్ మాదిరిగానే దేశ రాజకీయాల్లోనూ ఇండియన్ పొలిటికల్ లీగ్ (ఐపీఎల్) మ్యాచ్ నడుస్తోంది. ఒకవైపు నరేంద్రమోదీ ఆధ్వర్యంలోని బిజెపి టీం బరిలో దిగింది. మరోవైపు ఇండీ కూటమి పేరుతో గుంట నక్కల పార్టీలన్నీ టీంగా బరిలో ఉన్నయ్… ఆ కూటమి టీంను చిత్తుగా ఓడించి 400ల స్థానాలతో కేంద్రంలో మోదీ ముచ్చటగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి హ్యాట్రిక్ కొట్టబోతున్నరు…’’ అని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. దేశంలో మాదిరిగానే రాష్ట్ర రాజకీయాల్లోనూ తెలంగాణ పొలిటికల్ లీగ్ (టీపీఎల్) ఆట మొదలైందన్నారు. ‘‘కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో నాతో సహా 17 మంది సభ్యుల టీం బరిలోకి దిగినం. అటువైపు కాంగ్రెస్, బీఆర్ఎస్ గుంట నక్కల టీంలు బరిలో దిగినయ్. వేర్వేరుగా బిజెపిని ఓడించడం సాధ్యం కాదని.. చీకటి ఒప్పందాలతో ఆ రెండు పార్టీలు ఒక్కటైనయ్… అయినప్పటికీ ఆ రెండు పార్టీలను చిత్తుచిత్తుగా ఓడించి టీపీఎల్ కప్ ను గెలవబోతున్నాం.. మోదీకి గిఫ్ట్ ఇవ్వబోతున్నాం’’ అని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అతి తక్కువ వ్యవధిలో అత్యంత ప్రజావ్యతిరేకత ఎదుర్కొన్న ఏకైక పార్టీ కాంగ్రెస్సేనని వ్యాఖ్యానించారు. రైతులంతా కొనుగోలు కేంద్రాల వద్ద వడ్ల రాశులు పోసినా ఎవరూ కొనే నాథుడే లేరన్నారు. తాలు, తరుగు పేరుతో దోచుకునేందుకు దళారులు సిద్ధమైనా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. రైతులను మోసం చేస్తే మిల్లర్ల, వ్యాపారుల లైసెన్స్ రద్దు చేస్తామని చెబుతున్న ప్రభుత్వం…. వంద రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేస్తామని హామీలిచ్చి మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ లైసెన్స్ ను కూడా ప్రజలు రద్దు చేయబోతున్నారని అన్నారు.. ఏప్రిల్ 13న కరీంనగర్ లో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని పోలింగ్ బూత్ స్థాయి నాయకులతో ‘బూత్ విజయ సంకల్ప్ అభియాన్’ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి బండి సంజయ్ తోపాటు ముఖ్య అతిథిగా పార్టీ జాతీయ సంస్థాగత సహ ప్రధాన కార్యదర్శి శివ ప్రకాశ్ జీ హాజరయ్యారు. ఈ సందర్భంగా బండి సంజయ్ కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై నిప్పులు చెరిగారు.. పార్లమెంట్ ఎన్నికలను క్రికెట్ తో పోలుస్తూ… హాట్ కామెంట్స్ చేశారు.

బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ ‘‘కాంగ్రెస్ రూ.3 లక్షల వడ్డీ లేని రుణం ఇస్తామని దగా చేసింది. రూ.2 లక్షల రుణమాఫీ చేయకపోవడంతో రైతులను బ్యాంకర్లు డిఫాల్టర్లుగా ప్రకటించాయి… రైతులకు అప్పులు కూడా పుట్టడం లేదు… రైతులు బతికేదెలా? అందుకే రైతులంతా కాంగ్రెస్ పై కసితో ఉన్నరు. అట్లాగే మహాలక్ష్మీ పథకం పేరుతో మహిళలకు నెల నెలా రూ.2500లు ఇస్తామని హామీ ఇచ్చారు.. వృద్ధులకు రూ.4 వేల పెన్షన్ ఇస్తామన్నరు. ఇల్లు లేని వాళ్లందరికీ జాగాతోపాటు రూ.5 లక్షల నగదు సాయం చేస్తామన్నారు. విద్యార్థులకు రూ.5 లక్షల భరోసా కార్డు ఇస్తామన్నారు. రైతులకు ఎకరాకు రూ.15 వేల భరోసా సాయం చేస్తామన్నారు… ఎక్కడైనా ఇచ్చారా?

కరీంనగర్ నుండి వరంగల్, ఎల్కతుర్తి నుండి సిద్దిపేట రోడ్ల విస్తరణ సహా కరీంనగర్ పార్లమెంట్ అభివృద్ధి కోసం రూ.12 వేల కోట్లకుపైగా తీసుకొస్తే… మేమే చేశామని బీఆర్ఎస్ ప్రచారం చేసుకుంటుంది. నేను ఎంపీగా ఉన్నప్పుడే నిధులు తీసుకొచ్చి ప్రధానితో జాతీయ రహదారుల విస్తరణ పనులు ప్రారంభిస్తే…. నావల్లే అయ్యిందని బీఆర్ఎస్ అభ్యర్థి ప్రచారం చేసుకుంటున్నడు. కరీంనగర్ ఆర్వోబీ నిర్మాణానికి నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం నిధులియ్యకుంటే… కొత్తగా వచ్చి సేతు బంధన్ స్కీం కింద కేంద్రం నుండి మొత్తం నిధులు తీసుకొచ్చి ఆర్వోబీ పనులు చేపడుతుంటే… సిగ్గు లేకుండా బీఆర్ఎస్ నేతలు కొబ్బరికాయ కొట్టుకున్నరు… తెలంగాణ మొత్తానికి సీఆర్ఐఎఫ్ నిధులు ఎన్ని వచ్చాయో… అందులో సగానికిపైగా నిధులు కరీంనగర్ కే తీసుకొచ్చిన ఘనత మాదే… స్మార్ట్ సిటీ నిధులను కేసీఆర్ ప్రభుత్వం దారి మళ్లిస్తే… నేను నిలదీసిన. లేఖలు రాసి మళ్లీ ఆ నిధులను జమ చేయించిన.

ఇక్కడున్న మంత్రి (పొన్నం ప్రభాకర్) అడ్డగోలుగా మాట్లాడుతున్నడు.. బండి సంజయ్ ఏం చేసిండు, శ్వేత పత్రం ప్రకటించాలని అంటున్నడు… నేను చేసిన అభివృద్ధిపై బుక్ లెట్ ముద్రించి ఇంటింటికీ పంపించిన… అయినా మాట్లాడుతున్నడంటే ఏమనాలే..? కరీంనగర్ ప్రజలు ఆశీర్వదించి నన్ను ఎంపీగా గెలిపిస్తే… కేసీఆర్ రాక్షస ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు రాష్ట్రమంతా తిరిగి ప్రజల పక్షాన పోరాడిన. కేసీఆర్ ప్రభుత్వం ఓడిపోయిందంటే… అది బిజెపి చేసిన పోరాటాల ఘనతే… నా గుండెలో స్టంట్ ఉన్నా రైతులు, నిరుద్యోగులు, విద్యార్థులు, మహిళల పక్షాన ఉద్యమాలు చేసిన. 1600 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన కష్టాల్లో ఉన్న ప్రజలకు అండగా నిలిచిన. నేను నిరుద్యోలు, ఉద్యోగుల పక్షాన కొట్లాడితే నాపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపినా ఏనాడూ భయపడలే…

రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేది… చేసింది బిజెపియే… కరీంనగర్ పార్లమెంట్ ను అభివృద్ధి చేసే బాధ్యత నాది… కరీంనగర్ పార్లమెంట్ ప్రజలకు రక్షణగా నేనుంటా… మిమ్ముల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటా… మోదీ మళ్లీ ప్రధాని కాకపోతే ఈ దేశం పరిస్థితి ఎట్లా ఉందో ఒక్కసారి ఆలోచించి ఓటేయాలని కోరుతున్నా… మీరు కరీంనగర్ ఎంపీగా గెలిపిస్తే… మోదీకి నా ఓటేసి ప్రధానిని మళ్లీ చేసుకుందాం… కార్యకర్తలంతా ఈ విషయాన్ని ఇంటింటికీ తీసుకెళ్లి బిజెపిని అత్యధికంగా గెలిపించి కరీంనగర్ దమ్ము చూపాలని కోరుతున్నా…’’ అని అన్నారు.