turmeric

ఇందూరు పసుపు బోర్డు ప్రారంభం

మోదీ ప్రభుత్వం ఇందూరు రైతులకు ఇచ్చిన హామీని నెరవేర్చింది. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కృషితో నిజామాబాద్‌ జిల్లా రైతుల చిరకాల స్వప్నం సాకారమైంది. జనవరి 14న నిజామాబాద్ లో జాతీయ పసుపు బోర్డు ప్రారంభమైంది. దిల్లీలోని వాణిజ్యభవన్‌ నుంచి కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ గోయెల్‌ పసుపు బోర్డు కార్యకలాపాలను వర్చువల్‌ విధానంలో ప్రారంభించారు. నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటు శుభ పరిణామమని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ గోయెల్‌ అన్నారు. బోర్డు ఏర్పాటుతో పసుపు రైతులకు మంచి రోజులు వచ్చాయని.. ఎంతో మేలు జరుగుతుందని చెప్పారు. కేంద్రమంత్రితో బిజెపి ఎంపీ ధర్మపురి అర్వింద్‌, కరీంనగర్‌ నుంచి వర్చువల్‌గా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కుమార్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గోయెల్‌ మాట్లాడుతూ.. కేంద్ర మంత్రి సంజయ్‌, ఎంపీ అర్వింద్‌ కోరిక మేరకు సంక్రాంతి రోజున పసుపు బోర్డును ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. బోర్డు ఏర్పాటు కోసం బండి సంజయ్‌, అర్వింద్‌ తీవ్ర ప్రయత్నాలు చేసి విజయం సాధించారన్నారు. కుంభమేళా రోజున బోర్డు ఏర్పాటు చేయడం రైతులకు కలిసి వస్తుందని పేర్కొన్నారు. ఏపీ, తెలంగాణలో నాణ్యమైన పసుపును సాగు చేస్తున్నారని.. అందుకే పసుపు బోర్డును ఇక్క డ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. పసుపు బోర్డు ఏర్పాటుతో పరిశోధనలు జరుగుతాయని.. కొత్త వంగడాలు అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు. పసుపు ఉత్పత్తిలోనూ నాణ్యత పెరుగుతుందని.. సరైన గిట్టుబాటు కూడా వస్తుందని ఆయన చెప్పారు.

రైతుల కోసం పనిచేసే ప్రభుత్వం ఏదైనా ఉంటే అది మోదీ ప్రభుత్వమేనని.. సంక్రాంతి రోజున పసుపు బోర్డు ఏర్పాటుతో మోదీ రైతులకు మేలు చేశారని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ అన్నారు. నిజామాబాద్‌ ఎంపీలుగా గతంలో చాలా మంది పనిచేసినా అర్వింద్‌ ఒక్కరే బాండ్‌ పేపర్‌ మీద రాసిచ్చిన తన హామీని నెరవేర్చుకున్నారని చెప్పారు. బోర్డు ఏర్పాటు వల్ల రైతులకు మెరుగైన ధర లభిస్తుందని ఎంపీ అర్వింద్‌ అన్నారు. లక్షలాది మంది పసుపు రైతుల కల నెరవేర్చిన ప్రధాని మోదీకి పాదాభివందనాలు తెలియజేస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా బిజెపి తెలంగాణ అధ్యక్షుడు, కేంత్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ప్రకటన విడుదల చేస్తూ జాతీయ పసుపు బోర్డు తెలంగాణ రైతులకు సంక్రాంతి కానుకగా పేర్కొన్నారు. బిజెపి తెలంగాణ అధ్యక్షుడిగా ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు. పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రధాని మోదీ ఇచ్చిన హామీని నెరవేర్చామని అన్నారు.

నేపథ్యం

ప్రపంచంలోనే అత్యధికంగా పసుపు భారత్‌లో సాగవుతోంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా 3.24 లక్షల హెక్టార్లలో సాగు చేయగా.. 11.61 లక్షల టన్నుల దిగుబడి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా సాగయ్యే పంటలో ఇది 75%. దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలో 2.78 లక్షల టన్నులు, ఆ తర్వాత తెలంగాణలో 2.32 లక్షల టన్నులు పండింది. 2022-23లో 207.45 మిలియన్‌ డాలర్ల విలువైన 1.53 లక్షల టన్నుల పసుపు, పసుపు ఆధారిత ఉత్పత్తులు భారత్‌ నుంచి ఎగుమతి అయ్యాయి. ప్రపంచ మార్కెట్‌లో భారత్‌ వాటా సుమారు 62 శాతం. నాణ్యమైన పంట పండేలా రైతులను ప్రోత్సహించడంతో పాటు ప్రపంచ మార్కెట్‌లో భారత్‌కున్న అగ్రస్థానాన్ని నిలబెట్టేలా బోర్డు చేయూత అందిస్తుంది. ఇందులో కేంద్ర ఆయుష్, ఫార్మాస్యూటికల్స్, వ్యవసాయ, వాణిజ్య శాఖలకు చెందినవారిని సభ్యులుగా నియమించనున్నారు. పసుపును అత్యధికంగా పండించే మూడు రాష్ట్రాలకు చెందిన సీనియర్‌ అధికారులకు రొటేషన్‌ పద్ధతిలో అవకాశం కల్పిస్తారు. కేంద్ర/రాష్ట్ర పరిశోధన సంస్థల్లో పనిచేసే నిపుణులు, పసుపు రైతులు, ఎగుమతిదారులకూ సభ్యత్వం ఇస్తారు. కేంద్ర వాణిజ్యశాఖ కార్యదర్శిని నియమించనుంది. 

పసుపు బోర్డు సమస్య 2019 లోక్‌సభ ఎన్నికల్లో నిజామాబాద్‌ లోక్‌సభ స్థానంలో ప్రధాన అంశంగా మారింది. కేంద్ర ప్రభుత్వ దృష్టిని ఆకర్షించాలన్న ఉద్దేశంతో 176 మంది రైతులు నామినేషన్లు వేశారు. ఆ ఎన్నికల్లో ఒక్కో బూత్‌లో 12 ఈవీఎంలు వాడాల్సి వచ్చింది. ఇందూరుకు చెందిన 30 మంది పసుపు రైతులు.. ప్రధాని నరేంద్ర మోదీ పోటీ చేసిన వారణాసిలోనూ నామినేషన్లు వేశారు. ఈ అంశం అప్పట్లో చర్చనీయాంశమైంది. నిజామాబాద్‌లో బిజెపి అభ్యర్థిగా పోటీ చేసిన ధర్మపురి అర్వింద్‌ తాను గెలిస్తే పసుపు బోర్డు తీసుకొస్తానంటూ బాండ్‌ పేపర్‌పై రాసిచ్చారు. పసుపు బోర్డును ఏర్పాటు చేయనున్నట్లు గత అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా 2023 అక్టోబరు 1న మహబూబ్‌నగర్‌ సభలో ప్రధాని మోదీ ప్రకటించారు. ఆ తర్వాత అక్టోబరు 4న కేంద్ర వాణిజ్యశాఖ దీనిపై గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. తాజాగా నిజామాబాద్‌లో బోర్డు ఏర్పాటు చేసింది. 37 సంవత్సరాల తర్వాత కేంద్ర ప్రభుత్వం ఒక వస్తువు కోసం ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేసింది. పసుపు బోర్డు ఏర్పాటుతో ఎంపీ హామీ నెరవేరినట్లయింది. రైతుల పోరాటం సాకారమైంది.

పసుపు బోర్డు చైర్మన్ గా పల్లె గంగారెడ్డి

కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ పసుపు బోర్డు చైర్మన్ గా పల్లె గంగారెడ్డిని నియమించింది. కేబినెట్ అపాయింట్మెంట్స్ కమిటీ సెక్రటేరియట్ ఆమోదించిన ఈ నియామకం నోటిఫికేషన్ తేదీ నుంచి మూడేళ్లపాటు లేదా తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు, ఏది ముందు అయితే అది అమల్లో ఉంటుంది. ఈ మేరకు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ మహేందర్ చౌదరి ఉత్తర్వులు జారీ చేశారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామానికి చెందిన పల్లె గంగారెడ్డి బిజెపి జిల్లా అధ్యక్షుడిగా రెండు పర్యాయాలు పనిచేశారు. ప్రస్తుతం రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగుతున్నారు. గతంలో సీడ్స్ కార్పొరేషన్ డైరెక్టర్ గా కొనసాగారు. రైతు సమస్యలపై అనేక పోరాటాల్లో పాల్గొన్నారు. ఎన్నో ఉద్యమాలు చేశారు.